Previous Page Next Page 
ఆరాధన పేజి 15


    కంపౌండరు మెల్లగా పిలిచాడు.
    "డాక్టరు గారూ - ఈ రిపోర్టు రాయకముందే మిమ్మల్ని చూడాలంటున్నారు.
    ఇందులో ఏదో గూడుపుఠాణీ వుంది. కుమార్ కు వెంటనే తట్టింది. కనుబొమలు చిట్లించి అతని వేపు తీక్షణంగా చూచాడు.
    కంపౌండర్ తల దించుకున్నాడు - చేతులు నలుపుకుంటున్నాడు. అతడిని చూచి కుమారీ కు జాలేసింది. చేతులు కడుక్కుని ఇవతలికొచ్చాడు. కాంపౌండరు రహస్యంగా అన్నాడు "వారి మాటల్ని నిర్లక్ష్యం చేయకండి బాబూ.....మాపై దయుంచండి."
    అతను వింతగా చూచాడు. ప్రక్కగదిలోకి వెళ్ళాడు. పెద్దలంతా గుమికూడి వున్నారు. కరణంగారు అక్కడే కూర్చుని వున్నారు.
    "రండి డాక్టరుగారూ - మీ కోసమే చూస్తున్నాము"
    "పిలిచారుట....ఏం కావాలి? మీకెవరికైనా.."
    "అబ్బే - అదేం లేదు. అందరం బాగానే ఉన్నాము. ప్రెసిడెంటు గారికే కాస్త సుస్తీగా వుంది...తప్పించే భారం మీది....ఐనా ఈ కాలం మనుష్యులకు కళ్ళు నడినెత్తిమీద నుంటాయి. రోడ్డుమీద నడుస్తూ ఇంట్లో నడుస్తున్నామనుకుంటారు ఎంత అజాగ్రత్తతో మసలుతారనీ....రోడ్డంతా వీడి తాత సొమ్మనుకుంటారు.
    రామస్వామి మరీ అనుకోండి....కొత్త పెళ్ళాం మోజులో ఏదీ అగుపించటం లేదు....ఎంత అరచినా వినిపించుకోలేదు..."
    "మీ రక్కడే ఉన్నారా?"
    "ఆ.....లేకేం-పనిమీద ఆ రోడ్డు మలుపు దగ్గరున్నాను.....ఎంత డోసేశాడో ఎన్ని సీసాలు ఖాళీ చేశాడో గాని- అలా తూలుతూ తూలుతూ వచ్చేశాడు..."
    "మీరు చూస్తూనే వున్నారన్నమాట"
    "ఆ ..మిమ్మల్ని ఎలా చూస్తున్నానో - అలాగే చూచాను"
    రెడ్డిగారు గొంతు సవరించుకున్నారు. "పోయిన నెలలోనే గుండెనొప్పి వచ్చినట్లు చెప్పాడు....పాపం....ఈ మధ్య రెండుసార్లు గుండెనొప్పి వచ్చిందట ..... వో సారి గుండె నిలిచి పోతుందేమోనని భయపడి పోయారుట."
    ఇదంతా దేనికి నాంది? కుమారీ పసివాడు కాడు. వారి మాటల్లోని అంతరార్ధం గ్రహించటానికి-ఎంత సేపో పట్టలేదు. హృదయం అనిర్వచనీయమైన బాధతో బరువెక్కింది. కాని వెంటనే స్థాయి పడి అన్నాడు; "నాకు చాలా పనుంది. ఇప్పుడు మీరు చెప్పినదంతా నాకనవసరం లేదు. అవన్నీ మీరు పోలీసు వారికి తెల్పండి. నా రిపోర్టు కవన్నీ అక్కర్లేదు....శవానికి సంబంధించిన మేరకు..."
    అతని కడ్డుతగుల్తూ అన్నాడు రెడ్డి" మరి ఇదంతా శవానికి సంబంధించినది కాదా డాక్టరు గారూ?"
    "ఔనే అనుకోండి. కానీ నా కవుసరం లేదు. మీ సహకారానికి ధన్యవాదాలు....వస్తాను" అంటూ వెనుదిరిగాడు.
    "ఆగవోయ్' చిన్న గర్జింపు విని చటుక్కున ఆగిపోయాడు.
    తనను ఆ విధంగా సంబోధిస్తుంటే విని ఆగ్రహంతో అరుణిమ దాల్చిన కళ్ళతో సూటిగా ప్రెసిడెంటు వైపు చూచాడు.
    అతడు వికృతంగా నవ్వేశాడు. "నీ రిపోర్టు మా కనుగుణంగా ఉండాలి... లేదా...?"
    "బెదిరిస్తున్నారా?" కుమార్ శాంతంగా అడిగాడు.
    "ఏమైనా అనుకో బెదిరిస్తున్నాననే అనుకో. చిన్నవాడివి-నీకేం తెలియదు......త్రాగి ఉన్నట్లు. గుండె బలహీనత ఉన్నట్లు రాశావా నిన్ను..." అతడు ఆపుజేసి కరణం వైపు చూచాడు. కరణం ఆ డుకుని మొదలెట్టాడు 'ఇంకేం...నిచ్చెన ఎక్కినట్లే....స్వర్గ సౌఖ్యాన్నందుకో గలరు. ఈ జిల్లా మొత్తానికి ప్రెసిడెంటుగారితో సరితూగగల స్తోమతు ఎవ్వరికీ లేదు .... మీరు అదృష్టవంతులు.. "పాచిన పారుతున్నట్లు సంతోషంతో అన్నాడు. కుమార్ నిగ్రహించుకున్నాడు. నీళ్ళతో వైరం పెట్టుకోరాదు. ఇంకో వారం రోజులకి తాను వెళ్ళిపోతాడు. ఇంతట్లో ఎందుకీ పగ! కుర్చీలో కూర్చుని తదేకంగా ప్రెసిడెంటును చూస్తూఅన్నాడు."    
    మీరు చెప్పినట్లు రాశానే అనుకోండి...వీరన్న-అంటే శవం మామ. మళ్ళీ శవ పరీక్ష చేయిస్తే-నా ఉద్యోగం ఊడుతుంది." పెదాలు బిగబట్టి మౌనం దాల్చాడు...
    "అహ్హహ్హ ... వీరన్న....వాడికేం తెలుసు? ఐనా - నాకు వ్యతిరేకంగా నిలబడేందుకు ఎవరికి దమ్ములున్నాయి- ఏం రెడ్డిగారూ!"
    "చిత్తం- చిత్తం- అటువేపునించి ఎవరూ అడ్డు తగులరు....మీకేం ఆ భయం అక్కర్లేదు...."
    ఏమో- మీ కలా అనిపిస్తోంది ...నాకు మాత్రం ఎవరో అడ్డు తగుల్తారనే వుంది సుమా! పరీక్షించి అంతా అబద్ధం వ్రాయలేను. న్యాయం నన్నలా రాయనివ్వదు. క్షమించండి.......ఇప్పటికే ఆలస్యమైంది...."
    కుమార్ మరి ఆగలేదు.
    గబగబ గదిబైటికి దూసుకొచ్చాడు. కంపౌండరు చేతులు కట్టుకుని దీనంగా నుంచున్నాడు.
    "వాళ్ళు అన్నింటికి తెగించినవారు.....మీ విషయం భయంగా వుంది." అతను గొణిగాడు.
    "భగవంతుడిపై భారంవేశాను- అంతే- మీరు నిశ్చింతగా వుండండి. " కుమార్ శవం వున్న గది లోకి వెళ్ళాడు.
    శవం ఒక్కచుక్కలేదా అణుమాత్రంగా నైనా సారాగాని, బ్రాందీగానీ లేదు. గుండెలో ఏ లోపంలేదు. ఆరోగ్యవంతు డెవడైనా వుండే వాడా? అంటే రామస్వామి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంటే పోలీసువారి కేసులో కారు నడిపినవాడికి పెద్దశిక్ష తప్పదన్నమాట. తను చూచినప్పుడు శవం ముందర చక్రాల దగ్గర ఉన్నది. కార్ డోర్ మధ్యలో లేదు- బాగా ప్రక్కగా వచ్చింది. బండిని తప్పుకోటానికి రోడ్ ప్రక్కగా కారు నడిపినట్లు చెప్ప దలచినా అక్కడ ఆ క్షణానికి బండ్లు లేవు. అసలు ఇవన్నీ ఎవరూ ఆలోచించలేదు. డాక్టర్ మనచేతిలోనివాడు-సమస్య ఇట్టే పరిష్కారమై పోతుందని ఏ ఇతర నన్ను గడలు వెన్నలేదు. నేరమంతా ముందునించీ రామస్వామి మీద వేశారు.

                                  
    ఆ శవ పరీక్షలో కుమార్ కు ఒక్క విషయం తేట తెల్లమైంది. ఏదో కుతూహలంతో అతను శవాన్ని క్షున్నంగా పరీక్షించాడు. తెలిసికొన్న "సత్యం అతన్ని శాంతిలో ముంచి వేసింది!     
    బైటికొచ్చేసరికి అక్కడ పై వాళ్ళెవ్వరు తేరు. కంపౌండర్ క్షుభిత హృదయంతో బెంచి మీద కూర్చున్న వాడల్లా గభాలునలేచి నుంచున్నాడు. ఆతృతతో సమీపించి "డాక్టర్ గారూ వాళ్ళంతా చాల కోపోద్రేక తో వెళ్ళిపోయారు. ప్రెసిడెంట్ గారు నిప్పులు గ్రక్కుతూ క్రోధంతో పళ్ళు పటపట కొరుకుతూ వెళ్ళాడు. మరిట పాత డాక్టరుగార్ని రమ్మంటారుట. మిమ్మల్ని రేపే పంపిస్తారట..... ఏమేమో శాపనార్ధాలు పెడ్తుంటే వినలేకపోయాను. బాబూ అన్నాడు.
    కుమార్ పేలవంగా నవ్వేసి దీర్ఘంగా విశ్వశించాడు.
    "చాల ఆలస్యమైంది. వెళ్దాం పదండి....సాయంత్రం ఓమారు ఇంటికి రావాలి. మీతో ఓ విషయం చెప్పాలి" అతడు చకచక నడుస్తూ వెళ్ళిన వేపు చూస్తూ "ఏం విషయం చెప్మా!" అని ఆలోచిస్తూ తనూ నెమ్మదిగా నిష్క్రమించాడు.
    ఇంటి కెళ్ళగానే స్నానంచేసి - వచ్చేసరికి మంజు అన్నం వడ్డించి ఎదురు చూస్తోంది. భోజనం దగ్గరకు రాగానే చేతులనో మారు వాసన చూచుకున్నాడు. ముఖం చిట్లిస్తూ "స్పూన్ తెచ్చివ్వు మంజూలోషన్ వాసన"
    "స్పూన్ ఎందుకూ-మీరలా కూచోండి-నేను తినిపిస్తాను.
    కుమారి అనురాగంతో చూస్తూ "ఔను....రేపు ఆ వచ్చే బుల్లి తల్లికి తినిపిస్తూ నన్నే మర్చిపోతావు ఊ కానియ్....మళ్ళీ మనసు మార్చేసుకోగలవు....సమయం జారవిడుచుకోరాదు"
    మంజు సిగ్గుతో కళ్ళు వాల్చేసుకుని నెయ్యి వేసి ముద్దలు కలిపి నోటి కందిస్తోంది. ముద్దతోపాటు ఆమె సౌందర్యాన్ని సహితం ఆస్వాదిస్తూ తృప్తిగా భోంచేస్తూ - చెప్పతగినంత మాత్రమే ఆమెకు- ఆనాటి విషయాలు తెలియజేశాడు.
    సాయంత్రం మందులిచ్చాక డిస్పెన్సరీ మూసి డాక్టర్ గారి వెనకాలే కంపౌండర్ బయలుదేరాడు. ఇంటికెళ్ళి కాఫీ త్రాగాక ముందువైపు వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మంజుల ఆ పరిసరాల్లో లేదని గ్రహించి కుమార్ అన్నాడు.
    "రామస్వామి పెళ్ళయిన మరుసటిరోజు వచ్చి నిజంగా పురుషుడిలో లోపం వుంటుందా-అని అడిగాడు. పట్నంపోతే ఏ హాస్పిటల్ కెళ్ళాలని అడిగాడు ఇవ్వాళ నా స్నేహితుడినించి ఉత్తర మొచ్చింది. అతనిలో చిన్న లోపం వుందట. శస్త్ర చికిత్సతో సరిచేయవచ్చునట. ఆ పిల్లను తలంచుకుంటే మాత్రం హృదయం ద్రవించి పోతుంది.
    "పురుషుడి అహంభావం డాక్టర్ గారూ తనలో ఏ లోపం ఉండదనే గట్టి నమ్మకం....నిలువునా దాని గొంతుకోశాడు....పెళ్ళయి పక్షం రోజులు కాలేదు. అప్పుడే ఆ పిల్లకీ గతి. ఆనాడు ఆ భగవంతుడే మీ నోట పలికించాడు వీళ్ళు వింటేనా!"
    గేటు చప్పుడైతే ఆ వైపు చూచాడు. వీరన్న గులో అడుగేసుకుంటూ శోకమూర్తియై చూస్తున్నాడు. వాళ్ళను సమీపించి కళ్ళొత్తుకుంటూ చతికిలబడ్డాడు, అతడిని ఏ విధంగా ఓదార్చాలో వాళ్ళకు బోధపడలేదు. మౌనం దాల్చి ఎటో చూస్తూ కూర్చున్నారు.
    కండువా మడతల్లోంచి ఒక ఉత్తరం దీసి కుమార్ కందిస్తూ "బాబయ్యా-మద్దేన్నం వచ్చింది....అప్పటికే అతడ్ని ఆ భగవంతుడు పిలుసుకెళ్ళాడు. ఏముందో చూడండి" చేతులు కంపిస్తూంటే ఒడిలో పెట్టుకుని ఆత్రంగా చూస్తూన్నాడు కుమార్ లేఖను తెరచాడు. అది తన హాస్పిటల్ కాగితంమీద రాసిన లేఖ. క్రింద ఖాన్ సంతకం ఉంది. ఆత్రంగా విప్పాడు. చదివాడు.
    "హైదరాబాద్ నించి ఒక డాక్టర్ వ్రాశారు."
    "ఎందుకూ?" తాత విస్తుపోయాడు.
    "అల్లుడు అక్కడికెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు."
    "అయ్యో-ఎందుకని?"
    "తనొకవేళ మందు తింటే - పరీక్ష చేయించుకుంటే - పిల్లలు పుడ్తారేమోనని అక్కడి కెళ్ళాడు కాబోలు. వాళ్ళు అంతా పరీక్షించి ఏదోచెప్పారు ...."కుమార్ ఓరగా తాతను గమనిస్తున్నాడు. వీరన్న గొంతుక తడారిపోయింది. చేతులు కంపిస్తున్నాయి. కళ్ళు పెద్దవిగా చేసి కాస్త ముందుకు వంగి ఆయాసంతో అడిగాడు "ఏమని రాశారు బాబూ-ఏమనుంది?"
    అతడిలోని కంగారును చూచి వారిద్దరికేం అర్ధంకాలేదు. ముసాలాడెందుకిలా బెంబేలు పడి పోతున్నాడు. ఎందుకింతగా చలించిపోతున్నాడు.
    "నీ అల్లుడి రక్తం. పరీక్షించారుట. మొత్తం మీద ఆరోగ్యం ఎలా వున్నదీ చూచారుట. అంతా బాగున్నదట. కానీ చిన్నలోపం ఉందట. శస్త్ర చికిత్సలో అది సరిచేయబడుతుందిట. ఇదంతా రాసి ఉన్నది. ఈ లేఖను మరే డాక్టరు దగ్గరకు తీసికొనివెళ్ళినా అతడు ఆపరేషన్ చెయ్యగలడు. ఇది ఒక సిఫార్సులాంటి ఉత్తరం. నీ అల్లుడిని గూర్చిన రిపోర్టు. వీలైతే - అతడ్ని నా దగ్గర ఆపరేషన్ చేయించుకోమన్నాడు.....తాత వినటంలేదు. అతని ముఖం వెలవెల బోతోంది. పెదాలు కదులుతున్నాయి. గాని శబ్ధం రావటం లేదు. ఉన్నట్లుండి రెండు చేతుల్లో ముఖం దాచుకుని - ఏదేదో గొణుగుతూ రోదిస్తున్నాడు.
    వారిద్దరూ జాలితో చూస్తున్నారు వారుమాత్రం ఏంచెయ్యగలరు? నిస్సహాయతతో తాతను తిలకిస్తున్నారు. ఉన్నట్లుండి. తాత కుమార్ చేతి లోని ఉత్తరాన్ని లాక్కుని పరపర చింపేసి ఆ కాగితాలను కండువాలో దాచుకుని గభాలున కుమార్ కాళ్ళను పెనవేసుకొని తలను కుమార్ పాదాల కానించి స్పష్టంగా అన్నాడు బాబూ... ఈ విషయం రహస్యంగా ఉంచండి ఎవ్వరితో అనకండి....నన్ను రచ్చించండి....మిమ్మల్ని    నమ్ముకున్నాను. అతడు ఆసుపత్రి కెళ్ళినట్టుగాని ఈ ఉత్తరం చదివినట్టుగాని ఎవ్వరితో చెప్పకండి.... అయ్యా కాంపౌండరయ్యా మీ పాదాలు పట్టుకొంటున్నాను.      చూపండి....
    ఇద్దరు విస్తుపోయి ఒకరి ముఖా లొకరు చూచుకున్నారు. వాళ్ళకేం చేయాలో పాలుపోలేదు. తాత దుఃఖాన్ని చూచి తాళలేక పోయారు. ఎలాగో అతడిని విడిపించి లేచి నుంచున్నారు. తాత చేతులు నలుపుకుంటూ ఆశగా చూస్తున్నాడు. వాళ్ళు మాట ఇవ్వాలి. దోసిలొగ్గి నుంచున్నాడు.
    "అలాగే వీరన్నా.....మాకు తెలియనట్లే ఊరు కుంటాంలే. నిశ్చింతంగా వుండు వెళ్ళు"
    తాత రెండుచేతులు పైకెత్తి దండం పెట్టాడు. బీదోడిని ఏమి యిచ్చుకోలేను. కానీ ఎప్పుడు మిమ్మల్ని తలంచుకుంటాను బాబూ.
    కాగితం ముక్కల్ని భద్రంగా పట్టుకొని కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చీకటిలో కలసిపోయి అదృశ్యుడయ్యే వరకు చూచి నిట్టూర్చారా ఇరువురు ప్రేక్షకులు!
    ఎవరికీ వారు దీర్ఘాలోచనలో మునిగి పోయారు.
    మంజుల వచ్చి పిలిచేవరకూ వారిద్దరు అలాగే కూర్చుని ఉన్నారు కాంపౌండరు వెళ్ళిపోయాక తాత వింత ప్రవర్తనను మంజులకు చెప్పాడు. ఆమె అంతా విని మౌనం దాల్చింది. అలసిన ప్రాణం. కుమార్ కి వెంటనే నిద్రపట్టింది. మంజుల ఏదో ఆలోచిస్తోంది.
    తనకు ప్రసవించే రోజులు దగ్గరకు పడ్తున్నాయి. ఏదో భయం. సంశయం. ఏవేవో తలంపులు ఆమెకు అశాంతిని ప్రసాదించినై!
    ఎందరికో పురుడు పోసింది. డాక్టర్ అన్న పూర్ణతో కలసి-తను ఒక్కత్తీ ఎంతోమందికి కాన్పు చేసింది. ప్రతి కాన్పుకు తను చూస్తోన్న విషయం ఆమెను కలత పరుస్తోంది. ఆ బాధలో ప్రాణాన్ని అడకత్తెరలో వుంచి నొక్కేస్తున్నలాంటి నొప్పులతో - ఇక ఈ బాధ భరించలేదు - ప్రాణానికే ముప్పు - అన్నలా భ్రమింపజేసే ఆ యమ యాతనలో ఆ స్త్రీ తల్లి - లేదా అతిదగ్గర బంధువు - ఆమెకు బలాన్ని ప్రసాదిస్తున్నట్లు - మృదువైన అమృతమయమైన హస్తాన్ని ఆసరాగా యిస్తుంటే-ఆహస్తంతో వేదనతో అలమటించిపోతున్న ఆమె నుదురుకి కోమలంగా రాస్తుంటే - ప్రేమ పూరిత వాక్కులతో ఏదో ధైర్యం చెబుతుంటే - ఆఖరుగా ఒక్క అరిచి అరిచి చటుక్కున అచంచలత్వంతో హాయిగా ఒక్క శ్వాసవదలి - ఆ పసికందు మొదటి ఏడ్పును విని ఆనందిస్తారు. తను - అలా కాన్పు గదిలో పండుకుని నొప్పులు పడ్తుంటే తనకెవరున్నారు? అమ్మ-అమ్మ - ఉందికానీ ఆమెకు తను జీవించిలేదు, ఆ చల్లని  స్పర్శ తన ఆవేదన నంతా పటాపంచలం చేయగలదు. ఆ తీయని తల్లి కంఠం తనకు వెయ్యి ఏనుగుల బలం ప్రసాదించగలదు. కానీ తనకా అదృష్టంలేదు, తనొక అనాధ-తనకెవ్వరూ లేరు......తనభర్త తప్ప కానీ పరిస్థితిలో స్త్రీ అంత ముఖ్యం కాదా - ఆమె కనుకొనల్లో నీరు నిల్చింది, భర్త కేసి చూచింది. అన్నింటికి నేనున్నాను - అన్నట్లు అతని చెయ్యి నిద్రల్లో ఆమె మీద లీలగా పడింది. మంజు కదల్లేదు చీ; ఏమిటిది? అనుకుని ఒక్క నిట్టూర్పు వదలి నిద్ర కుపక్రమించింది-    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS