Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 15

   
    "ఏడకేంది? మెహదీపట్నం పోతున్నా" అన్నాడు ఆటోవాడు ఆటోని ఆపకుండా నిర్లక్ష్యంగా.

    "మెహదీపట్నానికా?"... అటెందుకు? మేము సంజీవరెడ్డినగర్ వెళ్ళాలి! ఆటోని వెనక్కి తిప్పు"

    "లేద్సాబ్... నేను మెహదీపట్నానికి పోవాలె. మిమ్మల్ని ఆడికే తీస్కెళ్త!... ఆడనే దిగూండ్రి"

    ఆటోని మరింత స్పీడుగా ముందుకు దూకించాడు ఆటోవాడు.

    "నీ జబర్దస్తీ బాగానేవుంది. మేం మెహదీపట్నం ఎందుకొస్తాం? సంజీవరెడ్డి నగర్ కి వెళ్తాం" అన్నాడు చిట్టబ్బాయి చిరాకుగా.

    "ఛల్... ఆటో దిగూండ్రి... సుబా సుబా మంచిబేరమే దొరికింది" అంటూ ఆటోవాడు కసురుకున్నాడు.

    ఇద్దరూ మనసులోనే ఆటోవాడిని బాగా తిట్టుకుంటూ ఆటో దిగి రెండడుగులు వేశారోలేదో ఆటోవాడు రయ్యిమని వచ్చి ఇద్దరి ఎదురుగా నిలబడి కళ్ళెర్రజేసి చూశాడు.

    "పైసలివ్వకుండా పోతూండ్రేంది!" అని క్రూరంగా అడిగాడు.

    "పైసలా?.... ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయి.

    "ఆటో ఎక్కినందుకు" పళ్ళునూర్తూ అన్నాడు ఆటోవాడు.

    "ఎక్కాంగానీ నువ్వు రానని మమ్మల్ని దించేశావ్ గా?" అన్నాడు కన్నారావు.

    "మీటర్ తిప్పుతే పైసల్ ఇవ్వాల! ఛల్ రెండ్రూపాయల్ తియ్యండ్రి"

    "అదేంటి?... నువ్వు మేం చెప్పిన చోటికి రానన్నావుగా? పైసలెందుకిస్తాం?" మొహం చిట్లించి అడిగాడు చిట్టబ్బాయి.

    "అసలు నువ్వు రానన్నావుగానీ ఇందులో మా తప్పేం ఉంది?" అన్నాడు కన్నారావు కూడా చికాకుగా మొహం పెడ్తూ.

    "యాడ్కిఫోవాల్నో చెప్పకుండా ఆటో ఎక్కడం తప్పుగాదా మల్ల? ఛల్ పైసల్ నికాలో" అన్నాడు చొక్కా చేతులు పైకి మడుస్తూ ఆటోవాడు.

    వాడితో పెట్టుకుంటే అనవసరంగా తమ పరువేపోతుంది అనిపించింది ఇద్దరికీ.

    చిట్టబ్బాయ్ జేబులోంచి రెండు రూపాయల నోటు ఆటోవాడికి ఇచ్చాడు.

    "హు! గట్ల రావాలె దారికి!" అనేసి ఆటోవాడు వెళ్ళిపోయాడు.

    "ఒరేయ్ కన్నాటైమైపోతుంది ఎలా?" కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి.

    "అదిగో ఇంకో ఆటో వస్తుంది. వాడు ఇటే వెళ్తున్నాడు కాబట్టి సంజీవరెడ్డి నగర్ రావొచ్చు..." అన్నాడు కన్నారావు కాస్త దూరంలో వస్తున్న ఆటోని చూపిస్తూ.

    ఆటో దగ్గరికి రాగానే ఇద్దరూ "ఆటో ఆటో...." అంటూ కంగారుగా కేకలు పెట్టారు వాడెక్కడ ఆపకుండా పోతాడోనని.

    ఆటోవాడు చట్కున బండిని ఆపి కోపంగా చూసి "హర్రే! ఎందుకట్ల వొర్రుతుండ్రు... మంది నా ఆటోకింద ఎవ్వలైన పడి చచ్చిండ్రేమోనని అనుకుంటార్.... యాడ్కిపోవాలె?అని విసుక్కుంటూ అడిగాడు.

    "సంజీవరెడ్డినగర్!"

    "రెండ్రూపాయల్ ఎక్స్ ట్రా ఇవ్వాల!!" అన్నాడు ఆటోవాడు.

    "ఎందుకూ? ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయి.

    "అర్రె! మీ తానా సామాన్లు భీ ఉన్నాయ్ కదా? సామాన్లకి ఎక్స్ ట్రా పైసల్ ఇవ్వరామల్ల?" ఓహో భలేగావున్నారే అన్నట్లు చూశాడు ఆటోవాడు.

    "సామానా? ఎక్కడా?"మరింక ఆశ్చర్యపోతూ అడిగాడు చిట్టబ్బాయి.

    "అదో!.... గాయన చేత్లలేదు?" అన్నాడు ఆటోవాడు కన్నారావు చేతిలోని పాకెట్ వంక చూపిస్తూ.

    అది పెళ్ళిలో ప్రెజంట్ చేయడానికి వాళ్లు తీస్కెళ్తున గిఫ్ట్ ప్యాకెట్. దాంట్లో టేబుల్ లైట్ ఉంది.

    "ఏంటి?... ఇదా?... సామానా?" చిట్టబ్బాయి కోపంగా అడిగాడు.

    "ఛల్ నీయవ్వ.. మంచి బేరమే దొర్కింది" విసుక్కుంటూ ఆటోని స్టార్టు చేసి వెళ్ళిపోయాడు వాడు.

    "ఆగు బాబూ... ఎక్స్ ట్రా రెండు రూపాయలిస్తాంలే" అని చిట్టబ్బాయిని ఆటోలోకి నెట్టి తనుకూడా ఎక్కి కూర్చున్నాడు కన్నారావు.

    చిట్టబ్బాయి ఏదో అనబోతే కన్నారావు కోపంగా అన్నాడు "వాదిస్తూ కూర్చోడానికి మనకి టైంలేదు"

    చిట్టబ్బాయి మౌనంగా ఉండిపోయాడు.

    ఆటో పావుగంటలో సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీ హాలు ముందు ఆగింది.

    ఆటోవాడికి డబ్బులు చెల్లించి హడావిడిగా హాల్లో ప్రవేశించారిద్దరూ.

    ఖాళీగా ఉన్న కుర్చీలు చూస్కుని కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే పెళ్ళి కూతురు, పెళ్ళికొడుకు తలలమీద జీలకర్ర, బెల్లం పెట్టారు.
    "ఆహాహా... చాల బాగుంది!... చాల చాల బాగుంది!!!" అన్నాడు కన్నారావు. చుట్టూ పరికించి చూస్తూ.

    "అవునవును! పెళ్ళి ఏర్పాట్లు బాగా చేశారు!!" అన్నాడు చిట్టబ్బాయి.

    "నీ బొంద! పెళ్ళి ఏర్పాట్ల గురించి కాదు నేనన్నది! పెళ్ళికి వచ్చిన అమ్మాయిల్ని చూడు!! పెళ్ళి పందిరంతా ఎంత కళకళలాడిపోతుందో"

    చిట్టబ్బాయ్ చుట్టూ పరికించి చూసి "కెవ్ వ్..." మని ఆనందంతో కేకపెట్టాడు.

    పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, మంత్రాలు చదువుతున్న పురోహితులు ఇంకా పెళ్ళిపందిరిలోని అందరూ వీళ్ళవైపు తలలు తిప్పి వింతగా చూశారు.

    "ఏంలేదు ఏంలేదు... స్నేహితుడి పెళ్ళి చూస్తూ ఆనందం పట్టలేక అట్లా అరిచాడు మావాడు" అని వాళ్ళందరికి సర్ది చెప్తూ "అవును కదురోయ్ చిట్టీ?" అని చిట్టబ్బాయిని అడిగాడు కన్నారావు.

    "అవును... నిజంగానే! వీడు చెప్పిందే నిజం, సత్తె ప్రమాణకంగా" బిక్కమొహం వేసి తడబడుతూ అన్నాడు చిట్టబ్బాయి.

    వాళ్ళంతా చిట్టబ్బాయ్ వంక వింతగా చూసి తలలు తిప్పుకున్నారు. పెళ్ళి కొడుకు మోహన్ తనకి పెళ్లవుతున్న సందర్భంగా అంత యిదిగా ఆనందాన్ని ప్రకటించిన చిట్టబ్బాయి వంక కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు. ఆ తరువాత పెళ్ళికూతురు డొక్కలో మోచేత్తో పొడిచి ఆమెకి సైగచేశాడు. ఆమె కూడా చిట్టబ్బాయ్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది.

    పురోహితుడు మళ్ళీ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు.

    చిట్టబ్బాయ్, కన్నారావులు చుట్టుప్రక్కల ఉన్న అమ్మాయిలను చూస్తూ కాలక్షేపం చేయసాగారు.

    మంగళసూత్ర ధారణ సందర్భంగా భజంత్రీలు పెద్ద మోతగా ఢమఢమ వాయించడంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డారు చిట్టబ్బాయ్, కన్నారావులు.

    ఒక అయిదు నిముషాలయిన తరువాత తలంబ్రాలు పోస్కున్నారు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు.

    ఒక్కొక్కరే లేచి మండపం దగ్గరికివెళ్ళి నూతన వధూవరులకి శుభాకాంక్షలు చెప్తున్నారు బహుమతులు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు.
    "పద... మనం కూడా వెళ్ళి బెస్ట్ విషెస్ చెప్దాం" అన్నాడు కన్నారావు లేచి నిలబడుతూ.

    ఇద్దరూ మండపం దగ్గరికి వెళ్ళారు.

    నూతన వధూవరులకి శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నారావు తన చేతిలోని గిఫ్ట్ ప్యాక్ ని మోహన్ కి అందించాడు.

    "నిజంగా నువ్వు పెళ్ళి చేస్కున్నందుకు మాకు చాల ఆనందంగా ఉందిరా" అన్నాడు కన్నారావు.

    "అవును... మాకు ఈ పూట వంటపని తప్పిందిగా" మెల్లగా అన్నాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు చిట్టబ్బాయ్ డొక్కలో మోచేత్తో పొడిచాడు.

    "ఏవిటంటావ్?" అన్నాడు మోహన్.

    "అబ్బే ఏమీలేదు.. నాక్కూడా చాల ఆనందంగా  ఉందని అంటున్నాడు" సర్దిచెప్పాడు కన్నారావు.   

    "అవునవును! ఇందాక సంతోషంతో అరిచినప్పుడు చూశాగా!" అన్నాడు మోహన్.

    "అవునవును! అందుకే అరిచా" అన్నాడు చిట్టబ్బాయ్.

    "మీరు భోజనం చేసి వెళ్ళండి.. భోజనాలు రెడీగా ఉన్నాయి" అన్నాడు మోహన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS