Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 15

 

    "ఇదేం నటన కాదు నాయనా! మీరిద్దరూ ముష్టి యుద్దానికి దిగితే నిన్ను నిజంగా ఆస్పత్రికి మోసుకు పోవాల్సి వస్తుంది. సినిమా యుద్ధం లాగా నాజూగ్గా కొట్టుకుని వెనకాతల చప్పుళ్ళు చేసుకోవటం కాదు....ఎంతైనా అంత కోపం పనికి రాదు..... శాంతం వహించు.....!
    "చెప్పులు కుట్టే వాడికి చెవులు వాయించ లేడు కాని చైనా వాడితో వీడెం యుద్ధం చేస్తాడు? ఒడ్డూ పొడుగూ ఉన్నావు కాని ఎందుకూ పనికి రావురా? వట్టి పిరికి వెధవ్వి.....!" అన్నాడు చిరాకు పడుతూ మోహన్.
    "నాకా పిరికితనం? వాడిని పిప్పి పిప్పి చేసేయ్యనూ? చూద్దూ గాని నా జబ్బ సత్తువ.... పద!" అంటూ సుధాకర్ రోషంగా వెనక్కి తిరిగాడు.
    కళ గాభరాగా "మీరు వెళ్ళారంటే వట్టె.. వెధవ చెప్పులు బుట్టలో వేసుకుని ఇంటికి పట్టుకు పోతాను లెద్దురూ... అక్కడే బాగు చేయించుకుంటాను. నా చెప్పుల కోసం మీరిద్దరూ చావు దెబ్బలు తిని రావటం దేనికి?" అంది.
    "సరే అలాగే కానివ్వండి... మీరు వట్టి కాళ్ళతో నడిస్తే మళ్ళా ఏ సిగరెట్టూ పీకో మట్టేస్తారు.... వాడు అడిగినంతా ఇచ్చి మళ్ళీ కుట్టించుకుని వద్దామా...?" అన్నాడు సుధాకర్.
    "ఇందాకైనా పరాభవం చాల్లేదా? వీడు చేసే సిఫార్సు లన్నీ ఇలాగే ఉంటాయి! మళ్ళా ఏ మొహం పెట్టుకుని వెళ్ళటం?.... నాకు తెలిసిన వాడొకడున్నాడు. వాడి దగ్గర కెళ్ళి కుట్టించుకుందాం రండి...." అంటూ మోహన్ దారి తీశాడు.
    మరో రెండు మలుపులు తిరిగాక మరో చెట్టు. మరో చెప్పులు కొట్టే వాడు -- కళ చెప్పులు తీసి వాడి ముందు పడేసింది.
    "రెండిటికీ ఎంత కావాలో ముందే చెప్పు.... తర్వాత తగువు లాడకు....' అంది కళ ఇందాకటి వాడి మీది కోపం వాడి మీద చూపించి.
    వీడేమో అరణాలు అడిగాడు. ఇందాక  ముప్పావలా, ఇప్పుడు అరణాలు.... ఇంకో రూపాయి వేస్తె కొత్త చెప్పులే వస్తాయి, అనుకుంది కళ మనస్సులో బాధగా లెక్క వేసుకుంటూ.
    "వద్దులే" చెప్పులు తీసుకో బోయేసరికి అయిదణా లిద్దామన్నాడు. కళ ససేమిరా యివ్వనన్నది.
    "పావలాకు కుడితే కుట్టు.... లేకపోతె ఆ చెప్పులిలా పడెయ్యి!" అంటూ ముందుకు వంగింది.
    వాడు సరేనని వప్పుకుని ఒక చెప్పు చేతిలోకి  తీసుకున్నాడు. కొత్తగా వేసిన బటన్ కాస్తా ఇట్టే తీసి పడేశాడు.
    కళ ఆశ్చర్యపోతూ అంది.
    "వాడేమో బటన్ చెప్పుకు అంటుకు పోయి నట్టు మాట్ల్దాడాడు...! వీడు కాస్తా నిమిషం లో తీసి ఇవతల పడేశాడు! ఎంత మోసం....?"
    "లోకం అంటే మోసాల పుట్ట....! ఇల్లు విడిచి బైట కొచ్చమంటే చాలు ప్రతివాడు మన నెత్తిని టోపీ పెట్టాలనే చూస్తాడు...." అని బోధ పరిచాడు సుధాకర్.
    చెప్పులు కుట్టడం అయ్యాక కళను ఇద్దరూ కలిసి బస్సులో ఎక్కించి వచ్చారు.
    "ఎలా ఉంది....?" అనడిగాడు సుధాకర్.
    "గట్టిగానే ఉంది.... వాడు బాగానే కుడతాడు. నువ్వు సిఫార్సు చేసిన వెధవలా టోకరా ఇస్తాడనుకున్నావు కాబోలు!"
    సుధాకర్ నవ్వాడు.
    "చెప్పుమాట కాదురా.. కళ మాట....! నువ్వు ఇంతకూ ముందు కళను చూడలేదుగా? ఎలా ఉంది....?"
    "చూడకేం? ఇంతకూ ముందే చూశాను....."
    "ఎడిశావులేరా నీ విట్టూ నువ్వూనూ..... ఇంతకూ ముందంటే బస్సు ఎక్కబోయే ముందు వరకనేగా నీ అర్ధం?"
    "అదేం కాదు! నేను, ఆవిడా ఒకే రోజున ఒకే సినిమా కెళ్ళాం...."
    తెల్లని సుధాకర్ ముఖం నల్లబడింది.
    మోహన్ నవ్వుకున్నాడు.
    'అలా కుంగిపోతావెంరా అబ్బాయ్! నేను, ఆవిడ కలిసి వెళ్ళలేదు..... ఎవరి మట్టుకు వాళ్ళే వెళ్ళాం. సినిమా హల్లో నుంచి బైటి కోస్తున్నప్పుడు కళ వచ్చిందంటే చూశాను... అంతే...."
    సుధాకర్ ముఖం వికసించింది.
    "కళ వచ్చిందని ఎవరన్నారు?... దొరికావులే దొంగవి.... ఎవరితో వెళ్ళావో చెప్పు!"
    మోహన్ నిజంగా సిగ్గు పడ్డాడు... నటన కాదు....
    'ఆవిడే.... ఆవిడే లేరా..." అన్నాడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ.
    "ఆవిడికి పేరు లేదా ఏమిటి?" అని సుధాకర్ నిలదీసి అడిగాడు.
    "పేరు లేకేం? బహు చక్కని పేరు....గీ..త"
    సుధాకర్ ఆశ్చర్యానికి మేరలేదు.
    "ఓరి నీ అసాధ్యం కూలా! ట్రాన్సి స్టర్ కోసం వచ్చి ఆ అమ్మాయిని ఎంచక్కా బుట్టలో పెట్టావ్....! ఎంత నాటకం....! ఇందుకే కాబోలు గీత రేడియో పెట్టుకోవటం మానేసి అశోక వృక్షం క్రింద సీతలా దిగులుగా కూర్చుంటున్నది."
    "బుట్టలో పెట్టడం కాదు. నాటకమూ  కాదు... నిజంగానే పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నాను...."
    "గట్టి చిక్కే ! మీ నాన్నగారితో చెప్పకుండా వచ్చేసానన్నవు కదా? ఇప్పుడు వెళ్లి "నేను ఫలానా ఆవిడ్ని ప్రేమించాను' అంటే అయన ఎడా పెడా వాయించడూ?" అంటూ సందేహం వెలిబుచ్చాడు సుధాకర్.
    "వాయించడ మేమిటోయ్? అయన మూడో కన్ను తెరుస్తాడు... ఆ మంటల్లో పడి భస్మం కావటం కన్నా అయన కంట బడక పోవటమే మంచిది...."
    "అయినా ఎన్నాళ్ళి లా మీ నాన్నగారికి కనబడకుండా దాక్కుంటావ్ ? హాయిగా మీ వూళ్ళో ఏదైనా ఉద్యోగం చేసుకో రాదు?" అన్నాడు జాలిగా సుధాకర్.
    "పొద్దుటి నించి సాయంకాలం వరకు కుర్చీకి అంటి పెట్టుకుని ఫైల్స్ రాస్తూ కూర్చోలేను. నటుడ్ని కావాలనే కొండంత కోర్కె తో వచ్చాను. పట్టుదల ఉంటె సాధించలేని పనేం లేదు.... నేను ఎప్పటి కైనా పైకి రాగాలను. ఆ ధైర్యం నాకుంది. అలాగే గీత విషయంలో కూడా.... ఇందులో మా నాన్నగారిని ప్రాధేయపడాల్సిందేమీ లేదు..." అన్నాడు మోహన్ ఆవేశంతో.
    సుధాకర్ నిట్టూర్చాడు.
    "వూ...! అంత ధైర్యం ఉంటె మంచిదే.... ఇంతకీ గీతకు నువ్వంటే ఇష్టమో, లేదో కనుక్కున్నావా? ఆరోజు నిన్ను చూస్తె ఎంత మండి పడింది నేను మర్చిపోలేను-- ఆ కోపమంతా ఇంతలోనే మంచులా కరిగి పోయిందంటే వింతగా ఉంది...."
    'ఆడవాళ్ళని అడిగితె ఏం చేస్తారో తెలుసునా? సిగ్గుపడి మాట్లాడకుండా జారుకుంటారు... అంటే ఇష్టమే అని చెప్పటం...."
    "మాట్లాడకుండా నాలికతో వెక్కిరించి వెళ్తే....?"
    "ఏమిటేమిటి? నాలికతో వెక్కిరించటమా? సిగ్గుతోనా, కోపం గానా?"
    "ఏమో! ఆవిడికి సిగ్గే వేసిందో, కోపమే వచ్చిందో ఎవరికి తెలుసు....?"
    మోహన్ నవ్వాడు.
    "అప్పుడే కళతో పెళ్ళి మాట కదిపావన్న మాట!"
    "కదిపితే ఏం ప్రయోజనం? ఆవిడ అవునంటేగా? పైగా నేను అడిగానని కోపం కూడా వచ్చిందేమో..." అంటూ నిస్పృహను వెలిబుచ్చాడు సుధాకర్.
    మోహన్ సుధాకర్ వీపు చరిచి ధైర్యం చెప్పాడు.
    "మరేం బెంగ పెట్టుకోకురా! కళకు నువ్వంటే పంచ ప్రాణాలు....కాకపోతే ఇప్పుడొచ్చి ఎందుకు పలకరిస్తుంది?"
    "పలకరించక పోయినా బాగుండును.... ఆ సిగరెట్టు కాస్తా ఆవిడ కాలినే చుర్రు మనిపించాలి, ఆవిడ ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఆ సిగరెట్టు నేనే కాల్చి పారేసానని తెలిస్తే ఆవిడ జన్మలో నా మొహం చూడదు.... అదీగాక ఆవిడకో బావ కూడా ఉన్నాడు...." అన్నాడు నిరాశగా సుధాకర్.
    "నిరాశ పడకురా భాయ్! బావగారికి మరో భామను కట్ట బెట్టచ్చు. మీ ఇద్దరి పెళ్ళి నా చేతుల మీదుగా చేయిస్తానుగా....?" అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు మోహన్.

                         *    *    *    *
    "ప్రియా! మా అంటీ వైజాగ్ రమ్మని రాసింది...."
    పరిచయం ఉన్న కంఠస్వరం లా వినబడితే మోహన్ అటు తిరిగి చూశాడు.
    పేవ్ మెంటు మీద నిలబడి గీత మరొక అమ్మాయితో మాట్లాడుతున్నది.
    ఆ అమ్మాయి సంతోషంతో పళ్లన్నీ బైట పెట్టి "అలాగా! నేను కూడా వైజాగ్ వెళ్తున్నాను. మనమంతా మళ్ళా వైజాగ్ లో సరదాగా కాలక్షేపం చెయ్యొచ్చు!" అంది.
    "వైజాగ్ లో ఎవరున్నారు ప్రియా?' అనడిగింది గీత.
    "మా తాతగారు, అమ్మమ్మ అక్కడేగా ఉన్నారు? మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. వాడీ ఏడు బి.ఎస్.సి (ఆనర్స్) పరీక్షలు రాశాడు....."
    "ఏమో! నేను వైజాగ్ వెళ్తానో, లేదో చెప్పలేను... మా ఆంటీకి మనసంతా కళ మీదే..... కళను మా బావ కిచ్చి చేసుకుంటారు. బావ చదువు కూడా పూర్తయింది. దగ్గరలోనే ముహూర్తాలు పెట్టుకుంటారేమో కూడా..... అంటీ మాట వరసకు మమ్మల్నంతా రమ్మన్నది కాని మేమంటే ఆవిడకేం అభిమానం లేదు...."
    మోహన్ గుండె కలుక్కుమంది. ఈ బావెక్కడ దాపురించాడు. సుధాకర్ పాలిటి విలన్ లా అనుకున్నాడు కోపంగా. ఈ బావను తేలిగ్గా తీసి పారేయ్యాటం తేలికనిపించలేదు...
    ఇంతలో గీత ఇటు తిరిగి మోహాన్ని చూసి చూడనట్టుగా తల అటు తిప్పి, "ప్రియా! ఇంక నేను వెళ్ళి రానా? బస్సు కోసం వెయిట్ చేసి ఇంటి కెళ్ళేటప్పటికి ఎలా లేదన్నా ఇంకో రెండు గంటలు పడుతుంది.... చీకట్లో ఒక్కర్తినే వెళ్ళాలి....." అంది.
    "నేనూ వెళ్ళాలి గీతా! ప్రయాణం కదూ ఒకటే హాడావిడి గా ఉంది... అన్నయ్య సాక్సేవో కావాలన్నాడు . మూర్ మార్కెట్టు కు వెళ్ళి కొనుక్కు రావాలి.... వైజాగ్ నువ్వు కూడా రారాదు? మీ మేనత్త అభిమానం ఎవరిక్కావాలి? మనం హాయిగా గడపొచ్చు....."
    కాస్త దూరంలో బస్సు వచ్చి ఆగింది.
    "గబగబ పరిగెత్తు--" అంది గీత కంగారుగా.
    "అది కాకపోయే మరొకటి వస్తుంది. ఏమిటా కంగారు. నువ్వు వైజాగ్ తప్పకుండా రావాలి...."
    గీత మనస్సులో విసుక్కుంది.
    'అలాగే ప్రయత్నిస్తాను.... నే వెళ్లొస్తాను... మళ్ళా చీకటి పడిందంటే...."
    "టిక్కెట్టు పుచ్చుకుని రైలేక్కటానికి ప్రయత్నమేమిటి? తప్పకుండా రావాలి...."
    "అలాగే! టా, టా! ప్రియా!"
    'అలాగే! టా, టా, ! ప్రియా!"
    "చీరియో గీతా!"
    ఆ అమ్మాయి కనుమరుగయ్యాక మోహన్ గీతకు దగ్గరగా వెళ్ళి "ఆ అమ్మాయి ఒక పట్టాన వదులుతుందనుకోలేదు సుమండీ....!' అన్నాడు.
    "దానికి మాటలు  కొంచెం ఎక్కువే కాని చాలా మంచి పిల్ల!" అంది గీత.
    బాగానే ఉంది కాని ఆడవాళ్ళు ఆడవాళ్ళు ప్రియా అని పిలుచుకోవటం ఏమిటి? సినిమాలోనో, నాటకం లోనో ప్రేయసీ ప్రియులు 'ప్రియా!' అని పిలుచుకున్నా, పాటలు కట్టి పాడుకున్నా అందం కాని....! మాములు మనుష్యులకి మాత్రం 'ప్రియా' అని పిలుచుకోవాలని ఉండదా ఏమిటి?
    "ప్రియా!' అంటూ మోహన్ అప్రయత్నంగా గీతను సంభోదించాడు.
    గీత కళ్ళు పెద్దవి చేసి చూసింది.
    "మీకేం వెర్రా ఏమిటి?"
    మోహన్ నాలిక  కొరుక్కుని "మరి మీరెందుకు ఆ అమ్మాయిని 'ప్రియా? ప్రియా!" అని పిలిచారు?' అనడిగాడు.
    గీత పగలబడి నవ్వుతూ నోట మాట రాక అవస్థ పడింది.
    "ఆ...ఆ....మ్మా....యి....పే....రు " పట్టరాని నవ్వుతో అస్పష్టంగా గంటకో మాట అంటూ వాక్యం పూర్తీ చేయలేక ఉక్కిరిబిక్కిరైంది గీత.
    మోహన్ ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ ప్రియ ఆ అమ్మాయి పేరా? పూర్తీ పేరై ఉండదు.... సగం పేరో, మూడో వంతు పేరో అయి ఉంటుంది.... ఆడవాళ్ళూ చిత్రంగా ఉంటారు,  వాళ్ళ పేర్లూ చిత్రంగా ఉంటాయి! ముందు గాని, వెనక గాని ప్రియ వచ్చే అడపెరేమిటి..... భలే క్వీజ్! మోహన్ బుర్ర చకచకా పని చేసింది.
    చటుక్కున గీత కేసి చూసి "మీ స్నేహితురాలి పేరేమిటో తెలిసిపోయింది లెండి....!" అన్నాడు వూరిస్తున్నట్టు.
    గీత ఇప్పటికి మామూలు మనిషయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS