Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 15

 

                                    11

          

    సుభద్రమ్మ పెట్టిన జరీ అంచు చీర చూచి, మురిసిపోయింది పార్వతమ్మ. అందులో తనమీద ఉండే ప్రేమ పడుగూ పేకా అయి, జరీ మలామాల్లో చివురించుకుందన్నట్లే అయ్యింది. దీనికితోడు ఎంతగా వర్గవిభేదాలు, శాఖాభేదాలు ఉన్నా, 'మా అక్కయ్య' అంటూ పరిచయాలు. ఆ అగ్రస్థానంఇవ్వడం, మంచి గంధం మండు వేసవిలో పూసుకున్నట్లు ఉంది. ఆ పెండ్లి హడావుడుల్లో తనే ఎక్కువ గౌరవం పొందిందేమో అనుకుంది కూడా.
    ఇంతకూ సుభద్రమ్మ అంత నోరుకలది లేదని తనకు తెలిసిఉన్నా, అంత భేదం వయస్సులో ఉట్టి పడుతున్నా, తన తమ్ముడికి పెండ్లి చెయ్యడం, అది ఒప్పుకోవడం, ఒప్పుకొని నడుం కట్టడంలో ఆంతర్యం అర్ధం కావటం లేదు. పైగా తను వింది -ఆపిల్ల ఇప్పుడయిన భర్త కొడుక్కోసం నిర్ణయించుకున్నట్లు, అది కాస్తా తుడిచివేసెయ్యడం, కుర్రాడు పరారీ అవడం. ఇవన్నీ ముజ్జిడ్డు వ్యవహారాలు.
    అడుగుదామనుకుంది. చాలా ప్రయత్నించింది. కాని ఆయా సమయాల్లో నోరు పెగిలిరాలేదు. మాటలున్నూ కరువయ్యేయి. ఎక్కడో తనకు తెలియని అవ్యక్తంలో సుభద్రమ్మ చెప్పకుండా ఉంటుందా అన్న ధైర్యం. దానికి తగినంత ప్రాతిపదికగా దిట్టత ఊగులాడేయి. ఇవన్నీ తనకెందుకన్న మంచితనం ఊయల.
    పెండ్లిలో లక్ష్మిని చూచింది.మాట్లాడింది కూడాను. దానితోపాటు సీతారామయ్య బిరిలోకి రాకపోలేదు. కాని ఆ దాంపత్యమే విచిత్రంగా కనపడింది. ఎవరికి ఎవరు భర్త అన్నవతుగా పోలిక తడితే నవ్వు వచ్చేది, తన బోళాతనానికి.
    ఆడపడుచు లాంఛనాలప్పుడు కాబోలు, సుభద్రమ్మకు పెద్ద చెక్కపేడుతో ముఖం కడుగుతూనే "వదినా, బంగారపు పుల్ల మాత్రం కాదు సుమీ!" అంది.
    సుభద్రమ్మ గుర్రుమంటూనే "ఆపనే చేస్తా వులే" అంది.
    "నీ ఆశీర్వచనం. అల్లాగే ఎందుకు కాకూడదు?"
    "మొత్తంమీదబూర్ల బుట్టలోనే పడ్డావుకా!"
    చురుక్కుమమన్నా నవ్వేసింది లక్ష్మి. రామచంద్రయ్య కొరకొరా ఓసారి అక్కయ్యవైపు చూచినా, అదేం లెక్కపెట్టలేదు సుభద్రమ్మ.
    పట్టు కాశీచీర, నూటపదహార్లు పెట్టింది-'అత్తగారివైనా, ఆడపడుచువైనా నువ్వేకా' అన్న చూపులతో.
    ఏదో విచిత్రంగా తట్టింది.
    తనకు జాగ్రత్త చెయ్యి అని ఇచ్చినప్పుడే "ముండ, ఇనప్పెట్టి తాళాలు మొలను దోపుకుంది అప్పుడే" అనేసింది చురుగ్గా. అప్పుడు మాట్లాడలేదు. ఆ రాత్రి మాత్రం ఆయనతో అంది. తను అడగలేని ప్రశ్న వెనక నించునే ఉంది ఆఖరున.
    "ఊరంతా కోడై కూస్తే, నీకు వినబడలేదూ?" అన్నాడు.
    "ఏమిటండీ?"
    "డబ్బుకోసం కూతుర్ని ముడెట్టింది."
    అప్పుడు అర్ధం అయ్యింది, తళుకుమన్నట్లు. ఒక్కసారి తనెంత సిగ్గుపడిందో అప్పుడు అనుకున్నా, రుక్మిణిలో ఒక్క భావం కాని, నవ్వుకాని, ఉత్సాహం కాని లేదు. మరబొమ్మే. ఇది బాధ పెట్టింది. కడుపు దేవినట్లే అయ్యింది. అందులో ఏం సుఖపడుతుందన్న ఛాయ కారు మేఘం లాగనే ఉంది. రుక్మిణి ముఖంలోకి చాలాసార్లు చూసింది. కళ్ళు ప్రతిఫలించని శూన్యం కన్పడేది. తనమీద తను ఆంక్ష పెట్టుకుని నిబంధనాలు విధించుకున్న శాంత జ్ఞాపకం వచ్చేది రుక్మిణిని చూసినప్పుడల్లా ఏదో ఎక్కడో వీళ్లిద్దరూ తనకు దగ్గరగా వచ్చిన సంభూతి. పైగా ఆనాడు.......
    ఏమీ తోచకే తోటలోకి వెళ్ళింది. ఎంత శ్రద్దగా పెంచినారన్న ఆనందంలోనే పరకాయించింది. తన యింటి పెరట్లో వెయ్యాలన్నంత ఆయత్తతా కలిగింది. నీలి గోరింటలు, మందారం, నందివర్ధనం, శంఖు పూలు, పారిజాతాలు, కాశీరత్నం పువ్వులు, కాగితంపూలు, ఇంకా ఎన్నో. 'అమ్మ'కు ఇవన్నీ పెట్టి పూజ చేస్తే ఎంత బావుంటుంది! ఉబలాట పడింది.
    ఠక్కునే ఆగిపోయింది.
    "ఇంత అన్యాయం చెయ్యడం కన్న, ఆరోజు పీకి పిసికేసి చంపెయ్యలేకపోయినావా?" రుక్మిణి.
    "చావు బ్రతుకులు మన చేతులో లేవుకా? అయినా ఈ ఇల్లు నీదే. అమ్మ ఓవిధంగా అనుకుంది. దానికి వ్యతిరేకం నాన్నగారు చేసేరు."
    కుతూహలం చంపుకోలేక, జాజిపందిరి చాటు నుండి తొంగి చూచింది. మూడు వంతులు అడ్డు వచ్చిన రూపం మాత్రమే చూసింది. 'ఇతనా ఆ రాజు!? రామచంద్రయ్య కొడుకు. పరారీ అయ్యేడన్నవాడు.
    "దానికి నువ్వు సంతోషిస్తున్నావన్నమాట!"
    "సంతోషం, దుఃఖం కూడా పోలికల్లో తారతమ్యాలు."
    "ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు? ఈ మొఖాన్ని చూచి నవ్వడానికా?"
    "కాదు. నమస్కరించడానికి." ఆతను వంగే పెట్టేడు. "ఈ స్థితిలో మళ్ళీ పెట్టగలనో లేనో. కాని ఒక్కటి గుర్తుకు ఉంచుకో. ఈ డబ్బు, ఆస్తికూడా నీవి. నీ సౌఖ్యాలకోసం, కనీసం ఆయనకు ఇవ్వతగ్గ ఆనందంకోసం, వీటిని ఉపయోగించుకో. నేనేమీ అడగను. పైగా వాట్లవల్ల నాకు ఏం ప్రయోజనం లేదు."
    "సన్యాసం పుచ్చుకుంటావా, బావా?"
    "చెప్పలేను. అయినా నా భార్యని నేను చూచేను, రుక్మిణీ!"
    "ఆ! చదువుకున్నదేనా? నాకన్న అందంగా వుంటుందా?"
    "అవునూ, కాదూ అనాలి."
    "ఏమిటి మాట్లాడుతున్నావ్, బావా?"
    "ఓ సృష్టి రహస్యం."
    "అంటే?"
    "ఎల్లా చెప్పగలను, రుక్మిణీ?"
    "నేనేం చేసేనని నన్ను ఇల్లా చిత్రవధ చేస్తావు?"
    అతను మాట్లాడలేదు.
    "వచ్చీ రావడంతోటే అమ్మ నన్ను దులిపేసింది. నేను, నా బ్రతుకుకూడా ఆవిడ కళ్ళల్లో....." ముఖం చేతుల్లో కప్పుకునే ఏడ్చింది.
    "ఆఖరుకు శరీరాన్నైనా అప్పచెప్పి నన్ను జయించలేదనే కదూ? ఆవిడ తత్వమే అది. దానికి నువ్వు బాధ పడవలసింది లేదు."
    "నా విలువ అంత వుంది. అదీ నేను సంపాదించుకున్న ఉన్నతి. నా శరీరం నాకిచ్చిన వ్యక్తిత్వం. అయినా, బావా...." ఆగింది.
    "నాలో నీమీద ఏభావం ఏర్పడిందో నాకే తెలియదు. అది శరీరపు కోర్కెకాదు. నేను నిన్ను చూస్తుంటే ఉద్రిక్తపడను. కాని ఓవిధంగా ఆపేక్ష కలుగుతుంది."
    "అంతేనా?"
    "అవును, రుక్మిణీ."
    "ఎందుకు పారిపోయేవ్ నువ్వు?"
    "ఇప్పుడు జవాబు చెప్పలేను. కాని ఓనాడు మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాగలనేమో! అప్పుడు పట్టెడు అన్నం పెడుతావా?"
    "అయితే నీ కళ్ళల్లో నాకున్న విలువ అంతే నన్నమాట!"    
    "మరి సెలవు."
    అతను పరుగెత్తుతున్నట్లే వెళ్ళిపోయేడు. మెరుపుకొట్టిన మనిషిలా నిశ్చేష్ట అయి నిలబడితేనే, తను వెళ్ళింది. కళ్ళమ్మట నీళ్ళు కారుతున్నాయి. ఏడుస్తూంది రుక్మిణి. చూసీ చూడ్డంతోనే, బావురుమన్నట్లే, "ఇదీ నా చరిత్ర, అత్తయ్యా!" అంటూనే ఒళ్ళో ఒదిగింది. తనకే దుఃఖం కమ్ముకుంది. స్త్రీల జీవితాలే ఇంత క్రూరంగా ఉంటాయి. భరించుకోవడమే జన్మహక్కు అయినా, ఎంత కాలం అన్నట్లు కోపం వణికింది.
    పసుపు వాసన తడారని తాళిబొందు. నల్ల పూసలున్నూ.
    "నేనెందుకు బ్రతకాలో నా కర్ధం కావటం లేదు, అత్తయ్యా."
    "పిచ్చితల్లీ!" అంటూ తను వీపు నిమిరింది. మృత్యువు అన్నది శాంతినిస్తూందన్న, కష్టాల్లో కలిగే భావనకు అర్ధం ఉందా? మృత్యువేమిటి? ఇవ్వడం ఏమిటి? ఇవే పెడగా నించున్నా, తనుమాత్రం ఎప్పుడూ, ఏ విషయంలోనూ భీరువైపోలేదు. నిలబడింది. "అంత నిరాశ ఎందుకూ?"
    "రాత్రి..."
    గ్రహించేసింది. "ఆయన నీ భర్త. అతన్ని సుఖపెట్టడమే కర్తవ్యం."
    "భరించుకోలేనంత కుమిలింపు. అసహ్యం పుడుతోంది."
    "ఇప్పట్లో అదో ఉప్పెన. క్రమేణా అలవాటై దృష్టి మారుతుంది."
    "మీరు కూడా...."
    నవ్వింది. నెమ్మదిగా నడిపిస్తూనే లోపలికి తీసుకువెళ్ళింది. వంటింటి మెట్లు ఎక్కేసరికే-
    "ఎక్కడికి తగులడ్డావే, ఆయనకు కాఫీ, ఫలహారాలు తీసికెళ్ళకుండా?" లక్ష్మి.
    'ఫో. నీ లెక్కేమిటి!' అన్నట్లే చూచి లోపలికి నడిచింది రుక్మిణి. డిల్లపోయి గోడ కానుకుంది లక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS