Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 18

 

    "అలోచన నాది కాదు పెద్దపిన్ని, వనజది, దానిని నేను రూపంలో పెట్టాను. అమ్మను బురిడి కొట్టించి, ఒప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది" అంది జయంతి.

    "ఇప్పటికయినా ఒప్పుకున్నావుగా నీకు తోక వుందని" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.

    "అబ్బా బావా! ఇప్పుడు నీకు దొరికిపోయానే.....దానికి సరిగా సమాధానం నా దగ్గర లేదు" అంది నెత్తిబాదుకుంటూ.

    శివపార్వతి, దాక్షాయణి ఇద్దరూ పెద్దగా నవ్వారు.

    "నవ్వండి, ఇక్కడ మీకు ఏ అడ్డు లేదు. మనం ఎంత పెద్దగా నవ్వినా కిందకు వినిపించదు బాబాయ్ ల భయం మీకు లేదు" అంది జయంతి.

    "అక్కా! అక్కా అదిగో నక్షత్రం కిందకు రాలుతోంది." అని అరిచింది వనజ.

    "అవునే! దాన్ని పట్టుకో. పట్టుకుని రేపు పెళ్ళిలో మీ అక్క జడలో తురుము. మీ బావా చూసి మురిసిపోతాడు" అంది జయంతి.

    "జయంతి! నువ్వు పెద్దయ్యాక పెద్ద రచయిత్రివి అవుతావే నీఆలోచన్లు గొప్పగా వుంటాయి" అంది దాక్షాయణి.

    "అమ్మో! ఏంటి పెద్దపిన్ని నిజంగానా అంత గొప్పగా వుంటాయా?" అంది దాక్షాయాన్ని వాటేసుకుంటు.

    "చీ! కొంటెపిల్ల వదులు" అంటూ నవ్వింది.

    "అవును పిన్ని మీ పెళ్ళిళ్ళు ఎన్నిరోజులు జరిగాయి? నాకు అసలు గుర్తులేదు. అప్పుడు చాలా చిన్నపిల్లను కదా?" అంది జయంతి.

    "వారంరోజులు" చెప్పింది శివపార్వతి.

    "అబ్బ! వారంరోజులా?" అంది వనజ.

    "అవునే ఊరంతా తరలివచ్చింది. పాపం మావయ్య ఎంత సంబరపడ్డారో.....అత్తయ్య కూడా వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు" చెప్పింది దాక్షాయణి
    
    "మరి ఇప్పుడు గిరిజక్క పెళ్ళి ఎన్నిరోజులు జరుగుతోంది" అడిగింది వనజ.

    "దాదాపుగా అన్ని రోజులే. ఎందుకంటే మనింట్లో మొట్టమొదటి శుభకార్యం కదా గొప్పగా చేద్దాం అంటున్నారు మీ బాబాయిలు" చెప్పింది దాక్షాయణి.

    "బాబూ సురేంద్రా! అక్కడ కుర్చున్నావే రారా.....ఇక్కడ కొచ్చి కూర్చో" కేకేసింది శివపార్వతి.

    "వస్తున్నానత్తయ్యా!" అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నాడు.

    సురేంద్ర వచ్చి కూర్చోగానే గిరిజ పడుకున్నదల్లా లేచి కూర్చుంది.

    "అబ్బో గిరిజక్కకి మొగుడిమీద భక్తి ఎక్కువేనే పిన్ని" అంటూ తనూ కూర్చుంది.

    "బాబాయ్ లు కోప్పడుతారుగా పిన్ని మీరు మాతోపాటే ఇక్కడే వుండిపోయారు" అంది జయంతి.

    "చెప్పే వచ్చాములే ఓ గంటసేపు కబుర్లు చెప్పుకుని వస్తామని" అంది దాక్షాయణి.

    "అబ్బ ఎంత హాయిగా వుంది పిన్ని చల్లగాలి . కింద ఇంత హాయిగా వుండదు" అంది జయంతి.

    "అవును మాకు పెళ్ళయిన కొత్తలో ఎక్కాం డాబా పైకి, మళ్ళి ఇన్నాళ్ళకు ఎక్కాం "అంది శివపార్వతి.

    "అవునా?! ఇంకేం రేపు గిరిజక్కకు సురేంద్ర బావకు పెళ్ళయిన తరువాత కూడా డాబా ఎక్కుతారన్నమాట." అంది జయంతి ఉత్సాహంగా.

    గిరిజ వెంటనే జయంతికి తొడపాశం పెట్టింది.

    "అబ్బా! చూడు చిన్నపిన్ని ఉన్నమాటంటే ఉలుకెందుకు? ఎలా గిచ్చిందో చూడు" అంది బుంగమూతి పెట్టి.

    ఆ మాటలకు అందరూ నవ్వారు.

    "మరీ ఈ నిచ్చెన వేసుకుని ఎక్కటం ఏంటి ఖర్మ! రేపే నాన్నగారికి చెప్పి మెట్లు కట్టించమంటాను. ఊరంతా రోడ్లు వేస్తారు, ఇళ్ళు కట్టిస్తారు, మనింటికి మెట్లు లేకుండా చేశారే భలేవారే" అంది జయంతి.

    ఆ మాటలకు దాక్షాయణి పగలబడి నవ్వింది.

    "మావయ్యను మెట్లు కట్టించమని అడిగే ధైర్యం నీకుందా జయంతి?!" అన్నాడు సురేంద్ర.

    "పందెమా! మీ పెళ్ళి లోపు మెట్లు కట్టిస్తాను చూడు" అంది జయంతి.

    "నువ్వు తలుచుకుంటే అవుతుంది జయంతి. ఆపని చేసిపెట్టు పాపం వీళ్ళకి నిచ్చెన ఎక్కే శ్రమ తప్పుతుంది" అంది శివపార్వతి.

    మాట కూడా పూర్తిచేయకముందే "అబ్బా! అంది శివపార్వతి.

    "ఏంటి ఈసారి నిన్ను గిచ్చిందా?" అంది జయంతి నవ్వుతూ.

    "ఏంటే నువ్వు నోరు తెరవకుండా అందర్నీ గిచ్చుకుంటు కూర్చున్నావేంటి? పెళ్లనగానే నోరు పడిపోయిందా?" అంది జయంతి దూరంగా జరిగి మళ్ళి తననేక్కడ గిచ్చుతుందో అని.

    "నాకెందుకు నోరు పడిపోతుంది? నాకు బదులు నువ్వే వసపిట్టలాగా వాగుతున్నవుగా?" అంది గిరిజ.

    "అమ్మో బావా నీ పెళ్ళాంకి నోరోచ్చింది, కిందకెళ్ళి కాస్త చెక్కెర తీసుకురా మా అందరి నోరు తీపి చేద్దువుగాని" అంది జయంతి.

    జయంతి మాటలకు గిరిజతో పాటు సురేంద్రకూడా పెద్దగా నవ్వాడు.

    "అక్కా! అక్కా అటుచూడు కాలవలో పడవ వెళ్తుంది" అంది వనజ ఉత్సాహంగా.

    "అవునే! అబ్బ! ఈ వెన్నెల్లో ఆ పడవ ప్రయాణం ఎంత బావుంటుందో......ఆ నీళ్ళు చూడు పిన్ని వెన్నెలకు ఎలా మెరుస్తున్నాయో.....మనం డాబా ఎక్కటానికే ఇన్ని తంటాలు పడ్డాం, ఇక పడవ ఎక్కాటమంటే అమ్మో! బాబాయ్ లు ఏమంటారో?" అంది జయంతి దిగులుగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS