పులిరాజు అందరి వైపు చూసి గర్వంగా నవ్వి, "పద" అన్నాడు.
ఇద్దరూ హాలు వెనుక విపున్న గదిలోకి వెళ్ళారు. అతడి చేతిలో సస్పెన్షన్ ఆర్డర్ గాలికి కదుల్తోంది.
"మీకో ఆధునిక నీతిసూత్రం తెలుసా సార్!"
పులిరాజు మొహం చిట్లించి "ఏమిటది?" అని అడిగాడు.
"రేప్ తప్పనిసరి అయినప్పుడు నవ్వుతూ వప్పుకోవాల్ట" అంటూ వూహించని వేగంతో లాగిపెట్టి అతని చెంపమీద బలంగా కొట్టాడు. ఆ చప్పుడికి గదిగోడలు ప్రతిధ్వనించాయి. రాజు ఇంకా ఆ దెబ్బ తాలూకు దిగ్భ్రమనుంచి తేరుకోకముందే ...."కొట్టావనడానికి నువ్వు సాక్ష్యం. కొట్టలేదనటానికి నేను సాక్ష్యం 1:1 నిష్పత్తి సరిపోయింది. కేసు లేదు" అని ఆర్డర్ మడిచి జేబులో పెట్టుకుని అక్కడినుంచి ముందు గదిలోకి వచ్చాడు.
అటెన్షన్ లో నిలబడి డియస్పీకి సెల్యూట్ చేసి, బయటకు నడిచాడు. బయట కంటి నిలబడి వుంది. "ఐయామ్ సారీ రాణా నువ్వేం బాధపడకు, అయిందేదో అయిపోయింది. ఈ వూళ్ళోనే ఇద్దరం కలిసి మసాజ్ పార్లర్ పెడదాం. మొగాళ్ళకి నువ్వూ, ఆడవాళ్ళకి నేనూ..... సంవత్సరంలో లక్షలు సంపాదించవచ్చు" అంది.
"తప్పకుండా పెడదాం మొదటి కస్టమర్ మీ నాన్నే" కసిగా అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు రాణా.
8
రాత్రి పదయింది.
వాళ్ళు నలుగురూ అతడివైపు చూస్తూవున్నారు. నిశ్శబ్దంగా మాటరానట్టు చూస్తూ వున్నారు. అతను పచార్లు చేస్తున్నాడు. వాళ్ళు ఆలోచించుకోవటానికి కాస్త టైమిచ్చినట్టు అతడు కూడా మౌనంగా వున్నాడు.
చాలా రహస్యమైన సమావేశం అది.
అతడిప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లా లేడు. కోపంతో మొహం ఎర్రబడి, చిరాకు అణుచుకునే ప్రయత్నంలో వున్నాడు. తనలోని రాక్షసుడిని బయటకు రాకుండా ఆపుచేస్తున్నాడు.
అతడు పులిరాజు!
వాళ్ళు నలుగురూ స్టూవర్ పురం దొంగలు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విద్యలో ఆరితేరినవారు. అందులో ముఖ్యుడు ప్రసాద్. ఎన్ని అంతస్థుల భవంతి అయినా అతడు ఏ ఆధారమూ లేకుండా పైకి ఎక్కగలడు. ఎటువంటి ఇంటిలో కయినా అవలీలగా ప్రవేశించగలడని ప్రతీతి. వారిలో రెండవ వ్యక్తి పొడుగ్గా సన్నగా వున్నాడు. జడ పిన్నుతో ఎలాంటి తాళాన్నైనా తీయగలడు అతడు. వేళ్ళ స్పర్శతో ఇనప్పెట్టె మర్మం తెలుసుకోగలడు. మూడో వ్యక్తి లావుగా వున్నాడు. గుండ్రటి మొహం. కేవలం వాసన పట్టి, బంగారం ఎక్కడ వున్నా కనుక్కోగలడు. నాలుగో వ్యక్తి ఎంత చిన్న అలికిడినైనా పసిగట్టగలడు.
ఈ నలుగురినీ పులిరాజు ఒక ప్రత్యేకమైన పనిమీద పిలిపించాడు. అయితే ఆ పనేమిటో చెప్పలేదు.
"ఒక దొంగతనం చెయ్యాలి. చాలా సులభమైన దొంగతనం. అది ఏమిటో, ఎక్కడో చెప్పను. మీరు వప్పుకుంటే చెప్తాను. ఈ పని చేసినందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ఇస్తాను" అన్నాడు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష అంటే - చాలా పెద్ద దొంగతనం అని వాళ్ళకు తెలిసిపోయింది. అయినా వాళ్ళలో కదలిక లేదు.
పులిరాజు అన్నాడు- "మీ వెనుక నేనుంటాను. ఏ కేసూ రాకుండా చూసుకుంటాను. నాకున్న పలుకుబడి ఏమిటో మీకీపాటికే తెలిసిపోయి వుంటుంది. ఈ రోజు మధ్యాహ్నం ఇన్ స్పెక్టర్ రాణాని క్షణాల్లో సస్పెండ్ చేయించాను. మీ వరకూ వచ్చిందా ఆ విషయం?"
"తెలిసింది" అన్నట్టు ప్రసాదు తలూపాడు.
"దాన్నిబట్టే మీ కర్ధమై వుంటుంది కాబట్టి చెప్పండి. ఈ దొంగతనం చేస్తారా? చేస్తానంటే వివరాలు చెప్తాను, చాలా సింపుల్ దొంగతనం."
ప్రసాదు గొంతు సవరించుకుని అన్నాడు- "అయ్యా! మీరు చాలా గొప్పవారు. మేమింతకుముందు చాలా దొంగతనాలు చేసినమాట నిజమే. ఒక్కొక్కరం పది సంవత్సరాలకి తక్కువ కాకుండా జైల్లో గడిపిన మాట కూడా నిజమే. కానీ ఇప్పుడిక ఈ దొంగతనాలు మానేద్దామానుకుని ఒక నిశ్చయానికి వచ్చాము సార్. మా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. మేము జైల్లో వున్నంతకాలమూ మా భార్యలు నానా కష్టాలూ పడుతున్నారు. ఇంకెంతకాలం ఇలా దొంగతనాలు చేస్తూ జైల్లో గడపాలి? మాకు దొరికేది తక్కువ, వాటాలుగా పోయేది ఎక్కువ. వీరదాసు, ఎమ్మెల్యే నాయుడుగారు కలిపి సగం, పోలీసులు పాతిక తింటారు. జైలుశిక్ష మాత్రం మాకు. అందుకని మేము మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. స్టూవర్టుపురం దొంగలకి ప్రభుత్వం పొలాలిచ్చింది. ఇళ్ళస్థలాలు ఇచ్చింది. ఆ అవకాశాన్ని మేము ఉపయోగించదల్చుకున్నాము. ఎంతకాలం ఇలా దొంగలుగా బ్రతకగలం? మీరే చెప్పండి. కాబట్టి మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి."
పులిరాజు బిగ్గరగా నవ్వేడు. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో అతడి నవ్వు కంపనాలుగా వ్యాపించి, ఎంతటి వారికయినా భయం కొలిపేదిగా వుంది. "వదలిపెట్టటమా?" అని తిరిగి నవ్వేడు. "నేను వదిలి పెడతాను. మీరింతగా అడిగితే బ్రతిమాలి మీతో పని చేయించుకోవలసిన అవసరంగానీ, ఆశగానీ నాకు లేవు."
అతడి మొహంలో నవ్వు మాయమైంది. దగ్గరగా వచ్చి వాళ్ళ మొహాల్లోకి చూస్తూ అన్నాడు- "కానీ పోలీసులు మిమ్మల్ని వదిలిపెడతారా? నేను వేరే మనుష్యుల్ని తెప్పించి ఈ దొంగతనం చేయిస్తాను, దాంతో మీకు నరకం మొదలవుతుంది. అవునా?"
వాళ్ళు సమాధానం చెప్పలేదు.
అతనన్నాడు "కానీ నేను అప్పుడు మీ వెనకాల వుండను. వదిలెయ్యమని పోలీసులకి పైనుంచి ఫోన్ లు రావు. పైగా దొంగ సరుకు వెంటనే పట్టుకొమ్మని పైనుంచి వత్తిడి ఎక్కువ అవుతుంది. ఆ కోపమంతా మీమీదే చూపిస్తారు పోలీసులు చెప్పండి.... ఆ నరకం అనుభవిస్తారా? నాతో సహకరిస్తారా?"
వాళ్ళు కొద్దిసేపు మౌనంగా వుంది- "మాకు కొంచెం టైమివ్వండి సారూ" అన్నారు.
"అయిదు నిముషాల్లో వస్తాను. ఆలోచించుకోండి" అని పులిరాజు అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
అతడు తిరిగి వచ్చేసరికి వాళ్ళొక నిర్ణయానికొచ్చినట్టు కనపడ్డారు.
"ఏం ఆలోచించుకున్నారు?"
ప్రసాదు అన్నాడు - "మేము ముందనుకున్న దానికే కట్టుబడి వుండాలని అనుకుంటున్నామయ్యా."
పులిరాజు మొహంలో లిప్తపాటు కాలం ఒక వక్రరేఖ క్రౌర్యంగా తొంగిచూసి మాయమైంది. "సరే వెళ్ళండ్రా వెళ్ళి ప్రభుత్వం మీకిచ్చిన పొలాలు దున్నుకుంటూ బ్రతకండి. మీరు ప్రశాంతంగా జీవిస్తానంటే నేనెందుకు కాదనాలి? ఏదో.....ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష వస్తుందంటే సంతోషంగా వప్పుకుంటారనుకున్నాను. వెళ్ళండి. కానీ జాగ్రత్త మనమధ్య జరిగిన ఈ విషయం బయటకు పొక్కిందో, పోలీసులు కాదు- నేనే మీ రక్తం కళ్ళ జూస్తాను. దొంగతనం సంగతి ఇక మీరు మర్చిపొండి."
'ఎంతమాట బాబయ్యా.... ఇంతకన్నా పెద్ద రహస్యాలే మేము ఎన్నో కడుపులో దాచుకున్నాం. ఒక చిన్న విషయం బయట పెట్టినా ఎందరో పోలీసులు ఉద్యోగాలు గంగలో కలసిపోవును. మీరు చెప్పింది మేం చెయ్యమన్నామే తప్ప మీ విషయాలు మాకెందుకు బాబూ. మమ్మల్ని ఇట్టా వదిలి పెట్టండి" అని వాళ్ళు వెళ్ళిపోయారు.
పులిరాజు అటే చూస్తూ నిలబడ్డాడు.
యాభై లక్షల విలువచేసే నగలు!!
ఎలక్షన్స్ దగ్గర్లో వున్నాయి. డబ్బు అవసరం చాలా వుంది. దాదాపు కోతిరూపాయల దాకా ఖర్చుపెడితే ఉపముఖ్యమంత్రి అవ్వచ్చు. ఈసారి రాష్ట్రంలో తమ పార్టీయే తప్పక వస్తుంది. అందులో సందేహం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే నాయుడు వున్న ఆ పార్టీకి డిపాజిట్టు కూడా రాదు. అందులోనూ సందేహం లేదు. తను పార్లమెంటు మెంబరుగా సాధించేది ఏమీలేదు. రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి నిలిపి ఇప్పట్నుంచి 'లాబీయింగు' జరిపి, ఓ కోటి రూపాయలు సమర్పించుకుంటే పార్టీ అధిష్టానవర్గం తన పేరుని సూచించే అవకాశం వుంది. విషయం అంతవరకు వస్తే మిగతా విషయాలు తను చూసుకోగలడు. చొచ్చుకుపోగలడు.
ప్రస్తుతానికి కోటిరూపాయల అవసరం చాలా వుంది.
అందులో దాదాపు యాభై లక్షలు.....
గుళ్ళో దేవుడి నగలు దొంగిలిస్తే లభిస్తాయి.
అదీ అతడి ప్లాను.
* * *
రాణా అద్దెకున్న పోర్షన్ కీ, ఇంటిగలవాళ్ళ పోర్షన్ కీ మధ్య ఒక తలుపు వుంది. రాణా - అలక్ నంద తో ఆ తలుపుమీద కోడ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కసారి 'టక్' మని కొట్టి, కొంచెం ఆగి రెండుసార్లు 'టిక్-టిక్' మని కొడితే అది అలక్ నందకి సంకేతం. రెండు పోర్షన్ల మధ్యనున్న తలుపుని ఆ విధంగా తెరవటానికి అలక్ ముందు వప్పుకోలేదు కానీ, అతికష్టంమీద వప్పించాడు. "బాధల్లో వున్నవాడికి కావల్సింది రవ్వంత ఓదార్పు, ప్రేమ-అలకా! మన మధ్య వున్న ఈ అడ్డు తలుపుల్ని బ్రద్దలుకొట్టి నీ ప్రేమని ప్రకటించు" అన్నాడు ఉద్వేగంగా ఆ సాయంత్రం.
ఆమె భయం భయంగా చూసింది.
"నిన్ను కారుతో డాష్ కొట్టి అవమానించిన స్త్రీని అరెస్ట్ చేసి నా ఉద్యోగం కోల్పోయాను. నామీద ఆ మాత్రం కనికరం లేదా అలకా?"
ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "అంతమాట అనకు రాణా. నీ కోసం సర్వస్వం అర్పిస్తాను. ప్రాణమైనా యిస్తాను" అంది.
"సర్వస్వం అర్పిస్తే ప్రాణాలు పోతాయనే అపోహనుంచి నువ్వింకా బయటకు రాలేదా?" నీరసంగా అడిగాడు.
ఆమె మాట్లాడలేదు.
"కనీసం ముద్దు వరకైనా వప్పుకో."
అలక్ నంద అదిరిపడి అడుగు వెనక్కి వేసింది. రాణా పేలవంగా నవ్వాడు. "ప్రేమ కోసం సర్వస్వం అర్పిస్తానన్న స్త్రీ ప్రాణం పోతుందన్న భయంతో ప్రియుడికి ముద్దుకూడా ప్రియం చేసింది."
"అంతమాట అనకు రాణా" అంది ఆమె ఆవేశంతో అడుగు ముందుకేసి అదే అదనుగా అతడు ఆమె చుట్టూ చేతులు వేసి, పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అరమోడ్పుగా కళ్ళు మూసుకుంది.
"ఏవిటది? తాదాత్మ్యతా?" ఆప్యాయంగా అడిగాడు.
"కాదు గుండెల్లో నొప్పిగా వుంది" అంది రాణా మొహం ఎర్రటి కొలిమిలా మారింది. "మొదటిసారి ముద్దు అనుభవం ఎలా వుందీ అని అడిగితే ఇదా ఆన్సరు? అయినా ఆ చిలక జ్యోతిష్కుడు కన్నెరిక హరణం మరణం సంభవం అని చెప్పాడే తప్ప, ముద్దు పెట్టుకుంటే గుండెనొప్పి వస్తుందని చెప్పలేదుగా" కసిగా అని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
అది జైర్గిన సాయంత్రం అలక అతడికి చిన్న చీటీ తలుపు సందులోంచి అందించింది. "జరిగిన దానికి విచారిస్తున్నాను. ఈ రాత్రికి ముద్దిస్తాను" అని అందులో సారాంశం డైరెక్టుగా 'ముద్దు' అన్న టాపిక్ లేకపోయినా సారాంశం అదే.
రాత్రి పన్నెండింటికి రాణా తయారయ్యాడు. ఉద్యోగం విషయమై అతడేమీ టెన్షన్ లో లేడు. తను చెయ్యబోతున్నదేమిటో, తిరిగి తన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో అతడికి స్పష్టంగా తెలుసు.
