Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 15


                                   8
    వేకువ ఝామున ఇంటికి వచ్చి మంచం మీద వ్రాలాడు విమల భర్త. అతనికది అలవాటే కాబోలు. అతను లోపలికి వస్తుంటే చవకబారు సెంటు వాసన గుప్పు మంది. అప్పుడే మెలకువ వచ్చిన సుమిత్ర కి కడుపులో వాంతి వచ్చినంత పనైంది. పిల్లలు స్కూలుకి వెళ్ళిన తరువాత తొమ్మిదిన్నరకి నిద్రలేచిన సత్యానందం, 'ఏయ్ విమలా కాఫీ!' అని కేకపెట్టడం, విమల స్ట్రాంగ్ డికాక్షన్ అతని కోసం ప్రత్యేకంగా తీసి చిక్కని పాలు కలిపి ఎక్కువ పంచదారవేసి శ్రద్దగా తీసుకుని వెళ్ళడం గమనించింది సుమిత్ర.
    'ఏమిటి మీ మంతనాలు!' అన్నాడు సత్యానందం కాఫీ గ్లాసు అందుకుని.
    'మంతనాలెం లేవు బావగారూ! మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారని అడిగాను!' అన్నది సుమిత్ర గదిలోకి వచ్చి.
    'నువ్వలా అడక్కూడదు --' అన్నాడు సత్యానందం నవ్వుకుంటూ.
    ఆ నవ్వు సుమిత్ర కి కంపరం కలిగించింది.
    'మరే! అడగడం తప్పే! మీరు వెళ్ళడమూ తప్పే! ఇవాళ నేను చుట్టాన్ని వచ్చానుగా! ఇంట్లో వుండండి! సరదాగా పెకాడు కుందాం!' అన్నది ధైర్యం చేసి.
    'కాలక్షేపం పేక నేను చస్తే ఆడను! ఉద్యోగస్తురాలివి కదా! స్టేక్ ఎంతో చెప్పు!' అన్నాడు సత్యానందం సిగరెట్టు ముట్టించు కుంటూ.
    అంత ఖరీదైన సిగరెట్టు అతను వెలిగించుకుంటూ వుంటే, అవతల గదిలో చిరిగిన ప్యాంట్ తోడుక్కోవలసి వచ్చినందుకు విసుక్కుంటున్నాడు అతని పెద్ద కొడుకు!
    'ఎమిటక్కా! వాడి గొడవ!' అన్నది సుమిత్ర అటు తిరిగి--
    'కాలేజీ లో చదివే వెధవాయేను ! మంచి బట్టలే లేవు' అన్నది విమల.
    'అదేం బావగారు అల్లా చేశారూ! పెద్ద కొడుకును ఈ ఏడు కాలేజీ చదువు మాన్పించేశారు! పైగా వాడికి చిరిగిన బట్టలేమిటి ఖర్మ! జమీందార్ల వంశానికి చెందిన వారసుడు!' అన్నది సుమిత్ర హేళన చేస్తున్నట్లుగా.
    'వాడికి బట్టలు లేవని నాకేం తెలుసు! మీ అక్కయ్య చెబితేగా! రేపు నేను గుంటూరు వెళ్ళే పనుంది. అప్పుడు పట్టుకోస్టాలే! కొంచెం డబ్బుకి ఇబ్బందై ఈ ఏడు వాడి చదువు ఆపాల్సి వచ్చింది. ఈ ఏడు చేరుస్తాలే బి.ఏ. లో!'
    'చాలా కేర్ లెస్ గా మాట్లాడతారు బావగారు! కొంచెం సంసారం బాగోగులు పట్టించుకోండి . ఎందుకైనా మంచిది!'
    గంబీరంగా అన్న మరదలు కేసి ఆశ్చర్యంగా చూస్తూ అక్కడి నుంచి లేచి పోయాడు సత్యానందం.
    'ఆయనతో నీకెందుకే గొడవా!' అన్నది విమల.
    'ధైర్యం లేని వాళ్ళకి అన్నీ గొడవలు గానే వుంటాయి. చెత్త పోగు చేసి తగలబెట్టడం మనకి సరదా! ఇల్లంతా ఇలా పనికి రాని బూజుతో నిండి వుండడం నాకు యిష్టం వుండదు. నీకెందుకు మీ అయన తలలో బూజు దులిపి, చిత్తూ కాగితాలు తగలబెట్టి , అయన మెదడు కి సున్నం వేసి ఎలక్ట్రిక్ బల్బు వెలిగించే ధైర్యం వుండాలి నీకు. అప్పుడు బాగుపడుతుంది మీ సంసారం-- ప్రయత్నించు -- ' అన్నది సుమిత్ర.

                          *    *    *    *
    'చాలా రోజులున్నారు -' అన్నాడు బసవరాజు పబ్లిక్ గార్డెన్ లో లాన్ మీద కూర్చుని సుమిత్ర కేసి గారంగా చూస్తూ.
    'ఇంకా వుండాలనే అనుకున్నా -- లాస్ ఆఫ్ పే మీద సెలవిచ్చారు -- ఇంతలో బాంక్ నుంచీ ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది.' అన్నది సుమిత్ర.
    'ఇంటర్వ్యూలో బాగా చేశారా? ఉద్యోగం తప్పకుండా వస్తుందా? అల్లా జరిగితే ఎంత బావుండునూ!' అన్నాడు బసవరాజు మళ్లీ--
    'మీకేం! అన్నీ బాగానే వుంటాయి -- విమలక్క ఊరెళ్ళి వాళ్లనేదో బాగుచేద్దామను కునే సరికి వాళ్ళబ్బాయిని చదివించమని నా వెంట తరిమారు! నాకు ఎంత మంచి ఉద్యోగం వచ్చినా డానికి తగ్గ ఖర్చు వుంటూనే వుంటుంది!' అన్నది సుమిత్ర.
    'ఫరవాలేదు లెద్దురూ! ఖర్చు లేకపోతె మీ ఆడవాళ్ళు మరీ షాపుల్లో పౌడర్లూ, క్రీములూ , స్నో లూ చీరెలూ బ్రతకనివ్వరు!'
    'మీ జోకులకి నవ్వే ఓపిక నాకిప్పుడు లేదు కానీ, నాకు సాయం చేసి పెట్టండి '
    'మీరు అడగడం నేను కాదనడమూనా! చెప్పండి-'
    'నాకో గది కావాలి వుండడానికి -- మా అక్క కొడుకూ నేనూ వుండడానికి చాలినంత ది. ఎంత త్వరగా చూసి పెడితే అంత మంచిది -- ఇంక నే వెడతాను-- ' అని లేచింది సుమిత్ర.
    'మీ ఆడవాళ్ళు వొట్టి స్వార్ధపరులు . మీరు చెప్పదలుచుకున్నదంతా చెప్పి వెళ్ళిపోతారు. గానీ మేం చెప్పేది వినరు--'
    'చెప్పండి -- ఎందుకు వినం?'
    'మీకు నేను చూసి పెట్టిన రూం లో గాలీ వెలుతురూ రాకపోతే నన్ను తిట్టకూడదు - నీళ్ళు రాకపోతే నామీద ఫిర్యాదు చెయ్యకూడదు-- ఇంటి వాళ్ళు  మీతో పోట్లాడితే మీరు నామీద పోట్లాడ కూడదు -- వాళ్ళు పొమ్మంటే నామీద కోప్పడకూడదు'
    'కానివ్వండి -- తప్పుతుందా!'
    'అన్నట్లు బ్యాంక్ లో ఉద్యోగం వస్తే రోజూ కనిపిస్తారన్న మాట!'
    'ఇప్పుడు కనపడుతూనే ఉన్నానుగా!' మెత్తగా నవ్వింది సుమిత్ర.
    'మీ సెక్షన్ వేరు -- నాది వేరు-- అయితే నేం లెండి-- మూసేసే వేళకి నేను సెక్షన్ లో నుంచే నడిచి పోతాను బయటికి!'
    'బావుంది మీ వరస! నా రూం సంగతి మర్చి పోకండెం!' అని బస్సు కోసం బయలు దేరింది సుమిత్ర.
    ఆమె వెళ్ళిపోయాక అర్జెంటు గా స్నేహితుణ్ణి కలుసుకుని సైకిలేసుకు ని చిక్కడపల్లి అంతా గాలించి వెంకటేశ్వర స్వామి కోవెల దగ్గర వసతులన్నీ వున్న ఒక గది కనిపెట్టి ఇంటి వాళ్ళతో మాట్లాడి, తాళం వేసి హాయిగా నిద్రపోయాడు బసవరాజు.
    'ఇంత త్వరలో ఎలా దొరికింది ఇల్లు!' అని ఆశ్చర్యపోయింది సుమిత్ర.
    'శ్రద్ధ అలాంటిది!' అని కామెంట్ చేసింది కుముదిని.
    'ఇంత శ్రద్దలో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తే భరించలేను -- ' అన్నది సుమిత్ర, అతనికి కాఫీ యిచ్చి.
    'మిమ్మల్ని ఎడ్మైర్ చేసే హక్కు నాకు లేదా ఏం?' అన్నాడు బసవరాజు. సుమిత్రతో సమానంగా ఇల్లంతా సర్ది పెట్టి.
    పిన్నితో అంత చనువుగా మసలుతూ ఇల్లంతా తనదేనన్నట్లు తిరిగే అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు కృష్ణ మూర్తి.

                              
    "ఈయన నా శ్రేయోభిలాషి . స్నేహితులు-- చాలా మంచివారు--' అని పరిచయం చేసింది సుమిత్ర.
    'మా దగ్గర నుంచీ వెళ్ళిపోవడానికి ఈ పిల్లాడిని తెచ్చావు కాబోలు !' అని దెప్పి పొడిచిన కుముదిని ఆ సాయంత్రమే చెల్లెళ్ళ ని తీసుకుని సుమిత్ర గదికి వచ్చేసింది.
    'హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికే దానికి ఈ హంగామా అంతా ఏమిటే , వంట చెయ్యడం నీకెక్కడ కుడురుతుందనీ!' అని జాలిగా చూసింది గదిలో సామాను వంక.
    'ఇద్దరం హోటల్లో తింటే చాలా డబ్బు ఖర్చవుతుంది. కుముదినీ-- నేను విశ్వానికి డబ్బు పంపాలి -- వీణ్ణి చదివించాలి . వీటన్నిటికీ ఎలా వస్తుంది డబ్బు! అందుకే వంట చెయ్యడానికి పూనుకున్నాను--'
    'నీదంతా వట్టి జాలి గుండె . విశ్వానికి మల్లినే ఇతని క్కూడా డబ్బు పంపితే సరిపోయేది గా-- ఇక్కడి కెందుకు తెచ్చావు --' అని విసుక్కుంది కుముదిని--
    'అక్క ఎంతో దీనంగా అడిగింది కుముదినీ-- తీసుకురాక తప్పింది కాదు-- నాకు మటుకు ఎవరున్నారు తినడానికి! వీళ్ళే కదా!'
    "వీళ్ళేమిటి సుమిత్రా! నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం  నీకేర్పడదా!"
    'ఏమో! నేనదంతా ఆలోచించలేదు -- అక్కయ్య బ్రతిమిలాడింది. తీసుకొచ్చాను. అంతే -- నాకప్పుడే పెళ్ళే'క్కడ కుదిరింది! ' అని నవ్వుకుంటూ వెళ్ళిపోయిన సుమిత్రని చూస్తూ అల్లాగే కూర్చుంది కుముదిని. బ్యాంకు లో ఉద్యోగం రావడం వల్లన సుమిత్ర కి జీతం అరవై రూపాయల దాకా పెరిగింది. అక్కడ పని కూడా కొంచెం కష్టమే, సాయంత్రాని కల్లా తలనొప్పి రావడం సాగించింది. అన్నీ కూడికలూ, హెచ్చవేతలూ చేస్తూ సతమత మావుతూన్న సుమిత్ర కి ఓరోజు ఫోన్ కాల్ వచ్చింది.
    'మీ ట్యూషన్ ధర్మమా అని అమ్మాయి లిద్దరూ ప్యాస్ అయ్యారు. సెకండ్ ర్యాంక్ వచ్చింది. దయచేసి ఈ ఏడు కూడా చెప్పండి. జీతం కావాలంటే పెంచుతాం -- సాయంత్రం ఓ మాటు రండి . అమ్మాయిలు మీకు టీపార్టీ యివ్వాలని  అత్ర పడుతున్నారు --' అన్నది మిసెస్ అగర్వాలా వచ్చీ రాని ఇంగ్లీషులో.
    'ఈ ఉద్యోగమే తలనొప్పి -- అదికాక ట్యూషన్ కూడా ఎందుకు! వద్దు వెళ్ళకండి! ఆరోగ్యం చెడి పోతుంది ' అన్నాడు బసవరాజు.
    'సారీ బసవరాజూ! ఎన్నాళ్ళ నుంచో ఎం.ఏ చదవాలనే కోర్కె వుండిపోయింది. బెనారస్ వెళ్ళడానికి బోలెడు డబ్బు కావాలి -- నా జీతంలో మిగలదు-- ఉద్యోగమూ చెయ్యాలి-- ట్యూషనూ చెప్పాలి-- తప్పదు - లేకపోతె-- ఎప్పుడైనా మీతో అలా ఐస్ క్రీం తినదానికైనా పర్సు లో పైసా వుండదు' అనేసింది సుమిత్ర.
    'ఇంత అందమైన సాయంత్రాలన్నీ అగర్వాలా గారి ముద్దు పాపాలకి నీతులు బోధిస్తూ గడపండి' అన్నాడు బసవరాజు కసిగా.
    'ఒక్కొక్క నిమిషం ఖరీదు లక్ష రూపాయ లిప్పుడు -- నాకు చదువెం వస్తుంది!' అని విరక్తిగా అనుకుంది సుమిత్ర ఒకరోజు కుముదిని ఇంట్లో కూర్చుని. ప్రొద్దున వంట, తరువాత ఆఫీసు, మళ్ళీ ట్యూషనూ, వంట, ఇక అప్పుడు చదువుకోడం! కొంచెం ఆలస్యంగా నిద్రపోతే త్వరగా మెలకువ రాదు -- త్వరగా నిద్ర లేవకపోతే పని కాదు. ఆఫీసులో లేటు మార్కు. తొమ్మిది గంటల కల్లా కృష్ణుడి కి భోజనం పెట్టి పంపాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS