Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 15

 

                                    22

    "తన గురించి తనకు తెలుసు ననుకోడమే అసలు భ్రమ అంటారుకదా విజ్ఞులు. ఇక పరాయివారి గురించి తనకు తెలుసు ననుకోడం మూర్ఖత్వమే కద?"
    భాస్కరం సురేఖ గురించి మంచిగానూ అనుకోలేదు. చెడ్డగానూ అనుకోలేదు. అసలా పిల్లను కలుసుకుని నాలుగూ చెప్పి.....తన చెల్లెలికి జరుగనున్న యీ పెళ్ళి తప్పించవద్దని అడగా లను కున్నాడు గాని.....తీరా ఏమో.....సురేఖ  ధనమ్మ గారికి చెప్పి ఆమె ముకుందం తండ్రిని పిలిచి ..... పెళ్ళి రసాభాస చేయడమే గాకుండా తనమీద కసి తీర్చుకుంటే?.....
    తనను కన్న బిడ్డ కంటే ఎక్కువగా, పెంచి పెద్ద వాణ్ణి చేసిన జానకమ్మ పట్ల చూపాల్సిన విశ్వాసం "వసంతకి ఈ చక్కని సమ్మంధం చెదిరిపోయేలా చేయడం కాదని" భాస్కరానికి తెలుసు.
    అవసరమైతే తనేనా త్యాగం చేయాలి. అంటే సురేఖను పెళ్ళాడాలి?! అది త్యాగమా? స్వార్ధమా?
    "ఛీ! ఛీ! ఎంత నీచంగా అనుకున్నాను."
    భాస్కరానికి రెండో ఆలోచన బొత్తుగా నచ్చలేదు. "అరిటాకు" లాంటి ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడకూడ దనుకున్నాడు. పద్మావతికి అనుమానం రావచ్చును. కోపమే రావచ్చును. ఇక సురేఖకి కూడా అహంకారం దెబ్బతిని క్రోధంలో ఆపిల్ల తనకు గాకపోయినా తన చెల్లెలికేనా అపకారం తలపెట్టవచ్చును. "ఏమేనా అందర్నీ దగా చేయగల్గడం తనవల్ల గాదు" దుఃఖమే వొచ్చిందతనికి.
    ఎంతపని చేశాను? అని బాధపడ్డాడు పదేపదే భాస్కరం.
    జయమ్మ అనే పేరు పిన్ని నోట విన్నాడు భాస్కరం. అదే పేరు పద్మావతి తల్లిదనీ కూడా తెలుసు భాస్కరానికి. సంప్రదాయాలన్నా, సంస్కార మన్నా జానకమ్మకున్న అభిప్రాయలు వేరు. వాటిని మార్చాలనుకొడం, నదని మరోమార్గ మంటా నడిపించాలనుకోడమే!
    ఆ రోజు తాను తల వూపకపోతే వసంతకు నచ్చిన సంబంధం, అందరూ మెచ్చిన సంబంధం పోతుంది. పిన్ని హృదయంలో కూడా తనకు గల స్థానం చెరిగిపోతుంది!
    "అట్నుంచి నరుక్కురమ్మన్నారు!" పిన్నికి కోపం తెప్పించి, ఆమెకు దూరమైపోతే దాని దారి వేరుగాని, ఆమెకు, వసంతకూ అపకారం జరగడం తను చూడలే ననుకున్నాడు భాస్కరం. తనను పెంచినందు కామె గుండెలుదీసిన బంటును కాలేనని అధైర్యపడిపోయాడు భాస్కరం.
    
                                *    *    *

    పద్మావతిని కలుసుకోగల ధైర్యం మనస్సుకి చిక్కలేదుగాని, విశ్వవిద్యాలయావరణలో అడుగు పెట్టిందగ్గర్నుంచీ కళ్ళు ఆమె కోసరమే వెదుక సాగాయి.
    ఏ నలుగు రమ్మాయిలు కలిసి అట్నుంచి, ఆడ పిల్లల విశ్రాంతి భవనం వేపు నించి దిగుతూ ఉన్నా అందులో 'పద్మ ఉందేమో' ననే ఆదుర్దాతో అతని కళ్ళు అటే తిరుగుతున్నాయి.
    "ఉహుఁ .... పద్మతో ఈ సంగతులన్నీ చెప్పేస్తాను" అనుకున్నాడు.
    అనుకుంటూ అటునించి వస్తోన్న మూర్తిని గుద్దేశాడు పరధ్యానంలో. "ఒరే, ఒరే" నేను గనుక సరిపోయింది ..... యిదే ఆశమంతకమణి ఐతేనా? అన్నాడు మూర్తి.
    "సారీ! నువ్వు అదృష్టవంతుడివి, ఆ శమంతకం అంత అదృష్టం చేసుకోలేదుగా మరీ!" అని నవ్వు తెచ్చుకుని క్షమాపణ చెప్పుకున్నాడు భాస్కరం.
    "అది సరేగాని, ఏవిట్రా? ఎవరిమీదో ఉంది నీ దృష్టి....." రెక్క పట్టుకుని క్యాంటీనులోకి లాక్కొనిపోతూ అడిగాడు మూర్తి.
    "మా చెల్లాయ్ పెళ్ళి....." అన్నాడు భాస్కరం.
    "భేష్.....బాగుందిరా, ఆనక నీకు పెళ్ళి గనక యిలా పరధ్యాన్నంగా వెతుక్కుంటున్నా వన్నమాట?" భుజంమీద ఒక్క చరువు చరిచి మరీ నవ్వేడు మూర్తి.
    "ఛా! నీ గోల నీది ..... అది కాదురా" అన్నాడు భాస్కరం.
    "ఏది కాదు? ఆ రెండో అమ్మాయి ఆ నీలం చీరె చిన్నది అది కాదా?"  అన్నాడు. మూర్తి దూరాన వస్తోన్న యువతుల బృందాన్ని చూపించి "చచ్చేం! ..... రా! .... లోపలికి" భాస్కరం మిత్రున్ని లోపలికి లాగేశాడు.
    మూర్తికే అర్ధం అవలేదు. కాఫీ తాగుతూ ఉన్నంతసేపూ భాస్కరం పరధ్యనంలోనే ఉన్నాడు. ఆ నీలం చీరే చిన్నది సురేఖ. మూర్తి పేర్కొన్న సురేఖను తనెందుకు తప్పించుకోవాలి? సరే యివాళ తప్పించుకున్నాడు. రేపు? సురేఖ పద్మ యిద్దరూ యూనివర్శిటీలో జాయిన్ అయ్యారు కదా. ఎలా? తప్పించుకుంటాడు?
    'ఒరేయ్ ! మూర్తీ నే నొకటి అడుగుతాను చెప్తావా?" ఆ సమయంలో మూర్తి భాస్కరానికి చాలా ఆత్మీయుడిలా అగుపించాడు. కాని అంతలోనే మూర్తి 'ఏమిటని' భావ యుక్తంగా కనుబొమ లెగురవేసే లోపునే "ఉహూఁ ..... ఏం లేదులే" అని మనసు మార్చుకున్నాడు.
    "ఒరేయ్! భాస్కరం .... నేను నేకు స్నేహితున్నేరా?" అన్నాడు మూర్తి.
    తలూపాడు ఇంకా పరధ్యానంలోనే ఉన్న భాస్కరం.
    "అయితే పద ....." లేచి దారితీసి తిన్నగా సముద్ర పొడ్డుకి తీసుకుపోయాడు మూర్తి.
    ఇద్దరూ ఇసుకలో కూలబడ్డారు.
    "ఎందుకురా అదోలా ఉన్నావ్?" ఒడ్డున విరిగిపడే కెరటాలను చూస్తూ అడిగాడు మూర్తి.
    "మనం ఎవరి జీవితంలోను అడుగుపెట్టనే రాదూ. అధవా పెడితే వాళ్ళ జీవన రంగంలో సముచితమైన పాత్ర వహించాలి ఔనా?" అన్నాడు. భాస్కరం.
    "మీ పిన్నిగారేమేనా అన్నదేమిట్రా?" తను యిసికెలో కూచుని మిత్రున్ని కూచోబెట్టాడు మూర్తి.
    "ఉహూఁ...... నా ప్రశ్న."
    "ఔను ..... నువ్వు స్థిరసంకల్పం లేనివాడి నైతే తొందరపడి, ఎవరి జీవితంలోను ప్రవేశించకూడదు."
    "అదే వచ్చింది చిక్కు......మరి యిప్పుడు ఒక కథ చెప్పనా?" కాని భాస్కరం మూర్తికి కథ చెప్పలేదు. ఆ యిద్దరి మధ్య అరమరికల్లేవు. అందుకనే నిజమే చెప్పాడు భాస్కరం.
    సూర్యుడు సముద్రపొడ్డున దోబూచులు మానేశాడు. దీపాలు వెలుగుతున్నాయి. లైటు హవుసు ఉండి వుడిగీ సముద్రంమీద ప్రసరిస్తోంది.
    "ఇప్పుడు వెళ్ళి ఎవరికీ ఏమని నేను చెప్పనురా" అన్నాడు భాస్కరం.
    "ఎవరికీ ఏం చెప్పినా పద్మావతికి మాత్రం ఏమీ వొద్దు. ఈ సంప్రదాయాలు పిన్ని పట్టింపులు ..... గట్రా చెపుతే ఆ అమ్మాయి.....ఏ కొరగాని త్యాగమో చేయొచ్చును. నీకు దూరం కావచ్చును కూడా" చెప్పేడు మూర్తి.
    "అదీగాక పద్మావతి సంప్రదాయం చెడ్డదనే శంక మనకు లేదుకదా?" అని అడిగేడు మూర్తి మళ్ళీ. "లేదు" అన్నాడు భాస్కరం. కాని అతనికి ఉన్నది అదేనని తనకే తెలీదు."
    "మీ పిన్నికి ఇష్టంలేదు. అంటే చాలదా?....వెంటనే ఆ పిల్ల చదువు మానేసి అవతలికి పోయిందనుకో....."
    జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి ఉస్సురవడం తప్ప మరో జవాబు చెప్పలేదు భాస్కరం.
    "పోనీ సురేఖతో చెప్పనా?" అన్నాడు స్వగతం పలుక్కున్నట్లు.
    "ఏమో మరి ..... నాకేం తెల్సు.....ఆ సురేఖను నే చూడలేదు కదా .... చెప్పలేమ్.....ఆవిడ ఎలా రియాక్టవుతుందో మరి" మూర్తి అనుమానంలో అసందర్భంగా ఏం తోచలేదు భాస్కరానికి. "ఏమో..... మొత్తంమీద అసలు వసంత పెళ్లికే చిక్కురావచ్చును."
    "ఔనులే! సరే! నువ్వు ఇదంతా మరిచిపోరా భాయ్! మొదట మా వసంత అత్తరింటికి వెళ్ళాలి. మా పిన్ని మనస్సు కుదుటపడాలి. అప్పుడు చూద్దాం" అన్నాడు భాస్కరం.
    మూర్తి రెక్క పుచ్చుకుని లేచాడు భాస్కరం. "సురేఖ కూడా పద్మకి నువ్వు నా కయినంత నేస్తంరా" న్నాడు. మళ్ళీ ఏదో స్ఫురించిన వాడిలా.
    "కాని, మనిద్దరి మధ్య పరువు ప్రతిష్టల గొడవ.....పెళ్ళి చూపుల బెడద జరుగలేదుగా..... ఆడపిల్లల అహంకారం చెడ్డదని మా మావయ్య చెప్పాడు" మూర్తి నవ్వేడు కాని భాస్కరం ఆ మాటలను మరోసారి మననం చేసుకొంటూ ఆలోచించాడు. "వాళ్ళ మావయ్య ఎవడోగాని సరిగ్గానే అన్నాడు" అనుకున్నాడు. తన "పిన్ని ని తల్చుకుని.

                                    23

    తల్లిని విశాఖపట్నం తెచ్చింది పద్మావతి.
    "మొత్తానికి నన్ను మళ్ళీ ఇంత దూరం ఈ ప్రాంతాలకు తెచ్చావు" అన్నది జయమ్మ కూతుర్ని ఉద్దేశించి. ఆ మాట ఆమె అనడం అది రెండోసారి. సామర్లకోట స్టేషను రాగానే ఒకసారి అన్నది అవే మాటలను.
    "ఎందుకమ్మా! చూస్తూ ఉండు" అంది పద్మావతి.
    "ఏమిటి?" అంటూ తల్లి కుతూహలం ప్రకతిన్చేసరికే కూతురికి సిగ్గు, భయం రెండు వచ్చి అవతలికి పోయింది. ఆ పిల్ల ఉద్దేశం భాస్కరం తనూ పెళ్ళి చేసుకోవడం .... అమ్మ సంతోషపడటం" యివన్నీ జరుగుతాయని.
    అయితే పద్మావతి పసిపిల్ల గాదేమో మధుర భావా లంతలోనే మాయమై వాటి వెనుకనే ఆందోళన రగిలింది. అసలు సమస్యలు చెలరేగాయి.
    "అయ్యో! అమ్మని వంచించి నేను ఈ వూరు ఈ చదువుకని తెచ్చానుకదా! కొంపదీసి ..... ఇది గట్టెక్కేనా?:" అన్నది అంతరాత్మ.
    "ఏం, ఫర్వాలేదే ..... ఎలాగో గడిపేస్తే..... ఇట్టే అయిపోదువుగాని. 'మాస్టరీ' ఉద్యోగమే మంచిది." జయమ్మ కూతురు మనసు చదివినట్లు బుజ్జగించింది.

                                 *    *    *

    కాలేజీకి వెళ్ళిందేగాని పద్మావతి కళ్ళు ఒక్క వ్యక్తి కోసరమే వెతుకుతున్నాయి. అంతమంది వెలిగించిన దీపాల్లాంటి; యిస్త్రీ మడతలు ధరించిన యువకుల్లో ఒక్క భాస్కరం అనే యువకుడి కోసరం ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోంది.
    సురేఖ అడిగింది:
    "అదేనోయ్, మీ భాస్కరంగారి సైన్సు కాలేజీ. ఎందుకే నామంచిది పోయివద్ధామా?" అని నవ్వుతూ.
    "పోవోయ్! నీ వెటకారం నువ్వూను."
    "అది సరేగాని, ఆ పెద్దమనిషి కొత్త వూరు కొత్త మాలోకం కదా? నిన్ను వోసారి చూసుకో వద్దే" సురేఖ అమాయకంగా అడిగినట్లు అడిగింది. ఐనా అందులో ఎక్కసక్కెం కూడా ఉంది. సురేఖకు భాస్కరంపట్ల అనుమానం ఉన్నది.
    పోదూ! మద్యని ఆయన కెందుకు?" పద్మావతి స్నేహితురాల్ని చేత్తో నెట్టింది. "నేనేం చంటిపిల్లను కానుగా" అన్నది కాస్త అభిమానంతో.
    "అదుగో" అంది ఒకసారి సురేఖ ఎవరినో చూసినట్లు.
    "ఎక్కడ?" అంటూ ఉలిక్కిపడ్డది పద్మావతి.
    "పిచ్చి పద్మా!" అంటూ గడియారం కేసి చూపించి విరగబడి నవ్వింది సురేఖ.
    "అమ్మో! షేక్స్ పియరు! అమ్మో క్లాసు" అంది పద్మావతిగుండెమీ చెయ్యివేసుకుని.
    ఇద్దరూ సంరంభంగా క్లాసుకి వెళ్లారు.

                                   *    *    *

    ఐతే క్లాసు జరుగుతూ ఉన్నంతసేపూ ఏమిటో వెలితి. ఎందుకో తెలీని బెంగ ఆ పిల్లకు కలిగాయి. ఒక్క ముక్క పాఠం తల కెక్కింది కాదు. భాస్కరాన్ని చూడాలి. భాస్కరంతో మాట్లాడాలి. అమ్మకి "ఆయనను" చూపించాలి. అదీ ఆలోచన. అదే ఆవేదన.
    అయితే తన తపస్సు వూరికే పోలేదు. సాయం కాలం "ఔట్ గేట్"లోనించి ఇంటికి వెళ్ళుతూ ఉంటే భాస్కరం అగుపించాడు. "పరుగెత్తి దగ్గరకు వెళ్దువా" అనుకున్న పద్మావతికి కోపంతో, ఉడుకుమోతు తనంతో, సంభ్రమంతో వొళ్ళు మండిపోయింది. నడుస్తున్నదో, నిలుచున్నదో తెలీకుండా ఐపోయింది.
    భాస్కరం ఆ పిల్లను చూచి చరచరా దగ్గరికి వచ్చాడు. కాని, ఎందుకో తెలియదు. సూటిగా చూడలేకపోయాడు. 'సురేఖ చెప్పే ఉంటుంది. అందుకే అట్లా చూస్తోంది;' అనుకున్నాడు. భయపడ్డాడు.
    "సురేఖ గారు వచ్చిందా?" అన్నాడు అదీ తొలికుశలప్రశ్న.
    "ఇదా మీ ప్రశ్న?" రోడ్డు ఐపోయిందిగాని లేకపోతే ఏడ్చేసేదే పద్మావతి.
    "లేదు ..... లేదు ..... నువ్వు నాకు ఉత్తరంలో ఎక్కడ దిగేదీ ఏమీ రాయలేదుగా."
    మనిషి సాకులు వెతికినప్పుడు అన్నింటికన్నా మంచి సాకు నేరాన్ని ఎదుటివాడిమీద నెట్టేయడ మనేదే.....గనుక భాస్కరం అదే చేశాడు.
    రెండడుగులు వేసింది పద్మావతి. ఇద్దరూ నడక నిష్క్రమణ ద్వారంకేసే సాగించారు. ఎవరూ మాట్లాడలేదు. ఎంతోమంది కుతూహలంగా వీరి కేసి చూసినా గమనించలేదు.
    "నువ్వు ఎక్కడ ఉంటున్నావు?"
    "ఇక్కడే....."
    "అంటే ..... సురేఖ వాళ్ళ హాస్టలు రూములోనా?"
    "ఎక్కడో అక్కడ ఉండాలిగా.....లేపోతే మీ రూములో ఉండనిస్తారా? ఏం?"
    "ఎందుకు ఉండనివ్వరు?" భాస్కరంలో సహజ చమత్కారధోరణి ఉన్నదేమో అది బయట పడుతూనే ఉంటుంది.
    "నా కర్మ ..... ఎందుకేమిటి? ..... సరేనే వస్తాలెండి" చినవాల్తేరుకేసి తిరిగింది.
    "ఇటెక్కడికి?"
    "సముద్రంలోకి" నవ్వింది ఆ నవ్వులో చిలిపితనం లేదు. ఆనందం కూడా లేదు. ఇద్దరి మధ్య ఏదో ప్రచ్చన్న వైరం ఉన్నట్లుంది. భాస్కరానికి "రెండు రెళ్ళు నాలుగు అన్నట్లు"గా సురేఖ ఏదో అని ఉంటుంది. 'లేకపోతే ఈ ముభావం ఏమిటీ" అనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS