Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 16

 

    'ఆ తీసికెడతా. ఆ - పిన్నిగారూ, నాకోసం ఎవరు వచ్చినా నేను బయటకి వెళ్ళానని, ఎప్పుడొస్తానో చెప్పలేదని చెప్పండి. నేను రాత్రిపొద్దుపోయే వరకు ఆస్పత్రిలోవుండి చిన్నబాబుని ఎత్తుకుంటాలెండి" - శారద బుట్టచేత్తోపట్టుకుని గబగబా ఆటోలో కూచుంది. హాయిగా ఊపిరిపీల్చుకుంది. ఇంకా కొద్దిరోజులు నరసాపురం వుంటే ఎంతో బావుండేది అనిపించింది.
   
    వీధి గుమ్మానికున్న తాళం చూసి విస్తుపోయింది లలిత. 'ఫోను చేసే వచ్చింది కదా తను, వెళ్ళిపోవటమేమిటి' విసుగ్గా వెనక్కి తిరిగింది. లలిత. సందుమలుపుతిరిగేసరికి కారు పక్కన ఆగింది. 'హలో, తలుపు తీసుకుని బయటకొచ్చాడు దినేష్ లలిత ఒక్కనిముషం తత్తరపాటు చెందింది.
   
    'నన్ను గుర్తుపట్టావా'. అయితే ఈ విషయం ఎక్కడైనా ఎప్పుడైనా బయటకొస్తే దానికి నువ్వేకారణమవుతావు. ఏం జరుగుతుందో తెలుసుగా' - దినేష్ కారు వేగంగా పోనిచ్చాడు. ఆ సందు మొదట నిశ్చేష్టురాలే నిలబడిపోయింది లలిత.
   
    'ఎక్కడికెళ్ళివుంటుందో - తనని రమ్మందిగా' దినేష్ గుమ్మానికున్నా తాళం చూస్తూ అనుకున్నాడు ఎక్కడి కెళ్ళినా వస్తుందిగా - కూరలదాకా వెళ్ళివుండచ్చు. చీరలు ఇస్త్రీకి ఇచ్చుకోడానికి వెళ్ళివుండచ్చు - ఏమైనాకానీ, ఇవాళ శారదతో మాట్లాడికాని వెళ్ళడానికి వీల్లేదని నిశ్చయించుకున్నాడు దినేష్, దగ్గరలో వున్న బార్ లోకి వెళ్ళాడు. గంట కాలక్షేపం చేశాడు గడియారం తొమ్మిది గంటలు చూపిస్తోంది.
   
    శారద గడియారం వంక చూస్తోంది. తొమ్మిది దాటుతోంది 'హమ్మయ్య. ఈ రాత్రి విశ్రాంతిగా నిద్రపోవాలి' - గబగబ ఆస్పత్రి నుంచి బయటపడింది. దినేష్ ఏమనుకున్నాడో - ఏమన్నా అనుకోనీ, రేపు సారీ చెప్పి అతన్ని మళ్ళీ ఇంటికి పిలిపించుకోవచ్చు -
   
    ఇంటిముందున్న కారుని చూసింది శారద. ఇప్పుడుమళ్ళీ ఎక్కడికెడుతుంది తను.
   
    'ఎక్కడి నుంచి వస్తున్నావు' - దినేష్ అడగ్గానే.
   
    'మా ఇంటి వాళ్ళ అమ్మాయికి కొడుకు, చూడ్డానికి ఆస్పత్రికెళ్ళాను' 'సరే-పద' - దినేష్ లోపలకి దారితీసాడు.
   
    శారదకి ఇవాళ దినేష్ తన యింట్లోకి రావటం యిష్టం లేదు. పిన్నిగారు అతని రాకపోకల్ని బాగా గమనిస్తోంది ఇప్పుడు తొమ్మిదిన్నర దాటింది దినేష్. లోపలకొచ్చి కూచునిపోతే కష్టం. ఇవన్నీ ఆలోచిస్తూ తాళం చెవులు బాగ్ లోంచి తీయకుండా ఊరుకుంది.
   
    'ఏమిటీ - లోపలకి వెళ్ళకుండా ఇక్కడే' దినేష్ తాళం చెవి బాగ్ లోంచి తీసి, తలుపుతీశాడు. చేసేది కాక అతని వెంటలోపలకి నడిచింది శారద.
   
    దినేష్ సిగరెట్టు వెలిగించాడు.
   
    'ఏమంది మీ ఫ్రెండు' దినేష్ శారద వంటింటి గుమ్మంలో నుంచున్నాడు.
   
    'నేను కలవలేదుగా' స్టౌ వెలిగించింది శారద. కుక్కర్ లో బియ్యం వేసింది కడిగి.
   
    'ఊ, పద - అక్కడ కూచుందాం' గుమ్మంలో నుంచి ముందుగదిలోకి వచ్చాడు దినేష్. ఎవరో లోపలకొచ్చినట్టనిపించింది శారదకి.
   
    'ఆ - పిన్నిగారూ - ఏం కావాలీ'
   
    'తోడుకి కొంచం పెరుగుతియ్యి, మధ్యాహ్నం పాలుతోడుపెట్టడం మరచిపోయాను' అంది దినేష్ వంకచూస్తూ.
   
    శారద పెరుగుయిచ్చి పిన్నిగారిని పంపేసింది. నిజంగా పెరుగు కావలసి వచ్చిందా! ఎందుకో అలా అనిపించింది శారదకి.
   
    'శారదా - అన్నట్టు మీ ఊరి విశేషాలు చెప్పలేదు - నాన్నగారు బాగున్నారా మీ ఊరు బాగుందా. మీ తోటలు దినేష్ మాటలపై శారదకి నిజంగానే తన ఊరు, తనవాళ్ళు గుర్తొచ్చి బెంగవేసింది.
   
    'ఓ వారం రోజులుండాల్సింది. ఏం కొంపమునిగిందని పరుగెత్తి వచ్చానో. మళ్ళీ వెడతాను' అంది శారద.
   
    'ఎప్పుడూ నేనొస్తానీతో మీ ఊరు చూపించవా. అదిసరే కొబ్బరితోటల బేరం ఎంతదూరం వచ్చిందీ! - దినేష్ ఆమాట అనే సరికి చాలా కోపం వచ్చింది శారదకి.
   
    'ఏమో - నాకేం తెలియదు - అవి అమ్ముడుపోయి, అందులోంచి నాకేమైనా యిస్తే తీసుకుంటా లేకపోతే అక్కర్లేదు'-
   
    'అదేమిటి - అక్కర్లేదా డబ్బువద్దా - నీకక్కర్లేకపోతే చెప్పు నేను తీసుకుంటా! నవ్వాడు దినేష్.
   
    "నువ్వెలా తీసుకుంటావ్ ఆ డబ్బునాది"
   
    అప్పటికే పదకొండు దాటింది.
   
    'నేను నిద్ర పోవాలి - చాలా బడలికగావుంది' అంది ఆవులిస్తూ శారద.
   
    ఓ.కె.గుడ్ నైట్ - దినేష్ లేచాడు.
   
    శారద హమ్మయ్య అనుకుంది. ఎంత జాగ్రత్తగా తలుపుతీసివేసినా కొంతచప్పుడు కాక తప్పలేదు. పిన్నిగారూ లైటు వేయటం, ఆర్పటం కూడా జరిగింది.
   
                                  *    *    *
   
                                           7
   

    దినేష్ ఆలోచనల్నీ శారదవైపే వున్నాయి. ఎలాగైనా నసరాపురం వెళ్ళాలి - ఆ కొబ్బరితోటల అమ్మకం విషయం కనుక్కోవాలి - ఎలాగో మంచి మాటలు చెప్పి, ప్రలోభపరచి షేర్స్ కొనిపించాలి శారద చేత కుదిరితే వాళ్ళ అన్నల చేత కూడా. ఆ తర్వాత బొంబాయి వెళ్ళాలి. అక్కడ కొత్త జీవితం - దినేష్ ఆపకుండా సిగరెట్టు వెలిగిస్తున్నాడు- నీరజ రేపు వస్తుంది. ఆమె ఎంతసొమ్ము సంపాదించగలదో షేర్స్ వంకతో అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి - తిన్నగా బతకటం చేతకాని మనిషి వంకరటింకరగానైనా బతకాలి - బతకటం తప్పదు - అయితే, ఆ బతుకు చాలా గొప్పగా, క్లాస్ గా, స్టైల్ గా బతకాలి - దగ్గు తెరలో ఉక్కిరిబిక్కిరయ్యాడు దినేష్ - అతని ఆలోచనంతా నరసాపురం ఎలా ప్రయాణం చేయించాలి శారదతో అనే విషయంపైనే వుంది - శారద తన మాటకాదనదు అనే నమ్మకముగా వుంది - కోర్టుకేసు ఎంత దూరమైనా వాయిదా వేయించగలడుతను - ప్లీడరు తన ఫ్రెండు" నరసాపుర ప్రయాణమంటే ఎంతో ఉత్సాహంగా వుంది శారదకి. పైగా తను, నీరజ, దినేష్ కార్లో వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. ఊరు చూడాలని ఎప్పటి నుంచో ఇష్టంకనబరుస్తున్నారు నీరజ, దినేష్ తను స్నేహంగావుంటూ తన ఊరుతీసుకెళ్ళనంటే కూడా బాగుండదని మనసులో చాలా అనుకుంది మొదట్లో శారద. అయినా పల్లెటూరు చూడాలని వాళ్ళువస్తే అందులో తప్పేముందీ.. ఎవరే మనుకుంటారు. శారద మనసుని సమాధానపరుచుకుంది అక్కడెవరున్నారూ - నాన్నగారొక్కరే - ఆయనకి వండి పెట్టడానికి వెనక గదిలోవుండే పంతులు, ఆయన భార్యా! - తనేం తప్పు చేస్తోందీ - నరసాపురం తన స్నేహితులతో వెడుతోంది - అంతేగా -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS