అనలేదు సామ్రాజ్యం అనుకుంది....అనుకున్న వెంటనే మనసులోని మాటని అనేయగలిగింది. "రేపు నువ్వు పందెంలో ఓడిపోయావనుకుందాం. అప్పుడు కూడా నా కోరిక నెరవేర్చటానికి మూడ్ లేదంటూ దాటేయొచ్చుగా."
"అవకాశం లేదు."
"నేనంటూ ఓడిన మరుక్షణం మాట నిలబెట్టుకోవడం ఓ కమిట్ మెంట్ అవుతుంది కాబట్టి."
* * * *
"కమిట్ మెంట్ గా ఆలోచించినప్పుడు మనసుతో పనిలేకుండా అంతా జరిగిపోతుంది ధన్వి....అది నా వుద్దేశ్యంలో వ్యభిచారం."
"అంగీకరిస్తూన్నాను."
ఉలిక్కిపడింది సామ్రాజ్యం.
"అవును సామ్రాజ్యం.....మనసుపడి కాక, మాటకోసం మనువు కలిస్తే అది వ్యభిచారమేగా!"
అవమానంగా అనిపించింది సామ్రాజ్యనికి. తన అభిప్రాయాన్ని ధన్వి అంత పచ్చిగా వ్యక్తికరించడం, అతడికి సమంజసంగా తోచిందేమో కాని ఆమె జిర్ణించుకోలేకపోయింది.
ఎందుకు?
ఎందరి దగ్గరో తల వంచకుండా స్వాభిమానంతో మాట్లాడగల తను ధన్వి దగ్గర యింత సులభంగా ఓడిపోతోందేం?....ఇది ఒంటరితనం మూలంగా పేరుకున్న శూన్యం తాలూకు పర్యవసానమా? లేక ఓటమిని గెలుపుగా అన్వయించుకోవాలనే ఆత్మవంచనకి రూపమా?
ఏకత్వంలో ద్వంద్వం! సాంప్రదాయాల ట్రెజడి ముసుగుని, తేనె పూసిన చురకత్తిలాంటి కాంక్షతో సర్జరీ చేసి, బ్రతుకు పుస్తకంలో తను సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్న అవకాశవాదపు సిలబస్.
"ఒక్కమాట చెప్పు ధన్వీ.....నిర్మొహమాటంగా, నిజాయితీగా, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు."
ఆమెలో అంతవరకు వున్న వుత్సాహం వుత్పతమై మేఘంలా గర్జించాలనుకుంది. కానీ, తమాయించుకుంది. అంతెత్తు అశోకంలా పెంచుకున్న ఏ నమ్మకమో, కూలిన విశోకమాయి, కోపంలా, శాపంలా, రంపంలాం కంపరంలా వ్యధనమై, కధనమై ఆమెను వివశురాల్ని చేస్తుంటే "నీకు నా మీదున్న అభిప్రాయం ఏమిటి....? ఇలా అడుగుతున్నందుకు మరోలా దాటేసి మాట్లాడకు ధన్వి....నన్ను చాలా ఆత్మీయురాలిగా అంగికరించే నీకు నా మీదున్నది ఏమిటి ఇష్టమా? అభిమానమా? "ప్రేమా?" అడిగింది అణువంత అంతర్మధనంతో.....
సామ్రాజ్యం భాధపడుతున్నట్టు తెలుస్తూనే వుంది.
బాధపెట్టడం అతడి అభిమతం కాదు.
అయినా చెప్పాడు....చెప్పకుండా వుండటం అతడికి సాధ్యం కాదు కాబట్టి.
"ఏదో ఓ మొక్కని ఆశించి ఓ విత్తానాన్ని నెలలో నాటడం, యిష్టం, అవుతుంది సామ్రాజ్యం.
ఆ విత్తనం మొక్కగా రూపుదిద్దుకోవటానికి పోసే నీరు, తీసుకునే జాగ్రత్తే 'అభిమానం' అన్పించుకుంటుంది. ఆ విత్తనం ఎదిగి క్రమంగా మనం అనుకునే రూపం పొందేదాకా, ఏకాగ్రతని పాటించడం ఆరాధనవుతుంది.....కొంతకాలం తర్వాత ఎదిగిన మొక్కను చూస్తూ దాని పువ్వునో, కాయనో రుచి చూసి, ఇది నాది అని గర్వంగా ఆలోచించడం ప్రేమవుతుంది."
క్షణం ఆగాడు.
"ఇందులో చివరిది ప్రేమ. అయినా, ఆ ప్రేమలో అంతర్లినంగా పెరుకున్నవే ఇష్టం, అభిమానం, ఆరాధనా అన్నీ...అయితే "సంశయంగా చూశాడు. నీ మీద నాకున్న అభిప్రాయం ఏమిటో, మన స్నేహం ఏ దశలో వుందో నాకూ తెలీడం లేదు ప్రామిస్."
విప్పారితంగా చూసింది సామ్రాజ్యం.
"కోపం వచ్చిందా సామ్రాజ్యం? ఏం చేయను....నేను దురదృష్టవశాత్తూ అందరిలా ఆలోచించలేను. ముక్కుకు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడటం నాకున్న అనర్హతయితే, దాన్నే నేను అర్హతగా భావిస్తాను. నాయీ ప్రయాణం ప్రాణాంతకమైనా నేను బ్రతికేది నా చుట్టూ వున్న వాళ్ళని భాధపెట్టాడమని అందరూ తూలనాడుతున్నా, నేను అలాగే కడతేరిపోవటానికే కోరుకుంటాను. నాకు భేషజాలు తెలీవు, స్వాతిశయంతో నటించడం చేత కాదు. మనసులో లేనిదాన్ని మొహానికి మేకప్ లా పూసుకుని, అవసరానికి తగ్గ పాత్రగా మారి, మిమ్మల్ని ఆనందపరచడం నాకు కుదరనిపని, నక్షత్రాల్ని కలిపెస్తాననో, మేఘాల్ని కరిగించి మానవాళిని ఉద్దరిస్తానో, మాటలగారడితో రెడీమేడ్ సేల్స్ మెన్ కాగలిగే యువకుల్లో ఒకడ్ని కాలేను. నా ఇష్టాన్ని ఇష్టంగా వ్యక్తం చేస్తాను. నీ నుంచి అనుభవం కావాలి అనుకుంటే మొహం మీదనే కోరిక వ్యక్తం చేస్తాను."
ఆగిపోయాడు ధన్వి చెప్పాల్సింది చెప్పి.
మౌనంగా వుండిపోయింది సామ్రాజ్యం. తల వంచుకుని నేలచూపులు చూస్తున్న ధన్విని గమనిస్తూ.
కోపం రాలేదామెకి. జాలిగా అనిపించిందా?
ఎవరు....ఎవరి వ్యక్తి....శవాల సమాధుల్ని చరిత్ర శిదిలాలుగా చెప్పుకుంటూ కృత్రిమహాసాల దుర్గందాల మధ్య విశ్రుంఖలపు వికృతనగ్న తాండవాలు నిండిన యీ ప్రపంచంలో యితడు ఏ వర్గానికి చెందిన మనిషి?
