తిరిగి వచ్చిన తరువాత ఒకనాడు మరకతం స్వర్ణ తో "స్వర్ణా! శైలు నీ అంత అదృష్టవంతురాలవుతుందని అంటే, అన్నా వదినలు బాధపడ్డారు. సభ్యత ప్రకారం అడగకూడదనుకో! అయినా , మీరంతా నా ఆత్మీయులని భావిస్తున్నాను. కాబట్టి అడుగుతున్నాను. వేరే విధంగా అనుకోకు. కారణం తెలుసుకోవచ్చా?' అని అడిగింది.
స్వర్ణ కళ్ళెత్తి మరకతం వైపు చూసింది. కళ్ళలో ఆలోచన స్పష్టంగా కనపడుతున్నది. పెదవుల మీద చిన్న చిరునవ్వు . అయితే తన పెదవులు నవ్వుతున్నాయని స్వర్ణ కు తెలిసినట్లు లేదు.
"మరకతం! మీమంతా నీ ఆత్మీయులమెగా?" నెమ్మదిగా అడిగింది స్వర్ణ.
"సందేహ మెందుకు? నువ్వు నా ఇష్టసఖి అని చెప్పాగా?' అన్నది నవ్వుతూ మరకతం.
"ఆ విధంగా అనుకొన్నట్లయితే , నీ సంగతి ఎప్పుడూ నాతొ చెప్పలేదెందుకు? డాక్టర్ సుధేష్ణ, రాజగోపాల్ గారూ నీ సన్నిహితులనే చెప్పావు గాని , నీ బంధువులని ఎన్నడైనా చెప్పావా? నా దగ్గర దాపరిక మెందుకు?" స్వర్ణ కళ్ళలో కుతూహలం తొంగి చూసింది.
ఎప్పుడూ నవ్వుతూ ఉండే మరకతం , స్వర్ణ మాటలు విని అలాగే ఉండిపోయింది. రెండు నిమిషాల తరవాత తేరుకొని, "ఇంత గొప్ప సంగతి ఎవరు చెప్పారు నీకు?" అని అడిగింది . ఎగతాళి గా అడగబోయినా , గొంతులో బాధ, కఠినత్వం ధ్వనించాయి.
"పొరపాటు , ఎవ్వరూ చెప్పలేదు. రాజ గోపాల్ గారూ, నీవూ ఒకలాగే ఉంటారు. కొంచెం జాగ్రత్త గా చూస్తె పోలికలు కనబడతాయి. మరొక్క సంగతి కూడా. రాజగోపాల్ గారు నీతో ప్రవర్తించే తీరు అచ్చంగా అల్లరి చెల్లెలి పట్ల అన్న ప్రవర్తించే తీరే! ఎంత చనువున్నా, పరాయి మగవాడితో అతి చనువుగా ప్రవర్తించే సంస్కారం మనకింకా రాలేదులే! కాబట్టి రాజ గోపాల్ గారూ, సుధేష్ణ నీ బంధువులని ఊహించుకోన్నాను. నా ఊహ సరి అయినదేనా?" అన్నది స్వర్ణ.
"అసలు సంగతంతా కొద్ది రోజుల్లో అందరికీ తెలిసిపోవచ్చు. అందాకా ఓపిక పట్టు. ఎన్నో రోజులు పట్టక పోవచ్చు. త్వరలోనే చరమాంకం ముగియ వచ్చు. అప్పుడు నా కధ నీకు గాక మరెవరికీ చెబుతాను? అయితే, నా కధ నా ముఖతః వినే అవకాశం నీకు రాకపోవచ్చు!" అన్నది మరకతం.
"అవకాశమెందుకు రాదు? ప్రతి దినం మనం కలుసుకొంటూనే ఉన్నాముగా?" అన్నది స్వర్ణ.
"భవిష్యత్తు ఎవరికి తెలుస్తుందోయ్? ఇన్నాళ్ళూ నువ్వూ, నేనూ పద్మా కలుసుకొనే వాళ్ళంగా! ఇప్పుడు పద్మ అమెరికా వెళ్ళి పోలేదూ!" అన్నది మరకతం.
"పద్మంటే అమెరికా వెళ్ళింది. నీ వెక్కడికి పోతావు?' చిరునవ్వుతో అడిగింది స్వర్ణ.
టక్కున జవాబిచ్చింది మరకతం. "స్వర్గానికి. ఊహు! నరకానికి!"
'ఛీ! ఏమిటీ అపశకునపు మాటలు!" మందలిస్తూన్నట్లుగా అన్నది స్వర్ణ.
"కబుర్ల కేమిటి గాని, కాలేజీ కి టైమవుతున్నది. బయలుదేరు!" అని హడావుడి పెట్టింది మరకతం.
ఇంతలో పోస్ట్ మన్ కనిపించాడు.
"స్వర్ణా! పద్దాలు జాబు వ్రాసినట్లుంది. త్వరగా రా!" అని గావు కేక పెట్టింది మరకతం.
కుతూహలంగా ఇద్దరూ జాబు చదివారు.
"స్వర్ణా! మర్కటం!
ఎట్లా ఉన్నారు మీరంతా? నా మొదటి జాబు అందిందిగా? రెండవ జాబు కాస్త ఆలస్యమైంది కదూ! ఇక్కడి పరిసరాలు గమనించి, మీకు విపులంగా జాబు వ్రాయాలని అనుకొన్నాను. అందుకే ఈ ఆలస్యం.
అమెరికాలో మన దేశపు కూరగాయలు, బియ్యము మొదలయిన వన్నీ చిక్కుతాయి. మన తిండి చిక్కదన్న దిగులే లేదు. చక్కగా కంది పచ్చడి కూడా చేసుకోవచ్చు. మన ఆంధ్రా వంటలంటే అమెరికనులకు విపరీతమైన మోజు! 'కారం' అని అంటూనే తింటారు!
ఇక్కడ మట్టిని అమ్ముతారు. నేను కొని మెంతులు చల్లాను. మెంతికూర పప్పు చేస్తే, నా స్నేహితురాలు కాధరీన్ స్మీత్ అనే అమ్మాయి ఎంతో మెచ్చుకుంటూ తినింది.
డబ్బు గురించి చెప్పాలంటే , ఇక్కడి డాలర్ మన రూపాయికి సమానం. జీవన వ్యయం మన కంటే హెచ్చు. అయితే, ఆధునిక సౌకర్యాల వల్ల మనకు టైం ఎంతో కలిసి వస్తుంది.
ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ అని ఉన్నది. చుట్టుపక్కల ఉన్న భారతీయ విద్యార్ధుల మంతా పదుహైదు రోజుల కొమారో, లేక విధిగా నెల కొక్క మారో కలుసుకొంటాము.
మొన్ననే అట్లా కలుసుకొన్నప్పుడు , కొందరు నన్ను పాట పాడమని బలవంతం చేశారు. నేను నీ పాట -- "ఏ కవి యెదలో పూచినా మధురోహలు ఈ పువ్వులు !" -- అన్నది పాడాను. తెలుగు వాళ్ళంతా చప్పట్లు కొట్టి, ఎంతో మెచ్చుకున్నారు. అసోసియేషన్ కు సరదాగా వచ్చిన అమెరికను లు పాటకు అర్ధం చెప్పమని నన్ను కోరారు. నేను నీ కవిత్వం సార్ధకమయ్యేట్లు వర్ణించి చెప్పి, ఈ పాట నువ్వు వ్రాశావని చెప్పాను. నిన్ను ఎంత మెచ్చు కొన్నారో చెప్పలేను! నువ్వే ఇక్కడ ఉంటె తక్షణం సన్మానసభ ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు!
మన తెలుగు వాళ్ళలో మిస్టర్ పి.ఎస్. ఎస్. రాయన్ అన్న అతను ఉన్నాడు. చాలా కాలంగా అమెరికా లో ఉంటున్నాడు. నా పరిచయం కోసం తహతహ లాడాడు. చెప్పడానికి సిగ్గవుతున్నది కాని, అతని కళ్ళలో ఆరాధన కనపడుతున్నది! మనిషి కూడా చక్కగా ఉన్నాడు. ఏమో? పరిచయం ముదరవచ్చు.
సాయం సంధ్యం లో నీ ఇల్లూ, మన స్నేహిత బృందమూ విధిగా జ్ఞాపకం వచ్చి, చెప్పరాని దిగులు కలుగుతుంది! ఆ నిమిషాన రెక్కలు గట్టుకొని మీ దగ్గరకు వాలాలని ఉంటుంది!
నా చదువు బాగా ఉంది. నేను తెలివి గలదానినని లెక్చరర్లు ఎంతో మెచ్చుకొంటారు!
మీరంతా కలిసి జాబు వ్రాయండి.
మీ
పద్మ."
కాలేజీ కి పోతూ , మరకతం -- "చదువు కోవడానికి అమెరికా పోయిన పిల్ల ఎవరో రాయన్న తో, రప్పన్న తో పట్టిందేమిటి?" అన్నది నవ్వుతూ.
స్వర్ణ జవాబివ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నది.
"నేను జోస్యం చెబుతున్నాను విను, తొందరలోనే ఆ పిల్ల పెండ్లి చేసుకొంటుంది." అన్నది మరకతం.
స్వర్ణ నుండి జవాబు లేదు.
"ఏం! నీ పెండ్లి ని గురించి ఆలోచిస్తున్నావా? కాస్త నిదానంగా నడు. వెధవ కాలేజీ ఎప్పుడూ ఉన్నదే! నువ్వు రాజన్న ను ఎందుకు వద్దన్నావు? అతనికేం లోటు? నువ్వు నిరాకరించావని ఎంత కుంగి పోతున్నాడో నీకు తెలుసా? ఎందుకని? కులాల పట్టింపా? లేక ఇంకేదన్నా కారణమా?" అని అడిగింది మరకతం.
"నాకు ఇష్టం లేదు!" అన్నది స్వర్ణ.
"బుద్ది మంతురాలవు. ప్రేమ మైకం నిన్ను కప్పలేదు! వర్ణాంతర వివాహాలు మంచివని ఊరికే అంటారు గాని, వాటిలో పచ్చగా ఉన్నవి చాలా కొద్ది! వాటిని సహజంగా తీసుకునే సంస్కారం మనకింకా రాలేదు. నిజంగా మంచి పని చేశావు! అయితే, దూర మాలోచిస్తే రాజన్న తో నీ జీవితం పచ్చగానే ఉంటుంది. రాజన్న మనసు బంగారు మనసు!' అన్నది మరకతం.
స్వర్ణ కళ్ళలో తిరిగిన నీరు చూసి మరకతం దిగ్భ్రాంతి పొందింది.
"రాజగోపాల్ గారి మనసు నాకు తెలుసు. అయితే, నేనేం చెయ్యలేను! రాజగోపాల్ గారినే కాదు, ఎవ్వరినీ చేసుకోవటానికీ ఇష్టపడను" అన్నది స్వర్ణ.
ఎప్పుడు వచ్చిందో వెనకగా ఇందిర , నవ్వుతూ -- "ఆడపిల్లకు పెండ్లె ముఖ్యం! స్త్రీకి పరిపూర్ణత లభించేది మాతృత్వం లోనే! పుస్తకాలు చదవటం లేదూ మీరు? కనక, స్వర్ణా , పెండ్లి చేసుకోనని అనకు. అది ప్రకృతి విరుద్దం. అసహజం. పెండ్లి చేసుకొని పిల్లల్ని కను. నీ జన్మ సార్ధకమవుతుంది" అన్నది.
అప్పటికి అంతా కాలేజీ ఆవరణ లోకి వచ్చారు. బిలబిల్లాడుతూ పిల్లలు తిరుగుతున్నారు.
ఇదేమీ గమనించకుండా , మండిపడుతూ మరకతం -- "బుద్ది తక్కువ మాటలు చెప్పకు! స్త్రీ కి పరిపూర్ణత నిచ్చేది మాతృత్వమే నని అమ్మమ్మ కబుర్లు చెప్పి, ఆడపిల్లలను పాడు చెయ్యకు. కాలం మారిపోతున్నది. మీ అమ్మ గాని, అమ్మమ్మ గాని ఉద్యోగాలు చేశారా? నువ్వూ మానేయ్య మరి! ప్రతి పిల్లకీ పెండ్లి కావాలని మీ బోటివాళ్ళు చెబుతుంటేనే గదా, ఆడపిల్లల బుర్రలు చెడి పోయేది! ఆడది గానీ, మగవాడు గానీ పరిపూర్ణత నిచ్చేది వ్యక్తిత్వం! సంస్కారం! అంతేకాని పెళ్ళి కాదు. అవివాహితలైన ఆడపిల్లలకు ఆత్మ విశ్వాసం ఎక్కువ చెయ్యాలి గాని, ఇట్లాంటి వెధవ కబుర్లు చెప్పి వాళ్ళని నాశనం చెయ్యకు! మారిపోతున్న కాలంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళను బ్రతకనీ! ఇంకెప్పుడు ఆడపిల్లలకు పెండ్లిండే ముఖ్యమని కూయ్యకు!" అన్నది.
అటూ ఇటూ తిరుగుతూ మరకతం మాటలు విన్న అమ్మాయిలు నవ్వుకుంటూ పోయారు.
గంట కావడంతో ఎవరి క్లాసులకు వాళ్ళు పోయారు.
* * * *
మరకతం లో మార్పు కొట్టవచ్చినట్లు అందరికీ కనిపించుతున్నది. గలగలమని ప్రవహించే సెలయేరు నిండు గర్భిణిలా, గంబీరంగా ప్రవహించే నదిగా మారినట్లు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నది. పెద్దలే కాక, పిల్లలు కూడా గమనించారు మార్పును.
"కొంప ముంచుకొందేమో?" అన్నది ఒక లెక్చరర్. అంటే గర్భవతి అయిందేమో అన్న భావన.
"ఎన్నిమార్లు చెప్పినా ఆ కొంప వదలలేదు మరి! వరస చూస్తె అలాగే ఉంది!" అన్నది ఆవిడ.
అంతా తన వైపు అసహ్యంగా చూడడంతో, తన మాటలు ఎవరికీ నచ్చలేదని తేలిపోయింది ఆమెకు.
"మరకతం బాధ అది మాత్రం కాదు. మనం అర్చలేము, తీర్చలేము గాని, ఇట్లాంటి మాటలతో బాగా హింసించగలము!" అన్నది ఇందిర.
మితభాషిణి అయిన స్వర్ణ కూడా సంగతేమీటని మరకతాన్ని నిగ్గ దీసింది.
"త్వరపడకు. విషయాలన్నీ త్వరగా తెలుస్తాయిలే. కధ ముగింపు త్వరలోనే ఉంది!" అన్నది మరకతం నవ్వటానికి ప్రయత్నిస్తూ. కాని, కన్నీరు కళ్ళలో తళతళ లాడింది.
స్వర్ణ నివ్వెర పోయింది.
* * * *
