రాయుడు గబగబా నాలుగడుగులు ముందుకు వేసి రాధకి అడ్డుగా నిలుచున్నాడు.
"ఎవరు నువ్వు. నా దారికి అడ్డులే." అంది రాధ రాయుడితో కోపంగా.
రాయుడు వెనక్కి చూస్తూ అన్నాడు.
"ఒరేయ్ సంతానం.. దీనికి మన సంగతి కాస్త చెప్పు."
సంతానం వెకిలిగా నవ్వుతూ మెలికలు తిరిగిపోతూ రాధతో అన్నాడు.
"రాయుడుగారికి ఆడపిల్లల దారికి అడ్డు తగలడం... వారిని తన దారిలోని తిప్పుకోవడం తప్ప అడ్డు తొలగడం తెలీదు పిల్లా."
"విన్నావుగా?" అన్నాడు రాయుడు గుప్పుగుప్పున చుట్టపొగ వదుల్తూ.
"కానీ నాలాంటి వాళ్ళకి అడ్డుతగిల్తే నీ దిమ్మ తిరిగిపోద్ది. నేను పవిత్ర భారతనారిని తెల్సా." అంది రాధ రాయుడివంక క్రూరంగా చూస్తూ.
రాయుడు పకపకా నవ్వాడు.
"ఏం జోకేశావ్ తల్లీ.... నేను ఇంతదాకానా దార్లోకి తెచ్చుకున్న వాళ్ళంతా పవిత్ర భారతనారులే ... నువ్వు కూడా నా దార్లోకి వచ్చెయ్.... ఆ రిక్షావాడి దగ్గర ఏముంది? నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను."
అంటూ రాధ చేతిని హఠాత్తుగా పట్టుకున్నాడు రాయుడు.
అంతే...
రాధ చేయి రాకెట్ లా దూసుకువెళ్ళి రాయుడి చెంప దీపావళి టపాకాయల్లా పేలగొట్టింది.
రాధ ఇంటికి రాగానే గోపి ఆందోళనగా అడిగాడు.
"నీళ్ళకి ఇందాకనగా వెళ్ళినదానివి ఇంతాలస్యంగా వచ్చేవేమిటి రాధా?"
"నేను నీళ్ళకి వెళ్లేసరికి అక్కడ డజనున్నరమంది అమ్మాయిలు నా కోసం ఎదురుచూస్తు ఉన్నారండీ." అంది రాధ బిందెని మూల పెడ్తూ.
"హర్రే... నువ్వొస్తావని వాళ్ళకెలా తెల్సూ?"
ఆశ్చర్యంగా అడిగాడు గోపి.
"ఎలా తెల్సో ఏం పాడోగానీ... తెల్సు అంతే... మరి ఇంతమంది అమ్మాయిలం నీళ్ళకోసం ఒక దగ్గర చేర్తే తిన్నగా నీళ్లు పట్టుకుని రాం కదా?"
"మరేం చేశారు?"
"బిందెలన్నీ నీటిలో విసిరికొట్టి చెర్లో తిన్నగా నీళ్లు కాళ్ళూగిస్తూ ఓ చక్కని పాట పాడుకున్నాం."
"ఆ!.... అంతమందీ చెర్లో కాళ్ళూగించారా? అయితే చెర్లోని చేపలో, కప్పులో సగం చచ్చుంటాయే"
"అరే ఎంత చక్కగా ఊహించారండీ.... నిజంగా మీరెంత తెలివైనవారండీ." గోపి వంక మెచ్చుకోలుగా చూస్తూ అంది రాధ.
గోపి రాధ పొగడ్తలకు పొంగిపోయాడు.
"ఊ.... తర్వాత ఇంకేం చేశారు!" అని అడిగాడు.
"తర్వాత ఎవరో రాయుడట! అక్కడికి వచ్చాడు! వాడిని చూడగానే మిగతా ఆడపిల్లలంతా పరుగుతీశారు ఒక్క నేను తప్ప!"
గోపి ఉలిక్కిపడ్డాడు.
"ఆ... రాయుడు అక్కడికి వచ్చాడా? వాడు నిన్ను చూశాడా?" కంగారుగా అడిగాడు గోపి.
"చూడ్డమా? ఒట్టిగా చూడ్డం కాదు. కొరుక్కుతినేలా చూశాడు... అసలే తడిచిపోయిన నా చీరలో ఒంపుసొంపులన్నీ కనిపిస్తున్నాయ్ కదా? దానికితోడు చీర పిక్కల పై దాకా కట్టుకున్నానాయె" అంది రాధ తన కళ్ళని చక్రాల్లా తిప్పుతూ.
"అబ్బా! నీ వర్ణనలు కాస్త అవుతావా? అయినా ఎప్పుడూలేంది చేరని పిక్కలపైదాకా ఎందుకు కట్టావ్?" జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి.
"అంతేనా?.... చీరని బొడ్డుక్రిందకు కూడా కట్టాను... ఆ రాయుడిగాడి పంట పండిందనుకోండి...
"ఇం అనవసరం సోది ఆపి అసలు విషయంచెప్తావా లేదా?.... ఆ రాయుడు ఏంచేశాడు?.... కొంపదీసి నీ శీలాన్ని దోచుకోలేదు కదా?..." ఇరిటేట్ అయిపోతూ అడిగాడుగోపి.
ఆ మాట వినగానే రాధ బుసలుకొట్టింది.
"నేను పవిత్ర భారతనారిని అండీ... నా శీలాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు...." అంది ఆవేశంగా.
"నేను కూడానా రాధా?..." బాధగా అడిగాడు గోపి.
"మీరెందుకు కొల్లగొట్టలేరూ?.... మీరు నా భర్తకదా?.... ఆడదానికి పతియే ప్రత్యక్షదైవం... ఆడది తన భర్తకి సర్వస్వం అర్పించుకుంటుందండీ..."
"రాధా..." ఆనందబాష్పాలు రాలుస్తూ అన్నాడు గోపి
అవునండీ... నేను చెప్పింది నిజం... ఇది జీవితం సత్యం అండీ... జీవిత సత్యం..." అంది రాధ శూన్యంలోకి అనవసరంగా చూస్తూ.
"సరేగానీ... తర్వాతేమైందీ?" కుతూహలంగా అడిగాడు గోపి.
"వాడు ఏవో అవాకులో చవాకులో పేలి నా చేయి పట్టుకున్నాడు... అంతే... వాడి చెంప ఛెళ్ళుమనిపించివచ్చాను..." గర్వంగా పలికింది రాధ.
"రాధా..."
గోపీ ప్రేమగా రాధను దగ్గరకు తీస్కున్నాడు.
13
రాయుడు తనఇంట్లో వరండాలో బుసలు కొడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు.
మధ్య మధ్య బాధగా "హబ్బా" అనీ "అమ్మా..." అని అంటున్నాడు.
"ఏంటండయ్యా ....నెప్పి ఇంకా తగ్లేదా అబ్బా, అమ్మా అంటున్నారు!... అవునులే... గూబ అదిరిపోయేలా కొట్టిందికదా ... నెప్పి ఉండదూ మరి?...." అన్నాడు సంతానం రాయుడింక జాలిగా చూస్తూ.
"అబ్బా సంతానం .... నువ్వు కాస్సేపు నోరు మూస్తావా?.... నేన అబ్బా అమ్మా అని అంటుంది గూచ సెప్పెట్టికాదు... నాకు జరిగిన అవమానానికి బాధపడి అంటున్నా..." అన్నాడు రాయుడు సంతానంవంక మిర్రిమిర్రిచూస్తూ.
అంతలో రాయుడి భార్య మహాలక్ష్మమ్మ బయటికి హడావిడిగా వచ్చింది. ఆవిడ పెద్దకొప్పు వేస్కుంది... దానినిండా పూలు పెట్టుకుని నుదుట పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుంది.
ఆమె మొహంలో ఆందోళన!
"ఏమిటండీ అమ్మా, అబ్బా అంటున్నారు... ఏమైనా బాధగా వుందా!...." అని అడిగింది కంగారుగా.
"ఆ.... అవును బాధగా వుంది... యేం?...." ఇరిటేట్ అవుతూ అన్నాడు రాయడు.
"హయ్యో... ఎక్కడ బాధగా ఉందండీ?"
అతని ఇరిటేషన్ గమనించకుండా ప్రశ్నించింది మహాలక్ష్మమ్మ.
"ఎక్కడేంటమ్మా... ఆయన గూబ పగిలింది..." వినయంగా అన్నాడు సంతానం ఆవిడతో.
"హయ్యో... మీ గూబ పగిలిందా?.... ఎలా పగిలిందండీ.... ఏ రాయైనా తట్టుకుని బోర్లాపడ్డారా?...." ఆందోళనగా అడిగింది ఆమె.
"కాదు... నాకే సర్దాపుట్టి ఓ పాత చెప్పుచ్చుకుని గట్టిగా కొట్టుకున్నాడు.... చాలా?" అరుస్తూ అన్నాడు రాయుడు. అది విని మహాలక్క్ష్మమ్మ చాలా బాధపడింది.
"హయ్యయ్యో... ఎందుకండీ అంతశ్రమపడ్డారు?.... నాకు చెప్పివుంటే నేను కొట్టివుండేదాన్నిగా?.... వేడినీళ్ళు తెచ్చి మీ దవడకు కాపడం పెడ్తాను..." లోపలికి వెళ్ళబోయింది.
"ఇదో పిచ్చిమాలోకం దొరికింది నాకు... ఆగవే... ఆగు..." నెత్తికొట్టుకుంటూ అరిచాడు రాయుడు.
మహాలక్ష్మమ్మ ఆగింది.
"వేడినీళ్ళు కాపడం వద్దుగానీ... నా పీకపట్టుకుని పిసికెయ్.... పీడ వదిలిపోతుంది."
"చీచీ.. అవేం మాటలండీ... మీరు చచ్చిపోతే నాకు తిండెవరు పెడ్తారు?..... అసలే నాకు పెద్దబొట్టు పెట్టుకునే అలవాటు... అలాంటిది అస్సలు బొట్టులేకుండా నా మొహం బాగుంటుందా అని!!..." అంది మహాలక్ష్మమ్మ మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ . రాయుడు నెత్తిపట్టుకుని కుర్చీలో కూలబడిపోయాడు.
"అబ్బా!.... నువ్వు ముందు లోపలికి పోతావా లేదా..." అరిచాడు రాయుడు.
"ఏంటో ... ఈయన ఎందుకరుస్తారో తెలీదు" అంటూ గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది అతనిభార్య.
"దీంతో చచ్చిపోతున్నానయ్యా బాబూ... ఒక్కోసారి దీనిమాటలకీ, చేతలకీ నీళ్ళులేని బావిలోదూకి చచ్చిపోవాలని అనిపిస్తుంది..." అన్నాడు రాయుడు బాధగా.
"తప్పదండీ... ఎంతయినా ఆవిడ మీరు తాళికట్టిన భార్యకదా... జీవితాంతం భరించకతప్పదు.... " అన్నాడు సంతానం.
"నిజమేనయ్యా.... కానీ అసలే గూబ ఫెటిల్లున పేలి నా మూడ్ ఆఫ్ అయి నేను బాధపడ్తుంటే మధ్యన దీనిగోల ఏంటి?..."
"మీకు మూడ్ బాగోపోతే మీ చిత్రాంగి ఉందిగా... దాని దగ్గరకు వెళ్ళండి....హి... హిహి.... హిహిహి..." మెలికలు తిరుగుతూ అన్నాడు సంతానం.
