13
రైల్వే స్టేషను లో హిగిన్ బాధమ్స్ బుక్ స్టాల్ ప్రక్కన లాంతరు స్తంబాన్ని అనుకోని నిలబడి ఉన్నాడు సారధి. పది రోజులు లంఖణాలు చేయటం వల్ల, రాత్రి నిద్ర లేకపోవటం చేత, ఏదో అందని వ్యధ వల్ల మనిషి బాగా నలిగి నట్టు కనిపిస్తున్నాడు. రైల్వే స్టేషను పక్కనే ఉన్న కొండ కేసి చూస్తున్నాడు. నేను వెళ్లి భుజం మీద చెయ్యి వేశాను. నా చేతిని తన చేతిలోకి తీసుకుని మెత్తగా నొక్కాడు.
భాధల్నీ, సుఖాల్నీ , కోప తాపాల్ని అందరిలా వ్యక్తం చేసే శక్తి సారధికి లేదు. ఎక్స్ ప్రెస్ గంటన్నర లేటు . మద్రాసు వెళ్లాలని సారధి ఆలోచన. కాసేపు కలకత్తా వెళ్ళాలను కున్నాడు. మళ్ళీ బొంబాయి వెళ్ళాలని కొంతసేపు ఆలోచించాడు. చివరికి మద్రాసు వెళ్లాలని నిశ్చయించు కున్నాడు.
సారధి విజయవాడ వదిలి ఎందుకు వెళుతున్నాడో నాకు తెలుసు. అయినా "ఎందుకు వెళ్లి పోతున్నావు రా?' అని అడిగాను.
"కారణం నీకు తెలియదా?" అని ఎదురు ప్రశ్న వేశాడు.
"కొంత తెలుసు. కొంత తెలియదు."
"కల్యాణి కోసం వెళ్ళిపోతున్నాను."
"ఉన్న ఊరు వదిలి పోవటానికి అది తగినంత కారణం కాదని పిస్తుంది. ఊళ్లోనే ఉండి, ఆమెకు దూరంగా ఉండరాదూ?"
"అసంభవం. నేనెప్పుడూ ఆమెకు దూరంగానే ఉంటున్నాను. కాని ఆమె నన్ను ఉండనియ్యటం లేదు. పాపం చేసే శక్తి నాకు లేదు. లింగరాజు కి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు. నాకు విజయవాడ వదిలి పోవాలని లేదు కాని వదలక తప్పేట్టు లేదు."
"నువ్వు చెయ్యదల్చు కున్న పని ఎవరూ ఆపలేరని నాకు తెలుసు, కాని హెలెన్ కి తెలుసా నువ్వు ఇలా వెళుతున్నావని?"
"తెలియదు."
"సారదీ! లేనిపోని నమ్మకాలతో, అర్ధం లేని విశ్వాసాలతో చేజేతులా జీవితాన్ని పాడు చేసుకోకు. జరగబోయేది తెలుసుకోవటం మానవుడి కి సాధ్యం కాదు. ఆ జ్ఞానం సాధించిన వాడు మానవుడు భగవంతుడు ఔతాడు."
"ఎవరి నమ్మకాన్ని ఎవరు కాదన్నా ఏం లాభం చెప్పు? అయినా చూద్దాం. ఇంకా ఉన్నది రెండు సంవత్సరాల గడువు. ఈ రెండు సంవత్సరాలూ దాటి జీవించగలిగితే, ప్రపంచం నా పాదాల ముందుంటుంది."
"అంటే?"
"అంటే, నేనో మహారాజుని కావచ్చు. ప్రధాన మంత్రిని కావచ్చు. కోటీశ్వరున్ని కావచ్చు. సినిమాల్లో చేరి మహా నటుణ్ణి కావచ్చు. ఏది జరిగినా, అలాగే జరుగుతుంది. శని మహాదశ ప్రారంభ మౌతుంది . అది పాప గ్రహం. దాని శక్తి చాలా తీవ్రమైంది. ఆకాశానికి ఎత్తినా, అధఃపాతాళానికి తొక్కినా డానికే చెల్లు తుంది. పాతాళం లోంచి బైట పడగలిగితే , రెక్కలు కట్టుకు ఆకాశం లోకి ఎగిరి పోవచ్చు."
"మద్రాసు వెళ్లి ఏం చేయాలని? నీడగ్గిర డబ్బెంతుంది?"
"పాతిక రూపాయలున్నాయి వెళ్ళటానికి. మిగిలింది అక్కడికి వెళ్ళాక సంపాయించు కోవాలి."
"నా దగ్గిర యాభై రూపాయలున్నాయి జేబులో. ఇచ్చాను. బలవంతంగా జేబులో పెట్టాను.
"జీవితంలో ఎన్నో పరిశోధనలు చేయాలనుందిరా. పోయే వాణ్ణి ఎలాగో పోతున్నాను. జీవితాన్ని పూర్తిగా అనుభవించి, అన్ని రకాల అనుభవాల్ని చవి చూసి మరీ కన్ను మూస్తాను. ప్రపంచమంతా చుట్టి రావాలనుంది. ఈ రెండేళ్ళ లో నేను అనుభవించని అనుభూతి ఉండకూడదు."
సారధి మాటలు చాలా ఉద్రేకంతో చెబుతున్నాడు. యుద్ధంలోకి పోతున్న మహా సేనానిలా . ఉప్పెనలా పొంగుతుంది అతని హృదయంలో ఉత్సాహం. భయాస్చార్యాలతో నా గుండెలు క్షణ కాలం తొందరించాయి. సారధి రైల్యు ఎక్కి సెలవు పుచ్చుకున్నాడు.
రైలు కదిలింది.
"లోకం నుంచి సెలవు పుచ్చుకునే ముందు మరోసారి నీ దగ్గిర కోస్తారా" అంటూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. నా కళ్ళ లో నుంచి రెండు నీటి చుక్కలు అతని చెయ్యి మీద పడ్డాయి.
సారధి ముఖం ఆనందంతో పొంగి, విషాదం తో కుంగింది.
"ఈ కన్నీరు మన స్నేహానికి స్మృతి గా లోకంలో నిలిచి పోతుంది. నీలా కంట తడి పెట్టె దివ్య శక్తి నాకు లేదు. ఉంటె అందరి లాగే పదికాలాలు సుఖంగా బ్రతికే వాణ్ణి."
రైలు పోగలు చిమ్ముతూ సెగలు కక్కుతూ , అనంత విశ్వం లోకి గమ్యం తెలియని మార్గం పై సాగిపోయింది.
ప్రపంచం చివరకు పోతున్న యాత్రికుడు సారధి.
సృష్టి రహస్యాన్ని అన్వేషించాలని బయలుదేరిన పరిశోధకుడు సారధి.
అదే నేను చివరి సారి సారధిని చూడటం.
సారధి నాకు మళ్ళీ కనిపించలేదు.
14

మరునాడు గుంటూరు వెళ్లాను, సారధి వెళ్ళిపోయిన సంగతి హెలెన్ కి చెప్పాలని, హెలెన్ అనే పేరుతొ ఇద్దరు నర్సులు ఉన్నారుట. గుంటూరు జనరల్ హాస్పిటల్ ఒక మాయా మందిరం లా, పద్మ వ్యూహం లా ఉంటుంది. ఓ పట్టాన అజ దొరకదు. మెయిన్ గేటు దాటి లోపలికి వెళ్లి మెటర్నిటీ వార్డు లోకి వెళ్లాను.
ఇద్దరు డాక్టర్లు కూర్చొని ఏదో సమస్య చర్చిస్తున్నారు. వినయంగా నమస్కరించి, "హెలెన్ ఎక్కడుంటుంది?' అని అడిగాను.
ఇద్దరూ డాక్టర్లూ ఒక్కసారి నాకేసి ఎగాదిగా చూసి, నేను తోడుక్కున్నవి బాటా బూట్లో, ఫ్లేక్సు బూట్లో పరీక్షించి, "ఏ హెలెన్, ఇక్కడ ముగ్గురు హెలెన్ లున్నారు. ఓ హెలెన్ హెడ్ నర్స్. మరో హెలెన్ ట్రెయినీ నర్సు. మూడో హెలెన్ ..." ఆగాడు.
"ఇక్కడున్నది ఇద్దరే హెలెన్ లు. మీకు కావలసిన హెలెన్ ఎవరండీ?' అని ప్రశ్నించాడు రెండో డాక్టరు. "కావలసిన " అనే మాటని విడిగా నొక్కుతూ.
"హెలెన్ గ్రేస్ అని ఈ మధ్యనే చేరిందండీ. కాకినాడ లో ట్రెయినింగైంది " అన్నాను వినయాన్ని చెదరనీయకుండా.
"గ్రేస్ అందరికీ ఉంది లెండి. మీకు కావలసిన హెలెన్ బహుశా పైన 'బి' వార్డు లో ఉంటుంది." అన్నాడు స్తేతస్కోపు సవరించుకుంటూ ఆ దయామయుడు.
పైకి నడిచి 'బి' వార్డు కి వెళ్లాను. సన్నగా చువ్వలా సాగి సాగి వంగిన ఓ నర్సు ని చూసి మరో నర్సు "ఈవిడే నండి హెలెన్" అంది.
నేను కొంచెం తికమక పడి "ఈవిడ కాదండీ . మరో హెలెన్" అన్నాను.
'ఆవిడా? ఎక్స్ --రే వార్డు లో ఉంటుంది. కుడి పక్కగా వెళ్లి, ఎడమ కు తిరిగి, దక్షిణ వైపు గేట్లోంచి ఉత్తరంగా వెళ్లి , మెట్లెక్కి ఎడమ చేతి పక్క గదిలో చూడండి' అంది.
ఓ అరగంట పట్టింది. హెలెన్ ని కనుక్కున్నాను. తెల్లటి యూనిఫారంలో చెంగు చెంగున నడుస్తూ వస్తుంది.
ఆమెను నేను గుర్తు పట్టాను.
ఆమె నన్ను గుర్తు పట్టలేదు.
కొందరు మనుష్యులు ఎన్ని ఉన్నా, సుఖ పడటానికి ఎంత అవకాశ మున్నా ఎప్పుడూ నీరు కారి పోతుంటారు. మరి కొందరు ఏమీ లేకపోయినా, ఎటు చూసినా కష్టాలే గూడు కట్టుకు కనిపించినా, ఎప్పుడూ మహోల్లాసం తో తేలి పోతుంటారు.
ఈ రెండో తరగతి కి చెందింది హెలెన్.
"చాలా మారిపోయావే! నేను గుర్తే పెట్టలేదు. ఓయబ్బో! కోట్లు కూడా వేస్తున్నావే!" అంది.
హైస్కూల్లో చదివేటప్పుడు నిక్కరు తొడుక్కునే వాళ్ళం. మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మా మామ్మ లాగూ చొక్కాలు విప్పించి, వాకిట్లో అరుగు కింద పెట్టించి గానీ లోపలికి పిలిచేది కాదు. అలా దిగంబరం గానే అన్నం తిని, మళ్ళీ అవే బట్టలు తొడుక్కొని బళ్ళో కి వెళుతుండే వాళ్ళం. రైల్వే స్టేషన్ ఎక్కువ హెలెన్ గది తీసుకొని ఉంటుంది. మూడు గంటలకు గదికి రమ్మంది. సారధి సంగతి చెప్పాను. అది విని ఆమె ఆశ్చర్యంతో , బాధతో నివ్వెర పోతుందనుకున్నాను. ఏమీ కాలేదు.
"వెళ్ళిపోయాడూ? వెర్రివాడు! నేనను కుంటూనే ఉన్నా. తెలియని వాళ్లకి చెప్పగలం గానీ, ఇలాటి మనుష్యుల్ని ఎవరు దోవలో పెట్టగలరు? సర్లే. ఎవరి ఖర్మ వాళ్ళది. చస్తాం మొర్రో అంటున్న వాళ్ళని పట్టుకుంటే మానటారా చెప్పు? అన్నట్టు, మీ ఆవిడ బావుంటుందటగా? చిన్నప్పుడు ఎర్రటి పెళ్ళాం కావాలంటూండేవాడిని నన్ను చూసి. గుర్తుందా? ఎంతమంది పిల్లలు? పిల్లల కేం భాగ్యం లే ఇండియా లో. పెళ్లి చేసుకోవటం తరవాయి , "నాన్నారూ' అంటూ క్యూ లో నిలబడతారు. ఒకళ్లిద్దర్నీ కని ఆపరేషన్ చేయించుకో సుబ్బరంగా. దేశానికి చాలా సేవ చేయచ్చు. సర్లే, నీ కర్ధం కాదులే. మా డాక్టర్ గారంటే ఊళ్ళో లైలాలు చాలామంది తల బద్దలు కొట్టుకుంటారు. నీలాగానే ఉంటాడు రివటల్లా పొడుగ్గా. పొట్టి వాళ్ళని చూస్తె నా కెందుకో చిరాకు. సర్లే. భగవంతుడి తంతే అంత. మా అయన నా భుజాల దగ్గిరికి వచ్చేవాడు. ఆ నాయుడూ అంతే. వాళ్ళిద్దరంటే నా కెంత అసహ్యమో తెలుసా? గాడిద పిల్ల కళ్ళల్లా ఉంటాయి ఆయన కళ్ళు. అదో ఖర్మలె. నిజం చెప్పద్దూ . నాకు సారధి వచ్చాడు. అయితేనేం? నేను ఆ మన్మధుడి కి పనికి రాలా. కల్యాణి తో చాలా కధ నడిపి ఉండాలే! మగవాళ్ళ ని నమ్మమని ఎవరు చెప్పార్లె? నువ్వూ మగవాడివేగా? నీ మాటలు నిజమేనే దేముందీ? తాను పవిత్రుడ నంటాడు సారధి! కలియుగం లో పాతివ్రత్యం ఆడవాళ్ళని వదిలిపెట్టి మగ వాళ్ళ వెంట పడినట్టుంది! ఆ...చచ్చాం. మా గండు పిల్లి వస్తున్నాడు. అంటే, మా బాస్ లే. మూడింటికి గదికి రా. మరిచిపోకు. మనిషిని రివటలా ఎదిగావు . వస్తా" అంటూ మెరుపులా కిచకిచ లాడుతూ ఎగిరిపోయే పక్షిలా వెళ్ళిపోయింది హెలెన్!
మూడు గంటలకి హెలెన్ గదికి వెళ్లాను. గోపీ రంగు మూడంతస్తుల మేడ అది. కింద గదిలో ఉంటుంది హెలెన్. గదిని మించిన సమానుంది లోపల. నల్ల కర్రతో చేసిన పందిరి మంచం. నిలువు టద్దమున్న బీరువా. టేబిలు మీద రకరకాల కంపెనీల బిస్కెట్ పాకెట్లు, చాక్లెట్ టిన్నులు . గది పైన రంగు రంగుల కాగితాల తోరణాలు. ఏసుదేవుని విగ్రహం . ఒక స్టవ్, ఓ చిన్న కాపరానికి సరిపడ స్టెయిన్ లెస్ స్టీల్ సామాను, మంచం కింద లెదర్ సూటు కేసు . మంచం మీద మాలిన్యం లేని మహాత్ముడి జీవితం లా తెల్లగా మెరుస్తున్న దుప్పటి. మెఖమల్ గుడ్డలో బూరుగ దూది దిళ్ళు. ఒక చిన్న సర్కస్ కంపెనీ లో అవతరించిన ఇంద్ర లోకం లా ఉంది.
"ఈ బిస్కట్ల న్నీ నువ్వు తింటానికే కొన్నావా?' అన్నాను కేన్ చెయిర్ లో కూర్చుంటూ.
గలగల మంటూ నవ్వుతూ అంది హెలెన్ మంచం మీద కూర్చొని ! "నాకు పిల్లలంటే ప్రాణం లే! ఎందుకో తెలుసా? నాకు పిల్లలు పుట్టరు కనక."
"ఎందుకు పుట్టరు?" అన్నాను.
"సరే, గీతంటారు అది ఉండద్దూ. రోజూ బళ్ళో కి వెళ్ళే పిల్లలు చాలా మంది నా గదిలోకి వస్తారు. నన్ను పిన్నమ్మా అని పిలుస్తారు. ముద్దాడతారు నే పెట్టిన బిస్కట్లూ తింటూ వెళతారు. నీకెంత మంది పిల్లలో చెప్పావు కావు!"
"ముగ్గురు."
"సారధి కూడా నీ ఈడు వాడే గా . పెళ్ళయితే ఈపాటికి అతనూ ముగ్గుర్ని కని ఉండేవాడు."
అంతలో హెలెన్ ఇంటి ముందు కారు ఆగింది. కారు లోంచి ఓ పెద్ద మనిషి దిగాడు. ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం ఉల్లి పోరలాంటి సిల్కు లాల్చీ లోంచి మెరుస్తుంది. నిగ్గు లాంటి తలకట్టు షోగ్గా దువ్వుకుని, ప్రేము లేని రోల్డు గోల్డు కళ్ళ జోడు పెట్టుకున్నాడు . నాలుగు వెళ్ళకూ నాలుగు ఉంగరాలు మెరుస్తున్నాయి.
లోపలికి వచ్చి నన్ను చూచి క్షణం ఆగాడు. బహుశా ఏకాంతంగా హెలెన్ తో మాట్లాడాలని వచ్చి ఉంటాడు.
"మీ ఒంట్లో ఎలా ఉంది?' అన్నాడు.
"నాకేం రోగం? రాయిలా ఉంటె?"
"మీకు జ్వరం తగులుతుందని లక్ష్మీ పతి చెప్పాడు లెండి."
"అలా చెప్పాడా మహానుభావుడు ! నిన్న వచ్చాడు. కాస్త మైకం లో ఉన్నట్టు న్నాడు. కడుపు నిండా చివాట్లు పెట్టి పంపించాను. మతిపోయి మీతో అలా చెప్పి ఉంటాడు. మీరు పిక్చరు తీసేటప్పటికి నాకు వృద్దాప్యం వచ్చేట్టుంది. పెళ్లి కూతురికి బదులు అత్తగారి వేషమివ్వాలి" అంటూ నా వైపు తిరిగి , "ఈయన నేను పుట్టక ముందు నుంచి పిక్చర్ తీయాలని కారులో తిరుగుతున్నారు. ఆ పిక్చర్ రహస్యం నా ఒక్కదానికే తెలుసు" అంది.
ఆ పెద్ద మనిషి బిక్క చచ్చి , "రేపు మద్రాసు వెళ్దాం రండి. పై వారం మీకు చిన్న టెస్ట్ తీసుకోవాలను కుంటున్నా" అన్నాడు.
"లక్ష రకాల టెస్టులు ఎన్నర్ధం బట్టీ చేస్తూనే ఉన్నారు గదండీ, రాజు గారూ" అంది హెలెన్.
ఒక క్షణం ఆగి, "సరే, అలాగే వస్తాను మద్రాసు. చాకలి బట్టలు తేకపోతే మీరు కొందురు గాని" అంది నవ్వుతూ హెలెన్.
రాజుగారు ఆమె దగ్గిర , నా దగ్గిర సెలవు తీసుకు వెళ్ళిపోయాక, "అతగాణ్ణి చూశావా! కులాసా పురుషుదులే. ఎప్పుడూ భూమికి ఆరు గజాల ఎత్తున ఎగురుతుంటాడు. డబ్బుంటే ఇప్పుడు సుఖం టోకుగా కూడా కొనుక్కోవచ్చు గా!" అంది.
