ప్రతి విషయానికీ ప్రతి అల్పుడూ తనకు తోచిందేదో చేస్తానంటే సమాజం ఎలా నిలువ తీస్తుందో అలాగే ప్రతి దానికీ సమాజం చెలాయించే అధికారాన్ని కూడా వ్యక్తీ విలువరించగలగాలి. అప్పుడే సుఖ శాంతులు సాధ్యం అవుతాయనిపిస్తుంది.
ఆనాటి రాత్రి విజయ దగ్గర నుంచి చిట్టి ఆత్మహత్య చేసుకుంటుందేమోననే అనుమానంతో పరుగెత్తి పోయిన జగన్నాధానికి ఆ సందు చివర వెంకట్రామయ్య గారు తారట్లాడుతూ కనుపించారు. జగన్నాధం ఆశ్చర్యపోయి --
"ఏమిటిలా వచ్చారు?' అన్నాడు.
వెంకట్రామయ్య గారు ఆవేళప్పుడు జగన్నాధం అక్కడ కనుపిస్తాడని అనుకోకపోవడం వలన కాస్త కంగారుపడి --
"బాదమాకులు " అన్నాడు.
"బాదమాకులా?"
"అవును. రేపు విస్తళ్ళు కుట్టాలి కదూ" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయినారు.
అర్ధరాత్రి వేళ బాదమాకులు ఎందుకో! ఆ దిక్కుమాలిన బాదమాకులు ఈ మురకి సందులో ఎక్కడ దొరుకుతాయో ! ఆ మాత్రం గ్రహింప'లేని మూర్కుడు కాడు జగన్నాధం. చివరికి మిగిలేవి మానవతా మమతా మాత్రమె. జయించేది మానవుడే.
జగన్నాధం కళ్ళల్లో నీరు తిరిగింది. తుడుచుకొని గబగబా లోపలికి వెళ్ళాడు. చిట్టికి బాగా జ్వరం వచ్చింది. ఏమేమిటో కలవరిస్తున్నది. పకోడీల ముసల్ది ఆ పక్కనే వెన్ను వాల్చి నిశ్చింతగా గుర్రు పెడుతున్నది. శూన్యంగా వున్న ఆ దరిద్రపు కొంప లో కటిక నేల మీద జ్వరం తోనూ వేదనతోనూ పడున్న చిట్టి ని చూస్తుంటే అతని గుండె రాయాయి పోయింది.
ఆమె అంతర్యం దుఃఖం తో తూట్లు పడుతున్నది. ఆమె శరీరం జ్వర వేదనతో జర్ఝారీ భూత మవుతున్నది. అయినా ఆమెలో యింకా ఆత్మాభిమానం మిగిలే వుంది. ఆమె కన్నీరు ధారా వాహినిగా స్రవించి తలకింద అట్టగట్టింది. జుత్తు కూడా తడిచి పోయింది. ఊహించడానికి వీలులేని మహావేదన ఆమె ప్రత్యంగాన్నీ మంట మండించి వేస్తున్నది.
జగన్నాధం ఆమె తలను మెల్లగా ఒళ్లోకి తీసుకున్నాడు. ఈ ప్రపంచం అంతా మిధ్యగా కనుపించింది. అతనికి సాపేక్ష సిద్దాంతం ప్రకారం ఏ అనుభవపు వాస్తవికత తో కలిపి చూస్తేనే దాని అసలు రూపం అర్ధమవుతుంది. అసలు వాస్తవికత ఏదో ఇంతవరకూ మనుసుకు తెలియనే తెలియదు.
జగన్నాధం కళ్ళ నుంచి రాలిన కన్నీరు చిట్టి నుదుటి మీద పడింది. కాలుతున్న పెనం మీద పడిన నీటి బిందువుల్లా ఆవిరి అయిపోతుందేమో అనుకున్నాడు అతను. అలా కాలేదు. జగన్నాధం రచయిత.
రాజకీయ విధానాల దగ్గర నుంచీ అయోమయమై పోతున్న సంఘ పరిస్థితుల వరకూ దిద్ది , మానవ జాతిని ఉద్దరించాలనే ఆశయం కలవాడు . మొత్తం యీ లోకం మీదే అతనికి అసహ్యం కలిగింది యిప్పుడు. ఈ అసహాయ బాలికను అందరూ వదిలివేశారు. ప్రపంచం తల్ల క్రిండులైనా తను వదలడు. డానికి ప్రతిఫలం చాలా భయంకర మైనదే కావచ్చును . అయినా సరే.
ఆమె సర్వ భారాలు భుజాన వేసుకొని నిశ్చింతుడయినాడు. తెల్లవారినాక తన యింటికి చిట్టి తో సహా వచ్చిన జగన్నాధానికి పక్క భాగం ఖాళీగా ఉండటం చూచి మతి పోయింది. విజయకు చెప్పాలని రకరకాల సమాధానాలు ఆలోచించాడు తను. చిట్టిని ఆమె చేత క్షమింప చేయాలని కలలు కంటున్నాడు. కానీ ఆమె లేదు.
ఏమైందో కూడా తెలియలేదు. చాలా మందిని ఆ యిద్దరి విషయం అడిగాడు. ఎవరూ ఏమీ చెప్పలేదు. ఒక ముసలాయన మాత్రం -- "దిగులెందుకు నాయనా? పూలమ్మిన చోట కట్టే లమ్మాల్సి వచ్చిందనే దిగుల్తో ఇంకో వూరు పోయి వుంటారు" అన్నాడు.
అది నిజమేమో అనిపించింది జగన్నాధానికి. అయితే విజయ చేత చిట్టికి క్షమను ఇప్పించాలనే కోరిక మాత్రం అలాగే వుంది.
చిట్టికి జ్వరం తగ్గింది. ఎవరితోనూ అట్టే మాటాడదు. వంట చేసి జగన్నాధానికి పెట్టి తాను ఇంత తిని కిటికీ లోంచి ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటుంది. మురళీ పెండ్లి అయిపోయిన సంగతి జగన్నాధానికి తెలిసింది. కాని చిట్టి కి చెప్పలేదు. చిట్టి పోషణార్ధం జగన్నాధం కోమటి గుమాస్తా పని చేస్తున్నాడు. ఇప్పుడు వ్రాయడం మానివేశాడు అతను.

9
నానా ఎవరి కోసం తన మాతృదేశాన్ని వదులుకుని-- ఎండలు మండిపోయే విజయవాడ లో కాపురం పెట్టిందో అతను చాలా అందమైన వాడు. ఆమె తన కోసమే ఆ ఊళ్ళో ఉందని తెలుసు. అయినా సరే , ఆమెను సమీపించటానికి అతనికి భయం. క్షమించమని ఎంతో ప్రార్ధించాడు. కాని క్షమించదు.
మళ్ళీ అతను వెడితే మాట్లాడుతుంది. కబుర్లు చెప్పుతుంది. కాని దూరంగానే ఉన్నట్లుంటుంది. తనలో మానవత్వం ఉంది. అందుకే కొన్ని అబద్దాలు ఆడాడు. ప్రేమతో పాటు మిగతా ప్రపంచ వ్యవహారాలూ కావాలి తనకు. ప్రేమ తప్ప మరేమీ ఆలోచించదు ఆమె. అందుకోసమే వేదాంతి ని కూడా అయింది ఆమె. ఆమెకు వాంఛలు, తృష్ణ లు , మోహాలు అన్నీ కూడా ప్రేమలో లయించి పోతాయి. తనకట్లా కాదు. దేని కదే విడివిడిగా ఉంటుంది.
ఎప్పుడో జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చింది అతనికి. ఆమె బెంగుళూరు నుంచి వచ్చి, హోటల్లో దిగి, తనకోసం విజయవాడ కు ట్రంక్ కాల్ చేయ్యా లను కుంటున్నదట. సరిగ్గా ఆ రోజే విజయవాడ నుంచి వచ్చి తనూ అక్కడే దిగాడు. హల్లో ఇద్దరూ ఒకరి కొకరు ఎదురయ్యారు. తన వెంట ఒక పదిమంది పెద్ద మనుష్యు లు ఉన్నారు.
ఆమె అదేమీ ఆలోచించ లేదు. అమాంతంగా అతన్ని కౌగలించు కొని ఆవేశంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ 'నీకోసం విజయవాడ కు ట్రంక్ కాల్ చేద్దామను కుంటున్నాను" అన్నది.
చుట్టూ ఉన్నవాళ్ళు సహృదయు లవటం వలన తన అదృష్టానికి అభినందించారే గాని అసూయ పడలేదు. అంత ప్రేమ గల నానా ఇప్పుడు దూరంగా ఎలా ఉండ గలుగుతుంది. అన్నది సమస్య అతనికి. రోజూ మొత్తం మీద ఎప్పుడో అప్పుడు ఒకసారి చూస్తేనే చాలా ఆమెకు?
తనకు అలా చాలదు. ఆమె అంతా కావాలి. దగ్గరగా రావాలి. తన ధనం, కార్లు, స్త్రీ వ్యామోహం -- అన్నీ కూడా అర్ధరహితంగా అనిపిస్తున్నాయి అతనికి. వృత్తి ని బట్టి తనకు ఉచ్చులు వెయ్యాలనుకునే సినిమా తారలు, ధన్నాన్ని బట్టి దగ్గిరికి చేరాలని అభిలషించే అన్నుల మిన్నలు, అందాన్ని చూసి ఆరాట పడే అందాల భామలు -- వీటన్నిటినీ స్వంతం చేసుకోవాలని తాపత్రయ పడే భార్య.
ఇంతమంది స్త్రీల నూ అతను పొందుతూనే ఉన్నాడు. కాని ఎవరూ నానా లాగా తనను ప్రేమించ లేదు. నానా లాగా తనను బాధించ నూ లేదు. నానా వేదాంతి ని. ఊర్వశి. తనను శాసించే రాజరాజేశ్వరి. తనను లాలించి తోసేసే కఠోర మూర్తి. తనను ఆహ్వానించదు. వెడితే వద్దనదు. చిన్న తప్పునే క్షమించ లేని రాక్షసి. స్త్రీత్వపు కాఠిన్యం అంతా రూపు కట్టిన దుర్మార్గురాలు దయా విహీన.
కారు నడుపుతూ నానాను గురించి ఆలోచిస్తున్నాడు అతను. అతని పేరు బాలచంద్ర. చాలా అందగాడు. అతని కన్నులు, అతని నవ్వు, అతని నడక -- అన్నీ కూడా అపశ్రుతి లేని దివ్య గీతం లాటివి.
నానా ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్ళాడతను. సాయంత్రం పూట సూర్యుడి గులాబీ కాంతి, బాల్కనీ లో ముఖమల్ పరుపుల మీద ఒరిగి ఆలోచిస్తున్న నానా మీద పడి చుట్టూ పక్కలకు చిందుతున్నది. ఆమె ఇటూ అటూ కదిలి నప్పుడల్లా రంగు రంగుల నైలాన్ దుస్తులు అరోరా బొరియాలిస్ లా చల్లని సౌందర్యాన్ని చిమ్ముతున్నాయ్. ఆ మూర్తిని చూసి ముగ్ధుడ యిపోయినాడు బాలచంద్ర.
ఒక మోడాను ఆమె పాదాల దగ్గరగా లాక్కుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆమె కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నది. మరునాడు రిలీజు చెయ్యాల్సిన డబ్బింగ్ పిక్చర్ తాలుకూ డబ్బాలు ఇంతవరకూ రాకపోగా, కాపీలకు ముడి ఫిల్ము, డబ్బు, రెండూ లేవు గనుక రిలీజు డేట్ మార్చాలిసిందని మద్రాసు నుంచి అప్పుడే వచ్చిన ట్రంక్ కాల్ ను తిట్టుకుంటూ చిరాగ్గా ఉన్న బాలచంద్ర -=-
ఆ సంధ్యా స్వప్న విరహిణి నానా సమక్షం లో సర్వాన్నీ మరిచిపోయి మెదలకుండా కూర్చున్నాడు.
"ఎవరు?"
తనకు పరిచితమై ప్రాణమైన పరిమళాన్ని గుర్తు పట్టి నానా ప్రశ్నించింది కళ్ళు తెరవకుండానే!
"బాల........."
అతని సమాధానానికి కళ్ళు తెరిచింది ఆమె. సంధ్య కాంతి అతని మొగం మీద పడి చుట్టూ ఒక కాంతి పరివేషాన్ని కల్పించింది. అతని అందం ఎప్పటి కప్పుడే కొత్తగా ఉంటుంది ఆమెకు.
"ఏం అలా ఉన్నావు?"
"ఏవో గొడవలు. రేపు రిలీజ్ చెయ్యాల్సిన పిక్చర్ మానేయ్యాల్సి వచ్చింది."
"ఏం పిక్చరది?"
"ఏదో చెత్త."
"ఒక అమ్మాయి అబ్బాయిని కలలో చూసి ప్రేమించే బొమ్మ రాసి....సరేలే కొంచెం నవ్వు" అన్నది నానా. అతని నవ్వంటే ఆమెకు చాలా ఇష్టం. అతను నవ్వలేదు.
"పోనీ రాకపోతే నేం? ఈ చిరాకులూ, బాధ్యతలూ మనసు లోంచి తోసేస్తే గాని ఆనందానికి స్థానం లేదు."
"ఎంత పాపం చేసుకుంటేనో ఇలా జరగటం. నిన్ను పొందీ కూడా పొంద లేకుండా ఉన్నాను." అని సిగరెట్ ముట్టించాడు బాలచంద్ర.
"ఇవన్నీ వదిలి నాతొ ఉండిపో."
