Previous Page Next Page 
ఆరాధన పేజి 16


    అంతలో-
    అయ్యా డాక్టర్ గారూ - ఎవరో ధన ధనమని తలుపు బాదారు."
    ఒక్కసారి కుమార్ కు మెలకువ వచ్చింది. మంజు లేచి కూచుంది ఆదరాబాధరా లేచి తలుపు తీశాడు. లాంతరు వెలుతుర్లో - నిద్ర ముఖంలో ఆ వచ్చిన వ్యక్తుల్ని వెంటనే గుర్తించలేక పోయాడు.
    "ప్రెసిడెంటుగారు - ఎక్కడికో ఎల్లొచ్చి ఇంట్లోకి రాగానే పడిపోయారండి" కుమార్ ఏం మాట్లాడలేదు. వెనుదిరిగాడు. ఒక్కసారి మత్తు వదిలింది. "డాక్టర్ గారూ - రావాలి - ప్రాణాపాయంలో ఉన్నారు" ఆ కంఠాన్ని గుర్తించగల్గాడు, అది రెడ్డిగారిది.
    ఇతను వస్తాడా; అపకారం చేస్తానని ముఖాన ఆనకపోయినా తెలిసి పోయింది. ఆ కంపౌండర్ఎదుటనే ఏమేమో అన్నాడు. అవన్నీ తప్పకుండా డాక్టర్ కు తెలిసే వుంటాయి. పీడ విరగడయిందని నిర్లక్ష్యం చేస్తాడేమో! రెడ్డిగారు ఆలోచిస్తూ నుంచున్నారు.
    "మంజు కావలసిన ఇంజెక్షన్ వయల్స్ పంపు" అంటూ షర్టు బటన్స్ పెట్టుకుంటూ వచ్చాడు.
    "పెట్టి తీసుకో" అన్నాడు. నౌకరు కిట్ తీసి కొన్నాడు, డాక్టరు రాక రెడ్డిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎంతగా బ్రతిమాలాలో ఏ విధంగా ఆశ జూ పాలో ఎన్నో ఆలోచించుకుంటూ వచ్చాడు. కాని డాక్టర్ ఏ ఒత్తిడి లేకుండానే వస్తున్నాడు. డాక్టరు పై ఓ విధమైన పూజ్య భావం ఏర్పడిందాతనికి.
    ఇద్దరు గబగబ ముందు నడుస్తున్నారు. నౌకరు గేటు దాటగానే కుమార్ అన్నాడు- ఆ పెట్టి నాకిచ్చే సెయ్, నేను వచ్చేవరకు ఇంటిదగ్గర అమ్మగార్కి తోడుగా వుండు-వెళ్ళు.
    రెడ్డి లాంతరు అందుకోక తప్పిందికాదు. అతనికి కాస్త చిన్నతనం అనిపించక పోలేదు. కానీ తప్పదు ..... తను ఓ జీతగాడికి దారిజూదటమా..... పోనీ - అనుకున్నాడు. కుమార్ మౌనంగా పెద్దపెద్ద అంగలేసు కుంటూ వెళ్తూ న్నాడు. అతనితో సమంగా రెడ్డి నడువలేక  - పోతున్నాడు -'    
    మీకు పాపం - చాలా కష్టంగా వుందేమో - యాభై సంవత్సరాలు గడిచాక యిలాంటి ప్రమాదాలు వస్తే చాలా అపాయం మనం త్వరగా వెళ్ళాలి, ప్రతీ క్షణం విలువైనదే. అతడు వగరుస్తూ ఫరవాలేదు అన్నాడు.
    రెండు ఫర్లాంగులు నడిచాక ఇల్లు చేరారు. అది పాతకాలపు మిద్దె. ముందు భాగంలో పెద్ద అరుగులున్నాయి. వాటిమీద అప్పుడే నలుగురైదుగురుచేరి ఏదో గుసగుసలాడుకుంటున్నారు.     
    వచ్చిన వార్ని చూచి మౌనం దాల్చారు.
    రెడ్డి ముందుగా లోపలికి వెళ్ళాడు. అతని వెనకాతలే డాక్టరు మెట్లెక్కుతున్నాడు. ఎవరో వచ్చి కిట్ అందుకున్నారు.
    రెడ్డితో "మా యింటికి ఎవర్నైనా పంపండి. డాక్టర్ గారు మందులు పంపిస్తారు," అని లోపలి కెళ్ళాడు కుమార్.
    చెట్టంత మనిషి-ఎంతో హుందాగా, నిండుగా ఉన్నమనిషి చలనం లేకుండా నేలమీద పడి ఉన్నాడు. తలక్రింద తలగడ్డమాత్రం ఉంది. స్త్రీలు, పురుషులు చుట్టూచేరి ఉన్నారు. కొందరు ఆడాళ్ళు శోకాలు తీస్తున్నారు. కుమార్ ను చూచి అందరూ తప్పుకున్నారు.
    మోకాళ్ళమీద వంగి నాడి పరీక్షించాడు - ఎక్కడా ఉన్నట్టులేదు. స్టెతస్కోప్ తో గుండె వినబోయాడు 'ఇక నేను కొట్టుకోలేను" అన్నట్లుగా అది విశ్రాంతి తీసుకొంటోంది? అరికాళ్ళు చేతులు చల్లబడ్డాయి.
    దగ్గర నే నుంచుని గమనిస్తున్న కొడుకు చెప్పాడు-ఎక్కడికో వెళ్ళి వచ్చి చాలా కోపంతో - ఇంట్లోకి వస్తూనే పడిపోయినట్లు ఒక్కసారి గుండెను అదుముకుంటూ పడినట్లు చెప్పాడు.
    "గుండె కొట్టుకుంటోందా-అప్పుడు?"
    "చెవిపెట్టి విన్నానండీ - ఎక్కడో అగాధం'లోంచి వినబడినట్లుంది" కుమార్ అతని ముఖాన్ని ప్రక్కకు తిప్పి నోటికినోరు పెట్టి ఊపిరి పోశాడు. గుండె ఉన్న స్థానంలో ప్రక్క టెముకల మీద మృదువు గా నొక్కి వదులుతున్నాడు. ఒత్తిడిని, విశ్రాంతిని - గుండె అందుకుంటే ఇక వరుసగా లబ్-డబ్ అంటూ కొట్టుకోగలదు కుమార్ చెప్పగా ఎవరో ఒకతను అతని పాదాలు వేడిగా వుంచటానికి ప్రయత్నిస్తున్నాడు.
    పావుగంట దాటింది. కృత్రిమ శ్వాస- క్రమ బద్ధమైన నిజమైన శ్వాస కాలేకపోయింది. ఇక ఆపుజేయాలి, ఇది శవం- దీనిలో ప్రాణం పోయటం మానవుని శక్తికి మించిన పని.
    కుమార్ నోటికి నోరుపెట్టి ఒక్కసారి ఊపిరి పోసి లేదా ...లాభం లేదు, ఇక చనిపోయినట్లు రాసిచ్చేసి వెళ్ళాలి.
    స్టెతస్కోప్ అందుకున్నాడు- గుండెను -వినబోయాడు. ఎక్కడో లోయలో సన్నగా కొట్టుకుంటోందా అలసిన గుండె, అతనిముఖం ఆనందంతో గంతులువేసింది. కళ్ళు మూసుకుని ఎన్నడూ వినని. అతి ప్రియమైన రాగాన్ని విని పరవశం చెందుతున్నలా వింటున్నాడా- ప్రాణ దాత-శబ్దాన్ని-
    ఇంతలో ఇంజక్షన్లు తీసుకొని వచ్చాడు కాంపౌండర్. గబగబ నాలుగైదు సూదులుగుచ్చి- ఫలితంకోసం చూస్తున్నాడు, శ్వాస క్రమ బద్ధ మైంది హృదయం చిన్నగా పైకిలేస్తూ పడ్తూ వుంది. గుండె నెమ్మదిగా తనపని చేసుకుపోతోంది.
    "చాలా విశ్రాంతి అవసరం. ఎక్కడికీ వెళ్ళనివ్వకండి. వేడిపాలు త్రాగించినా ఫరవాలేదు. గుండె అలసి పోయింది. ఈ సారి ఆగితే మన మాట వినదు. హాస్పిటల్ లో వుంచితే మంచిది..." గుండెబాధ తెలీకుండా మార్ఫిన్ ఇచ్చాడు. ప్రెసిడెంటు కళ్ళు తెరవలేదు. ఇంకా నీరసంగా మగతగా పడుకుని ఉన్నాడు. ఎవరో గాజుగ్లాసునిండా కాఫీ అందించబోయారు. కుమారి వద్దంటూ నిరాకరించాడు.
    రాత్రి రెండు గంటలైంది. కుమార్ లేచాడు "మంచం దగ్గర కూర్చుని కనిపెట్టుకొని వుండండి. ఏదైనా అవసరమొస్తే కబురు చేయండి, కిట్ అంతా సర్దుతున్నాడు కాంపౌండర్.
    కుమార్ బైటికొచ్చాడు. ఆడాళ్ళంతా కృతజ్ఞతలు తెల్పుకోవాలని ఆరాట పడ్తున్నారు. మగవాళ్ళంతా బైటికొచ్చారు. ఒకతనన్నాడు.
    మీరు లేకపోయినట్లయితే ఏమయ్యేదో - అంతా మీ చలువ - మీ హస్త వాసి గొప్పది. మా అమ్మా అక్కయ్య మీకు కృతజ్ఞతలు తెల్పుతున్నారు మీ ఋణం ఎలా తీర్చుకోగలం డాక్టర్ బాబూ!"
    "చేతనైన సహాయం చేశాను. అంతా ఆ భగవంతుని దయ. ప్రయత్నం చేసేవంతు మాది ఆ తర్వాత ఆ సర్వాంతర్యామి అభీష్టం ఎలా వుంటే అలా జరుగుతుంది.....వస్తాను.....ఇదంతా నా వల్ల జరిగింది. చాల ఉద్రేకంతో-కోపంలో ఉన్నట్లున్నారు......బాగా తెలివివస్తే ఏ బాధ లేక పోతే-సావకాశంగా, అదనుచూచి ఒక్కమాట చెప్పండి.....నేను ఎల్లుండి ప్రొద్దున్న హైదరాబాద్ కు వెళ్ళి పోతున్నానని....."
    అతను ఎవరి మాటలు-వాదనలూ వినదల్చుకోలేదు.
    అతను మెట్లు దిగి రోడ్ మీదికొచ్చాడు లాంతరు పట్టుకుని ఎవరో బైటికొచ్చారు. అతను దారి చూపుతుంటే గబగబ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో వెనకాతల వస్తున్న చప్పుడైంది.    
    "ఎవరూ! అని లాంతరు పట్టుకున్న మనిషి లాంతరు నెత్తి పరీక్షించాడు. "బాబూ-తనురా" అన్నాడు కరణంగార్ని చూచి.
    డాక్టర్ నడక చాలించాడు. "నువ్వు నడరా..." అని పాలేరుకు ఆజ్ఞాపించి డాక్టర్ కు దగ్గరగా వచ్చి నెమ్మదిగా మాట్లాడాడు.
    "మీదెంత విశాలహృదయం డాక్టరుగారూ! అతడు మిమ్మల్ని శపించని శాపం లేదు.... మీ ఉద్యోగానికే ముప్పు రావాలని ఏదేదో చేయదలచినాడు......కానీ విధి బలీయమైనది.....మీ కన్నీ ఆ కాంపౌండర్ చెప్పి వుంటాడు....కానీ మీరు వచ్చి అతని ప్రాణాన్ని రక్షించారు. మీరు గాని అంత శ్రమపడకుండా వుండివుంటే ఈ సరికి కట్టెలమీద మండేవాడే....మేమందరం అతని కెంతో సన్నిహితులుగా వున్నా అతని చావునే కోరామం హృదయంలో ఎక్కడో అతడు పోతాడని తృప్తిగా ఉండినది. ఆయన చేయని దుండగం లేదు.....ధనం, గౌరవం, పలుకుబడిని, సక్రమార్గంలో త్రిప్పి తన కనుగుణంగా చేసుకొన్నాడు, అక్కడ కూడిన జనమంతా పరోక్షంగా వారి చావును మనసారా కోరిన వారే సుమా! ఐనప్పటికీ మీరు అంతా మర్చిపోయి అతనికి ప్రాణదానం చేశారు. మీదెంతటి ఉదాత్త గుణం బాబూ అహంభావంతో మిమ్మల్ని ముందు గౌరవించలేక పోయాడు. క్షమించండి....
    కుమార్ నిజంగా ఆశ్చర్యపడ్డాడు. కరణం, రెడ్డి ఇత్యాది పెద్దమనుష్యులంతా ప్రెసిడెంటు సిబ్బంది" కాబోలునని భావించాడు. అంటే వీరంతా చేసేదిలేక ఎదురు తిరిగి దౌర్భాగ్యపు రోజులను తెచ్చి పెట్టుకోడానికి సాహసించలేక అతను పాడిందే పాటగా తాళం వేస్తు వచ్చా రన్న మాట....పాపం-
    జవాబుగా అన్నాడు" వైద్యునికి శత్రువు. మిత్రుడు అని స్త్రీ పురుషుడని, వివాహిత అవివాహిత అవి. పాప పండుముదుసలి అని భేదం లేదు, కులీనుడు కులహీనుడు అన్నతేడా లేదు. రోగి ఎవరైనా సరే వారికి చికిత్సచేయటమే మా వృత్తి ధర్మం. మానవునిలోని బాధను చూడటం తప్ప మరే భావన మా హృదయాలలో ఉత్సవం కాకూడదు. ఇది వైద్య వృత్తి ధర్మం. వ్యక్తి కోలుకోని ఆరోగ్య వంతుడైన తరువాత స్నేహం - శత్రుత్వం - అన్న తేడా వస్తే తప్పు లేదు, ఆరోగ్యవంతుడికి వైద్యుడక్కర్లేదు కదా ఇందులో నాగొప్పతనం ఏం లేదు. నా విధి నేను నెరవేర్చాను.
    ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రెసిడెంటు ను ఆసుపత్రికి తీసికొని వెళ్ళారు ప్రాణానికి ప్రాణం పెట్టి చావు తప్పించినందుకు డాక్టరుకు ఫీజు ఏమీ ఇవ్వలేదు ఎంత త్వరగా మర్చిపోతారు. ఎంత కృతఘ్నులు ఈ మానవులు!
    ఆ పల్లెలో ఇంకా నాలుగురోజులుండ వలసి వున్నా కుమార్ కు ఆ నాలుగురోజులు అక్కడ గడపటానికి కిష్టంలేక పోయింది. కుమార్ తంతిచూచి మాదప్ప ఆ నాల్గురోజులకు మరొక డాక్టర్ ను పంపగానే కుమార్, మంజుల హైదరాబాద్ వెళ్ళిపోయారు.

                            *    *    *

    హైదరాబాదు చేరిన మరుసటి రోజు కల్యాణి వచ్చింది. చెల్లి కళావిహీనమైన ముఖాన్నిచూచి చకితయై - అనుమానం పొడసూపగా రహస్యంగా విషయం తెలిసికొని ఆనందించింది మంజుల.
    పల్లెలో జరిగిన విశేషాలు చెప్పుకుంటున్నారు. అక్క సెల్లెండ్రు, కుమార్ తోటలో ఈజీ చైర్ లో పండుకుని ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS