Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 18


    ధృతి ఆలోచనగా "నిజమే" అంది.
    
    లీల ఉత్సాహంగా "తన భుజంమీద తలవాల్చే పురుషుడ్ని స్త్రీ భరించదు. తను అతను భుజంమీద తల వాల్చడాన్ని యిష్టపడుతుంది" అంది.
    
    ధృతి ఠకీమని "ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గాఢానురాగం వున్నప్పుడు ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడంలో ఎంతో తృప్తి లభిస్తుంది" అంది.    

    లీల సాలోచనగా "అంతగా స్పందింపజేసి తనకోసం మనం ఏమయినా చెయ్యగలిగేటట్లు చేసే మనిషి దొరకాలి కదా!" అంది.
    
    ఆమె మళ్ళీ తన చూపుడువేలు ఆడిస్తూ "కానీ ఒక్క విషయం శారీరకంగా, ఆర్ధికంగా బలవంతుడు కాకపోయినా ఫరవాలేదు కానీ మనోబలం లేకపోతే మాత్రం పురుషుడ్ని స్త్రీ యిష్టపడదు. నా ఉద్దేశం ప్రకారం మనోబలం వుంటే ఏదైనా సాధించవచ్చు! బహుశా అదే లేకపోతే టెన్ సింగ్ నార్కే ఎవరెస్టు ఎక్కి వుండేవాడు కాదేమో" అంది.
    
    లీల నవ్వేసి "నువ్వు మాట్లాడితే వినడానికి చాలా బావుంటుంది ధృతీ" అంది.
    
    ఆ రోజు లీల లంచ్ తెచ్చుకోకపోవడంతో ఇద్దరూ దగ్గర్లో వున్న హోటల్ కి వెళ్ళి లంచ్ తీసుకున్నారు.
    
    "ధృతి! ఆర్ యూ లవ్?" లీల అడిగింది.
    
    ఆమె ఆలోచనగా చూసింది. "ప్రేమంటే?"
    
    "ఒకరికోసం ఒకరు బ్రతకటం! అవతలి వాళ్ళకోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడకపోవడం" అంది లీల.
    
    "అయితే నీకు జవాబివ్వాల్సింది నేను కాదు."
    
    "మరి!"
    
    "కాలం ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను నుకున్నా ఒకవేళ నిజంగా అతనికోసం ఏమైనా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతేనో! అందుకే నీ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నాను" అంది స్థిరంగా.
    
    లీల ఆమె కళ్ళలోని నిజాయితీని చూసి చలించిపోతూ "ఒకటి మాత్రం నిజం! నీ ప్రేమని పొందినవాడు అందరికన్నా అదృష్టవంతుడు" అంది.
    
    "ఏమో" నవ్వేసిందామె.
    
                                                               * * *
    
    ఆ సాయంత్రం ఆమె ఆఫీసునుంచి వచ్చేటప్పటికి వరండాలో ఒక పొడుగాటి పెట్టె కనిపించింది. ఆమె ఆశ్చర్యంగా "ఇది ఎవరు తెచ్చారు?" అని వాచ్ మెన్ ని అడుగుతుంటే-
    
    "ప్రేమ్ బాబుగారు ఇక్కడ పెట్టిరమ్మన్నారమ్మా" అంటూ సుబ్బరాజు వచ్చాడు.
    
    ఆమె వెంటనే అది తెరిచి చూసింది. అందులో అందమైన ముఖమల్ బట్టమీద పెట్టిన బొబ్బిలి వీణ మెరిసిపోతోంది. దానికి కట్టిన ఎర్రని రిబ్బన్ కి ఒక స్లిప్ గుచ్చబడి కనిపించింది దాన్లో.
    
    "చూపు తీగ మీటి, హృదయవీణ సరిచేస్తే అనురాగ గీతం వినిపిస్తుంది. అది అందరూ వినలేరు. అందర్నీ రంజింపచెయ్యాలంటే యీ వీణ మ్రోగించాలి. అందుకే యీ చిన్న బహుమతి....ప్రేమ్" అని వ్రాసి వుంది.
    
    ఆమెకి ఆ పంక్తుల వెనుక దాగిన భావం ఏమిటో అర్ధం కాలేదు. కానీ అంత ఖరీదైన బహుమతి నిన్న పరిచయమై ఈ వేళ ఇవ్వడం విడ్డూరంగా అనిపించింది. అదతని అలవాటేమో! కానీ ఆమెకి ఎవరి దగ్గరా తీసుకోవడం అలవాటు లేదు! ఒక్క వ్యక్తి దగ్గర తప్ప!
    
    "సుబ్బరాజూ! ఈ వీణ తీసుకువెళ్ళి ఆ ఇంట్లోనేపెట్టి ప్రేమ్ గారికి చెప్పు.  ఆ అమ్మాయి తీసుకోవడానికి యిష్టపడడంలేదని" అంది.
    
    సుబ్బరాజు తల గోక్కుంటూ "ఆయ్" అని పెట్టె తీసుకుని వెళ్ళిపోయాడు.
    
    రాత్రి ఎనిమిది గంటలవేళ సుబ్బరాజువచ్చి తలుపు తట్టాడు. ఆమె ప్రేమ్ ఏమో అనుకుంది. కాదని తెలిశాక 'అమ్మయ్య అనుకుంది.
    
    "అయ్యగారు మిమ్మల్ని రమ్మన్నారు. ఏదో అర్జంట్ పనిట" అన్నాడు.
    
    ఆమె వెళ్ళేసరికే ధర్మానందరావుగారు ఒక్కరే సోఫాలో కూర్చుని వున్నారు. "ఒక డిక్టేషన్ తీసుకో అర్జంట్! మళ్ళీ  ప్రొద్దుట మరిచిపోయినా మరచిపోతాను"  అని హడావిడి పెట్టేశారు. ధృతి అటూ ఇటూ చూస్తుంటే తన జేబులోంచి పెన్ తీసి అందించారు. టేబుల్ మీద వున్న బుక్ తీసుకుని ఆమె వ్రాయసాగింది.
    
    డిక్టేషన్ చెప్పడం అయ్యాక "పెన్ బాగా వ్రాస్తోంది కదూ!" అన్నాడు.
    
    ఎందుకు అడిగారో అర్ధంకానట్లు చూస్తూ ఆమె పెన్ తిరిగి ఇచ్చేస్తూ "అవును" అంది.
    
    ఆయన అందుకునే ప్రయత్నం చేయకుండా "ఉంచు" అన్నాడు. ఆమె సందేహంగా చూస్తుంటే తీసుకో అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు.
    
    ఆమె తన చేతిలో ముచ్చటగా వున్న చిన్న పెన్ ని చూస్తూ "థాంక్స్" అంది.
    
    "ఇవ్వగానే తీసేసుకుంటున్నావే?" ఆయన కంఠం కొంచెం గట్టిగా వినిపించింది.
    
    ఆమె అప్రతిభురాలయి ఆయనవైపు చూసింది.
    
    "నీకు తీసుకోవడం యిష్టం వుండదుగా! ఇందాక ప్రేమ్ నీకు స్నేహంగా బహుమతి పంపిస్తే తిప్పికొట్టావట" సీరియస్ గా అడిగాడు.
    
    ధృతికి అప్పుడర్ధమయిందా డ్రామా.
    
    "ఇవ్వగలవాళ్ళకి స్తోమత వున్నా తీసుకునేవాళ్ళకి కూడా అంత అర్హతా, అనుబంధం వుండాలిగా!"
    
    "మరి పెన్ ఎలా తీసుకున్నావు?"
    
    "మూడు నాలుగువేలు ఖరీదుచేసే అంత విలువైన వస్తువు బహుమతిగా తీసుకోవడం, ఒక యాభైరూపాయలు ఖరీదుచేసే ఈ ప్లేర్ పెన్ తీసుకోవడం ఒకటే అవుతుందా?"
    
    "వాటి విలువలూ, ధరలూ నీకు అనవసరం. మా సంగతికొస్తే ఈ పెన్ కి, ఆ వీణకి పెద్ద తేడాలేదు. ఈ పెన్ తో  నాకు లెటర్స్ వ్రాసిపెట్టినట్లే ఆ వీణతో మనసు బాగాలేనప్పుడు పాటపాడి సంతోషపెడతావు. అంతే" సింపుల్ గా తేల్చిపారేశారు. మా ఆనందంకోసం ఏమైనా చేస్తాం అన్న దర్పం వుందా గొంతులో.
    
    ధృతి గమనిస్తున్న విషయం ఆయన ఆడంబరం, అభిజాత్యం కాదు. ఆయన లాజిక్! ఇది తీసుకున్నదానివి, అది ఎందుకు వద్దన్నావూ? అని అడగడానికి ఆయనప్పటికప్పుడు క్రియేట్ చేసిన సీన్ ని చూస్తుంటే అహం పక్కన పెట్టి ఆయనని అభినందించాలనిపించింది. అంతలోనే ఆ అభినందనని ఆయన తన ఓటమిగా పొరబడతాడేమోనని నవ్వుతూ "మీ స్వభావాలూ, పద్ధతులూ నాకు ఇప్పుడిప్పుడేగా అర్ధమవుతున్నాయి! వీణ ఇక్కడే వాయించుకో అంటే బానేవుంది. రేపు ఎప్పుడో ఇల్లు తుడుచుకునే క్లీనింగ్ మిషన్ లాంటిదిచ్చి ఇక్కడే వాడుకో అంటారేమోనని భయంగా వుంది" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS