శ్రీనివాస్ తలెత్తాడు 'అలాగే' అంటూ.
రైలు బయలు దేరబోతుంటే ఆప్యాయంగా ఆ చేతిని సున్నితంగా నొక్కి వదిలేశాడు ప్రభాకరం.
పెద్ద రోద చేస్తూ ఆగిన రైలు కెవ్వు మంటూ చీల్చేసింది కొన్నాళ్ళు గా పెనవేసుకున్న స్నేహ లతని పుటుక్కున తెంపిస్తూ . ప్రభాకరం వీడ్కోలు యిచ్చి స్టేషను దాటుతుంటే శ్రీనివాస్ కి అనిపించింది. 'అదేవిటి అతను అంత డీలా పడిపోయాడు?' అని.
* * * *
కిటికీ తలుపులు తెరిచి చూస్తె బజారంతా కనిపిస్తుంది. వచ్చిపోయే కార్లతో, రిక్షాల మువ్వల చప్పుడుతో , సైకిల్ బెల్ ల మేతతో , అప్పుడప్పుడు ప్రయాణం చేసే బళ్లతో కోలాహలంగా, ప్రొద్దున్న కూర్చున్న సుభద్ర కి ప్రొద్దెక్కి నా తెలీదు వాస్తవం. గంటల తరబడి ఆ కిటికీ లోంచి బజారు లోకి చూస్తుంటే యెంతో హాయిగా వుంటుంది. ప్రొద్దున్నే టిఫిన్ కారియర్ రావడం యిద్దరూ భోజనాలు ముగించు కోవడం ఆరున్నర ప్రాంతాల్లో జగదీశ్ తిరిగి యింటికి వచ్చేవరకూ 'చేద్దాం ' అనుకున్నా పనే కనిపించదు.
వెనకే నిల్చున్న జగదీశ్ చేతులు మెడ మీదుగా వచ్చి గుండెల మీద ఆగాయి. సుభద్ర తలతిప్పి చూసింది.
'నువ్వు యేవీ అనుకోకు' జగదీశ్ అన్నాడు.
సుభద్ర కనుబొమ్మలు ముడిపడి పోయాయి. 'నేను అనుకోవడం యేవిటి?' అర్ధం కాని దానిలా అడిగింది.
'మరేం లేదు సుభద్రా. నువ్వు యీ కిటికీ దగ్గర కూర్చోవడం నిన్ను నలుగురూ చూడడం , మన యిక్కడ వుంటున్నాం అని ఏ మాత్రం తెలిసినా నాన్న వూరుకోడు మండి పడతాడు.'
'యాభై ఏకరాల భూమిని నీకోసం వదులు కునేంత త్యాగబుద్ది లేదు నాకు'
'రేపటి నుంచీ కూర్చొను. నాకు తోచక యిక్కడ కుర్చీలో కూర్చునే డాన్ని.'
జగదీశ్ మళ్లీ అన్నాడు. 'నీకు మధవరావు తెలుసు కదు సుభద్రా?'
'యే మాధవరావు?'
'అదే ఆ రోడ్డు మీద అప్పుడప్పుడు సాయం కాల పూట నిలుచుంటాడూ....'
'నాకు తెలీదు యెవరో అయన.'
'వాహి ' వెటకారంగా అన్నాడు అతను నువ్వు గుర్తు పట్టగలవు. రోజూ చూసే మనిషే కదా'
'ఒట్టు నాకు తెలీదు అతను యెవరో?
'సరే వాదన యెందుకు మనకి...?' జగదీష్ మాటల్ని త్రుంచేశాడు. నెమ్మదిగా 'పారడైజ్ లో మంచి పిక్చరు వచ్చింది వెడదామా ?' అన్నాడు.
సుభద్ర నవ్వింది. 'మీరు తీసుకు వెళ్ళాలే గానీ యెక్కడికి రాను నేను?
పోనీ యిప్పుడు వొద్దు. నువ్వు వట్టి మనిషివి కూడా కావు.'
అతను మాటలతో స్వర్గాన్నే చూపిస్తాడు. చేతలకీ, మాటలకీ సహస్రం తేడా వున్న యీ జగదీశ్ తో.....
సుభద్ర యింక ఆ పైన ఆలోచించ లేదు.
గదిలో పచారు చేస్తూ 'చూడు సుభద్రా నాన్న రేపు ఈ వూరు వస్తారట. మన ఆచూకీ అయన తప్పకుండా తెలుసుకుంటాడు. నేను యిబ్బంది లో పడిపోవాలి.' అన్నాడు.
'అందుకని.'
'నిన్ను మాధవరావు దగ్గిర వుంచుతాను ఈ రెండు రోజులూ. తరువాత మళ్ళీ వచ్చేద్దువు గానీ.'
సుభద్ర కంగారుగా అతన్ని రెండు చేతుల్లో చుట్టేసింది. 'మీరు ఆడించినట్టల్లా అడే కీలు బొమ్మను అయ్యాను నేను. ఎంత పిచ్చిదాన్ని. మీరు నా మెళ్ళో పుస్తె కట్టక పోయినా నమ్మి యింత దూరం వచ్చాను. నా దురదృష్టానికి తోడు ఇప్పుడు నేను మామూలు మనిషిని కూడా కాదు.... అతను ఆ మాధవరావు యింట్లో....నాకు తెలీదని కూడా చెప్పాను కదా...' సుభద్ర గొంతు కఠినంగా మారిపోయింది... ముఖం మీద అసహ్యం పేరుకు పోయింది. సాధ్యం అయినంత గట్టిగానే అంది: 'ఒక్కనాటికీ వుండను. మీరు ఎలా వెడతారో నేను చూస్తాను.'
జగదీశ్ నవ్వాడు : 'నీకూ కోపం వస్తుంది. ఫరవాలేదు. చూడు సుభద్రా . కొన్నాళ్ళు వోపిక పట్టు. మా నాన్న డబ్బు పంపకం అయిపోయాక మనం విడిగా కాపురం పెడదాం. హాయిగా పిల్లాపాపతో సంసారం దొర్లించేయ వచ్చును. నా మాట విను. నాన్న మన మీద ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆయనకీ నాకూ సంబంధం లేకుండా చేస్తాడు. నన్ను నమ్ము.'
సుభద్ర తలెత్తింది. కిటికీ లోంచి సూర్యకిరణం లాంటిదేదో తళుక్కున కళ్ళల్లో కి ప్రతిఫలించి క్షణం లో అక్కడ అనేక రంగులు హరివిల్లు లా మారుతున్నాయి.'
'నమ్మాను, మిమ్మల్ని చాలాసార్లు నమ్మాను. యింకా వంచించడం ఏం బాగుంటుంది. మీలాంటి వాళ్ళు అర్ధరాత్రికి అర్ధరాత్రి పారిపోయి వెళ్ళిపోతేనే మీకు స్వేచ్చ, నాలాంటి డానికి,' వాక్యం పూర్తీ చేయలేక పోయింది. కడుపులో వూపిరి సలుపు కొనివ్వకుండా కదిలించే పిల్లో, పిల్లడో యింత అలక్ష్యం చేస్తుంటే 'తను...తను.'
'ఛ! యెప్పుడూ ఏడుపులూ, మొత్తుకోళ్ళు యీ దరిద్రపు యింట్లో యే రోజూ నవ్వూ, కళా కనిపించవు. అయినా వొక మాట సుభద్రా! నువ్వేవీ నేను కట్టుకున్న పెళ్లానివి కావు. నా యిష్టం వుంటే వుంటాను....లేకపోతె అర్ధరాత్రి ఖర్మేం పట్టపగలే వెళ్ళిపోతాను. నన్ను ఆపేవాడు లేడిక్కడ. నీకు దిక్కుంటే చెప్పుకో.' జగదీశ్ మాటలు శూలాల్లా పొడుచుకు పోలేదు , నిశ్చేష్టు రాలై నిలబడి పోయి చూస్తుండి పోయింది. అతను గది గుమ్మం దాటి ఎదురుగా ప్రహరీ మలుపు తిరిగి వెడుతుంటే కొద్దిగా తలభాగం ఆ తరువాత పూర్తీ మనిషి మాయం అయిపోతే బిక్క మొహం వేసుకుని శూన్యం లోకి చూస్తుండి పోయింది. కమ్చీతో యెవరో కొట్టారని భ్రమ పడింది. కానీ అది కమ్చీ దెబ్బ కానేకాదు. దూరాన మాధవరావు ఆకారం వికృతంగా తన పాలిటి కాలసర్పం లా కనిపిస్తుంటే అయోమయంగా కిటికీ తలుపు దగ్గర నిలబడింది. తలుపు మూయబోయే చేతుల్ని మరో అయిదు నిమిషాల తరువాత మరో రెండు చేతులు అప్రయత్నంగా బందించేశాయి.
* * * *
కాలం వురకలు వేస్తూ నలిగి పోయింది సూర్య భగవానుడి ముందూ వెనుకా ప్రదక్షణం లో. ఋతువులు మారాయి. నెలలు జరిగాయి. క్రమంగా రోజులు గడుస్తుంటే ఏడో కొద్దిగా వుత్సాహం కనిపిస్తోంది. 'చెప్పండి యింకా ఏం చేయను?' శ్రీనివాస్ కొంచెం ముందుకు వొంగి అడిగాడు. హెడ్మాష్టార్ అరుణాచలం గారిని.
'చాలు యింక యిప్పుడు నాలుగుంపావు దాటిపోయింది. నువ్వు యింటికి వెళ్ళు. ఆఫ్ యియర్లీ పేపర్లు యెల్లుండి యిచ్చేయాలి.'
'అలాగే నండి.'
'మరి రేపు మార్నింగ్ వస్తావుగా'
'వస్తాను సార్ గుడీ వేనింగ్' శ్రీనివాస్ ఈల వేసుకుంటూ యింటి దారి పట్టాడు. రోడ్డు పూర్తిగా నడిచేసి రెండు సంధులు దాటి లోగిలి లాంటి ప్రదేశం లో వో వాటా ముందు కూర్చున్న మనిషిని వెంటనే పోల్చుకోలేక పోయాడు. అప్పటికే ఆ ప్రదేశం సాయంకాలపు నీరెండ కి కొద్దిగా చీకట్లో కలిసిపోయింది. ఆ కూర్చున్న మనిషి స్త్రీ ఆకారంగా మాత్రం అతనికి గుర్తుంది కానీ ఆ ఆకారం బహుశా -- శ్రీనివాస్ కళ్ళు తటతటలాడాయి.
'పిన్నీ-- పిన్నీ వచ్చారా? మీరు రారేమో అనుకున్నాను. నమ్ముతారో లేదో కాని మీకోసం వూరంతా గాలించెను. యెక్కడా మీ జాడే లేదు. పోనీ నన్ను వెతుక్కుంటూ వచ్చారు.
'నేను అదృష్ట వంతుడిని నాన్నకి ఎలా చెప్పాలో అర్ధం కాక చాలా బాధపడ్డాను అందుకే కాబోలు యివాళ రోజంతా ఏదో హుషారుగా వుంది నాకు. మీరు యిప్పుడు కులాసాయేనా పిన్నీ.'
'నేను శ్రీనివాస్ రాజేశ్వరి ని '
'రాజేశ్వరా,' శ్రీనివాస్ పెదాలు కదిలాయి ఆశ్చర్యంగా. 'మీరు నా యింటికి వచ్చారా.'
'ఏం రాకూడదా.'
'ఛ! అలాగని నేను అన్నానా'
వీధిలోనే నిలబెట్టేసి దండకం చదివేస్తున్నారు . పిన్నీ......మీ వాళ్ళు గుర్తుంటారు గానీ రాజేశ్వరి, ప్రభాకరం జ్ఞాపకం వుండరు మీకు. అన్నయ్య జ్ఞాపకాలు వాడితో అంతం అయిపోయాయి.'
ఛ! ఏం మాటలవి. యిప్పుడు మిమ్మల్ని నేను యేవీ అనలేదు. చీకట్లో వున్నారు కనుక కొంచెం గుర్తు పట్టడం కష్టం అయింది. నా యింటికి వచ్చే చుట్టాలైనా అతిదు లైనా మీరే రాజేశ్వరి . పిన్ని చాలా రోజుల క్రితం గడప దాటి పుట్టింటికి వెళ్ళింది. ఒకవేళ ఆవిడ వచ్చిందేమో అని ....అదీ గాక పిన్నీ , మీరూ చెల్లి తప్ప నాకు గుర్తున్న ఆడవాళ్ళు చాలా తక్కువ అంటే నమ్ముతారా?'
రాజేశ్వరి నవ్వి వూరుకుంది.
తలుపు గొళ్ళెం తీసి లోపలికి అడుగు పెట్టి రెండు చేతులూ ఆప్యాయంగా ముందుకు చాచి నవ్వుతూ 'స్వాగతం ' అన్నాడు.
రాజేశ్వరి వచ్చి వారగా వేసిన చాప మీద కూర్చుంది. శ్రీనివాస్ స్టౌ వెలిగిస్తుంటే లేచి వెళ్లి తనే కల్పించుకో బోయింది . 'కాఫీ కాచి యిచ్చినంత మాత్రాన డిగ్నిటీ కి భంగం అయితే యింక జీవితం లో ప్రతి సెకెండు కీ డిగ్నిటీ అడ్డు వస్తుంది. అయినా మీరు గెస్టు. నేను చేసి పెడతాను. మీరు కూర్చుని తినాలి అంతే.' శ్రీనివాస్ వారించాడు.
'పాపం! అందుకే వచ్చనను కుంటున్నారు కాబోలు మీరు వెళ్ళమన్న వెళ్ళిందుకు రాలేదు నేను. యిక్కడే వుంటాను అంటే యేమంటారు?'
శ్రీనివాస్ తలెత్తి అన్నాడు : 'మీరే వుంటానంటే నేను అదృష్ట వంతుడినే నాకు యెవరూ లేరు. మీరు వుండడం నాకు యిష్టమే .' ప్రభాకరం మాటిమాటికీ గుర్తుకు వస్తున్నాడు. అతని మీద అభిమానం వుప్పేనలా పొంగు కు వస్తోంది. ఎదురుగా రాజేశ్వరి వూపిరి సలుపుకోకుండా మాట్లాడేస్తుంటే జీవితం యింత తియ్యగా వుంటుందా అనుకున్నాడు ఆ క్షణం లోనే.
'కాఫీ పొంగిపోయినా మీరు యీ లోకంలో లేరు. నాకు తెలుసును మీ సైకాలజీ. ఈ గాడిద బరువును ఎన్నాళ్ళు మోయాలిరా అనుకుంటున్నారు. ఏం చేస్తాం చేసుకున్న ఖర్మ. అనుభవించక తప్పదంటారు. మనవాళ్ళు.... అంతే యిది కూడా....
'మిష్టర్ , శ్రీనివాస్! రాజేశ్వరినీ నీ నెత్తిన వుంచాను. ఆ పిల్లను వో వొడ్డున చేర్చి గాని నువ్వు నిద్రపోకు. లేకపోతె నేనే పోనివ్వను నిన్ను రాజేశ్వరి యిప్పుడు ఎందుకు వచ్చిందో కనుక్కోవెం? అంటున్నాడండీ భగవంతుడు.' ఎకటాకీన అంటుంటే శ్రీనివాస్ వింటూనే వున్నాడు. రాజేశ్వరీ కల్పించుకుని కాఫీ పూర్తీ చేసి యిస్తుంటే అతని కళ్ళలో మిడిమిడి జ్ఞాపకాలు దొర్లుతున్నాయి. ఆరోజుల్లో తను సుఖపడిన ఆ పూర్వక్షణాల్లో, అమ్మా, పిన్నీ , చెల్లీ యిలాగే కూర్చో బెట్టుకుని చేసేవారు. పిన్ని మాత్రం? తన కిష్టం అని రకరాకాల పిండి వంటలు ఉన్నంత లోనే చేసి పెట్టేది. తనివి తీరా ఆప్యాయంగా 'శ్రీనివాస్' అనేది. ఆ పిలుపును తను పూర్తిగా పొందలేక పోయాడు. ఆవిడ నగల వల్ల తన బి.యస్. సి పరీక్ష పూర్తయింది. ఆ రాత్రి....ఆ రాత్రి శ్రీనివాస్ మెదడు స్వాధీనం తప్పి రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. ప్రభాకరం అన్నట్లు తను తన తండ్రికి అవకాశం యివ్వకపోతే జగదీశ్ కి దూరంగా పిన్ని నిశ్చలంగా వుండేదేమో?
