Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 17

   

    అసలు ధన్వి ఎలా నెగ్గుకురాగలడు?

 

    కోరితే గొంతుకి చిలుకపలుకులజిలుగు రావికెల్ని తొడిగి పాలిపోయిన అంధకార జీవిత మందిరాలలోనైనా దివ్వెని వెలిగించగల ధీశక్తి వుండి యీ మార్గంలో ప్రయాణిస్తున్నాడెం?

 

    ముందుకు చొచ్చుకుపోవడం సాధ్యం కాని బ్రతుకు ప్రస్థానంలో అత్తరులో దుమంగా, ప్రకృతి రగిల్చిన హోమంలా కనిపిస్తూ సైతం ఒక్కోమారు వికృతధ్వనితో విరిగిపడే కొండచరియలా కనిపిస్తాడెం.

 

    ఇంత మేధస్సు వుండి కూడా సుడిగుండాల అంచుల్లో రణన్నినాదాల కుంచేల్లో నడిచి నడచి రేపు కన్నవాళ్ళకి, కావాలనుకున్నవాళ్ళకి కన్నీళ్ళు మిగిల్చే మనిషిగానే అనిపిస్తున్నాడెం.....

 

    తేరుకుంది సామ్రాజ్యం. "అభినందిస్తున్నాను ధన్వి! ఎందర్నో ఆకట్టుకోగల నా అందం ఆకర్షణ  నిన్ను అంతగా కదిలించలేదు. నువ్వు పరోక్షంగా కాక సూటిగా వ్యక్తం చేసినందుకు కృతజ్ఞురాల్ని . మరి నీ గురించి నా అభిప్రాయం ఏమిటో చెప్పనా?'

 

    అడగలేదు ధన్వి. కానీ వినాలనుకున్నాడు.

 

    "నువ్వంటే నాకు యిష్టంలేదు. అభిమానం లేదు. ఆరాధనలేదు. ప్రేమ లేదు. కానీ....అంతకుమించిందేదో వుంది. నీతో బిడ్డను కనాలనుందన్న నా ఆలోచనల్ని విని నిన్ను అంచనా వేయాలని ప్రయత్నించకు ధన్వి! భాషకందని ఆ భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో అసలు దానికి నా జీవితంలో భాష్యం చెప్పగల శక్తిని సంపాదించుకోగలనో లేదో నాకు తెలీదు, కానీ నువ్వంటే....." చెప్పలేకపోయింది ఎంత ప్రయత్నించినా.

 

    "అందుకే నా కోసం అంత శ్రమ తీసుకున్నావన్నమాట."

 

    ఉలిక్కిపడింది సామ్రాజ్యం.

 

    "ఇందాకనే తెలిసింది సామ్రాజ్యం! అది నర్సింగ్ యాదవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు."

 

    "వాట్!" ఉద్విగ్నంగా అంది.

 

    "అక్కడికి నువ్వెందుకు వెళ్ళావ్?"

 

    "వెళ్ళలేదు....పిలిపించారు" కేజువాల్ గా చెప్పాడు ధన్వి. "నర్సింగ్ యాదవ్ దగ్గర నీ కొలీగ్ వున్నాడు. నీ అభ్యర్ధన మూలంగా గొడవ సెటిల్ చేస్తున్నానన్నాడు, సరే అన్నాను."

 

    సామ్రాజ్యనికి ముచ్చెమటలు పోశాయి.

 

    "నర్సింగ్ యాదవ్ ఏమన్నాడు?"

 

    "ఇకముందు జాగ్రత్తగా వుండమన్నాడు. ఆ విషయం తన మనుషులకు చెప్పమన్నాను. చాలా రియాక్ట్ అయ్యాడు. నేను సైలెంట్ గా విని వచ్చేశాను."

 

    "ఇక సెటిలైపోయినట్టేనా?" అడిగింది సామ్రాజ్యం. అంతకుమించి మరేదో తెలుసుకోవాలన్నా క్యూరియాసిటి కనిపించింది సామ్రాజ్యం గొంతులో. "నర్శింగ్ యాదవ్ నిన్ను హెచ్చరించినప్పుడు నీకు కోపం రాలేదా?"

 

    "ఎందుకు రాలేదు? వచ్చింది. నాకు నచ్చనిది నాన్న చెబుతుంటే అర్గ్యు చేసినట్టు నేనూ మాట్లాడాను."

 

    "థెంక్ గాడ్. గొడవ పడలేదన్నమాట."

 

    "అదే" ఉద్వేగంగా అన్నాడు ధన్వి. "సరిగ్గా నాకూ, మీకు మధ్య వున్న గేప్ అదే సామ్రాజ్యం! "గొడవపడటం నా వృత్తి కాదని మీరెందుకు ఆలోచించరు? నాదాకా వస్తేనే తప్ప నేను రియాక్ట్ కాను. మీరెందుకు అర్ధం చేసుకోరు?"

 

    ధన్వి ఉక్రోషంగా మాట్లాడుతుంటే మచ్చటేసిందేమో, ఉడికిస్తున్నట్టుగా అంది, "నీకు అసలే ముక్కు మీదే వుంటుందిగా కోపం అందుకని....."

 

    "కాబట్టి ముందున్నది గోడని తెలుసుకోకుండా దూసుకుపోయి ముక్కు పచ్చడి చేసుకుంటాననుకుంటున్నావా?"

 

    "నర్శింగ్ యాదవ్ గోడని ఒప్పుకున్నావ్."

 

    నవ్వేసింది సామ్రాజ్యం.

 

    "సంతోషంగా వుంది ధన్వి! నీకు పరిస్థితుల్ని అర్ధం చేసుకోగలిగే తెలివి మాత్రమే కాక పరిణామాల గురించి ఆలోచించగల విజ్ఞానము వుందని తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది."

 

    "వెళ్ళనా?"

 

    లేచాడు ధన్వి.

 

    "అభ్యంతరం లేదు కానీ , ఎల్లుండి ఉదయం పదిగంటలకి నువ్వు మా యింటికి రావాలి."

 

    "డ్యూటీకి వెళ్ళడం లేదా?"

 

    "శలవు పెడుతున్నాను."

 

    "దేనికి?"


    
    "నీ విజ్ఞానాన్ని పరిశీలించడానికి."

 

    అర్ధం కానట్టు చూశాడు.

 

    "కంగారుపడకు....నీ మేధాశక్తిని పరిక్షించడానికి ఓ ఫ్రెండ్ ని పిలిచాను. నువ్వొస్తే సంతోషిస్తాను."

 

    ఎవరు, ఏమిటి అని అడగలేదు ధన్వి.

 

    సరే అన్నట్టు తలపంకించి బయటికి నడిచాడు.

 

    ఒకవేళ.....

 

    సామ్రాజ్యం యింటికి ఆహ్వానించింది రచయిత్రి మధూళీని అని తెలిస్తే ధన్వి ఎలా రియాక్టయ్యేవాడో!

 

    ఎందుకో చెప్పాలనిపించలేదు సామ్రాజ్యానికి.

 

    అదికాదు ఆ క్షణంలో సామ్రాజ్యం ఆలోచిస్తున్నది.

 

    రేపు సమావేశంలో జరగబోయేది మధూళీ, ధన్విల పరిచయం మాత్రమే కాదు.

 

    నమ్మిన సిద్దాంతాల గురించి ఇద్దరు బలమైన ప్రత్యర్ధులు పోటీ పడబోతున్నారు.

 

    ధన్వి గురించి మధూళీకి చాలా వివరంగా చెప్పింది సామ్రాజ్యం.

 

    నిజానికి అలాంటి వ్యక్తిత్వం గల ధన్విని కలుసుకోవటానికి ఎక్కువ వుత్సాహం చూపించింది మధూళీ.

 

    కాగితాలపై తను రాసే పాత్రలకన్నా విచిత్రమైన వాడిగా అనిపించాడు ధన్వి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS