మా నాన్న శాస్త్రులతో సంప్రదించి ఆదినెల పోయాకే గర్భాదానం కార్యక్రమం నిర్ణయించాడు. దాంతో ఆయన మరుసటి రోజు ఉదయమే ఊరెళ్ళిపోయారు. నేను ఒంటరిదాన్నయి పోయాను.
వారం రోజుల తరువాత ఆయన దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది నాన్నకు. జ్వరం తగ్గిపోయిందని, ఇప్పుడు ఆరోగ్యంగా వున్నానని రాశాడు.
"భగవంతుడా!" అనుకుంటూ రెండు చేతులూ పైకెత్తి మొక్కుకున్నాను. వారం రోజులుగా బరువెక్కిన గుండె కుదుటపడింది తొలిసారిగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు గాఢంగా శ్వాస పీల్చాను.
ఆరాత్రి నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతున్నాను. అమ్మా నాన్న హాల్లో నిద్రపోతున్నారు. నేను ముందు గదిలో పడుకున్నాను.
బాగా రాత్రయినట్లు జోరీగల రొద తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. దూరంగా కప్పలు అరుస్తున్న శబ్దాలు చీకటి గాఢతను తెలియజేస్తున్నాయి.
అమావాస్య రోజులేమో - చిట్ట చీకటి గుడ్లగూబ రెక్కలా వుంది.
ఉత్తరంలో నన్ను అడిగినట్లు చెప్పమని రాశాడు. ఆ చిన్న వాక్యం రేపుతున్న అలజడి మాత్రం పెద్దగానే వుంది.
జోరీగ రొద కూడా ఆగిపోయింది. రాత్రి మరింత చిక్కబడింది. ఆకాశం వెంట నడిచెళుతున్న గంధర్వ కన్యల కాళ్ళకున్న వెండి పట్టీలు రాలిపడిపోయినట్లు చుక్కలు బారులు తీరున్నాయి. కిటికీ అంత ఆకాశం మల్లెపూలు వాడిపోకుండా చుట్టి వుంచడానికి వుంచిన నల్లటి వస్త్రంలా వుంది.
అదిగో... అప్పుడు వినిపించింది సైకిల్ బెల్. నా గది కిటికీ అవతలే ఎవరో సైకిల్ బెల్ మొగిస్తున్నట్లు గ్రహించాను. భయంతో గుండె కుంచించుకుపోయింది. కిటికీ కింది రెక్కలు తీసి చూద్దామంటే ధైర్యం చాలడం లేదు. దిగ్గున లేచి కూర్చున్నాను.
"పరంజ్యోతీ.....పరంజ్యోతీ" మెల్లగా ఎవరో పిలుస్తున్నారు. ఆ గొంతును పోల్చుకోలేకపోయాను.
పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఎవరో తెలిసినవాళ్ళే అయి వుంటారని ధైర్యం చేసి కిటికీ రెక్కల్ని తీశాను.
"నేను వీరభద్రాన్ని"
వచ్చింది ఎవరో తెలిసింది. మెడలోని మంగళ సూత్రాల్ని కళ్ళకద్దుకుంటూ మంచం దిగాను. అది నెలలో అదీ అంత రాత్రిపూట ఆయన ఎందుకొచ్చాడో ఊహించలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎటూ కదలక అలానే నిలబడిపోయాను.
"నీకోసమే వచ్చాను"
చాలా చిన్నగానే చెప్పినా, ఆ శబ్దాలకే అమ్మా నాన్న లేచినట్లు కంగారుగా అటూ ఇటూ చూసాను.
"కాళహస్తిలో లాస్ట్ బస్ దిగాను. ఇక అక్కడి నుంచి బస్సులేదు కదా బాడుగ సైకిల్ తీసుకొచ్చాను"
అంత రాత్రిపూట దాదాపు పదిహేను కిలోమీటర్లు సైకిలు తొక్కుకొచ్చిన ఆయన్ని చూస్తుంటే భావావేశం పట్టలేక ఏడుపు తన్నుకొచ్చింది. యిక ఒక్క క్షణం ఉపేక్షించడం కూడా తీరని ద్రోహమే అవుతుందనిపించి మెల్లగా నడిచి తలుపు తీసుకుని ఆయన దగ్గరకు చేరాను.
"జ్వరం పోయింది. కావాలంటే చేయి పట్టుకుని చూడు. ఈ రోజే రసం అన్నం తిన్నాను. ఒళ్ళు బాగయిపోయిన క్షణం నుంచి నిన్ను చూడాలని ఆరాటం మొదలయింది. సాయంకాలానికి ఆగలేక పోయాను. కాళహస్తి చేరేటప్పటికి పదైంది. ఇక అప్పుడు ఈ ఊరికి బస్సుల్లేవుగా అదృష్టం కొద్దీ సైకిల్ షాపు అప్పుడే మూస్తున్నారు. వాడిని బతిమిలాడి సైకిల్ ఇప్పించుకుని వచ్చాను ఇంత శ్రమపడిందీ ఎందుకో తెలుసా? నిన్ను చూడ్డానికి."
ఉత్పలమాలలా హుందాగా, శార్దూలంలా గంభీరంగా, కంద పద్యంలా అందంగా, తేటగీతిలా సరళంగా, సీసపద్యంలా పొడవుగా వుండే ఆయన చిన్నపిల్లాడు ఆటవెలది పద్యాన్ని అప్పజెబుతున్నట్టు చెబుతుంటే తమాషాగా అనిపించింది.
"రండి- లోపలికి" అన్నాను.
"వద్దు - మావయ్యను లేపకు. అది నెల కదా - అభ్యంతరం చెప్పచ్చు. అందునా ఇంత రాత్రి పూట వచ్చానంటే నామోషీగా వుంటుంది. మనిద్దరం డాబా మీద కొంతసేపు కూర్చుందాం - ఇక్కడయితే మామయ్యా వాళ్ళు లేచే ప్రమాదముంది. సరేనా" అని నేను ఒప్పుకుంటానో లేదోనని కళ్ళల్లోకి చూస్తున్నాడు.
సంస్కృతాంద్రాల్లో మహాపండితుడు అయిన ఆయన ఎదురుగ్గా నిలబడి దీనంగా పిలుస్తుంటే వెళ్ళకుండా వుండగలనా? సరేనన్నట్లు తల ఊపాను.
నిశ్శబ్దంగా ప్రహరీ గోడకున్న గేటు తీసాను. ఆయన ముఖంలో ఆనందం పౌర్ణమినాటి వెన్నెలే అయింది.
నేను గదిలోకి వెళ్ళి కిరోసిన్ దీపాన్ని వెలిగించి తెచ్చాను.
ఆయన సన్ సైడ్ నీడలో సైకిల్ ను నిలబెట్టి స్టాండు వేస్తున్నాడు.
ఆయన దగ్గరగా వెళ్ళి దీపాన్ని కొద్దిగా పైకి లేపి పట్టుకున్నాను.
అప్పుడు చూసాను సైకిలు ముందు చక్రాన్ని, భయంతో వణికిపోయాను. చేతిలోనున్న దీపం కూడా కదలడంతో స్టాండు వేయడం పూర్తిచేసిన ఆయన "ఏమైంది పరంజ్యోతీ?" అని అడిగాడు.
నాకు నోట మాట రావడం లేదు. ముందు చక్రాన్ని చూడమన్నట్లు చేత్తో చూపించాను.
సైకిల్ చక్రం రిమ్ముల మధ్య పొడవైన పాము అడ్డదిడ్డంగా చుట్టుకుని వుంది. ముందు భాగమంతా చలనరహితంగా వున్నా, తోక మాత్రం చిన్నగా కదులుతోంది.
ఆయన కూడా కంగారుపడిపోయి, దీపాన్ని నా చేతుల్లోంచి లాక్కుని దగ్గరగా పెట్టి చూసాడు. ఆయనతో పాటు నేనూ వంగాను.
నాగుపాము పాడగా స్పష్టంగా కనిపిస్తోంది మధ్య భాగంలో ఒక దగ్గర శరీరం నుజ్జు నుజ్జు అయిపోయి వుంది. రిమ్ములకు అక్కడక్కడా రక్తం మరకలు అంటి వున్నాయి. ఆయన పక్కనున్న పుల్లను తీసుకుని దానిని పొడిచాడు అది కదల్లేదు.
"చచ్చిపోయినట్లుంది కాళహస్తి దాటాక ఓ చిన్న గుడి వస్తుంది కదా - అక్కడ సైకిల్ దేన్నో ఎక్కినట్లనిపించింది తాడో, కొబ్బరి చిప్పో - ఏదో అలాంటిధై వుంటుందనుకున్నాను. సైకిల్ మాత్రం ఆపలేదు. కొంతసేపటికి పాము బుసలాంటి శబ్దాలు వినిపించాయి. అదంతా నా భ్రమే అనుకున్నాను. కాని సైకిల్ ని ఎక్కించింది పాము మీదేనన్న మాట.
సైకిల్ ఎక్కగానే నడుం విరిగుంటుంది ఆ బెదురులో అది చక్రంలోకి ఎక్కేసుంటుంది. రిమ్ముల మధ్య తగులుకుపోయి, కొంతసేపు పెనుగులాడి చచ్చిపోయుంటుంది."
భయంతో గడ్డకట్టుకు పోయిన నేను తిరిగి సర్దుకున్నాను. కానీ నన్ను చూడాలని అంత రిస్కు తీఉస్కుని వచ్చిన ఆయన్ని అలా కళ్ళార్పకుండా చూస్తూండిపోయాను.
పెడల్ ని తొక్కుతున్నప్పుడు అడిగానీ కాలిని కరిచి వుంటే ఏమై వుండేదో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరించింది.
