సుశీల స్టౌ వెలిగించింది. కాఫీ కాస్తుండగా సుబ్బలక్ష్మి వంటగది గుమ్మంపైన కూర్చుని తన గురించి చెప్పడం మొదలెట్టింది. అదీ అంతు లేకుండా సాగిపోతుంది ఆమె వాగ్దోరణి. వింటూ కూర్చుంది సుశీల.
సుబ్బలక్ష్మి యిప్పుడు గృహిణి. వైవాహిక జీవితంలో గల సుఖాన్నీ, ఆనందాన్నీ అనుభవిస్తోంది. హోదా గల భర్త, అతని ఆదరణా, అనురాగమూ ఇవేగదా స్త్రీకి కావలసిన వరాలు. నిజంగా సుబ్బలక్ష్మి అన్నట్టు అనుకూలుడైన భర్త లభించడం ఒక గొప్ప అదృష్టమే మరి.
కాఫీనీళ్ళు పొంగడం చూచి హెచ్చరించింది సుబ్బలక్ష్మి. ఆలోచనల నుండి తేరుకుని కాఫీ తయారుచేసింది సుశీల. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు.
"నే చేసే కాఫీ ఒక్కరోజు కషాయంలా తయారైనా, ఆ విషయం చెపితే నే నెక్కడ బాధపడతానో అని 'కాఫీ చేస్తే నువ్వే చెయ్యాలి. అమృతం తాగినట్టుంటుంది' అంటా రాయన. ఆయనగారి అవస్థ చూస్తుంటే జాలీ, నవ్వు కలుగుతాయి. అంతెందుకూ-ఒక్కోసారి వంట తగలెట్టా ననుకో ఆయనేమంటారో తెలుసా 'ఇవాళ మనిద్దరం కలిసి హోటల్లో భోంచెయ్యాలని సరదాగా ఉందోయ్!' అని. నాకు తెలుసు ఆయన బాధంతా, ఏం చేస్తాను చెప్పు. చిన్నప్పట్నుంచీ మా అమ్మ నన్ను పొయ్యి దగ్గరకు రాని చ్చేది కాదేమో - మరి వంటలలా అఘోరించకేమవుతాయి. ఇదంతా పడలేక వారానికి రెండు మూడు సార్లు హోటల్లోనే భోంచేస్తాం" అన్నది సుబ్బలక్ష్మి.
మరికొంతసేపు ఆవిడ సంసారం గురించి మాటది, ఆతర్వాత సుశీల వాళ్ళ కుటుంబ విషయాలు అడిగింది.
"అన్నట్టు మీ శంకరమన్నయ్యకి బెజవాడలో ఉద్యోగం వొచ్చిందటగా. పోనీలే పాపం."
".... ...... ..... ......"
"ఏం ఉద్యోగాలో ఏమో? ఈ గుమాస్తా ఉద్యోగాలు మరీ దారుణం సుశీ! నేను చూస్తున్నాగా వాళ్ళ అవస్థ రేయింబవళ్ళూ చచ్చినట్టు పని చేయాలి. అప్పటికీ ఆఫీసరు ఫైరవుతూనే ఉంటాడు."
అన్నయ్యలాటి గుమాస్తా జాతిపై సుబ్బలక్ష్మికి గల సానుభూతి సుశీలకి ఒక విధంగా బాధ అనిపించింది. అనంయ్యకిది అవమానంగా గూడా భావించింది. అందుకే.
"కానీ ..... మా అన్నయ్య ఆఫీసు అలాంటిది కాదట. ఉత్తరం రాశాడు. అందరూ బి.ఏ లు చదువుకున్నవాళ్ళే నట. అయిదంటే అయిదన్నట్టు సాయంత్రం అయిదు గంటలకి అందరూ బయట కొచ్చేస్తారట. మిగిలినపని మళ్ళా రేపు చూచుకోటమే నట." అన్నది.
"అదేంకాదు లెద్దూ. నాకు తెలీదా ఏమిటీ ...... మావారి దగ్గరికి చాలామంది గుమాస్తాలు వచ్చి పాపం, వారి దయా దాక్షిణ్యాల కోసం కాచుక్కూర్చుంటారు. ఒక్కరోజు సెలవు కావలసి వచ్చినా మావారి దగ్గరికి రావలసిందే."
"అదేమో నాకు తెలీదు. అన్నట్టు మావాడు ఈమధ్య ఒక బ్రహ్మాండమైన నవల రాశాడు. ఆ నవలని ఒచ్చేవారం నుంచి వేస్తూన్నట్టు పత్రిక వాళ్ళు రాశారు. వాడికి కథలు రాయడంలో వొచ్చిన ఖ్యాతి చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందనుకో" అన్నది సుశీల.
"మావారు గూడా కథలు చదువుతూ ఉంటారు ఆఫీసు పనితో సతమతమైపోతారా? రిలీఫ్ కోసం కథలు చదువుతారు. అయినా ఇప్పుడొచ్చే కథలు ఏమంత బాగోడంలేదుట. అమ్మాయిలూ, అబ్బాయిలూ వాళ్ళ ప్రేమాను. కథలన్నీ యిలాగే ఉన్నాయిట."
"ప్రేమ కథలైతే మాత్రం- ఎంత చక్కగా ఉంటున్నాయి. చదువుతూన్నంతసేపూ హాయిగా ఉండటంలేదూ!"
"నువ్వెన్నయినా చెప్పు సుశీ! ఇప్పుడొచ్చే కథలు కేవలం కాలక్షేపం గురించే కాని దాని వల్ల నేర్చుకోవలసినదేమీ లేదుట."
"మీవారికి అలా అనిపిస్తే ఆ తప్పు కథకులిది కాదు. వాళ్ళు చాలా మంచి కథలు రాస్తున్నారు. మీవారి కాలక్షేపానికి పనికొచ్చే కథలైనా, రాయడానికి వాళ్ళెంత కృషి చేస్తున్నారో తెలుసా? ఒక మంచి కథ రాసేప్పుడు వాళ్ళు మనలో ఉండరసలు. ఏవో ఆలోచనలు. గాలిలో తేలిపోతుంటారు. ఎన్నో విషయాలు సేకరించి గాని కథ రాయరు. ఈ రోజుల్లో కథలెంత ప్రచారంలో ఉన్నాయో, వాటికెంత గౌరవముందో మీవారికి తెలీదేమో గాని పత్రికలు చదివేవారిని అడుగుచెప్తారు. మా అన్నయ్య పేరు చెపితే ఓహో అంటారు" అన్నది సుశీల.
"అబ్బ. ఎంత లెక్చరిచ్చావే? మీ అన్నయ్యంటే నీకెంత అభిమానమూ?" అని గలగలా నవ్వేసింది సుబ్బలక్ష్మి.
సుశీల సిగ్గుపడింది.
మరి కాసేపు ఏవో విషయాలు మాటాడి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి.
సుశీలకి వాళ్ళ చిన్నన్నయ్యమీద బెంగ పట్టుకుంది. చిన్నన్నయ్య సుబ్బలక్ష్మి భర్తలాగానే చదువుకున్నాడు. ఆయన అదృష్టం బావుండి హోదాలో ఉన్నాడు. వాడి దురదృష్టం కొద్దీ గుమాస్తా అయ్యాడు. కానీ-ఖ్యాతి ఎవరిది?
పెద్దన్నయ్య దొరబాబు. వాడిలాటి జాతక పురుషుడు మరొహడు ఉండడు. పోతే యీ చిన్నన్నయ్య. అయినా వాడికేం తక్కువని. గౌరవం, కీర్తి ముందు ఈ హోదాలేం పని చేస్తాయి అసలు. తన పని తాను సక్రమంగా చేసుకుంటే యివాళ కాకపోయినా రేపైనా వాడు హోదాలోకి రాగలడు.
చిన్నన్నయ్య భవిష్యత్తు గురించి కలలు కంటూన్న సుశీల తండ్రి రాక గమనించలేదు. ఆయన పలుకరించిన మీదట గాని యీ లోకంలోకి రాలేదు..
"ఏమిటమ్మా అదోలా ఉన్నావ్."
"అబ్బే.....ఏం లేదే?"
ఆయన ఏమీ మాటాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు. కూతురు ఆయన్ని అనుసరించింది.
"సుబ్బలక్ష్మి వచ్చి వెళ్ళింది నాన్నా!"
"అలాగా" అన్నారాయన.
సుశీల తండ్రికి మందు కలపడానికి వెళ్ళిపోయింది.
జానకిరామయ్య ఆ రాత్రి నిద్రపోయే ముందు సుబ్బలక్ష్మి సుశీలతో దేని గురించి మాటాడి ఉంటుందో ఊహించుకోడం మొదలు పెట్టారు. ఈమధ్య ఆయనకి నిద్రపట్టడం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది.
* * *
"ఇలాంటి మనుషుల్లో కుళ్ళూ కుచ్చితం ఓమూల మెదుల్తూనే ఉంటుంది. ఒకడు బాగుపడి పోతున్నాడని తెలిసి గొప్ప బాధపడిపోతారు. ఈ శాస్త్రిగాడూ వాడి వెనకాల ఉన్న జనాభా-వీళ్ళందరికీ మనమంటే కడుపుమంట రోజు రోజుకీ పెరిగిపోతుంది. శంకరం నవల వేస్తున్నా రని తెలిసిం దగ్గర్నుంచీ మరీను. మనం "పోటుగాళ్ళంట" అని వాళ్ళన్నారు. అది నిరూపించే బాధ్యత మనది. ఇదిగో గురూ! ఏది ఏమైనా, ఇదివరకున్న ఆఫీసు వాతావరణాన్ని పూర్తిగా మార్చేంతవరకూ మనం నిద్రపోగూడ దంతే" అన్నాడు ఉద్రేకంగా ప్రసాదం.
"ఒక్క ఆడపిల్ల మగాడితో మాటాడిందీ అంటే చాలు వాళ్ళ నెత్తిని యింత 'కథ' రుద్దడం నేర్చుకున్నారు వెధవలు. మొదట్లో శంకరం కుసుమకి కొంత డబ్బిచ్చాట్ట. దాంతో ఛడామడా వాగేస్తూన్నారు. ఆ మాటాడేదో ఎదట పడి మాటాడటానికి దమ్ములుండవు మళ్ళీ. మగవాళ్ళం కాబట్టి మనకేమీ అనిపించకపోవచ్చు. పాపం, ఆవిడ ఆ ములుకుల్లాటి మాటల్తో ఎంత బాధ పడిపోతుందో గదా!" అన్నాడు ప్రసాదం దిగులుగా.
గోడవారగా చేరగిలబడి ప్రసాదం చెప్పేది వింటున్నాడు శంకరం. వాసు ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. హోల్డాలు పైన సిగరెట్టు కాల్చుకుంటూ కూర్చున్న పతి అడిగాడు.
"అయితే ఇప్పుడేం చేద్దామంటావ్."
"బుద్ది చెప్పా లంటాను. మళ్ళా ఆ కారు కూతలు కూయకుండా నోళ్ళు మూద్దామంటాను" అన్నాడు ప్రసాదం.
"వాళ్ళంతా ఫూల్స్ ముళ్ళకంప" అన్నాడు పతి.
"అలా అని ఉపేక్షించి కూర్చుంటే నెత్తి కెక్కరూ?" అన్నాడు ప్రసాదం.
"దేనికైనా సహనం కావాలి. అవకాశ మొచ్చి నప్పుడు నొక్కిపారేస్తే తిక్క వదుల్తుంది గాని తొందరపాటు పనికిరాదు." అన్నాడు పతి.
ప్రసాదం జవాబు చెప్పలేదు.
"ఈ విషయాల నింతగా పట్టించుకోడం నా కిష్టంలేదు. వాళ్ళ మానాన్న వాళ్ళని వాగనివ్వండి. వాగి వాగి వాళ్ళ నోళ్లే నొప్పెడతాయి" అన్నాడు శంకరం.
"వింటూన్న మనకి చీమ కుట్టినట్టయినా ఉండదంటావ్. ఏం పెద్ధమనిషివయ్యా! పైగా కథలూ రాస్తావ్ మహ" అన్నాడు ప్రసాదం.
శంకరం నవ్వి ఊరుకున్నాడు.
ఆ తర్వాత ఆఫీసు విషయాలు కొన్ని మాటాడి వస్తానంటూ లేచి నిలబడ్డాడు ప్రసాదం.
"తొందరగా వచ్చేయ్. ఏదైనా సినిమాకి వెడదాం" అన్నాడు పతి.
ప్రసాదం వెళ్ళిపోయాడు.
* * *
8
అతను వరండా ఎక్కగానే మృణాళిని గదినుండి ఎవరిదో మగ గొంతు వినిపిస్తోంది. ఆ గొంతు లోగడ విన్నట్టు జ్ఞాపకం.
ప్రసాదం మృణాళిని గది దగ్గరిగా వెళ్ళి బయటే నిలబడి వాళ్ళమాటలు వింటూన్నాడు.
"నటుడై రాణించాలంటే అతను కృషి చేయాలి. నాటక రంగానికి పూర్తిగా అంకితమై పోవాలి."
ఈ మాట వినగానే ప్రసాదం పళ్ళు పట పట కొరికాడు. గుప్పిట బిగించాడు. అతనికోసం మిన్నంటుకుంది. వెంటనే గదిలోకి పరుగెత్తి శాస్త్రి గాడి పీక పిసికేద్దా మనుకున్నాడు. కాని - ఇంకా ఏమి సెలవిస్తాడో విందామని ఆగిపోయేడు.
"కాబట్టి నటించడం గూడా ఒకానొక జీవిత మన్నమాట. ఆ జీవితాన్ని అనుభవిస్తూ, ప్రేక్షకుల్ని భ్రమింపజేయడం తమాషా కాదు. దాని కెంతో చాతుర్యం కావాలి. ఉదాహరణకి నే నున్నాను. నా పేరు శాస్త్రి. ఏదో ఉద్యోగం చేసుకుంటో, ఖర్చు పెడుతూ కులాసాగా గడుపుతున్నావా? ఇది నిజజీవితం. ఇప్పుడు ఈ శాస్త్రి అనబడేవాడు స్టేజి ఎక్కి నీ దొంగ గానో, ఏ ఖూనీకోరు గానో నటించాలీ అంటే, వాడు తనని తను మరిచిపోవాలి. అప్పుడు వాడు శాస్త్రికాడు, గుమాస్తా కాడు, కులాసాగా తిరిగే విలాస పురుషుడూ కాడు. నెంబర్ వన్ కేడి. మర్డరర్. ఆ భీభత్సాన్నీ, క్రూరత్త్వాన్నీ వాడి ముఖంలో, వాడి ప్రతి కదలికలో చూపించి ప్రేక్షకులచేత భేష్ అనిపించుకుంటేనే నటుడు. ఏ క్లాసు నటుడు." ఇక్కడ కాసేపు శాస్త్రి మాటలు ఆగాయి. బయట నిలబడ్డ ప్రసాదం 'గొప్పగా కోసేస్తున్నాడు' అనుకున్నాడు. అసలు వీడికీ, మృణాళినికీ ఏమిటి సంబంధం? అని కూడా అనుకున్నాడు.
శాస్త్రి మళ్ళా మొదలెట్టాడు.
"రేపు మేము ప్రదర్శించ బోయేది ఒకానొక సమఘిక నాటకం. మంచి థీమూ, డైలాగులూ ఉన్న నాటకరాజం. మెయిన్ రోల్ నాది. 'కళా వూర్లోదయం' అనే కావ్యం పేరు మీరు వినే ఉంటారు. దాన్ని పింగళి సూరన్నా, షేక్ స్పియరూ ఇద్దరూ ఇటు తెలుగులోనూ, అటు ఇంగ్లీషులోనూ ఒకేసారి రాసినట్టు ఆధారా లున్నాయని చాలా మంది అంటున్నారనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు అ ఆకథని ఆధారంగా చేసుకుని, నేటి సాంఘిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మార్చి రాశారు మా నాటకాన్ని. కాబట్టి ఈ నాటకం ఎంత గొప్పదో మీరీపాటికి అర్ధం చేసుకునే ఉంటారు. దాంతోపాటు మా ప్రదర్శన విలువనీ తెలుసుకునే ఉంటారు. ఇంతకీ నే చెప్పొచ్చే దేమిటంటే-ఇది బెనిఫిట్ షో కాబట్టీ - ఒక నిరుపేద గుమాస్తా సహాయార్ధం ప్ర్దధర్శిస్తున్నది. కాబట్టి మీరు తప్పకుండా ఒక టిక్కట్టు కొనాలి. ఆ రోజు మా ప్రదర్శన చూచి తీరాలి. టిక్కట్టు మా చెల్లాయితో పంపుతాను" అన్నాడు శాస్త్రి.
"అలాగేనండి" అన్నది మృణాళిని.
"చాలా థాంక్స్ మీలాటి అభిమానులు లేక పోతే ఈ నాటక సంస్థ లేప్పుడో మూసేయబడేవి. షేక్ స్పియర్ ఏవన్నాడూ, ఎవడు రస హృదయుడూ, కళాభిమానీ కాదో వాడు వట్టి దద్దమ్మ అని చెప్పాడు. మనకి కళలు చాలా ఉన్నాయి. ఆదరించే వారు మాత్రం బహు కొద్దిమంది. ఇది కళా ప్రపంచానికే తీరని అవమానం దుగ్ధ. మార్పు రావాలి. ప్రజానీకంలో ప్రతివాడూ కళా కారుడై రాణించాలి. ఆ రోజెంత త్వరగా వస్తే అంత మంచిది. అప్పటిగ్గాని మా సంఘ ఆశయం, మా సంస్థ ఆదర్శం ఫలవంతంగావు. మీ కాలాన్ని చాలా పాడుచేశాను కాబోలు. వస్తాను మరి. సెలవు అన్నట్లు టిక్కట్లు మా చెల్లాయితో పంపుతాను" అని చెప్పి గదినుంచి బయట కొచ్చేడు శాస్త్రి. బయట ప్రసాదాన్ని చూచి గతుక్కుమన్నాడు.
"నమస్కారం శాస్త్రిగారూ! ఇది మావయ్య గారిల్లే. ఏ!ఁ.......ఇలా దారి తప్పి వచ్చారూ?" అని నిలబెట్టి అడిగాడు ప్రసాదం.
"ఏం లేదండీ.....మా నాటక మొహటి....."
"అన్నట్టు మీ నాటకాలు ఇంతకుమునుపు నేనేం చూడలేదు సుమాండి ....... అయినా చూశారూ..... వెధవది నాటకాలంటే నా కసలు సదభిప్రాయం లేదండీ. అందరి సంగతి ఏమోగాని ఇప్పుడు నాటకాలు వేస్తున్న వాళ్ళల్లో చాలా మంది 'వెధవ' నాటకాలు వేస్తున్న వాళ్ళల్లో చాలా మంది 'వెధవ' లని ఈ మామిత్రుడు అంటారు లెండి. వాడెందుకు మా మాటన్నాడంటే, ఇప్పటి కొన్ని సమాజాల్లో రగులుకున్న 'అవినీతి' ఉంది చూశారూ......"
"సారి......మా సమాజం"
"మీ సమాజం గురించి కాదులేండి. మాటాడుతూంట. పాపం, మీ కవతల బోల్డు పనులున్నా యేమో.....వెళ్ళి రండి మరి."
శాస్త్రి మెట్లు దిగి వెళ్ళబోతూండగా మళ్ళా పిలిచాడు ప్రసాదం.
"అన్నట్టు మీకు సినిమాల్లో వేషా లేయాలనే సంకల్పం?"
"ఏదో లేండి. అవకాశం రావద్దూ!" అన్నాడు శాస్త్రి సిగ్గుపడుతూ.
"అదేం మాట గురువుగారూ! టాలంట్ ఉండాలే గాని మీలాటి వాళ్ళకి అదెంత పని చెప్పండి. నాకో ఫ్రెండ్ ఉండేవాడు. వాడు అచ్చం మీలాగే నాటకాలంటే ప్రాణం పెట్టేవాడు. పరిషత్తులూ, వగైరాలంటూ గొప్ప హడావిడి చేసేవాడు. చివరి కేమైందంటే-జస్టెమినిట్-ఈ మాట వినిపోదురుగాని ఉండండి. ఆ చివరి కేమైందంటే, వాడు మదరాసు వెళ్ళి, ప్రయత్నంచేసి సినిమాల్లో చోటు చేసుకున్న మాట నిజమే గానీండి అప్పట్నుంచీ ఇప్పటి వరకూను వాడికి దొరికేవన్నీ ఎందుకూ పనికిరాని చిన్న వేషాలే పాపం! ఒక సినిమాలో ముని బాలకుడు, మరొక సినిమాలో జేబులు కొట్టేవాడు-ఇలా తగులడింది. వాడి నట జీవితం. ఇంతా ఎందుకు చెప్తున్నానంటే-"
"సారీ......నా కవతల........."
"అవును పాపం. వెళ్ళిరండి. శ్రమనుకోకుండా ఇంతదూరమూ వచ్చి చక్కటి విషయాలెన్నో చెప్పి నందుకు సంతోషం శాస్త్రిగారూ!"
శాస్త్రి వెళ్ళిపోయేడు.
ప్రసాదం పళ్ళు నూరాడు.
"వెధవ్వేషా లేస్తాడూ నా దగ్గిరే. సినిమాలో చేరుతుందిట మొహం" అని విసుక్కున్నాడు.
అతను విసుగ్గా తన గదిలోకి వెళ్ళేడు. పుస్తకం ఒకటి చేత్తో పట్టుకుని చెడామడా చదివేయడం మొదలెట్టాడు. అలా అరగంట ఊరికే పేజీలు తిప్పేశాడు. దానికి తగ్గట్టు తన ఉనికిని ఆ ఇంటి వాళ్ళెవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. దాంతో మరింత వళ్ళు మండిపోయింది.
మంచంమీద వాలిపోయి మెడ వరకూ దుప్పటి కప్పుకుని గట్టిగా నిట్టూర్చాడు ప్రసాదం.
మృణాళిని ఆవేళకి వచ్చింది.
"అమ్మ నిన్ను భోజనానికి పిలుస్తోంది బావా!"
"............................"
"ఓబావా! నీకే చెప్తూంట. భోజనానికి లేవయ్యా"
