అందరూ ధృతిలా వుండరు. కానీ ఆమెలాంటివారు చాలామందే వుండచ్చు అనుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో ఆమె కూడా అతని గురించే ఆలోచిస్తూ-
'ఇతని ఆలోచనలు కూడా ఆయన పంధాలోనే సాగుతున్నాయి. ఈ చిన్న ధర్మానందరావుగారితో కలిసి నేను జీవనప్రయాణం చెయ్యగలనా?" అనుకుంటోంది.
"పద" అతను ఆమె చేతిని పట్టుకుని లేవదీశాడు. అతని చేతిని తాకగానే ఆమె సందేహాలన్నీ పటాపంచలయిపోయాయి. సృష్టిలో ఏది అసత్యమైనా, నిర్మలమైన స్నేహం మాత్రం అసత్యం కాదు అని ఆ యిద్దరి నమ్మకం! అది నిజమో కాదో తెలియజెప్పాలి.
"రవీ, కృతి నామీద చాలా బెంగపెట్టుకున్నారు పాపం! అమ్మ కూడా ప్రొద్దుట నన్ను పట్టుకుని ఏడ్చేసింది తెలుసా?" అంది అతనివంక చూస్తూ.
అతను ఎటో చూస్తూ అన్నాడు- "మొదట్లో అలాగే వుంటుంది. నెమ్మదిమీద అలవాటుపడతారు."
ఆమెకి ఎందుకనో ఆ మాటలు అంతగా రుచించలేదు. నేను లేక పోవడాన్ని, నావాళ్ళు అంత తేలిగ్గా అలవాటుపడిపోతారా అనిపించింది.
సోమవారం ప్రొద్దుట తను బయల్దేరుతుంటే రవి, కృతీ ఎంతో మామూలుగా వీడ్కోలు చెప్పారు. తల్లీ తండ్రీ జాగ్రత్తలు చెప్పారు.
భారమైన మనసుతో ఆమె బయల్దేరింది. ఆమెకి మొట్టమొదటిసారిగా 'నేను ఓడిపోవడంలేదుకదా?' అన్న అనుమానం కలిగింది.
డిక్టేషన్ చెపుతున్న ధర్మానందరావు ధృతి ఆగిపోవడం చూసి అడిగారు "ఏమైందీ?"
ఆమె బాధని అణచిపెడుతున్నట్లుగా మొహంపెట్టి చూపుడు వేలు చూపించింది. దానికి కాలిన దెబ్బ వుంది. సరిగ్గా పెన్సిల్ ఆనేచోట.
"ప్రొద్దుట వంట చేస్తుంటే కాలింది" అంది.
ఆయన మొహం అప్రసన్నంగా మారింది. "అంత అజాగ్రత్తగా ఎలా వుంటావూ? స్టెనోగ్రాఫర్ కి వేళ్ళు ఎంత అవసరమో నీకు తెలీదా? మనుషులు తమ అజాగ్రత్తయొక్క పర్యవసానాలు ఇంకొకళ్ళని అనుభవించమనడం నాకు చిరాకును కలగజేస్తాయి"
ఆమె ఏం మాట్లాడలేదు. కంటనీరు గిర్రున తిరిగింది కానీ బైటికి రానివ్వలేదు.
"ఈ రోజుకి లీవ్ తీసుకుని వెళ్ళిపో" విసుగ్గా చెప్పి మరో స్టెనోని పిలిపించుకున్నారు.
ఆమె ఆఫీస్ బైటికి వచ్చాక కొంచెంసేపు ఆలోచించింది. అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళిపోదామా అని కానీ మళ్ళీ నా తప్పెందుకు వుంచుకోవాలి అనుకుంటూ ధర్మానందరావుగారింటి దగ్గరకు వెళ్ళే బస్ ఎక్కేసింది.
ఆమె టైం కాని టైంలో అలా ఇంటికి రావటం చూసి కొత్త వాచ్ మెన్ అడిగాడు. "ఒంట్లో బాలేదా అమ్మా?" అని.
ఆ మాత్రం స్వాంతనకే ఆమె తట్టుకోలేకపోయింది. కళ్ళనిండా నీళ్ళు చేరి ఏ నిమిషానైనా బైటికి దూకటానికి సిద్దమయ్యాయి. ఛటాల్న తల తిప్పుకుని, "కాస్త తలనొప్పిగా అనిపిస్తోంది" అంటూ తన ఇంటి వైపు నడిచింది. ఆమె మనసంతా ఆలోచనలు ఈగల్లా ముసురుకొన్నాయి.
డబ్బుకోసం కక్కుర్తిపడి వచ్చానని ఆయన అనుకుంటున్నాడు కాబట్టే యిలా నోటికి వచ్చినట్టల్లా అనేస్తున్నాడు. ఛీ చీ....ఇలా ఎప్పుడూ అనిపించుకోలేదు. అసలు నా నోరెందుకు పెగలటంలేదూ? ఇంత సహనం ఎలా వచ్చింది? నా ఆవేశం అంతా ఏమైపోయిందీ? పరిస్థితులు నా ఆత్మాభిమానాన్ని చంపెయ్యడంలేదు కదా! ఎవరితో పడని వ్యక్తులు, కలవలేని వ్యక్తుల్లా కారాగారంలో వుండతగ్గవారు అనుకుంది కసిగా.
లోపలి వెళుతూనే చెప్పులు వదిలేసి, చాప వాల్చుకుని కూర్చుని, "బాలత్రిపుర నీకూ పంతమేలనే" నాటో పాట అందుకుంది.
ఆ తరువాత ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి, అలా తన మనసులోని బాధంతా తీరేటట్లు మనసంతా కేంద్రీకరించి చుట్టూ వున్న పరిసరాలనే కాకుండా, తనని తనే మరిచిపోయి పాడసాగింది. ఆ గానం దిగంతాల వరకూ సాగుతున్నట్లుగా.....ఆ మధ్యాహ్నం నిర్మానుష్యంలో గాలిలో అలా....అలా.... తేలి ప్రయాణిస్తోంది.
అలుపు వచ్చేదాకా పాడి ఆపేసి లేవబోతుంటే, వెనకనుంచి చప్పట్లు వినిపించాయి. తిరిగి చూసింది.
సన్నగా, పొడుగ్గా, తెల్లగా వున్న స్ఫురద్రూపి అయిన యువకుడు గుమ్మం దగ్గర నిలబడి చప్పట్లు చరుస్తున్నాడు. ధృతి అతనివైపు విస్మయంగా చూస్తుండిపోయింది.
"మార్వలెస్!" అన్నాడతను.
ఆమె చటుక్కున లేచి నిలబడి "మీరూ..." అంది.
"ఐయామ్ ప్రేమ్!" అన్నాడు పరిచయం చేసుకుంటూ అంతలోనే ఆమె కళ్ళలోని భయం, సంభ్రమం చూసి చిన్నగా నవ్వుతూ "ధర్మానందరావు అంకుల్, మా డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ నేను స్టేట్స్ నుండి ఈ ఉదయమే వచ్చాను. అమెరికానుండి వచ్చిన నాకు, తెలుగుదనం గుభాళిస్తున్న వీనులవిందైన సంగీతంలో భలే స్వాగతం చెప్పారండీ. థాంక్స్!" అన్నాడు కొద్దిగా స్టయిల్ గా పట్టిపట్టి మాట్లాడుతూ.
ధృతి అతని ఉచ్చారణకి చిన్నగా నవ్వింది.
"నిజంగా మీ పాట అమోఘం! అద్భుతం!" అన్నాడు కళ్ళు పెద్దవిగా చేస్తూ.
"మీకు తెలుగులో చాలా విశ్లేషణలొచ్చే!" అంది నవ్వేస్తూ.
అతను ఉత్సాహంగా ఇంకో రెండు అడుగులు ముందుకు వేసి, "లుక్! నేను తెలుగులో 'పొయిట్రీ' ఐమీన్ కవిత్వం చెప్పగలను తెలుసా!" అన్నాడు.
"అలాగా?" నిజంగానే ఆశ్చర్యపడింది ఆమె.
