Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 15


    "నాకిప్పటికి బాగా జ్ఞాపకం. అప్పుడు నేను అయిదో తరగతో, ఆరో తరగతో చదువు తున్నాను. నా కప్పట్లో లెక్కలు అసలు రాకుండా ఉండేది. అవి సాంవత్సరిక పరీక్షలు. ఒక్క సబ్జెక్టు లో పోయినా ఫెయిల్ చేస్తుండేవారు. నేను అ ఏడు పాసు కావాలంటే లెక్కలు పాస్ కాక తప్పదు. తతిమ్మా అన్ని సబ్జక్ట్స్ లోను బాగానే ఉండేవాణ్ణి. లెక్కల పరీక్ష నాటి రాత్రి 'భగవంతుడా , నీదే భారం .....నీదే భారం ' అని కళ్ళు మూసుకుని ప్రార్ధించాను. రెండో రోజు అదృష్టవశాత్తు నేను కూర్చున్న సీటు దగ్గిరనే అన్సర్ పేపర్స్ పెట్టె డెస్క్ పెట్టారు. దాదాపు రెండు గంటల వరకు ఊరికే కూర్చున్నాను. ఇన్ విజిలేటర్ వస్తున్నప్పుడల్లా ఏదో చేస్తున్నట్లు యాక్ట్ చేస్తుండే వాణ్ణి. అలా రెండు గంటలయిన తరవాత ఎవరో పరీక్ష రాసిన కుర్రాడు అన్సర్ పేపరు తెచ్చి ఆ డెస్క్ మీద పెట్టాడు. భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ , చేతులు వణుకుతుంటే నెమ్మదిగా ఆ మొదటి పేజీలో ఉన్న లెక్క వరకు జాగ్రత్తగా కాపీ కొట్టాను. తరవాత పది నిమిషాలకు ఇంకో కుర్రాడు వచ్చి తన పేపరు అక్కడ పెట్టాడు. మీరు అది నా అదృష్టమనుకోండి , లేకపోతె భగవంతుడు ఆవిధంగా ఎరేంజ్ చేశాడనే అనుకోండి. ఏమైతే నేం , ఇంకో ప్రాబ్లం ఆ పేపర్లో అన్సర్ చేయబడింది. నెమ్మదిగా అది కూడా ఎక్కించాను.
    ఇంకాస్సేపు ఓపిగ్గా వెయిట్ చేశాను. ఇంకో ప్రాబ్లం కష్టపడి నా పేపర్లో ఎక్కిస్తే చాలు. నేను పాసవుతాను. నా ప్రార్ధనలు ఫలించినట్లున్నాయి. ఇంకో కుర్రాడు పేపరు ఇచ్చి వెళ్ళాడు. నెమ్మదిగా అది కూడా ఎక్కించి అన్సర్ పేపరు గిరాటేసి ఆనందంగా ఎగిరి గంతులు వేస్తూ ఇంటికి వచ్చాను. భగవంతుడున్నాడని ఎందుకనో ఆ క్షణం లో నమ్మ బుద్దయింది."
    ప్రియ "మీరు చూడబోతే మొత్తం క్లాసులన్నీ అలాగే పాసు అయినట్లుంది" అంది రాజగోపాలాన్ని ఉదికిస్తున్న ధోరణి లో.
    అతడు నవ్వుతూ "తర్వాత భగవంతుడి అనుగ్రహం నాకు సంపాదించవలసిన అవసరం రాలేదు. భగవంతుణ్ణి గురించి అలోచించి నప్పుడల్లా ఈ సంఘటన నాకు జ్ఞప్తి కి వస్తుంది. ఒకవేళ భగవంతుడనే వాడు ఉన్నాడనే అనుకున్నప్పటి కి పరీక్షల్లో విద్యార్ధులను ఈ విధంగా కాఫీ కొట్టేటట్లు చేసి పాసు చేయించటం, ఎలక్షన్ల లో సారా పోయించిన కాండిడేటును తనకు ముడుపు కట్టినందు వల్ల గెలిపించటం చూస్తుంటే మాత్రం ఆ భగవంతుణ్ణి ఇమ్మిడియట్ గా డిస్ మిస్ చేయవలసిన విధి మనమీ దుంది" అన్నాడు.
    రాజగోపాలం మాటలు రవిలో ఆలోచనలను బాగా రేకెత్తించాయి. ఏమీ మాట్లాడకుండా ఏదో అలోచిస్తూ అతన్నే చూడసాగాడు.
    "ఏదో యాదృచ్చికంగా నేను కాఫీ కొట్టి పాసు కావటానికి అన్నీ కలిసి ఉండవచ్చు. అంత మాత్రం చేత నేను భగవంతుడి ఉనికిని నమ్మితే మాత్రం నన్ను మించిన తెలివి తక్కువ వాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండదు. అణువును బద్దలు చేసే యాటం ను కనిపెట్టిన ఈ విజ్జాన యుగం లో హేతువాదానికి అందని ఈ సమస్యలను విడమర్చి ఒక అర్ధాన్ని గ్రహించటం కష్టమే. అయినప్పటికీ "భగవంతుడున్నాడు. ఈ చెడ్డ పనులు చేస్తే (చెడ్డ పనులు అంటే ఇక్కడ మనందరి చేత చెడ్డ అనిపించుకున్నవి) నిన్ను శిక్షిస్తాడు. అందువల్ల అది మానేయ్" అని చెప్పడం వల్ల భగవంతుడి కి వేరిచి అలా నమ్మేవాళ్ళు చేయకునా ఉండేటట్లయితే , నేను అటువంటి వారి దగ్గిర భగవంతుడున్నాడనే చెప్పమంటాను. మంచిని వ్యాప్తి చేయటం కోసం భగవంతుణ్ణి ఎక్స్ ప్లాయిట్ చేయటం లో తప్పేమీ లేదని నా ఉద్దేశ్యం.
    సాలోచనగా తలూపుతూ చూశాడు రవి.
    "మీకు వింతగా ఉండవచ్చు. పరస్పర వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తిగా కూడా మీకు నేను అనిపించవచ్చు. 'ఈ భగవంతుడున్నాడన్న నమ్మకం వల్ల మానవుడికి అపకారం జరుగుతుంది. నాస్తికత్వం వల్ల మనిషి లో మంచి ప్రేరేపించబడి శాంతి, సాహర్ధత పరస్పర స్నేహశీలత పెంపొందించబడుతుంద'ని నిరూపించబడిన నాడు నేను నాస్తికుడు గా మారిపోవటానికి కూడా సంకోచించను. అవీ భగవంతుడి ని గురించి నా నమ్మకాలు" అన్నాడు మందహాసం చేస్తూ.
    అప్పటికే చాలా సమయమయింది. రవి లేచాడు వెళదామని. "భోం చేసి వెళ్ళండి" అంది ప్రియ. "నిజమే . భోజనం చేసి వెళ్ళండి" అంది ప్రియ. "నిజమే . భోజనం చేసి వెళ్ళండి" అని రాజగోపాలం కూడా బలవంతం చేశాడు.
    అవాల్టికి అక్కడ తినక తప్పింది కాదు రవికి.
    గదికి వస్తుంటే అన్నాడు రాజగోపాలం "మీకు ఎకడమిక్ ఇంటరెస్ట్ చాలా ఉన్నట్లు నా కన్పిస్తుంది. ఏదైనా రిసెర్చ్ లాంటిదో , పరీక్షలకు కూర్చోటం లాంటిదో చేస్తే ఎలా ఉంటుంది?"
    రవి ఏమీ మాట్లాడలేదు. రాజగోపాలం మాత్రం "అన్ని చికాకులు మరిచి పోవడానికి పరీక్షలు మందం టారు. హాయిగా మీరు ఏదన్నా పరీక్ష కు కూర్చుంటే బాగుంటుందే మో ! నేను మీ దగ్గిర ఎక్కువ చనువు తీసుకుంటున్నానెమో . ఈ విషయం అలోచించండి. తరవాత మీ ఇష్టం ' అన్నాడు.
    ఏం మాట్లాడకుండా సెలవు తీసుకొని వచ్చేశాడు రవి.

                                

                                   10
    రవిచంద్ర ఇంటికి చేరుకోనేసరికి బాగా పొద్దు పోయింది. గదిలో చాలా కోలాహలంగా ఉంది. తలుపులు వేసి ఉన్నాయి.
    "సురేంద్రా.......సురేంద్రా " అని పిలిచాడు రెండుసార్లు.
    లోపలినించి కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. రవికి ఏమీ అర్ధం కాలేదు. "సురేంద్రా " అని ఈసారి గట్టిగా పిలిచాడు.
    కాసేపటికి తలుపులు గాభాల్న తెరుచుకున్నాయి. గుప్పున ఏదో వాసన కొట్టింది. తలుపు తీశాడు సురేంద్ర. కళ్ళు మత్తుగా జోగుతున్నాయి. మనిషి తూలుతున్నాడు.
    "రా! లోపలకు రా!"ఆన్నాడు.
    రవి అచేతనుడయ్యాడు . తనను తాను సంబాళించుకొని లోనికి వెళ్ళడానికి రెండు క్షణాలు పట్టింది.
    ఆ గదిలోకి వెళ్ళగానే తుళ్ళుతూ తూలుతూ నలుగురు -- ఎవరో తెలియని వ్యక్తులూ-- కనపడ్డారు. గ్లాసులో ఉన్నది ఖాళీ చేస్తూ ఏదో విషయం మీద పెద్దగా వాదించుకుంటూన్నారు.
    సురేంద్ర "రవీ, నీవు లోపల పడుకోవచ్చు" అన్నాడు, రవి లోపలకు రావడం చూసి. ఆ నలుగురు కూడా రవిని చూశారు. అందులో ఒకడు బల్ల మీదికి వంగుతూ మత్తుగా "వై నాట్ యూ జాయిస్ అజ్" అన్నాడు.
    "డోంట్ ఫోర్స్. హి డజంట్ లైక్ ఇట్" అన్నాడు సురేంద్ర సీసాలోంచి గ్లాసులోకి వంచుతూ.
    నెమ్మదిగా రవి లోనికి వెళ్లి పక్క పరుచుకున్నాడు. పక్క గదిలో గ్లాసుల కోలాహలం చాలా సేపటికి గాని తగ్గలేదు. అంతసేపూ అలాగే నిశ్చలంగా పడుకొని ఏదో ఆలోచించ సాగాడు. అతనికి ఈ నాగపూర్ జీవితం మొత్తం చాలా చిత్రంగా అనిపించసాగింది. జీవితంలో తానెన్నడయినా ఈ మూల నివసిస్తానను కున్నాడా? ఆ ప్రశ్నకు "లేదు" అనే సమాధానం తప్ప ఇంకోటి లేదు అని అతనికి తెలుసు. ముక్కు, మొహం తెలియని రాజగోపాలం తో ఇంత సన్నిహితుడవుడనుకున్నాడా? ఏనాటి స్నేహితుడో అయిన సురేంద్ర తో ఈ విధంగా గడప వలిసివస్తుందని కూడా అతను ఎన్నడూ అనుకోలేదు. జీవితాన్ని ఆ రాత్రి అంత పెద్ద మలుపు తిప్పేంత వరకు భావి జీవితాన్ని గురించి అతనెన్నడూ ఆలోచించలేదు. అతనికి అప్పటి వరకు జీవితం పండిన కలలా, వడ్డించిన విస్తరిలా అనిపించింది. ఏమిటిది? ఇలా ఎందుకయింది? ఇలా ఎందు కయింది? ఆ ప్రశ్న అతన్ని పదేపదే వేధించింది. కాని సమాధానాన్ని చూపించలేదు. "ఇందులో నీ తప్పు గూడా ఉంది' అని ఏ మూలో ఎవరో అతని లోంచే అన్నట్లు అనిపించింది. కాని ఎందుకనో ఆ విషయాన్ని అంగీకరించడానికి అతని మనస్సు అంగీకరించలేదు. ఎన్నిసార్లు అలోచించి నప్పటికీ ఆ పరిస్థితుల్లో తనకు అంతకంటే మార్గాంతరం లేదు.
    'నేను ఆ నరకం లో ఉండలేను. నరకాన్ని చవి చూడక మునుపే బయటకు రాగలిగాను' అనే ఊహ స్పురించి ఎందుకనో కాసేపు ప్రాణానికి శాంతి కలిగినట్లయింది.
    
                              *    *    *    *
    'ముందు తను చేయవలిసింది ఏమిటి?' సూటిగా ఆలోచన అతన్ని నిలబెట్టి అడిగింది.
    "నేనేం చేయాలి? ఎన్నాళ్ళిలా గడపాలి? ఏ వ్యాపకం లేకుండా ఏ విధంగా ఉండాలి ?' లెక్కకు మించిన ప్రశ్నలు ఎందుకనో అతన్ని ఆ రాత్రి ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. వీటన్నిటిని మరిచి పోవడానికని నిద్రపోదామని శతవిధాల వ్యర్ధ ప్రయత్నం చేశాడు.
    నిద్ర పట్టక విసుగ్గా అటూ ఇటూ పొర్లుతున్న సమయంలో బయట వాళ్ళందరూ వెళ్ళిపోతున్న సవ్వడి వినిపించింది. అటు తరవాత సురేంద్ర తలుపు మూసి తూగుతూ తన గదిలోకి వచినట్లు గూడా అనిపించింది. కళ్ళు తెరవకుండానే అలాగే నిద్ర పోతున్నట్లు నటించడానికి ప్రయత్నించాడు. కాని సురేంద్ర లైటు వేయటం తో చటుక్కున కళ్ళు తెరిచి అతన్ని అసహ్యంగా చూశాడు.
    తూలుతూ వచ్చి అతను పక్కన కూర్చున్నాడు.
    రవి కొంచెం కోపంగా అతన్ని చూశాడు. "నన్ను క్షమించు , రవీ! నాకీ బలహీనత ఉన్నదన్న సంగతి ముందే చెప్పలేక పోయాను." అతని మీదికి వంగుతూ సురేంద్ర అన్నాడు.
    రవి ఏమీ మాట్లాడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS