అంతే!
ఆరోజే ప్రేమ పుట్టింటికి వెళ్లిపోయింది.
* * * *
'అసలు - ఆడరచయితలు, అసలు మొగరచయితలు ఆడ మొగ రచయితలు (ఆడవాళ్ల పేరుతో రచనలు చేయువారు). మొగ ఆడ రచయితలు (ఇంకా రాలేదు - అనగా ఏ ఆడది తన పేరును కాదనుకొని మొగపేరుతో రచనలు పంపుతుంది, పంపినా అవి ప్రింటు ఎలా అవుతాయి? ఇది ముక్కోణపు యుగం కదా) అనే నాల్గురకాలున్నారా అబ్బీ!...... అన్నాడు మూర్తి, ప్రేమ శేఖర్ తో.
'నిజమే. ఇంతకీ నేనే కోవకు చెందిన రచయితను...' అడిగాడు ప్రేమ -శేఖర్.
'నీ పేరునుబట్టి చూస్తె నీవు అసలు ఆడరచయిత్రిగా కన్పడతావు. నీరచనలు బట్టిచూస్తె అసలు మొగరచయితచ రచనగా నీరచన కన్పడుతూంది. నిన్నుబట్టి చూస్తె వట్టిచవటలా కన్పడుతున్నావు...."అని అన్నాడు మూర్తి.
ప్రేమ- శేఖర్ వొక్కసారిగా కోపం తెచ్చుకొని, "చూస్తున్నావు కదరా..... ఎన్ని పత్రికలకు పంపినా - అన్నీ తిరిగి వస్తున్నాయి కదా! ఎంతకాలమని వ్రాతపత్రిక నడపి కథ నవల, నాటక రచయితగా లోకల్ గా వెల్గను?అదే మన్నా దానిపేర...... ప్రేమాశేఖర్, రచయిత్రి అని పంపమంటుంది. నాకు ఇష్టముండదు. అందుకని అది పుట్టింటికిపోయింది ఆరంగారావుగారు ఏమయినా లిప్టు ఇస్తాడా అంటే.... స్టాంపు లుంచిన కవర్లుంచమంటా డాయన.... ఎట్లా చచ్చేదిరా...."
'అయితే వో పనిచెయ్ నీకధ, నవల. నాటకం, మినీ కథ, చిన్నకధ, కవిత ఏదయినా లేటెస్టుది వొకటి విన్పించు.' అని అడిగాడు మూర్తి.
'వోకథ 'థీమ్' చెప్తావిను. అతని వయస్సు ఇరవై. నిండుయవ్వనం. చిన్నప్పుడే తల్లి, తండ్రి పోతారు. వోచెల్లి వుంటుంది. అది మేనమామ దగ్గర పెరుగుతుంది. వోసారి అతన్ని చూట్టానికి చెల్లి అతని దగ్గరకు వస్తుంది. ఆమె వయస్సు పదహారు. అతను ప్రస్తుతం నిరుద్యోగి. వోరాత్రి స్నేహితులతో బ్లూ సినిమాచూసి, విపరీతంగా త్రాగి ఇంటికి వస్తాడు. తలుపు తీసే వుంటుంది. చెల్లి పడుకొని వుంటుంది. స్నేహితుల బూతులు, సినిమాలోనివేడి, అతని రక్తాన్ని వేడెక్కిస్తాయి. అతను ఏంచేస్తున్నాడో అతనికే తెలియక ఆమెను బలాత్కరించి అనుభవిస్తాడు. ఆచెల్లి అతన్ని గట్టిగా తోస్తుంది. స్పృహతప్పి పడిపోతాడు. ఆమె అవమానం భరించలేక బావిలోదూకి చస్తుంది. ఈవార్త పేపర్లో వస్తుంది. వింతలు విడ్డూరాలుగా అన్ని పత్రికలూ ఘోషించాయి. అతను ప్రపంచదృష్టిలోకి వస్తాడు. ప్రపంచమంతా తనదృష్టిని అతనివైపుకు చాస్తుంది..... ఆచూపును తట్టుకోలేక అతనూ చెల్లిపడిన బావిలోనేపడి చస్తాడు ఇదీ కధ.... ఈకధ పేరు 'చూపు' అనిగాఢంగా నిట్టూర్చాడు ప్రేమ -శేఖర్.
'వెరీగుడ్.. .ఇటువంటి కధళు భరించే తెలుగువారు లేరు. అందుకే నీరచన లేవీ ప్రింటుకావటం లేదు. నీపేరా కధలు పంపవద్దు. నీ పెళ్లాంపేరా కధలు పంపవద్దు. అసలు తెలుగు పత్రికలకే కధలు పంపకు... .అని హితబోధ చేశాడు మూర్తి.
"మరి నేనెలా రచయితను కాగలను? నేను ఎంత కాలం ఇలా లోకల్ రచయితగా వుండను...." దీనంగా అడిగాడు ప్రేమ -శేఖర్.
'అందుకే చిట్టికన్నా! నీకోఉపాయం చెప్తా... నీకు ఎటూ మళయాలం వచ్చు. మంత్రాలు వచ్చుకదా! 'మళయాల మంత్రం' వెయ్.... అంతె!' అంటూ చెవులో గుసగుసలాడాడు మూర్తి.
ప్రేమశేఖర్ కళ్ళింతచేసుకొని విని, ఆనందంతో మూర్తిని కౌగలించుకొన్నాడు.
ఇద్దరూ పార్కునుండి ఎవరి ఇళ్ళకు వాళ్లు వెళ్లారు.
* * * *
శేఖర్ మర్నాడు ప్రేమను తీసుకువచ్చాడు పుట్టింటి నుండి క్షమాపణలు చెప్పుకొని. ప్రేమ, శేఖర్ హాయిగా వుంటున్నారు. శేఖర్ తెలుగులో రచనలు చేయడం మానుకున్నాడు. అతను 'శేఖరన్' అనే పేరుతో మళయాళంలో రచనలు చేస్తున్నాడు.
అంతే!
హఠాత్తుగా శేఖరన్ పుస్తకానికి ప్రభుత్వ అవార్డు వచ్చింది. ఆకధను మళయాలంలో సినిమాతీశారు. ప్రభుత్వం సుంకం తీసేసింది. సిల్వర్ జూబ్లీ ఆడింది. ఎన్నో అవార్డు లొచ్చాయి. ఇంకేముందీ... ఆ సినిమా తెలుగువారిని ఆకర్షించింది. తెలుగువారు తెలుగులో ఆకధను తీశారు. అఖండ విజయం అంతులేని ఆదరణ!
ఇంతకీ ఎవరా రచయిత?
ఎవరీ శేఖరన్....
తెలుగువారు గప్పవారు కదా!
దివిటీవేసి చూశారు. వెదికారు. అప్పుడు తెలిశాడు శేఖరన్ మళయాలవాడు కాదు తెలుగువాడేనని. ఇకనేం. పత్తికాయలాంటి అక్షరాలతో .. .అన్ని పత్రికల్లో ఇలా వచ్చింది...
"ఆంధ్రులు గర్వించదగ్గ వార్త. శేఖరన్ ఎవరోకాదు. తెలుగువాడే. మనవాడే. గుంటూరుజిల్లా - తెనాలి తాలూకా - వాడే. చిన్ననాడే అక్కడ స్థిరపడి ...'ఇంకా ఇలా ఎన్నెన్నో చివరికి అతనువాడే ఆఫ్టర్ షేవ్ లోషన్ తో సహా - అన్ని వివరాలూ తెలుగువారికి అందించారు.
ఇక శేఖర్ ఎంతబిజీయో - ఈ తెలుగు రచయిత చెప్పనక్కర లేదుకదా!
కాని వొక్కటే ఈ రచయితకు ఏడుపువస్తుంది. కేవలం తెల్గె తెలిసిన రచయిత గతేంకావాలి?అతనే 'మంత్రం' ఈ తెలుగు 'వాడి' కి వేయాలి?
రనచ కేవలం కల్పితం.
--రచయిత
*
