"నువ్వు చెప్పేశావుగా. ఇంకా నేనేం చెప్పాలి?" అన్నాడు సీతాపతి.
తులసి కాఫీ తయారుచేసి, ఓ కప్పు సీతాపతి కిచ్చి, మరో కప్పు పాపముందర ఉంచింది. కాని పాప అది తీసుకోలేదు.
"తీసుకో, పాపా" అంది. అప్పుడైనా గొంతు తమాయించుకోలేకపోయింది.
"తీసుకో, మీ అక్క ఇస్తుంటే తీసుకోవేం?" అన్నాడు సీతాపతి సన్నగా మందలిస్తూ.
పాప కాఫీ తాగేసి, "వెళ్తాను, బావా శైలజగారు మధ్యాహ్నమే రమ్మన్నారు" అంది.
"ఊఁ" అన్నాడు సీతాపతి.
"వెళుతున్నానక్కా" అంది పాప బయల్దేరుతూ.
తులసి తలెత్తి చూసింది. పాప తన సమాధానం కోసం చూడకుండా గేటు దాటింది. తులసి టైం చూసింది.
నాలుగుపదిహేను.
మేనెల ఎండ. వేడిగా ఉంది.
ఇంటిముందర మొక్కలు వాడిపోయాయి. ఎదురుగా వీథి నిర్మానుష్యంగా ఉంది. దూరంగా రిక్షా గంటల చప్పుడు. ఆకాశం నిర్మలంగా ఉంది. వడగాడ్పు ఇంట్లోకి కొడుతున్నది. జనం ఊరికెనే అలిసి పోతారు ఈ ఎండకు.
సీతాపతి బనియను విప్పేసి, "నేను స్నానం చేసి వస్తాను. కొంచెం చల్లబడుతుంది" అనుకుంటూ మెట్లు దిగేడు.
'ఇప్పటికే మీ కళ్ళు చల్లబడి ఉండాలి' అనుకుంది తులసి.
భర్త స్నానం చేసివచ్చాడు కాని, తను అడగాలనుకున్న వేమీ అడగలేకపోయింది. అంతా జరిగిపోయింతరవాత తెలుసుకుని మాత్రం ఏం ప్రయోజనం? ఇంక ఇవాళో, రేపో నాన్న వస్తాడు. అతడే తెలుసుకుంటాడు.
* * *
మర్నాడు...
తులసి ఆఫీసుకు సిద్ధమయింది. కాని ఇంకా తండ్రి జాడ లేదు. క్రితం రాత్రంతా తను నిద్రపోలేక పోయింది. పాప గురించిన ఆలోచనలూ, భయాలూ, తండ్రి రాకకై నిరీక్షణా, ఏదో చెప్పలేని ఆవేదనా, అశాంతీ-మనసు గాయపడింది. తనకు నిద్ర లేకుండా చేశాయి.
మగతగా ఎప్పుడో కన్ను మూసినా, వెంటనే ఏదో భయం కలిగి మెలకువ వచ్చేది.
తన కెవ్వరూ తోడు లేరు.
భర్త ఉదయం జ్ఞాపకం చేశాడు, మామగార్ని హాస్పిటల్నించి తీసుకొస్తున్నాడట.
ఛీ! పాడు బ్రతుకు.
తను ఆఫీసుకి వెళ్ళింతర్వాత మధ్యాహ్నం మూడింటికి ఆఫీసుకు వచ్చాడు తండ్రి. తను పర్మిషన్ తీసుకుని వచ్చేసింది. ఆఫీసు గేటు దాటగానే అడిగాడు. తనకు మళ్ళీ కన్నీళ్ళపర్యంతమైంది. ఆ విషయం అక్కడ తప్పించి ఇంటికి తీసుకువచ్చి చెప్పింది. ఉండమంటే ఉండకుండా పాప ఎలా వెళ్ళిపోయిందీ చెబుతూంటే తనకు మాటలు పెగల్లేదు. తండ్రికూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
"ఐతే ఇప్పుడు చంటి దెక్కడున్నట్టు?" అన్నాడు. తను భర్త రాగానే తీసుకెళ్ళి చూపిస్తాడని చెప్పింది.
సీతాపతి సాయంత్రం తన తండ్రిని హాస్పిటల్నించి తీసుకొచ్చాడు. ఇద్దరు వియ్యంకులూ క్షేమసమాచారాలు మాట్లాడుకున్నారు. సీతాపతి తన తండ్రిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి, మామగార్ని పాప దగ్గిరకు తీసుకెళ్ళి వచ్చాడు.
తెల్లవారే వెళ్ళిపోతానన్నాడు తులసి తండ్రి. తులసి వద్దన్నది. "సెలవు పెడతాను. అన్నీ మాట్లాడుకోవచ్చు" నన్నది. కాని అతడు వినలేదు. మధ్యాహ్నం బస్సుకు వెళ్ళిపోతానన్నాడు. అలాగైనా తులసి సెలవు పెట్టేసింది. సీతాపతి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
"పాప ఏమంది, నాన్నా?" అని అడిగింది తండ్రిని.
అతడు చాలాసేపు మౌనంగా ఉండి, తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా ప్రారంభించేడు.
"అమ్మా, తులసీ, ఇది నీ సంసారం. ఎవరూ కాదనరు. అలా ఆ వెర్రిబాగులముండని రప్పించుకుంటానంటే ఎంతో ఆశతో అక్కచెల్లెళ్ళు కలిసి ఉంటారు కదా అని పంపేను. అదీ తీరా వచ్చింతరవాత దాన్ని నానా మాటలూ అన్నావు. దాని ప్రతి మాటనూ విరిచి పెడర్దాలు తీశావు. అదెటు పోయినా అనుమానంగానే చూశావు. ఇంట్లో అది చేసిన ప్రతి పనికీ నీకు కోపం వస్తే అది ఎలా మెలుగుతుందమ్మా?" అన్నాడు తండ్రి.
"నాన్నా, ఇదంతా ఎవరు చెప్పేరు? పాప చెప్పిందా. అంతా అబద్ధం, నాన్నా" అంది తులసి.
"అవునమ్మా, ఇప్పుడు నువ్వలాగే అంటావు. అది నీ కన్నా చిన్నది. ఏదో విషయంలో అది నీకు కోపం తెప్పించవచ్చు. కాదనను. అంతదానికి దాన్నలా అంటారమ్మా? నువ్వో సంసారం చేసుకుంటున్నావు. అదింకా పెళ్ళి కావలసిన పిల్ల. దాని నడత గురించి నువ్వే అన్ని అనుమానాలు పడితే, అలా అందరికీ చెబితే, ఇంక దాని బ్రతుకేం గాను? నువ్వు చదువుకున్న దానివి, పెద్దదానివి. నీ చెల్లెలితో నువ్వలా ప్రవర్తించకూడదమ్మా. అదిక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతుందనుకోలేదు. ఇంత అవమానాన్ని, మనోవ్యథను భరించవలసి వస్తుందనుకోలేదు. ఇలా జరుగుతుందని ఏమాత్రం తెలిసినా నేను దాన్ని నీ దగ్గరకే పంపేవాన్ని కాదు. కాని ఎలా తెలుస్తుంది, ఇలా జరగవలసి వున్నప్పుడు. ఇంత జరిగినా, ఇంకా అదలా ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటోంది. అదెంతో మారిపోయిందమ్మా ఇప్పుడు తన పెళ్ళిమాటే తలపెట్ట వద్దంటున్నది. దాని కంత మనోనిశ్చయం వచ్చిందన్నదే నా తృప్తి" అన్నాడు తండ్రి.
తులసి అవాక్కయింది.
"నాన్నా, నేనేం చేసినా పాప మంచికోసమే చేశాను. నన్ను నమ్ము" అంది.
"అవునమ్మా. చివరి కంతేలే. ఇంకా దాని గురించి మాట్లాడుకోవట మెందుకు!" అన్నాడు తండ్రి.

13
"మందు వేళ ప్రకారం పడాలన్నాడు డాక్టరు. పథ్యంకూడా జాగ్రత్తగా పాటించాలి. లేకపోతే మళ్ళీ పాతస్థితికి దిగజారుతుందట" అన్నాడు సీతాపతి.
"చూస్తానులెండి. మీరు చెప్పాక చెయ్యకపోను గదా" అంది తులసి.
జరిగిన అవమానాలతో, అనుభవించిన మనోవ్యథతో ఆమె మనసు చిల్లులుపడినా, అలా ఒంటరిగా, వెల్లకిలా పడుకున్న మామగార్ని చూస్తే జాలివేసింది. ఆ గది చీకటిగా ఉంటుంది. అందువల్లే అతడు దాన్ని ఇష్టపడ్డాడు. లైటుకూడా వెయ్యొద్దంటాడు. ఎప్పుడూ పడుకునే ఉంటాడు. ఉదయం ఏ ఎనిమిదింటికో లేచి కాఫీ తాగి, కాసేపు పత్రిక చదువుకుని, స్నానం చేసి, ఇంత తినేసి పడుకుంటాడు సాయంత్రందాకా లేవడు. అప్పుడు కొంచెంసేపు అలా పెరట్లో కూర్చుని, ఏడింటికల్లా తినేసి మళ్ళీ పడుకుంటాడు. ఎప్పుడూ అలా పడుకుంటాడు గనక అత నెప్పుడు నిద్ర పోతున్నాడో, ఎప్పుడు ఊరికే పడుకున్నాడో చెప్పటం కష్టం.
"అంతేకాదు, తులసీ, మరో మాట. ఈ నెలనించీ నాకు టూర్లు కూడా ఉంటాయి గామోసు. ఆఫీసులో నా సీటు మారింది. ఇంక ఆఫీసరు వెనక ఇన్స్ఫెక్షన్లకు వెడుతుండాలి" అన్నాడు సీతాపతి.
"ప్రతి నెలా?"
"ఆఁ ఇంచుమించు ప్రతి నెలా నెలకు రెండు వారాలయినా ఉంటాయి" అన్నాడు సీతాపతి.
"సరే" అంది తులసి.
"ఆఫీసరుకు చెప్పానుకూడా, ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని. కాని స్టాఫ్ పొజిషన్ అలా ఉంది, నన్నేం చెయ్యమంటావు అన్నాడు. నాన్నగారికి..." అనబోతుంటే-
"బెంగ పెట్టుకోకండి. నేను చూస్తాను. అంతగా అవసరమైతే డాక్టరుగారు ఉన్నారు" అంది తులసి.
భర్త సందిగ్ధత ఆమెకు బాధ కలిగించింది. అతని పరిస్థితి మీద జాలి, సానుభూతి కలిగేయి.
"నీ పైని నమ్మకంతోనే నే నీ టూర్లకు ఒప్పుకున్నాను, తులసీ" అన్నాడు సీతాపతి.
ఆ తరవాత రెండు రోజులకే అతడు వరంగల్లుకు వెళ్ళాడు. మామగారికి మంచంపక్కనే ఉండి సపర్యలు చేయవలసినంత అవసరం లేడు. కాని భర్త చెప్పినట్టు మందు జాగ్రత్తగా వేళకు ఇవ్వాలి.
తులసి అతనికి కావలసిన వంట తయారుచేసి, మళ్ళీ అతను వంటింట్లోకి వచ్చే ప్రయాస లేకుండా, అతని గదిలోనే పెడుతుంది. మందులూ అవీకూడా అక్కడే అమర్చుతుంది. వంట చల్లారిపోతుంది. కాని ఎలా? మరో వీలు లేదు. ఫ్లాస్కు నిండా కాఫీ పోసి పెడుతుంది. తను ఆఫీసునుంచి వచ్చేవరకు అతడు వంటా, ఫ్లాస్కూ ఖాళీ చేస్తాడు. ఒక్కోసారి మందులు మరిచిపోతాడు. తులసి వచ్చిన తరవాత కొంచెం విసుక్కుంటూ, నొచ్చుకుంటూ, కొంచెంగా మందలిస్తూ ఆ మందు మింగిస్తుంది. సీతాపతి టూరునించి రాగానే అడుగుతాడు. తులసి నోటిద్వారా విని ఊరుకోడు. మళ్ళీ తండ్రిచేత చెప్పించుకుంటాడు. ఈలోగా సీతాపతికి ఉత్తరాలు వస్తాయి, "అమ్మ బెంగ పెట్టు కుంది. నాన్నగారి కెలా ఉంది?" అంటూ సీతాపతి ఉంటే జవాబు రాసేస్తాడు. లేనప్పుడు తులసి రాస్తుంది. పెళ్ళాం ప్రేమకు బలే మురిసిపోతుంటాడు ముసలాయన. తులసి గదిలో ఉన్నప్పుడల్లా ఆమె గురించి మాట్లాడతాడు. ఎప్పుడేనా తులసి జవాబివ్వకపోతే, ఊఁకొట్టక పోతే, "ఏమమ్మా, పరధ్యానంగా ఉన్నావా?" అంటాడు.
ఒక్కోసారి తులసి నిజంగానే పరధ్యానంగా ఉంటుంది. పాప జ్ఞాపకం మనసు కలిచివేస్తుంటుంది.
ఇదే తులసి రొటీన్-సీతాపతి అలా మూర్ఖంగా, పాశవికంగా ప్రవర్తించి, తనను నిష్కారణంగా అవమానించి, నిందించి, చెయ్యి చేసుకొన్న ఆ రోజు దాకా.
ఆ రోజు-
సీతాపతి టూరునించి వస్తున్నాడు. తులసి మామూలుగా వండి, మామగారి గదిలో అన్నీ అమర్చి, ఆఫీసుకు వెళ్ళిపోయింది. కాని సాయంత్రం ఆఫీసునుండి వచ్చేసరికి ఇంటికి తాళం!
అక్కడే కూర్చున్న పనిమనిషి చెప్పింది. మధ్యాహ్నం నించీ ముసలాయనకు విరేచనాలు మొదలైనాయట. సీతాపతి ఇంటికి వచ్చేసరికే రెండుసార్లు వాంతులుకూడా చేసుకున్నాడుట. కళ్ళు తేలేశాడుట. సీతాపతి తండ్రిని డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాడుట.
తులసికి కాళ్ళు వణికాయి.
రిక్షా చేసుకుని తాము ఎప్పుడూ వెళ్ళే డాక్టరుగారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ లేరు. అటునించి అదే రిక్షాలో సరాసరి జనరల్ హాస్పిటల్ కి వెళ్ళింది.
అదంతా తనకు కొత్త. ఎక్కడుంటారో, ఎవర్నడగటం? ఎలా వెదకటం? ఓ పక్కగా భయం.
తను ఈ గేటువద్ద దిగకూడదేమో.
తన వెర్రిమొహాన్ని చూసి కాబోలు ఎవరో వచ్చి, "ఏం కావాలండీ?" అన్నాడు.
చాలా సహజంగా, "ఏం లేదు" అంటూ వెళ్ళింది తను.
ఆ మనిషి మాటలో మరేవో అర్ధాలు వినిపించాయి తనకు. ఒంటరిగా, వెర్రిదానిలా తిరిగితే ఇలాగే తటస్థిస్తారు ఆప్తులు ధైర్యం చేసి ఓ నర్సును అడగ బోయింది. నర్సు సగం విని అర్ధమైనట్టుగా చరచరా నడిచిపోతూ, "ఎంక్వైరీకి వెళ్ళండి" అంది.
ఎంక్వైరీ ఎక్కడో?
ఆ క్షణాన చుట్టూఉన్న లోకమంతా, ఒక్క నిమిషం కళ్ళూ, చెవులూ మూసుకుంటే ఒకసారి బిగ్గరగా కేక వెయ్యాలనిపించింది. ఉన్నపళంగా తన కేమైనా జరిగితే ఏం చేస్తారు? ఎక్కడికి తీసుకువెడతారు? ముసలాయన్నుకూడా అలాగే, అక్కడికే తీసుకువెళ్ళి ఉంటారు. ఎలా కనుక్కోవటం? కాంపౌండులో నడుస్తుంటే మార్చురీ వచ్చింది. వెంటనే వెనక్కు తిరిగింది రెట్టింపు భయంతో ఒళ్లంతా చమట పట్టింది. చెంప లదురుతున్నాయి. ఓ ట్రక్కు ఉంది అక్కడ. లైట్లు వెలిగాయి, ఏం చెయ్యాలో తోచలేదు. జనం తగ్గిపోయారు. ఎత్తైన, విశాలమైన ఆ భవనంలో వందలాది రోగులు. మార్చువరీ. నర్సుల క్వార్టర్లు చీకటిలో ఆ దృశ్యం సహించలేకపోయింది. మృత్యుహింస ఆ భవనంలో దర్భారు తీర్చి ఉంటుంది. తనేం చెయ్యగలదు? ఎక్కడికి వెళ్ళగలదు? ఏడుపు ఆగేటట్టు లేదు. శరీరం స్వాధీనంలో లేదు. వెళ్ళి రిక్షా మాట్లాడుకొంది ఇంటికి.
ఇంకా ఎవరూ రాలేదు.
తొమ్మిదిన్నరవుతున్నది. ఆకలితో నీరసం వచ్చేసింది. కాసేపు కూర్చుంటే గాని లాభం లేదు. కాళ్ళు కడుక్కుని, కడుపునిండా నీళ్ళు తాగి, వెళ్ళి అరుగుమీద కూర్చుంది. కళ్ళు మూసుకుని గోడకు వాలింది. ఎంతో సుఖంగా ఉంది. గాలి చల్లగా తగిలింది. ఒళ్ళు మరిచింది. ఆలోచనలతో పుండైన మనసుకు మగత కమ్మింది.
ఎవరివో కాళ్ళు తగిలేయి. గాఢనిద్ర విచ్చుతూంది. తలుపు తీసిన చప్పుడు కళ్ళమీద కాంతి. కళ్ళు విప్పింది. గాభరాగా ఇంట్లోకి వచ్చింది. ఎవరో దొంగ వచ్చి ఉంటాడన్న అనుమానం ఎందుకు వెయ్యలేదో, లేక భర్తే వస్తే తనను ఎందుకు లేపలేదోఆలోచించలేదు.
ఈవలి గదిలో ఎవరూ లేరు.
వంటింట్లో బీరువా దగ్గిర భర్త.
అతణ్ణి చూడగానే గంపెడు ఆశా, ఆనందమూ, సంశయమూ, మరోపక్క భయమూ కలిగేయి. తను ఏదో అడగాలనుకుంటూంది.
"మీరు... ఎప్పుడొచ్చారు?"
తనవైపు తీక్షణంగా చూశాడు. ఏ దుశ్శంకా లేకుండానే అతడి మొహంలో ఏదో విహ్వలత కనిపిస్తూంది. అదేమిటి, కోపమా? జుగుప్సా? నిరాశా? ఏమిటి అతడి మొహంలోని ఆ భావం?
"మామగారేరీ?" తన కంఠం వణికింది. ఆ వాక్యం సరిగ్గా పలకలేదు తను. అసలు పలికిందా? పెదవులు కదిలినట్టే తోచింది. ఏదో వినిపించింది. కళ్ళనించి జారిన అశ్రువులు బుగ్గలమీద పచ్చిగా తోచినాయి. అలసటతో ఒళ్ళు తూలుతున్నదా? కళ్ళు తిరుగుతున్నాయా? ఆకలితో తన నించి వచ్చిన మాటల్లో అసహనముందా?
అతడు మాట్లాడడేం?
ఎలా, తను కేక వెయ్యాలా?
స్పృశించి-కాళ్ళు-అతని గుండెలమీద తల ఆన్చి, ఏడ్చి - లేదా బిగ్గరగా అరుస్తూ - లేదా?-"
"ఏమండీ, మామగారేరీ? ఎక్కడికి తీసుకెళ్ళారు?"
"ఇదిగో, నీ కేదో కవరొచ్చింది."
"ఇదికాదు. మామగారు..." తను ఏడ్చేసింది.
"ప్రస్తుతానికి భయం లేదన్నారు."
ఎలా అతని మౌనాన్ని పెళ్ళగించటం?
దుఃఖమో, మరేమిటో-తనను తాను మరిచింది. చెయ్యద్దనుకున్నదే చేసింది. ధారకట్టిన కన్నీళ్లను కాదని, "ఎందుకలా రాయిలా నిల్చుంటారు? అతడెలా ఉన్నాడు? చెప్పరేం? నన్నేం చేస్తారో చెయ్యండి. అలా నిల్చుంటారేమిటి?" అంది.
తనెంత బిగ్గరగా అరిచిందో!
భర్త కొట్టేడా? ఒకటి...రెండు...
"నీకు పిచ్చా..."
"లేదు, మీకే."
మళ్ళీ దెబ్బలు.
"ఇంతకూ ఏమైంది?" తను గెలుస్తూంది.
"ఏమైంది, చావు తప్పి బ్రతికాడు. నీ చేతుల్లో పెట్టిన మనిషిని చంపక బ్రతికిస్తావా? అత్తను వెళ్ళగొట్టావు. చెల్లెల్ని వెళ్ళగొట్టావు. మామను చంపాలనుకున్నావు. రేపు నన్నూ ఏదో చేస్తావు. అంతే నువ్వొక్కదానివీ సుఖంగా ఉండు, రాక్షసీ."
"ఇంతకూ ఏమైంది?"
