12
నాగభూషణం మీద రాఘవరావు ఆలోచించిన విషయాలు రాయుడు గారు పట్టించుకోలేదు. నాగభూషణం మంచి చెడ్డలు రాయుడు గారికి తెలుసు. ఇది రాఘవరావు పన్నిన పన్నాగ మని అయన గ్రహించాడు. అందుకనే ప్రసాదపురం పంచాయితీ ఎన్నికల విషయం లో అయన ఏ జోక్యమూ కలిగించుకో లేదు.
పంచాయితీ ఎన్నికలయినాయి. రాఘవరావు సభ్యుడుగా ఎన్నికయ్యాడు గాని ప్రెసిడెంటు గా ఎన్నిక కాలేదు. ఇదివరకు ఉన్న ప్రెసిడెంటే తిరిగి ఎన్నుకో బడ్డాడు. డానికి కొంతవరకూ బాధ్యుడు నాగభూషణం అని అందరికీ తెలుసు. నీతి నిజాయితీ లు కలవాడు గనుకనే నాగభూషణం మాట చెలామణి అయింది.
ఐశ్వర్యవంతుడిని చూచి గౌరావిస్తారు. ఆయనకేం డబ్బు కలవాడు , కొండమీద కోతిని కొనగలడు అనడం పరిపాటి. నిజాయితీ పరులకు వ్యక్తీ ప్రాధాన్యం ఉంటుంది. అలాటి వారి యందు అందరికీ సద్భావం ఏర్పాడుతుంది.
అప్పటి నుంచి రాఘవరావు నాగభూషణ మంటే మరీ మండిపోతున్నాడు. కామాక్షి తనను కాదన్నది. నాగభూషణం తనను బలపరచలేదు. నాలుగు పుట్లు పండించి అవి చూచుకుంటూ కాలక్షేపం చేసే నాగభూషణం దృష్టి లో , ఏభై పుట్లు పండించే రాఘవరావు ఎందుకూ కాకుండా పోయాడు.
ఈ పంచాయితీ ఎన్నికల అనంతరం ఊళ్ళో, ముఖ్యంగా రెండు పార్టీలుగా చీలిపోయారు. నాగభూషణమూ, ప్రెసిడెంటూ, మారికొందరు పెద్దలూ ఒక పార్టీ. వీళ్ళంతా ఎన్నికల్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్ధిని బలపరిచే వాళ్ళు. రెండో పార్టీ రాఘవతావు పార్టీ. అందులో రాఘవరావు, మరో ఇద్దరు పంచాయితీ సభ్యులూ, కార్ముకులూ, కొంతమంది యువతరం వారూ ఉన్నారు. వీళ్ళంతా రాఘవయ్య గారి అభ్యర్ధిత్వాన్ని బలపరిచే వాళ్ళు.
ఈ విధంగా ప్రసాదరావు రెండు చీలికలయింది.
ఈ పరిస్థితుల్లో రాఘవరావు గుంటూరు వెళ్ళారు. మనస్సులో పొగలూ, సెగలూ అవరించినాయి. రమేష్ గదికి వెళ్ళాడు. ఆ సమయంలో రమేష్ , సురేంద్ర వసుంధర మాట్లాడు కుంటున్నారు. ఎన్నడూ రాని రాఘవరావు ఇట్లా వెతుక్కుంటూ తమ గదికి రావడం రమేష్ కు చాలా ఆశ్చర్యం కలిగించింది. రాఘవరావు కుర్చీలో కూర్చున్నాడు. కుశల ప్రశ్న లయ్యాక "బాగా చదువుతున్నావా , రమేష్?" ఏదో మా వూరి వాడివి, చదువు కుంతున్నావని చూచిపోదామని వచ్చాను. పాపం మీ మాటలకు అంతరాయం కలిగిస్తున్నానెమో!" అన్నాడు వ్యగ్యంగా వసుంధర వైపు చూచి. ఈ మాటల్లోని అంతర్యం రమేష్ గ్రహించాడు.
"బాగానే చదువుతున్నాం. మొన్న జనవరి ఇరవై అరున హైస్కూల్లో నాటకం వేశారు. ఆ నాటకం లో హీరోయిన్ ఈ అమ్మాయి. ఆ నాటకాన్ని గురించి చర్చించు కుంటున్నాం. ఈ రోజుల్లో విద్యార్ధులకు చదువూ ఉండాలి. కాలేజీల్లో నాటకాలు, నాటికలూ వెయ్యాలి." అన్నాడు రమేష్.
"ఇదివరకు రోజుల్లో చదువుకునే పిల్లల్ని నాటకాలకూ, సినిమాల కూ పోవద్దనే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతనే నాటకాలాడిస్తున్నారు. కాలం మారిపోయింది. సరే వెళ్ళొస్తా. మీ నాన్నగారి కేమన్నా కబుర్లు చెప్తావా?" అయినా అయన పెద్దవాడై పోయాడు. ఏమీ పట్టించుకోరు. ఎవళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నా అయన కేం అక్కర్లేదు. ఆ ఇంట్లో ఉన్నది ఇద్దరే అయినా ఎవరి దారి వాళ్ళది. ఆయనకు వేళకు ఇంత పెడితే చాలు. ఇంకా నీదాకా రాలెదనుకుంటా." అంటూనే రాఘవరావు వసుంధర వైపు చూస్తూ వెళ్ళిపోయాడు.
రాఘవరావు మాటల్లోని అంతర్యం రమేష్ కు అర్ధం కాలేదు. తన ఊళ్ళో తన ఇంట్లో ఉంటున్నది తండ్రి , కామాక్షి. ఇద్దరిదీ తలొక దారీనా? ఇదేదో వింతగా ఉన్నదను కున్నాడు. కాసేపు మాట్లాడి తరువాత వసుంధర వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా రమేష్ కు ఏమీ అర్ధం కాలేదు.
జీవితంలో అనేక రకాల వ్యక్తులు తెలియకుండానే తారసిల్లు తారు. ఏదో ఒక అభాండం హైడ్రోజన్ బాంబు లా నెత్తిన వేసి అది బ్రద్దలయితే , జరిగే పరిణామాలను చూచి సంతోషించే వాళ్ళు కొంతమంది. విన్న విషయాలకే ప్రాధాన్యం ఇచ్చి ఏమిటో తెలీక ఏమీ తెలుసుకోలేక మధనపడే వాళ్ళు కొంతమంది.
రమేష్ తండ్రికి ఉత్తరం వ్రాశాడు. రాఘవరావు వచ్చి వెళ్ళాడని, ఎందుకో తమ కుటుంబమంటే పెద్ద యిష్టం లేనట్లుగా మాట్లాడాడనీ, తన కా విషయాలేమీ తెలీటం లేదని వ్రాశాడు.
ఆ ఉత్తరం నాగభూషణం చదువుకున్నాడు. కామాక్షి ని పిలిచి ఉత్తరం చాడువుకోమన్నాడు. ఉత్తరం చదివి ఒక నిట్టుర్పు విడిచింది కామాక్షి.
"చూచావా తల్లీ. ఆ రాఘవరావు మొన్న ప్రెసిడెంటు గిరీ ఎన్నికల్లో ఒడి పోయినప్పటి నుంచీ మనమీద ఏదో నెపం తో పగబట్టే ఉన్నాడు. ఊళ్ళో ఉంటున్న వాళ్ళం మనమీడనే గాక పోరుగూళ్ళో చదువుకునే వాడికి కూడా ఏదో తంపులు పెడుతున్నాడు. సరే కానియ్యి. ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అన్నింటికీ" అన్నాడు.
కామాక్షి అంతా విని "కామాంధుడి కి కక్ష ఎందుకుండదు నాన్నా? నా మీద అతనికి కక్ష గానే ఉంది తనకు లొంగ లేదని" అన్నది.
అ మాటకు నిర్ఘాంత పోయాడు నాగభూషణం.
* * * *
నాగభూషణం ప్రతి సంవత్సరం పుట్టి గింజలు పాతర వేయించి మూడు పుట్లు పురి కట్టిస్తాడు ధాన్యం అమ్మడానికి. ఈ సంవత్సరం కూడా అట్లాగే వేయించాడు. ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్ళితేనే గాని ధాన్యం అమ్మడు. ధాన్యం అమ్మేటంత వరకూ పుర్ల కు కాపలాగా రాత్రిళ్ళు ప్రత్యేకం మనిషిని పెట్టేవాడు. ఇది ఆయనకు పరిపాటి.
రాత్రి రెండు జాములయింది. నాగభూషణం యధాప్రకారం లోపల పడుకున్నాడు. కామాక్షి తన గదిలో పడుకుంది. కావలి వాడు పుర్ల దగ్గర గా మంచం వేసుకుని పడుకున్నాడు. కాపలా వాడు కొంచెం పెద్ద వాడేమో చల్లగాలికి కాస్త కునుకు పట్టింది. కొంతసేపటికి శరీరమంతా వెచ్చగా ఆవిర్లు తెరినట్ల యింది. వెచ్చదనం ఎక్కువయి వెలుతురూ కనిపించి నట్లయింది. కళ్ళు తెరిచి చూశాడు. పుర్లు తగలబడి పోతున్నాయి. రెండు పుర్లూ అంటుకున్నాయి.
"బాబోయ్1 పుర్లు తగల బెట్టారండోయ్. అమ్మగోరు! కొంప బోయిందయ్యా!" అంటూ గావు కేకలు పెట్టాడు. పుర్ల గడ్డి లాగేశాడు. కర్రతో అంతా కుళ్ళగించి కదిలించి లాగేశాడు. కాని ఒక్కాడికి అలివి కాలేదు. వాడి కేకలకు నాగభూషణం, కామాక్షి , ఇంకా చుట్టూ ప్రక్కల వాళ్ళూ అంతా వచ్చారు. అంతా చేరి సగం , సగం కాలిన పురులు గడ్డి అంతా లాగి అర్పివేశారు. వడ్లు చాలావరకు కాలిపోయి పెట్లి పోయినాయి. ముందు పుర్ల మీద కిరసనాయిలు పోసి ఒక్కసారి భగ్గున అంటించారు.
నాగభూషణం కుప్పగా కూలిపోయాడు. ఆ మంటలూ, ధన్యమంతా పెళ పెళలాడుతూ కాలిపోవటం -- ఆ దృశ్యం చూసేసరికి నాగభూషణం గుండె బెజారయిపోయింది. నాగభూషణం జీవితంలో పుర్లు తగులబడడం అదే మొదలు.
కామాక్షి ఏడ్చింది. దిగాలు పడిపోయింది. ఈవార్త గ్రామంతా పాకిపోయింది. అంతా వచ్చారు. పుర్లు అంటించిన వాళ్ళను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. పుట్టెడు కు పైగా ధాన్యం తగులు బడిపోయింది. మిగతా ధాన్యం పొగచూరినాయి. కాని కాలిపోయిన పుర్ల వైపు కన్నీరు కారుస్తూ చూసింది కామాక్షి. ఆమె కళ్ళలో రాఘవరావు మెదిలాడు.
తెల్లవారిన తరువాత అందరితో పాటు రాఘవరావు కూడా వచ్చి నాగ భూషణాన్ని పరామర్శించి వెళ్ళాడు. అందరి కళ్ళూ రాఘవరావు మీదనే ఉన్నాయి . నాగభూషణానికి ఏం చెయ్యడానికీ తోచలేదు. కొంతమంది పోలీసు రిపోర్టు ఇవ్వమన్నారు. "ఏమీ చేయకుండా ఇట్లాగే వదిలేస్తే ఇంక ప్రాణాలు తియ్యడానికి క్కూడా సహసిస్తారు." అన్నారు కొంతమంది. అందరికీ ఒకటే సమాధానం చెప్పాడు నాగభూషణం. అరవై యేండ్ల వాడి మీద అనవసరంగా కక్ష కట్టి సంవత్సర మంతా కష్టపడి పండించుకున్న నోటి కాడి తిండి గింజలు తగులపెట్టించిన వాడు ప్రాణాలు తీస్తాడనడం లో ఆశ్చర్యం లేదు. కానివ్వండి. అన్నింటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. ఏ కట్టెన నిప్పుంటే ఆ కట్టే తగులబడుతుంది." అన్నాడు ఒక్క నిట్టుర్పు విడిచి.
