Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 15


    వాటి మధ్య కూర్చుని పరుగెత్తుతూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడారు.    
    ఆశ్రమాన్ని దర్శించే వారికోసం నివాసయోగ్యమైన గదులు ఉన్నాయి. వచ్చిన యాత్రికులు అందులో చేరారు. కొండ క్రిందనే బాట. బాటకి ఆవలి వైపు రెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్ లో ఉండటానికి పడకలు, ఫర్నిచర్ ఉన్నాయి. అక్కడే ఉందామనుకొన్నారు. రెస్ట్ హౌస్ ముందుకొస్తే ఎదురుగా కొండగోడలా ఉంది. బంగళా వెనక వైపుకి వెళ్ళారు. ఆవరణం అవతల పెన్నాగట్టు. గట్టుమీద కూర్చున్నారు. నీళ్ళ మధ్య ఇసుకపాయలు. నీళ్ళు ఎక్కువ లోతు లేదన్న మాట. ఆవలి గట్టుపై మరొక బంగళా చెట్లమధ్య కనిపించింది. వాచ్ మన్ ని పిలిచి అడిగారు- "అదెవ్వరి బంగళా" అని.
    "పి. డబ్ల్యు. డి. వాళ్ళది. ఆత్మకూరు మీదనుంచి వచ్చిన దొరలు అక్కడ ఉంటారు. పొదలకూరు, కలువాయి నుంచి వచ్చేవారికి ఇక్కడ వసతి" అని చెప్పాడు.
    చల్లని గాలికి పదిమంది బిడ్డలను-కన్న తల్లిలా నీరసంగా ఉంది పెన్నానది. అప్పుడొక మనుష్యుడు తొడలవరకు పంచె ఎత్తి పట్టుకొని అవసరం'కొద్దీ ఎత్తుతూ ఆవలిగట్టు చేరుకొంటున్నాడు. పోయేవారి నల్లని పిరుదుల మధ్య పుట్టగోచి చూచి కిలకిల నవ్వారు.
    మరో అతను ఆవలి గట్టునుంచి అభిముఖంగా రాసాగాడు. క్షణక్షణానికి పైకి లేస్తున్న పంచెను చూచి నవ్వుతూ గాభరాగా వెనక్కి తిరగబోయిన వీణ జారి గట్టుమీదనుంచి నదిలోకి పడింది.
    కెవ్వుమని అరుపు. తరవాత నవ్వులు. వీణను పైకి లాగింది సోఫియా. వీణకి కాలు బెణికింది. కుంటుతూ లోనికి వచ్చి బట్టలు మార్చుకొంది వీణ.
    వారి అలుపు అప్పటికి తెలిసింది. సోఫియా ఆశ్రమానికి వెళ్ళి యాత్రికులు వండిన భోజనం తీసుకొని రాగా కడుపునిండా తిన్నారు. ఆకు తీస్తున్న వీణ భళ్ళుమని వమనం చేసుకొంది.        
    సోఫీ భయపడింది.
    వీణ నవ్వుతూ ఎండకి, ప్రయాణానికి అలా అయి ఉంటుందని చెప్పింది.
    పెందరాళే మంచా లెక్కారు. నిద్ర పడుతూ ఉండగా వీణ లేచి, "సోఫీ! కడుపులో నొప్పిగా ఉంది" అంది. బాధ ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతున్నది.
    "ఏ పక్క" అంటూ లేచి వచ్చి కడుపు నిమర సాగింది. నొప్పి కుడివైపు వస్తున్నట్లు తెలుసుకొని గాభరాగా-"వీణా! ఆ పెండిసైటిస్ కాదు కదా? ఎప్పుడైనా ఇలా నొప్పి వచ్చిందా?" అంది.
    "ఎప్పుడో వచ్చినట్లు గుర్తు. ఎలా?" అంది ఏడ్పుగా వీణ.
    వాచ్ మన్ ని పిలిచింది సోఫీ. వేడినీళ్ళు కాచి ఇవ్వమంది. వేడినీళ్ళు కాపడం పెట్టినా తగ్గలేదు. ఎక్కువైనట్లుగా ఉంది. "సోఫీ!" అంది మూలుగుతూ.
    అడవీప్రాంతం. ఇప్పుడేం చేయగలదు? సోఫియాకి భయం ఎక్కువ కాసాగింది.    
    వాచ్ మన్ చెప్పాడు! "అవతల పి. డబ్ల్యు. డి. బంగళాలో ఆ సాయంత్రం పెద్ద డాక్టరు డి. ఎమ్. ఒ. దిగా"రని. అతని మాట అమృత ప్రాయంగా సోకింది.
    వీణను పడుకోమని చెప్పి వాచ్ మన్ సాయంతో చీకట్లో నడుము వరకు ఉన్న నీళ్ళలో నడుస్తూ ఆ వసతి గృహానికి చేరుకొంది.    
    పది గంటల వేళ. చీకట్లో తడిసి వచ్చిన సోఫియని ఆ డాక్టరు చూచి చకితుడైనాడు. సోఫియా తను ఒక 'మెడికో'పని తనను తాను పరిచయం చేసుకొని, తాను వచ్చిన పని చెప్పింది. సోఫియా మాటలాడుతూ ఉంటే అతనెక్కడో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు భృకుటి ముడిచాడు. అన్యమనస్కుడై అడిగిందే పలుమార్లు అడిగి తెలుసుకొన్నాడు. డాక్టర్ కిట్ బాగ్ తీసుకొని టార్చిలైటు కాంతిలో నీరు తక్కువ ఉన్న చోటు చూసుకొని వచ్చారు.
    వీణ నొప్పికి మెలికలు తిరుగుతూ ఉంది.     
    డాక్టరు వచ్చి స్టూలుమీద కూర్చుని స్టెత్ పట్టి హార్ట్ లంగ్స్ పరీక్షించబోతే వీణ వారిస్తూ, "డాక్టర్! నా హార్ట్స్ లంగ్స్ బాగున్నాయి. కడుపులో మాత్రమే నొప్పి" అంది.    
    డాక్టర్ "ఆల్ రైట్!" అంటూ చీర కుచ్చెళ్లు వదులు చేయమన్నాడు.
    సోఫియా వదులు చేసి చీర తొలగిస్తూ ఉంటే మరలా పైకి లాక్కుంది.    
    డాక్టర్ నవ్వుతూ, "సరిగ్గా ఎగ్జామిన్ చేస్తే గదా సరిగ్గా మందు ఇచ్చేది" అన్నాడు.
    "చెప్పాను కదా, డాక్టర్? ఇక్కడ నొప్పి!" బొడ్డు పక్కగా చూపిస్తూ, "అక్క డేముందో మీకు     తెలుసుగా" అని నొప్పికి పెదాలు బిగపెట్టింది.     
    సోఫియాకి అంత బాధలోను ఒళ్ళు మండింది వీణ చాదస్తానికి! ఆ డాక్టర్ తన మాట మీద నీళ్ళలో వస్తే వీణ చెప్పేదేమిటి? ఆయన ఏమనుకొంటారు? వీణ చేతులు గట్టిగా పట్టుకొంది, "పరీక్ష చేయండీ!" అంటూ.
    వీణ అందానికి ముగ్దుడైన ఆ డాక్టరుకి వీణపై కోపం రాలేదు కదా, పైగా ఇంటరెస్ట్ ఎక్కువైంది.
    "పూర్వం డాక్టర్లు అంతఃపురస్త్రీల మణికట్టుకు కట్టిన దారం మరో గదిలో పట్టుకొని పల్స్ చూసే వారట. ఆ పల్స్ ని బట్టి డయాగ్నైస్ చేసి మందిచ్చే వారు. లేదా వ్యాధి లక్షణాలు వినే మందిచ్చి బాగుచేసే వారు మహానుభావులు!"
    "సోఫీ! ముందున్న నొప్పికంటే వత్తిన చోట మరింత బాధగా ఉంది" అంది వీణ.
    డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వగానే! "నాన్నమ్మా!" అంటూ అరిచింది! డాక్టర్ పెద్దగా నవ్వకుండా ఉండలేకపోయాడు.
    ఆ మత్తు ఇంజక్షన్ వెంటనే పని చేసింది. వీణ కళ్ళు మూసుకుంటూ ఉంది.
    "భయపడే అవసరం లేదు. షీ ఈజ్ ఆల్ రైట్" అన్నాడు, సోఫియాని నఖశిఖపర్యంతం చూస్తూ డాక్టర్.
    "సోఫీ! చచ్చిపోయాక పోస్టు మార్టమ్ చేసిన తరవాత డయాగ్నైస్ చేస్తారు ఈ డాక్టర్లు. పేషెంటును చూస్తూనే డిసీజ్ కనుక్కోవాలి. అలా చేయగలగాలి మనం.... రాజీవ్! యూ బ్రూట్! యువరాజ్ - యూ సిల్లీ డాగ్!..." మనస్సు, శరీరం తేలికై కళ్ళు గట్టిగా మూతలు పడ్డాయి.
    డాక్టర్ కళ్ళలోని ప్రశ్నలకి సోఫియా తడబడుతూ, "రాజ్! అహ! అదే యువరాజ్! అల్సేషియన్ డాగ్!" అంది.
    బాగ్ తీసుకుని లేచి నిలుచున్నాడు డాక్టర్.
    "థాంక్స్, డాక్టర్! మీకు శ్రమ ఇచ్చాను" అంది సోఫీ.
    వాచ్ మన్ అప్పటికే వెళ్ళిపోయి ఎక్కడ ముడు కొన్నాడో! నిర్మానుష్యంగా ఉంది బయట. కృష్ణపక్ష చంద్రుని వెలుతురు పొగమంచులా ఉంది.
    'అంబరాంతమున నున్న నక్షత్రాల మినుకు భూమి కెంతవరకు పయోగమో!" అని తలుస్తూ డాక్టరుతో బయటికి వచ్చింది సోఫియా.
    డాక్టర్ నిట్టూరుస్తూ, "సోఫియా! నీతో మాట్లాడాలి!" అంటూ ముందుకు నడిచాడు.

                            *    *    *

    అర్ధరాత్రి దాటింది. ప్రకృతి మరీ నిశ్శబ్దంగా ఉంది. మంచుతో రాతిబండలు చల్లాబడ్డాయి. గాలిలోని తేమ నీటిబిందువులు బండలమీద, తృణాల మీద సేద తీర్చుకొంటున్నాయి. ఆ తిమిరంలో ఓ కారు ఎంత దూరంనుంచో వచ్చినట్లు అరుస్తూ మూలిగినట్లుగా ఆగింది. ఆ కారులో నుంచి దిగిన వ్యక్తి రాజీవ్!
    ఎదురుగా ఉన్న బంగళాలో వెలుగుతున్న లైటు కాంతి కిటికీగుండా బయటికి వస్తూ ఉంది. చుట్టు పక్కల ఎవ్వరూ లేరు. తలుపు దగ్గరగా వెళ్ళాడు. తెరిచే ఉంది. తల మాత్రం లోనికి పెట్టి చూచాడు. పడకమీద ఒంటరిగా ఉన్న వీణ ఆకృతి కనుపించింది. చిన్న చిన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆమె పడుకొన్న తీరు చిత్రంగా ఉంది. సోఫియా ఏది? తలుపులు తీసి ఉన్నాయి. మరో ఆలోచన లేక దగ్గరగా వెళ్ళాడు.
    అస్తవ్యస్తంగా ఉన్న దుస్తుల్లో నగ్నశరీరపు తెల్ల దనం కనుపించింది.
    "రాజీవ్! రాజీవ్! అలా చేయకు. నన్ను....నన్నుగా ఉండనీ!..." అంటూ మాట్లాడుతూనే ఉంది వీణ.
    ఆ మాటలు స్పష్టంగా లేవు. కనుకొలకుల్లో నుంచి నీరు కారి చెంపలమీద ఎండినా, కనురెప్పలు తడిగానే ఉన్నాయి.
    చెదిరిన నల్లని ముంగురులు నుదుటిమీద, చెంపల మీద చెమటతో అతికినట్లుగా ఉన్నాయి.
    కళ్ళు విప్పుకోను ప్రయత్నిస్తున్నది. ఆ స్థితిలో వీణను చూచిన రాజీవ్ హృదయం ఆగిపోతుందా అన్నంతగా కొట్టుకుంది. కణతలను పగులకొట్టుకుని వస్తాయా అన్నట్లు నరాలు ఉబ్బాయి.    
    "వీణా!..." వణుకుతున్న పెదాలతో ఉచ్చరిస్తూ వీణ పైకి వంగాడు.
    ఆ స్థితిలో లోనికి వచ్చిన సోఫియా రాజీవ్ ని చూసి భయంగా, "రాజీవ్!" అంది.    
    ముఖంలో రక్తం చుక్క లేనట్లు తెల్లగా, పంటి ఒత్తిడికి పెదిమ చిట్లి ఎర్రనైన అధరంతో చకితుడైన రాజీవ్ నిలువెల్లా వణుకుతున్న సోఫియాని చూస్తూ ఉండిపోయాడు.    
    "మై గాడ్! రాజీవ్!..." సోఫీ అంది.
    వీణ మూలుగుతూ, "ఐ హేట్ యు రా..." అని మగతగా మత్తులోకి జారిపోయింది.
    కొండల చాటునుంచి సిగ్గు సిగ్గుగా పైకి వచ్చిన సూర్యుడు గాని, నులివెచ్చని గాలికాని వీణలో ఏ మార్పును తేలేదు. ముందున్న కొండ తన మీద ఉన్నట్లు బరువుగా గాలి పీలుస్తూ, "నీవు రాత్రి ఎక్కడికి వెళ్ళావు ఆ డాక్టరుతో?" అంది.
    అసహ్యం ధ్వనించింది ఆ స్వరంలో.
    తల వంచుకొనే ఉంది సోఫియా.
    "రా...ఆ బ్రూట్ వచ్చాడు కదూ!" గుండెను చేత్తో పట్టుకొంది.
    "వీణా! ఎందుకలా అయిపోతున్నావు? రాజ్ వచ్చాడని ఎందుకనుకొంటున్నావు?"
    "నన్ను మభ్యపెట్టకు, సోఫియా! ఏం జరిగిందో నాకు తెలుసు. అది కల కాదు. నా భ్రమ కాదు."
    "వీణా! పిచ్చిగా ఊహించకు."
    "షటప్! నీవు.... నీవే వాణ్ణి సమర్ధించకు. తుచ్చుడు....మృగం..." దిండు క్రిందనుండి కర్చీఫ్, మఫర్ తీసి సోఫియా కెదురుగా విసిరేసింది. "అవి ఎలా వచ్చాయి నా పడక మీదకు?" అంటూ దిండులో తల దూర్చింది. తనలో రేగుతున్న తుఫాన్ ని అణచటానికి ప్రయత్నించింది.
    వాచ్ మన్ వచ్చాడు కాఫీ తీసుకుని.    
    "రాత్రి కారులో ఎవరైనా వచ్చారా?" అని అడిగింది వీణ.
    వాచ్ మన్ జవాబు విన్న సోఫియా మరో కళ్ళెత్తి వీణవైపు చూడలేకపోయింది.    
    ఏ ఒక్కరి కోసమూ కాలం ఆగదు. పరమానంద స్వాములవారితో మాట్లాడి యాత్రికులు తిరుగుప్రయాణమయ్యారు. వీణ తిమ్మిరావస్థలో ఉంది. వారితో వాన్ లో ఎక్కబోతున్న సోఫియాని, "నీ వెక్కడికి?" అంది కటువుగా వీణ.
    ప్రాణాలను వదిలే శక్తి ఉంటే అప్పటికప్పుడే ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉండేది సోఫియా.
    తనను అక్కడే వదిలి వాన్ లో వెళ్ళిపోతున్న వీణను చూస్తూ కన్నీళ్లు తుడుచుకోను మరిచిపోయింది సోఫియా.
    ఏ ఉత్తరమూ లేకుండా వాన్ లో నుండి దిగుతున్న వీణకు ఎదురుపోయింది ఓంకారి.
    నాన్నమ్మ చేతుల్లో తామరకాడలా వాలిపోయింది వీణ. జ్వరంతో కాలిపోతున్న వీణను పొదివి పట్టుకోని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది ఓంకారి.
    వీణ మలినపడిన తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకొంది. కాని, నాన్నమ్మను, అమ్మను, కొత్తగా దొరికిన అన్నయ్యను- ఇప్పుడిప్పుడే కళకళలాడుతున్న నాన్నమ్మను తను స్వార్ధం కోసం, ఎవ్వరో చేసిన తప్పుకి శిక్షించినట్లవుతుందని ఎంతో నిగ్రహంతో ఆత్మహత్యా పాతకం నుండి బయట పడింది.
    జ్వరం పోయింది. శారీరకంగా, మానసికంగా మామూలు స్థితికి వచ్చింది. కాని, కాలేజీకి పోతానని అనలేదు వీణ.
    పాఠాలు పోతున్నాయి, నీవు రావాలంటూ జుబేదా రోజుకో లేఖ వ్రాస్తూ ఉంది. రాజీవ్ లేడు. హాస్పిటల్ కి రావటం లేదు. ఎక్కడ ఉన్నాడో ఏమోనని మరొకసారి వ్రాసింది.
    "నేను రావాలంటే సోఫియా మన రూములో ఉండకూడదు" అని షరతు పెట్టింది వీణ.
    వెంటనే తిరుగు జవాబు వచ్చింది. సోఫియా గది ఖాళీ చేసింది అని టెలిగ్రామ్ ఇచ్చింది జుబేదా.

                             *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS