Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 15


    చిరునవ్వి నవ్వింది నీరజ. 'ఎందుకు బావా అంత కంగారుపడుతున్నావ్? అలా చెమటపడుతూందేం?' తన పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తూ ఉండగా హాలు వైపు నడిచింది. వెనుకగా నడుస్తూన్న ప్రభాకరం ఆ రెండుకట్టలు రెండు జేబులలో పెట్టుకొని నీరజను అనుమానిస్తూ పైకి వెళ్ళాడు. అతను పైకి వెళ్ళగానే నీరజ గాభరా పడసాగింది. ఆ సమయంలో తన మావయ్యవస్తే ఎంతో బాగుండునని ఆలోచిస్తూ ఎటూ తోచక తత్తరపాటుతో పచార్లుచేయడ మారంభించింది.
    'మామయ్యకు చెప్పడమా? మానడమా? చెబితే గొడవ జరుగుతుంది. ప్రభాకరం రెండువేలు ఏంచేస్తాడో? ఏమో? అతను తీస్తూ ఉండగా కేకలు వేయాలనుకున్నాను. కాని నలుగురికి తెలుస్తే కుటుంబం గౌరవం పాడౌతుందనే ఊహ తట్టింది. కొద్ది మొత్తమైతే మామయ్యకు తెలియదు. ఇంత మొత్తం తీసినప్పుడు ఆయనకు తెలియకుండా ఉంటుందా? సరే! చెప్పవలసిన అవసరమొస్తే తప్ప, నా అంతట నేను చెప్పను. మొదట చెప్పలేదని మామయ్య ఏమనుకుంటాడో?' పరిపరివిధాల ఆలోచిస్తూన్న నీరజకు తన తండ్రి మామయ్య వస్తూ ఉండడం కనిపించింది. ఏమైతే అదౌతుందని ఈ విషయం శ్రీపతిగారికి చెప్పడానికే నిశ్చయించుకుంది. శ్రీపతిగారు లోపలికి వస్తూనే నీరజ ముఖంలో కనుపిస్తూన్న ఆందోళనను గుర్తించారు.
    'ఏమిటే నీరజా!... అలా గాభరాపడుతున్నావేం?'
    'మామయ్యా! ఇలా రా!' అని శ్రీపతిగారిని తనతో తన గదికి తీసుకువెళ్ళి విషయమంతా విడమర్చి చెప్పింది. ఆవేశంతో ఊగిపోయారు శ్రీపతిగారు. పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకున్న నీరజ 'మామయ్యా! త్వరపడి కేకలు వేయకు. ఏరహస్యమైనా గుప్పిట్లో ఉన్నంతవరకే! విప్పితే అంతా రసాభాసై పోతుంది. ఇదివరకు ఉన్న చెడ్డ పేరుకు యిదికూడా తోడౌతుంది. అతని చేతికి వెళ్ళినడబ్బు ఎలాగూ తిరిగిరాదు. అంతే కాకుండా అనవసర ఆవేశాలతో యిప్పుడున్న ఈ మంచి సంబంధాలు కూడా చెడిపోతాయి. పరిస్థితి చాలా నాజూకుగా ఉంటుంది. డబ్బు అవసరానికి మించి యింట్లో ఉంచకు. ఉంచినకొద్ధైనా అతనిచేతికి చిక్కకుండా జాగ్రత్తపడు. ఇంతకన్నా యిప్పుడు చేయగలిగిందేమీ లేదు. ఈ నామాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించి చూడు.' అని శ్రీపతిగారి ముఖంలోకి చూడసాగింది నీరజ.
    పదినిముషాలు బాగా ఆలోచించిన శ్రీపతిగారు. 'అవునమ్మా! చిన్నదాని వైనా చక్కగా చెప్పావ్! కాని యిలా ఎంతకాలం సాగుతుంది? నేనేం చెయ్యాలి?' నుదురు కొట్టుకుంటూ బాధపడసాగారు.
    వారి బాధను చూడలేక తలదించుకుంది నీరజ-

                             *    *    *

    రోజా బర్త్ డే ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. రోజా తన గదిలో ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రభాకరం ఆమె మెడలో నెక్లెసు అలంకరించాడు.
    'అబ్బ! ఎంత బాగుంది ప్రభాకర్! నాకోరిక తీర్చావ్!' ప్రభాకరాన్ని తన దగ్గరకు తీసుకుంటూ అంది రోజా.
    'రోజా! ఈరోజు ఈ దుస్తుల్లో ఎంత అందంగా ఉన్నావు?' అరవిచ్చిన కమలంలా ఉన్న ఆమె ముఖాన్నీ తన రెండు చేతులతో పట్టుకొని, ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, తనవైపు జరుపుకుంటూ అన్నాడు.
    'ప్రభాకర్! మన ఈ ప్రణయనౌకకు ఎటువంటి తుఫానులూ అడ్డు రాకుండా రిజిస్టర్ మారేజి చేసుకుందాం. ఏమంటావ్?' ఉప్పెనలా పొంగుతూన్న ఆవేశాన్ని బలవంతంగా అణగద్రొక్కుతూ అంది రోజా.
    'త్వరపడితే ఎలా? సమయం రావద్దూ! మా యింట్లో బహుశా దీనిని అంతా వ్యతిరేకిస్తారు. మెల్లిగా నచ్చజెప్పి ఒప్పించి మనం వివాహం చేసుకుందాం! ఈరోజే నాన్నగారితో మాట్లాడుతాను.'
    'అలాగే నీ యిష్టమే నాయిష్టం!' కళ్ళల్లో కాంక్షను నింపుకొని అంది రోజా.
    ప్రభాకరంలో ఒక సద్గుణముంది. ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగినా, రోజాను మెప్పించడానికి దొంగతనం చేసినా, త్రాగుడు అలవాటు చేసుకున్నా, శీలాన్ని మాత్రం చెడగొట్టుకోలేదు. ఒకటి రెండు సార్లు రోజా బలవంతం చేసినా నచ్చజెప్పి తప్పించుకున్నాడు. రోజా అతనిని ఎంత కవ్వించినా, ఉత్తేజ పరచినా అతను మాత్రం హద్దుమీరి ప్రవర్తించడం లేదు.
    ప్రభాకరం ఆరోజు రోజా యింటి నుండి బయట పడేసరికి రాత్రి పదిదాటింది. ఆమె బలవంతం చేయడంవల్ల కొద్దిగా త్రాగాడు. కారును నెమ్మదిగా డ్రైవు చేసుకుంటూ యింటికి వచ్చాడు. పైన ఉన్న తన రూముకు వెళ్ళాలని నాలుగు మెట్లు ఎక్కాడు.
    'ప్రభాకరం!....ఇలారా!' తండ్రి పిలుపు వినిపించింది. ఆ పరిస్థితిలో తన తండ్రికి ముఖం చూపించడం యిష్టంలేక వినపడనట్లు నటిస్తూ మెట్లు ఎక్కసాగాడు.
    'ఒరేయ్ ప్రభాకరం! నిన్నే పిలిచేది. పిలుస్తూ ఉంటే వినిపించుకోకుండా అలా వెడుతున్నానేం?' కంఠస్వరంలో కాఠిన్యాన్ని హెచ్చిస్తూ అతనిని రెండవసారి పిలిచారు శ్రీపతిగారు.
    ఇక తప్పదనుకుంటూ దిగి వచ్చాడు ప్రభాకరం. తన ఎదురుగా నిల్చున్న ప్రభాకరాన్ని కోపంగా చూస్తూ 'అలా కూర్చో! నీతో మాట్లాడాలి' అన్నారు శ్రీపతి గారు.
    'రేపు ఉదయం మాట్లాడకుండా మండీ నాన్నగారూ! ఇప్పుడు నాకు బాగా నిద్రవస్తూ ఉంది' బొంకి తప్పించుకోవాలని చూశాడు ప్రభాకరం.
    'అదేమీ కుదరదు. ఇప్పుడే మాట్లాడాలి. ఉదయం ఇనప్పెట్టెలోనుండి తీసిన ఆ రెండు వేలు ఏం చేశావ్! ఇంతవరకూ నీవు దుడుకువాడవనీ, ఏదో అల్లరిగా బాధ్యతారహితంగా మాత్రమే తిరుగుతున్నా నని మాత్రమే ఊహించాను. ఇప్పుడు దొంగతనంచేయడం కూడా మొదలుపెట్టావు. అయ్యో! ఇప్పుడు గుర్తుకు వస్తూ వుంది. ఆ రోజుకూడా నీవే ఇలా దొంగతనం చేస్తూ శారదకు పట్టుబడి పోయావు. నిన్ను దొంగగా నిరూపించడం యిష్టం లేక అన్నెం పున్నెం ఎరుగని ఆ అమాయకురాకు తను చేయని నేరాన్ని తనపై మోపుకొని ఎటో వెళ్ళిపోయింది.'
    'అవును. అపుడు ఆ వేయి రూపాయలు నేనే తీశాను. ఈ రోజు రెండు వేలూ నేనే తీసుకున్నాను. నేను రెండు వేలు తీయడం నీరజ చూసింది. ఆమె మీతో చెబుతూందని కూడా నాకు తెలుసు. నాకు ఆ డబ్బుతో అవసర మొచ్చింది తీసుకున్నాను. నా డబ్బు నేను తీసుకోవడంలో తప్పు లేదు.' మొండిగా సమాధాన మిచ్చాడు ప్రభాకరం.
    శ్రీపతిగారు కళ్ళెర్రజేసి ఆవేశంతో ఏదో మాట్లాడబోయారు. పరిస్థితులు విషమిస్తాయని గ్రహించిన నీరజ-'మామయ్యా! రేపు అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడేమీ త్వరపడవద్దు' అన్నది.
    'ఇందులో నీ పెత్తన మేమిటి? బోడి పెత్తనం? ఇప్పుడే మాట్లాడుకుంటాం. తిని కూర్చోలేక యిటువంటి పెత్తనాలు యెందుకు చేస్తుంటారో నా కర్ధం కాదు.' ముఖం మాడ్చుకుని చిటపట లాడుతూ అన్నాడు ప్రభాకరం.
    'అవున్రా.....పెత్తనం దానిదే! రేపు జీవితాంతం నీతో గడప వలసింది అదే కద! దాని మాటలో తప్పేముంది? ఐనా ఆ రెండు వేలూ ఏం చేశావ్? ఎక్కడ తగలబెట్టావ్?'
    'రోజాకు నెక్లెసు కొని యిచ్చాను. ఇక దాపరికమెందుకు నాన్నారూ? నేను రోజాను పెండ్లి చేసుకోవా లనుకుంటున్నాను. నీరజను చేసుకోను. మీరు ఆశీర్వదించి మా ఇద్దరినీ ఆదరిస్తే సంతోషిస్తాను.' కొంచెం తగ్గి అన్నాడు ప్రభాకరం.
    'ఛీ!.......అదెవతెరా....ఈ యింట్లో అడుగు పెట్టడానికి? మన వంశము, గౌరవ ప్రతిష్ఠలు ఏమైనా దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నావా? ఇటువంటి పనులు చేసి నన్ను నలుగురిలో తలెత్తుకొని తిరిగకుండా చేస్తానని భయపడుతూనే వున్నాను. అనుకున్నంతా అయింది. నీవు బుద్దిగా చదువుకొని నీరజను పెళ్ళాడితే సరి! లేకపోతే ఆస్తినంతా ఆశ్రమాలకు వ్రాసిచ్చి, మీ అమ్మ, నేను యింత విషం తింటాం.' ఆవేశంతో ఊగిపోతూ అన్నారు శ్రీపతిగారు. కోపంతో లేచి పైకి వెళ్ళిపోయాడు ప్రభాకరం.
    
                            *    *    *


    శాంత, శారదలిద్దరూ క్రమంగా కాలేజీకి వెడుతూ చక్కగా చదువుకుంటున్నారు. శారద స్నేహంతో శాంతకు చదువుపై యిదివరకటికన్న ఎక్కువ శ్రద్ధ పెరిగింది. మొదట్లో శారదను పుస్తకాల పురుగుగా దెప్పుతూ వుండే శాంత యిప్పుడు తనుకూడా ఆ విధంగానే మారింది. క్లాసు కంతటికీ శారద, శాంత లిద్దరే ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారు. ఆ సంవత్సరం వార్షికోత్సవాలలో జరిగిన వక్తృత్వ పోటీలలో శారద పాల్గొంది. ఆమె వాదనాపటిమ విమర్శనా విధానం ఆ వార్షికోత్సవాలకు అతిధులుగా వచ్చిన సాహిత్యవేత్తలకు సంభ్రమాశ్చర్యాలను కలిగించాయి. మన సంస్కృతి సభ్యతల మీద ఆమె యిచ్చిన ఉపన్యాసము యువకులను, పెద్దలను ఆకర్షించింది. ముఖ్య అతిధి బహుమతి ప్రధానం చేస్తూ ఆమెను ఎంతో పొగిడారు. చక్కగా కృషిచేస్తూ వెనుకబడిన మన సాంప్రదాయాలను, ఆచారాలను మళ్ళీ పునరుద్ధరించడం చాలా అవసరమనీ, అందుకు యిటువంటి యువతరంవారు పూనుకోవడం ఎంతో హర్షదాయకమని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంత మందిలోనూ శారదను పొగడడం శాంతకు గర్వకారణమైంది.
    పరీక్షలు యింకా నెలరోజులున్నాయి. ఇద్దరూ బాగా చదువుకుంటున్నారు. ఇద్దరిలోనూ పట్టుదల ఉత్సాహం ఎక్కువయ్యాయి. ఒకరిని మించి మరొకరు ఎక్కువ మార్కులు సంపాదించు కోవాలనే కోరిక యిద్దరిలోనూ ఎక్కువైంది. శారద మొదటినుండీ తెలివిగలది కాబట్టి, తను పూర్ గా ఉన్న సబ్జక్టు లలో ఆమె సహాయాన్ని తీసుకుంటూ తీవ్రమైన కృషిచేస్తూ ఉంది శాంత. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు ఎంతో సంతోషించింది శారద.     
    ఒకరోజు సాయంత్రం యిద్దరూ సుల్తాన్ బజార్ లో తమకు కావలసిన సామానులు ఏవో కొనుక్కుంటున్నారు.
    'శాంతా! బాగున్నావా?'    
    'ఎవరు ...?' వెనుతిరిగి చూసింది శాంత.
    'నేను .... సుందరాన్ని!' చిరునవ్వు ముఖంతో కనుపించాడు సుందరం.
    'నీవా ...? ఎంత మారిపోయావు? నిన్నుచూసి చాలా కాలమైంది కదూ...!' సంభ్రమాశ్చర్యాలను ప్రకటిస్తూ అంది శాంత.
    'అవును. శలవులలోకూడా యింటికి రావడంలేదు! రామం బాగున్నాడా ...? వాడికైనా ఉత్తరం వ్రాద్దామనుకుంటుంటాను. అలా అనుకుంటూ ఉంటుండగానే ఏండ్లు గడిచిపోతున్నాయి.'
    'డాక్టరువు కాకముందే అంత తీరిక లేకపోతే, డాక్టరువైన తర్వాత మాబోటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా వీలు చిక్కదను కుంటాను. అంతేకాక యిక మన ఊరినికూడా మరిచిపోతావేమో?' నవ్వుతూ అంది శాంత.
    'అబ్బే! అదేంలేదు శాంతా! ఏమిటో? ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన ప్రాణానికి ఆ పల్లెలో రెండురోజులుండాలంటే విసుగు పుడుతుంది. అసలు నాకు అక్కడ ఉండడం ఏ మాత్రం యిష్టం లేదు. రామం ఒక ఆస్పత్రి కట్టే ఆలోచనలో ఉన్నాడనీ, అందులో నేను పని చేయాలని ఉబలాట పడుతున్నాడనీ, నాన్న వ్రాశాడు. నిజమేనా శాంతా?' శాంత ముఖంలోకి అదో రకంగా చూస్తూ ప్రశ్నించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS