ఆమె చెప్పడానికి సందేహిస్తున్నట్టు ఓ నిముషం పాటు ఆగింది.
ఇక చెప్పక తప్పదని నోరు విప్పింది సబిత. "శేఖర్ తెలుసు కదా మన పక్క పొలం స్వంతదారు. అతనికి రేపు ఈ లెటర్ ఇవ్వాలి"
అదన్న మాట విషయం. తను వాళ్ళిద్దరికీ మధ్యవర్తిగా వుండాలన్న మాట. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. తను లిఖిత కోసం ఆరాట పడుతున్నట్టే ఈమె ఆ శేఖర్ కోసం అలమటిస్తుండవచ్చు. తమది ఉన్నతమైన ప్రేమని, ఎదుటి వ్యక్తులది నీచమైన ప్రేమ అని అనుకోవడం మూర్ఖత్వం. తమని తాము గొప్ప చేసుకుని ఆత్మవంచన చేసుకోవడం తనకి నచ్చని విషయం. ఇది కూడా సాయం చేయడమే అవుతుంది. ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు. అందుకే జితేంద్ర "సరే" నంటూ ఒప్పుకున్నాడు.
"మా మంచి జీతూ" ముద్దుగా అని వెళ్ళిపోయింది సబిత.
మరుసటి రోజు అతను పొలంలో వున్నప్పుడు సబిత భోజనం క్యారియర్ తీసుకువచ్చింది.
"వడ్డాణం తెచ్చావా?" జితేంద్ర ఆతృతతో అడిగాడు.
"నీ కన్నీ తొందరే" అంది సబిత అటూ ఇటూ చూస్తూ.
"ముందు భోజనం చెయ్" చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ కొచ్చాక అంది.
అతను క్యారియర్ విప్పి మొదటి గిన్నె తీసేటప్పటికి అతని కళ్ళు చెదిరాయి. బుట్టలో పాము నిస్తేజంగా పడుకున్నట్లు ఆ గిన్నెలో వడ్డాణం వుంది.
"థాంక్స్" అన్నాడు కృతజ్ఞతతో.
"మరో గిన్నె విప్పు"
ఇంకో గిన్నెలో తను శేఖర్ కి ఇవ్వాల్సిన కాగితం వుంది. అర్ధమైనట్టు మౌనంగా రెంటినీ అందుకుని జేబులో వేసుకున్నాడు.
అతను భోజనం చేశాక ఆమె వెళ్ళిపోయింది.
సాయంకాలం వరకు పొలంలో వుండి ఇంటికి తిరిగొచ్చాడు. బట్టలు మార్చుకుని టౌన్ కి వెళ్ళాడు. పదివేల రూపాయలకు వడ్డాణాన్ని కుదవ పెట్టాడు. ఎనిమిది అవుతుండగా తిరిగి వచ్చాడు.
వెంటనే భోజనం చేసి దేవాలయాన్ని చేరుకున్నాడు. లక్కీగా అక్కడ నారాయణ, వీరాస్వామి వున్నారు. వాళ్ళ కోసమే జితేంద్ర అక్కడికి వచ్చింది.
"మీకోసమే వచ్చాను" అన్నాడు ఉపోద్ఘాతంగా.
"ఏమిటి పని?"
"మీకో లాభం చేద్దామని"
"లాభమా? ఎలా?" వీరాస్వామి ఉత్సాహంగా అడిగాడు.
"సద్దల్లో" అని ప్రారంభించి లాభం ఎలా వస్తుందో వివరంగా చెప్పాడు అతను.
ఆ వూర్లోహైబ్రిడ్ సద్ద పండిస్తారు రైతులు. ఈ హైబ్రిడ్ సద్ద రకం కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలోనూ, ఆ వూర్లోనూ, చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాల్లోనే పండుతుంది. రాష్ట్రంలో ఇంకే ప్రాంతంలోనూ ఈ రకం పండేందుకు సరైన వాతావరణం లేదు. దాంతో ఓ నాలుగు ప్రైవేటు సంస్థలు రైతులకు హైబ్రిడ్ సద్ద విత్తనాలను ఇచ్చి పండిన సద్దల్ని తిరిగి తామే తీసుకుంటాయి. ఇలా పండిన సద్దను ఉత్తర భారతదేశంలో కమర్షియల్ క్రాప్ విత్తనాలుగా ఆ సంస్థలు ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. రైతులు తాము పండించిన సద్దల్ని ఆ సంస్థలకే ఇస్తారు.
"ఈసారి కూడా ఇవ్వండి. అయితే మొత్తం సద్దల్లో నాకు పదిబస్తాలు మాత్రం ఇవ్వండి. నేను బస్తాకు పదకొండు వందలిస్తాను" అన్నాడు చివరగా జితేంద్ర.
"మరి కంపెనీవాళ్ళు ఏమీ అనరా?" వీరాస్వామి అనుమానంగా అడిగాడు.
"ఏ రీత్యా మీమీద చర్య తీసుకోలేరు. అందుకనే పూచీ మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చే వేయి రూపాయలు కరెక్టుగా పదిరోజుల తరువాత ఇస్తాను. ఎక్కువగా ఇస్తానన్న వంద మాత్రం ఇప్పుడే ఇస్తాను" అని జేబులోంచి డబ్బు తీశాడు.
"నువ్వు ఈ వూరి వాడివి కూడా కావు. మరి మా డబ్బు చేరుతుందన్న గ్యారెంటీ మాకేమిటి!" నారాయణ అడిగాడు.
"అదీ పాయింటే అయితే మీరిచ్చే సద్దలు చిన్నస్వామి ఇంట్లోనే స్టాక్ చేస్తాను. వాటిని లారీకి ఎత్తేముందు మీకు డబ్బులిస్తాను. అలా ఇవ్వకపోతే మీరు లారీకి బస్తాలు ఎక్కించండి"
"అల అయితే సరి" వాళ్ళకి నమ్మకం కుదిరింది.
జితేంద్ర చెరి వేయి రూపాయలిచ్చేశాడు.
"మరో ఎనిమిదిమంది రైతులకు ఇవ్వగలను. ఎవరయినా ఇష్టం వుంటే రమ్మనమనండి. డబ్బులిస్తాను" అని చెప్పి వచ్చేశాడు.
అప్పుడే నూర్పుళ్ళు జరుగుతున్నాయి. కోతలు కోయటానికి, వాటిని తొక్కించటానికి డబ్బు చాలా అవసరం. అందుకే మరుసటి రోజుకల్లా రైతులు జితేంద్ర మీదకి ఎగబడ్డారు.
పదిబస్తాల చొప్పున ఇవ్వడానికి సిద్దపడ్డ ఎనిమిదిమంది రైతులకు మిగిలిన ఎనిమిది వేలూ ఇచ్చాడు.
మరో వారం రోజులకి వందబస్తాల సద్దల్ని చిన్నస్వామి పశువుల పాకలో స్టాక్ చేశాడు జితేంద్ర.
మిగిలిన సద్దల్ని రైతులు తాము కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు తోలారు. ఆ కంపెనీలు ఈ సద్దల్ని అమ్మాక, అంటే రెండు నెలల తరువాత డబ్బులిస్తాయి. అలాంటిది పదిరోజులకే జితేంద్ర డబ్బు చెల్లిస్తాననడంతో రైతులు భరోసాగానే వున్నారు.
రైతుల దగ్గర్నుంచి సద్దల్ని తీసుకున్నాయి కంపెనీలు. అయితే ఆ సంవత్సరం కర్నూలు ప్రాంతంలో వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల పంట తక్కువగా వచ్చింది. ఈ ప్రాంతంలోనే పండిన సద్దాలకు మంచి గిరాకీ వచ్చింది. ఎప్పుడో దినపత్రికలో ఈ వార్త చదివే జితేంద్ర ఈ పథకం వేశాడు.
అతని దగ్గర నూరుబస్తాల సద్దలు వున్నాయని, కొంతమంది రైతుల దగ్గర్నుంచి అతను కొన్నాడని కంపెనీలను తెలిసింది. దీంతో వాటిని చేజిక్కించుకోవడానికి అవి పోటీ పడ్డాయి.
పెద్ద కంపెనీ అయిన మారుతీ సీడ్స్ సంస్థను జితేంద్ర సంప్రదించాడు. బస్తాకు అయిదువందలు ఎక్కువిస్తానని ఆ కంపెనీ మేనేజర్ చెప్పాడు. అయితే వేయి రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు జితేంద్ర.
మేనేజర్ ఒప్పుకోకపోయేసరికి లేచి వచ్చేశాడు. అయితే ఆ రోజు సాయంకాలమే గిరిధర్ కంపెనీ వేయి రూపాయల చొప్పున ఎక్కువిచ్చి బస్తాలను కొంటామందని మారుతీ కంపెనీకి ఆకాశరామన్న ఫోన్ కొట్టించాడు.
దాంతో మారుతి కంపెనీ మేనేజర్ ఆఘమేఘాల మీద వచ్చి తనే ఆ వేయిరూపాయలు ఇస్తానని సద్దల్ని ఇవ్వమని వత్తిడి చేశాడు. తనకు ఇష్టం లేనట్టూ నటిస్తూనే జితేంద్ర ఒప్పుకున్నాడు.
మరుసటి రోజు రెండు లక్షల రూపాయలు ఇచ్చి వాటిని లారీలకు ఎక్కించాడు మేనేజర్. బ్రోకరేజ్ కింద పదివేలు రూపాయలు సెపరేట్ గా ఇచ్చాడు. చెప్పిన మాట ప్రకారం జితేంద్ర రైతులకు వేయి రూపాయల చొప్పున లక్ష రూపాయలు చెల్లించేశాడు. పోతే లక్షా పదివేల రూపాయలు మిగిలాయి.
