మీ అన్నయ్యగారు పోయారు, నన్నిలా ఈడొచ్చిన కూతురితో వదిలేసి! ఆయనకి దాపురించిన టి.బి. మేం పొదుపుచేసి అమ్మాయి పెళ్లికని దాచిన డబ్బుని తినేసింది. చివరికి ఆయన్నీ తినేసింది.
జానకీ! ఇన్నాళ్ళకి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈ ఉత్తరం వ్రాస్తున్నానంటే నువ్వు ఈసరికే ఊహించగలిగి ఉంటావు! సంధ్య పుట్టకముందే నీ కోడలి స్థానం దానికి రిజర్వ్ చేసి ఉంటావు. జ్ఞాపకముందా అరుణ్ పుట్టాక నాకు నెల తప్పడం ఆలస్యం అయితే " ఇంకెప్పుడిస్తావు మా వాడికి పెళ్ళాన్ని?" అంటూ వేళాకోళం చేసేదానివి.
అరుణ్ చదువు అయిపోయి ఉద్యోగంలో ప్రవేశించి ఉండాలి. లేకుంటే తండ్రి చేస్తున్న బిజినెస్ లో చేదోడు వాదోడుగా ఉండాలి. అవునా? అరుణ్ మరిచిపోయాడేమో గాని సంధ్య అరుణ్ ని ఎప్పుడూ మరిచిపోలేదు. అరుణ్ అంటే దానికెంత ప్రేమో! అరుణ్ అంటే సంధ్యకిష్టమనేకాదు. సంధ్యని అరుణ్ తప్ప ఇంకెవరూ చేసుకోరనిపిస్తూంది. ఎందుకంటే నేనెవరి దగ్గరికీ నా కూతుర్నిస్తానని వెళ్ళలేను కాబట్టి! ఆనాటి మన స్నేహాన్ని బట్టి నిన్ను అడగగలుగుతున్నాను. జానకీ! నాకు డబ్బు లేదు, కులం లేదు సంప్రదాయం లేదు. బంధువులసలులేరు. ఏమీ లేని నేను నా కూతుర్ని నీ కోడల్ని చేసుకొమ్మని అర్థిస్తున్నాను. నువ్వయితేనే నన్ను అర్థం చేసుకోగలవు. నన్ను చూసి జాలిపడగలదానివి నువ్వొక్కదానివేననిపిస్తూంది. ఒక్కసారి నువ్విక్కడికి రాగలిగితే, సంధ్యని తప్పకుండా నీ కోడల్ని చేసుకొంటావన్న నమ్మకం నాకుంది. నా కూతురని గొప్పగా చెప్పుకోవడం కాదుగాని, సంధ్య కుందనపుబొమ్మలా తయారైంది. ఇంత అందమైన కూతుర్ని నాకిచ్చి భగవంతుడు నాకింకేమీ లేకుండా ఎందుకు చేశాడా అనిపిస్తూంది. ఒకసారి నువ్వు దాన్నిచూశావంటే, నీ మనసులో ఏ కాస్త వ్యతిరేకత ఉన్నా అది నామరూపాల్లేకుండా మాయమైపోతుందన్న నమ్మకం నాకుంది. నా కూతురని గొప్పగా చెప్పుకోవడం కాదుగాని అరుణ్ నైనా ఒకసారిపంపు. నా అభ్యర్థనని నువ్వు అంగీకరించినదానికి అదే గుర్తు.
ఎంతో వేదనని ఎదలో మోస్తూ ఒంటరితనంతో వేగిపోతున్నాను. జానకే ఉంటే నాకింత ఒంటరితనం ఉండేదికాదుకదాని, నువ్వు లేని ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో ఎన్నిసార్లు అనుకొన్నానో!
ఇంకా ఎంతో వ్రాయాలని ఉంది. కాని బరువెక్కిన హృదయంతో ఇంకేమీ వ్రాయలేను. ఇక ఉంటాను. ఈ ఉత్తరానికి జవాబు ఉత్తరం కాదు. నువ్వో అరుణో రావాలి.
ఇట్లు
___అభాగ్యురాలైన రుక్మిణి."
ఉత్తరాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకొని, సంధ్యని పిలిచి ఇచ్చింది - "దీనిమీద ఈ అడ్రస్ వ్రాసి పోస్టుడబ్బాలో వేసిరా అమ్మా!"
"ఎవరికమ్మా ఉత్తరం?" సంధ్య ఆశ్చర్యంగా అడిగింది.
"జానకి అత్తకి!"
అడ్రస్ వ్రాయడానికి తీసుకొని, తల్లికి తెలియకుండా చదివిన సంధ్య ముఖం ఎర్రగా అయింది. వాళ్ళిక్కడ ఉన్నప్పుడు స్నేహంగా, కలిసి మెలిసి ఉండొచ్చు. ఆ స్నేహాన్ని బట్టి, చనువుని బట్టి ఏవో మాటలు అనుకొని వుండాలి. వాళ్ళెప్పుడో ఈ ఊరినీ, ఈ స్నేహాన్ని మరిచిపోయి ఉంటారు. ఇక్కడినుండి వెళ్లాక ఒక్కసారైనా తిరిగి చూడనివాళ్లకి, ఉత్తరమైనా వ్రాయనివాళ్ళకి అర్థిస్తూ, ప్రాధేయపడుతూ అమ్మ ఉత్తరం వ్రాసింది. ఈ ఉత్తరం చదువుకొని వాళ్ళెంత నవ్వుకొంటారో? అమ్మకీమధ్య బొత్తిగా విచక్షణ లేకుండా పోతూంది! కవరుమీద అడ్రస్ అయితే వ్రాసిందిగాని పోస్ట్ డబ్బాలో వేయలేదు. తల్లికంట పడకుండా తన పెట్టెలో చీర మడతల్లో దాచేసింది. అది దాస్తున్నప్పుడు అరుణ్ హైదరాబాద్ కి వెళ్లాక వ్రాసిన ఉత్తరం చేతికి తగిలింది. ఇదివరకే ఎన్నోసార్లు చదువుకొన్న ఆ ఉత్తరాన్ని మళ్ళీ చదువుకొంది.
అరుణ్ అంటే ఆ పది పన్నెండేళ్ళ అరుణే జ్ఞాపకమొస్తున్నాడు. నిక్కర్, షర్టులో! పాతికేళ్ళు దగ్గరికి వస్తూంటే ఇంకా నిక్కర్ లో ఎందుకుంటాడు? చక్కగా సూటు బూటులో ఉంటాడు. బాగా పొడుగై ఉంటాడు. అతడి ముఖం ఇప్పుడెలా ఉంటుందో? చూచుకోడానికి ఒక్క ఫోటో కూడా తమ దగ్గరలేదు. జానకి అత్త, ప్రసాద్ మామయ్య కలిసి దిగిన ఫోటో మాత్రం ఉంది.
జీవితంలో ఎప్పుడైనా అరుణ్ ని చూడడం అనేది జరుగుతుందా? తను ఈ పల్లెటూళ్ళో! అతడు హైదరాబాద్ లో!
ఇక్కడినుండి పోతూనే ప్రతిమ అనే స్నేహితురాలు దొరికిందని సగర్వంగా వ్రాశాడే! ఇన్నిసంవత్సరాలలో ఇంకెంతమంది స్నేహితులయ్యారో? సంధ్య అనే ఈ స్నేహితురాలు, చిన్ననాటి నిచ్చెలి అతడికి మచ్చుకైనా జ్ఞాపకముండదు! సంధ్యనుండి ఒక నిట్టూర్పు వెలువడింది.
