Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 17


    
    అతను కళ్ళు మూసుకుని "నీ నవ్వు చూసి తనని తాను వెన్నెల నిందించుకుంది.
    
    తమని తాము మల్లెలు కించపరుచుకున్నాయి. ఆహా! చూశారా అనుకోకుండా మనసులో భావాలు ఎలా బయటికి వచ్చేస్తున్నాయో! ఇదే కవిత్వమంటే" అన్నాడు ఎక్సైటయిపోతూ.
    
    ఆమె రాగయుక్తంగా "వట్టి వేళ్ళ సురటీలు.....మేల్పైడి కురిచీలు మా ఇంటలేవు...." అని పాడింది.
    
    "ఓహో! ఏం స్వరమండీ మీది! నా ఉద్దేశం ప్రకారం సంగీతం గొంతు లోంచి కాదు, హృదయంలోంచి రావాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. ఇందాక ఆవేశంగా మిమ్మల్ని మీరు మరిచి పాడారు చూడండీ" అని అనగానే-
    
    ఆమెకి తన ఆవేశం, ఉక్రోషం మళ్ళీ గుర్తుకువచ్చి ముఖం ఎర్రబడింది. "మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు...." అంది కాస్త మొహమాటంగా.
    
    "పొగడ్తని వాసనచూసి వదిలెయ్యమన్నాడో పెద్దమనిషి తాగుతూ కూర్చోకండే..." అన్నాడు నాటకీయంగా.
    
    ఆమె వెంటనే "కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళబోయింది.
    
    "ఆగండి, మీరు అలా వెనక్కి తిరుగుతుంటే నాకు మళ్ళీ ఊపందుకుంది.
    
    నీ చూపులో కవిత్వం జ్వాలాతోరణమైంది వెన్నెల!
    
    నీ పలకరింపులో మధురోహాలు గుబాళించాయి మల్లెలు!
    
    "ఎలా వుంది?" అన్నాడు కళ్ళు తమాషాగా ఆర్పుతూ.
    
    "చాలా బావుంది" మనస్ఫూర్తిగా చెప్పింది.
    
    "మీ చేతి కాఫీ తాగాలనే వుంది కానీ మీ కాఫీ కంటే కూడా మీ కంపెనీయే చాలా బావుందేమో అనిపిస్తోంది మిస్..." అంటూ అర్దోక్తిగా ఆపేశాడు.
    
    "ధృతి" పూర్తిచేసింది.
    
    "వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్!"
    
    "థాంక్స్!"
    
    "మీరు ప్రొఫెషనల్ సింగరా? ప్రోగ్రామ్స్ అవీ ఇస్తుంటారా?"
    
    "లేదండీ, ఏదో చిన్నప్పట్నించీ వీణ నేర్పించారు. మొన్నటిదాకా ఇదే నా జీవనాధారంగా వుండేది. ధర్మానందరావుగారి దగ్గర ఉద్యోగం వచ్చాక......మళ్ళీ చాలా రోజులకి ఈరోజే గొంతు విప్పాను."
    
    "మిమ్మల్ని ముఖంమీద పొగడకూడదు కానీ, మీచేత కన్ సర్ట్స్ ఇప్పిస్తే......అమెరికా దేశాల్లో అదిరిపోతారు" అన్నాడు ఉద్వేగంగా.
    
    "నన్ను ఎక్కువచేసి మాట్లాడుతున్నారు" కాస్త సిగ్గుగా అంది.
    
    "మిమ్మల్ని మీరు పొగుడుకోకూడదని చెప్పి అలా అంటున్నారు బానే వుంది కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. విన్నవాళ్ళు అదే నిజమనుకుంటారు" అన్నాడు నవ్వుతూ.
    
    "నిజంగా!"
    
    "ఔనండీ! అపరిచితులతో నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను ఎందుకు అని అడగరేం?"
    
    "ఎందుకూ?"
    
    "పరిచయసతులు నేనేం చెప్పినా ఇదివరకే ఇవన్నీ చెప్పేశావు. మరిచిపోయావా? అని అంటుంటారు."
    
    ఆమె అతని మోహంలో సీరియస్ నెస్ చూసి నవ్వుతూ "అయితే అందహ్రితో ఇవే మాటలు చెప్తారా?" అని అడిగింది.
    
    "నో..... నో..... మారుస్తూ వుంటాను. చక్కగా కవిత్వం చదివిన అమ్మాయిని బాగా పాడావులే అనీ, బాగా పాడిన అమ్మాయిని అద్భుతంగా చదివావనీ అంటే గతంలో పెద్ద గొడవైపోయిందిలెండి" అని నవ్వేసి, "ధృతీ! మిమ్మల్ని మాత్రం నిజంగానే పొగిడాను, ఆ పొగడ్తలో అబద్దం లేదు. ప్లీజ్ అండర్ స్టాండ్ మై సిన్సియారిటీ!" అన్నాడు.
    
    ఆమెకి నిజంగానే అతని మాటలో, కళ్ళలో సిన్సియారిటీ కనిపించింది.
    
    సుబ్బరాజు ఆదరాబాదరా పరుగెత్తుకువచ్చి "ఇక్కడున్నారా బాబుగారూ! మీకు ఫోన్ వచ్చింది" అన్నాడు.
    
    "ఓ.....పద....ధృతీ మీట్ యూ ఎగైన్" అంటూ పరుగుపెట్టాడు.
    
    ఎంతో భారమైన మనసుతో ఇల్లు చేరిన ధృతికి మనసంతా తేలికైనట్లూ, హాయిగా మారినట్లూ అనిపించింది. ఆహ్లాదకరమైన స్నేహం ఆత్మకు ఆహారంతో సమానం!
    
                                                                * * *
    
    సీరియస్ గా టైప్ చేస్తున్న ధృతి దగ్గరకొచ్చి "పాపం కృష్ణమూర్తి" అంది లీల జాలిగా.
    
    ధృతీ తలెత్తి "ఏమైందీ?" అంది.    

    "అతని పాట్లు చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది" అంది ఎదురుగా కూర్చుంటూ లీల.
    
    కృష్ణమూర్తికి జిడ్డు కృష్ణమూర్తని నిక్ నేమ్ పెట్టి ఏడిపిస్తుంటుంది లీల. అతను అందర్నీ పట్టుకుంటే వదలకుండా, చెప్పిన విషయమే పదే పదే చెప్పి విసిగిస్తుంటాడు.
    
    "ఏం అతనిమీద అంత జాలి?" నవ్వుతూ అడిగింది ధృతి.
    
    "నన్ను చూడగానే వీలైనంత ప్లెజెంట్ గా మొహంపెట్టి నవ్వడం, సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల గురించి వాపోవడం, నన్ను అతిగా పొగడటం ఇవన్నీ చూస్తుంటే కొంపదీసి నా జీతాన్ని గాని ప్రేమిస్తున్నా డేమోనని అనుమానంగా వుంది" కళ్ళు పెద్దవి చేస్తూ అంది.
    
    "మంచిదేగా! అయినా జీతాన్ని ప్రేమించడమేమిటీ?" అంది అప్పుడే అర్ధమైనట్లు.
    
    "అంతేగా! ఉద్యోగం చేసే అమ్మాయిల జీతాలే ప్రేమిస్తారు ఈ మగాళ్ళు అప్పుడే పెళ్ళిదాకా వెళతారు" గొప్ప అనుభవం వున్నదానిలా చెప్పింది.
    
    ధృతి నవ్వేసి "పాపం మంచివాడిలాగే అనిపిస్తాడు. నీ గురించి బాగా తెలిసినవాడు పైగా సంబంధాలు చూసే గొడవ మీ వాళ్ళకి తప్పుతుంది" అంది ఆమె.
    
    లీల ఆశ్చర్యంగా "అయితే నువ్వు ఇవిమాత్రమే చూసుకుంటావా?" అని అడిగింది.
    
    "ఇంకా ఏం చూసుకోవాలి?" కాయితాలు తీసి సర్దుతూ అంది ఆమె.
    
    "భర్త గురించి నీకు ఏమీ ఆశలూ, అభిలాషలూ లేవా? నాకు మాత్రం చాలా ఆశలున్నాయి.
    
    ధృతి చేస్తున్న పని ఆపి లీల చెప్పేది శ్రద్దగా వినసాగింది.
    
    లీల సీరియస్ గా చెప్తోంది. "ముఖ్యంగా గోడు వినేవారు దొరికితే చాలు అనుకుంటూ సుత్తికొట్టే మగవాడంటే నాకు చిరాకు. ఒకవేళ అటువంటి ఆలోచనున్నా, ప్రేమలాంటి ముసుగులు లేకుండా డైరెక్ట్ గా 'నా పరిస్థితి ఇదీ! మనం పెళ్ళిచేసుకుంటే ఇవీ ఎడ్వాంటేజెస్' అని ఫ్రాంక్ గా చెప్పేస్తే కొంతవరకూ నయం మళ్ళీ అందులో ఈ నాటకాలన్నీ ఎందుకూ? ప్రేమా, దోమా అంటూ...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS