Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 15


    ఆ చక్కగా మాటల్తో దాన్ని ఉబ్బేసి నీ వెనకాతల పనిచేయించుకోవడం బాగా నేర్చావ్ లే నువ్వు.'
    'అమ్మమ్మా? అట్ల అనకు నాయనా, నిర్మలమ్మ నా బిడ్డ మాదిరి. ఆమె మనసు బాధ పడిందంటే నాకు తాళదు. తెల్సిందా!'
    'అ అందుకే అన్ని పన్లూ దాన్నేత్తిన రుద్దుతున్నావ్.'
    'ఏం చేసేది నాయనా. వయసై పోయిందీ. మీరా విడవమూ, అంటారూ ఏదో--'
    'అన్నీ బాగున్నాయి గానీ, ముందు వెళ్లి ఆ నోట్లోని తాంబూలాన్ని బయట ఉమ్మేసి రా? అసలే నీ బాష అంతంత మాత్రం. దానికి తోడూ తాంబూలం కూడా పూడుస్తే ఇహ చెప్పాలా.'
    'అహహ . తిలక్ బాబూ, చిన్నప్పుడేట్లా వుంటివో . బిడ్డ తండ్రైనా ఇప్పుడూ అట్లనే వున్నాడు.' అని నవ్వుకుంటూ లేచి వెళ్లి తాంబూలం ఉమ్మేసి వచ్చాడయ్యరు.
    'ఉంటేనూ ఇంత మెత్తని బిడ్డ నిన్నే ఇట్ల అదిలిస్తుందే మీ అత్తగారూ, మరి తను ఈ రాధమ్మ ని పెంచే తీరుకు ఎక్కడదా పెండ్లి చేసివ్వబోతుందో--'
    'ఆ, ఆ , అమ్మతో చెప్తా నుండు-' బెదిరించాడు తిలక్.
    'చెప్పుమ్మీ? నేనేమన్నా అబద్దమా చేప్తిని...
    'అదే ఆ ధైర్యవేవిటో చూస్తాగా;'
    'పిచ్చి నాయనా. మీరట్ల విశాఖ కు పోతిరో, నేనిట్ల మా దేసం పొయ్యే బండే క్కెస్తును. అది తెల్సుకో ముందూ.' తమలపాకు ని గట్టిగా తొడకి వేసి తుడుస్తూ ఉత్సాహంగా అన్నాడు అయ్యరు    'ఇంకా నయం ఆ పని మాత్రం చెయ్యకు మా! అసలే ఇబ్బంది పడిపోతారత్తయ్య.' అంది హెచ్చరిస్తూ నిర్మల.
    'ఆ- ఆ. అద్దానే చెప్పేది. నువ్వట్లా నేనిట్లా పోవలె. అప్పుడామే కు బాగా తెలిసి రావలె. ఆ వెనక. ఈ మాదిరంతా ఇంట్లో నడుచునా చూడుమ్మీ' కనుబొమ్మ లేగరెయ్యడం తో పాటు మనిషంతా కూడా ఊగుతూ ఉత్సాహంగా అన్నాడు అయ్యరు    
    'ఇదీ వో ఉపాయమే సుమీ' అన్నాడు నెమ్మదిగా నిర్మలతో తిలక్.
    'మరింక ఒస్తునా? పోయి తోడూ పెట్టవలె. తెల్లవారి ఫలహరానికేదైనా ఏర్పాటు చేసి పెట్టుకోవలె. ఒస్తా.' అంటూ తువ్వాల్దులిపి భుజాన్న వేసుకుంటూ వెళ్ళిపోయాడు అయ్యరు.
    'పాపం ఒంట్లో ఉన్న శక్తంతా మా కుటుంబానికే ధారపోసి వుడిగి పోయాడయ్యరు ....పోనీ ఇతనిని మనతో తీసుకెళ్తేనో--' అన్నాడు తిలక్.
    'అమ్మో ఇంట్లో ఇక్కడిబ్బంది కదూ! అదీగాక ముగ్గురు మనుషుల కోసరం చేసుకునే భాగ్యానికి బట్టలుతకడం వగైరాలకి మళ్ళీమనిషెందుకూ?' అంటూన్న మీ అమ్మ వంటమనిషిని కూడా పెట్ట నిస్తారూ?'
    'ఆ, అలాగే ఇన్నాళ్ళూ ఈ పడ్డ యాతన్లన్నీ చాల్లెదనా? నువ్వేమీ మాట్లాడకు. ఏవైనా, అక్కడి కెళ్లాక శర్మ గారింట్లో చెప్పి ఎవరన్నా మంచి మనిషిని కుదుర్చుకోవడం, బాబుని ఆవిడ దగ్గరోదిలేసి మనం హాయిగా షికార్లూ , సినిమాలూ?' అంటూ నిర్మల చెయ్యి నందు కున్నాడు, ఆ సౌఖ్యాన్ని ఊహించుకుంటూ తిలక్. మరో వారాని కల్లా విశాఖ కి బయల్దేరారు వాళ్లు. కాపరం సర్దిపెట్టి వస్తానంటూ రాజమ్మ గారూ నిర్మలా వాళ్ళ వెంట బయల్దేరారు. తమ ఇంట్లో దిగవలసిందిగా శర్మ గారు రాసినా, మంచి రోజున ఇంట్లో ప్రవేశించాలన్న నెపంతో, కంపెనీ వీళ్ళ కోసరం ఇచ్చిన బంగళా లోనే వెళ్లి దిగారు నిర్మలా వాళ్ళూనూ. వో మారు వెళ్లి చూసోచ్చేందుకు గ్గాను పార్వతమ్మ గారు వెళ్లేసరికి నౌఖర్ల వద్ద అలవాటు కానందున బాబు నేత్తుకునే పని చేసుకుంటుంది నిర్మల. 'కోడలికి సాయం' అన్న మిషతో వచ్చిన రాజమ్మ గారు ఏదో సినిమా కెళ్ళడం కోసరం మేడ మీద ముస్తాబవు తున్నారు గావాల్ను. 'ఏం ఒదినా, ఇంకా కాలేదూ' అంటూ పై నించే ఒక్క కేక పెట్టింది రాధ. పార్వతమ్మ గారోచ్చిన సంగతి తెలియక.'
    'ఇదుగో డికాక్షన్ దిగుతుంది. ఈ లోగా నువ్వు తయారౌతూ వుంటే సరీ అంది శాంతంగా నిర్మల.

                                      6
    'అబ్బ ఆ వేడి వేడి కాఫీ తాగితే మొహమంతా మళ్లీ చెమట పడుతుంది బాబూ! నువ్వు కాస్త దబ్బున కానీ...' అంది విసుక్కుంటూ రాధ    'ఇదిగో , సామాన్లింకా రాలేదేమో ఒకటుంటే ఒకట్లేదు ఏం చెయ్యనూ' అని తనలో తనే అనుకుంటూ ఎలాగో కాఫీ తయారిస్తుంది నిర్మల.
    'బాబు' నిలా ఇచ్చి పని చూసుకో అమ్మా. అంటూ అందుకుని దగ్గర కూర్చో పెట్టుకున్నారు పార్వతమ్మ గారు. ఆవిడ రావడంతో పరమతృప్తి నిర్మలకి. ఈలోగా సామన్ల లారీ రావడంతో ఇల్లంతా ఒకే హడావిడై పోయింది.
    'ఏవేవి ఎక్కడ పెట్టించాలో త్వరగా చెప్పోదినా బరువు సామాన్ల ని మళ్లీ మళ్లీ మార్చాడమంటే ఇబ్బంది.' అన్నాడు హడావిడిగా లోపలి కొచ్చిన మురళి.
    'అయ్యో రామ చురుకుతన మన్నది ఏకోశాన్నా లేదు గదా?' అని సాధించుకుంటూ మేడ దిగొచ్చిన రాజమ్మ గారు అక్కడ పాప నాడిస్తూ కూర్చున్న పార్వతమ్మ గార్ని చూసి తెల్లబోయారు. ముస్తాబై సావకాశంగా కిందికి దిగి వచ్చిన తల్లినీ, చెల్లెల్నీ చూసేసరికి మురళి కి ఒళ్ళు మండిపోయింది.
    వో మూల్న ఇంట్లో ఇంత హడావిడి పడుతుంటే ఇప్పుడు సినిమకేం తొందరోచ్చింది అనుకుని.... 'వదినే ఒక్కర్తే అలా అవస్థ పడుతుంటే చూస్తూ అలా నిలబడతావేం రాధా! ఆ పనన్నా చూడు. లేకపోతె ఈ సామాన్లనన్నా సర్ధించు అన్నాడు గద్దిస్తూ.
    'పోనిద్దురూ , తనేదో పిక్చర్ కి వెళ్ళాలను కుంటుందీ.... ' అంది నిర్మల.
    'అలాగైతే రండి. దారిలో దింపేసి వెళ్లిపోతా!' అంటూ తనూ లేచారు పార్వతమ్మ గారు. ఇల్లున్న హడావిడి లో ఆవిడ్నాట్టె ఆపడం ఇష్టం లేక బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది నిర్మల. వోసారి బెట్టు చేశాకనే మరీ వాళ్ళ కరేక్కారు రాజమ్మ గారు. అవిడేదురుగా ఏవీ అనలేని మురళి వాళ్ళు వెళ్ళాక చాలా చిరాకు పడ్డాడు.
    'మీరిద్దరూ భోజనాల్చేసేయ్యలేక పోయారా' అంటూ లోపలి కొచ్చాడు ఆలస్యంగా వచ్చిన తిలక్.
    'ఇంతాలస్య మయిందెం కారు రిపేరా?' బల్ల మీద భోజన సామాగ్రి అమరుస్తూ  అంది నిర్మల.
    'మరే. ఈ ఛండాలపు రోడ్డులో ఇంత దూరం నడిచింది కదూ. కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది.'
    'ఈ నాలుగు రోజులకే ఇలా అయిపోయారేమిటి ?' అన్నాడు నిస్త్రాణగా వున్న నిర్మల మొహం లోకి చూస్తూ.
    'ఏదో ఊరూ, ఇల్లూ అన్నీ కొత్తవడం వల్ల. నాలుగు రోజులు పొతే అదే సరిపోతుంది...'
    'అన్నట్టు మురళీ ఏడీ?'
    'ఇంతవరకు సామాన్లన్నీ సర్ధించి ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు.'
    'సాయంత్రం పిక్చర్ కి వెళ్దామా?'
    'నే రాను బాబూ'
    'ఏం? ఎందుకనీ? తడిచేతి నీళ్ళని నిర్మల మొహం మీదికి విదిలిస్తూ అడిగాడు.
    'పనుంది...' కళ్ళు చికిలించుకుంటూ రెండు చేతులూ మొహాని కడ్డం పెట్టుకుంటూ అంది. ఈలోగా మురళి రావడంతో ముగ్గురూ భోజనం ముందు కూర్చున్నారు.
    'ఈ మార్పులో కాస్త మన పరిస్థితులకీ- అంటే స్వేచ్చా స్వాతంత్ర్యాలకీ కాస్త మార్పుంటుందన్న ఆశతో నెగా, ప్రత్యేకంగా ప్రయత్నించి విజయవాడ నుంచి ఇక్కడి కొచ్చేశానూ! అందువల్ల అక్కడ లాగే ఇక్కడ నువ్వెప్పుడూ ఇంట్లోనే మగ్గుతానంటే ఒప్పేది లేదూ తెలిసిందా.'  నిర్మల ని హెచ్చరించాడు తిలక్.
    'మీ మాటెలా వున్నా, వదిన ఇక్కడికి రావడం నాకు మాత్రం చాలా లక్కీయే? అన్నట్టు, కారోచ్చేసింది గనక, మరి మనం ఎప్పుడు వెళ్దాం వదిన?' ఉత్సాహంగా అన్నాడు మురళి.
    'ఏమో బాబూ, తల్చుకుంటేనే భయంగా వుంది నాకు.'
    'అమ్మని గురించే నా, అమ్మివాళ వెళ్లి పోతుందిగా? ఇక రాధా? మధ్యాహ్నమంతా అది ఇంట్లో ఉండనే వుండదు. అదీ గాక ఇది ఎంతమాత్రం పస.....
    'చులాగ్గా చెప్పేస్తున్నారు . రాధ చాలా సూక్ష్మంగా అన్నీ పసిగట్ట గలదు. ఇక మీ అమ్మ గారిప్పటి మట్టుకు వెళ్లితే మాత్రం? మళ్లీ ఈ కబురు మోసుకుని మనం ఆవిడ వద్దకేగా వెళ్ళాలీ?'
    'ఫరవాలేదు లెద్దురూ మిమ్మల్నెవరూ ఏమీ అనకుండా చూసుకునే పూచీ నాది. సరేనా' చెయ్యి కడుక్కు వొచ్చి మళ్లీ తన కుర్చీలోనే కూర్చుని చేతులుడుచుకుంటూ అన్నాడు.
    'ఆ ఆకస్తాడ్డూ తీరగానే అమ్మగారితో సహా మీరు 'హనీమూన్' కి వెం చేసేస్తారు. ఇక మీ అమ్మగారి వద్ద చిక్కుకునేది నేను----'
    'ఇంతకీ ఆ 'హానీమూన్ ' లేవిటో ఆ ,వెళ్ళడాలేవిటో , నేనూ కాస్త తెల్సుకోవచ్చా!....ఎరోయి? కిమ్పదీసి ఏ....'
    'అలా చేసేసుకుంటే , ఈ యాతన్లూ ఈ బతిమాలింపులూ, ఎందుకు తిలక్, ఏదో మీ వంటి పెద్దల సమక్షాన్నా---- ఏమంటావ్ వదినా!' అన్నాడు నానుస్తూ మురళీ.
    'అబ్బ, అంత తొందరైతే ఎలాగ కాస్త నిదానించండి.' అంది తనూ భోజనం ముగించి భర్తకీ, మరిది కీ వక్కపొడి అందిస్తూ.
    'ఆ ఒక్కరికి చెప్పచ్చున్లెండి యెన్ని శ్రీరంగ నీతులైనాను' అర్ధంగా చూస్తూ అన్నాడు మురళి.
    'ఏమన్నా మీ అంత తొందరపడలేస్సుమండీ మీ అన్నయ్యా.'
    'అయ్యో, ఆ వివరాలన్నీ నేనెరగనను కుంటున్నారు గావాల్ను.'
    'అయితే మీరు విన్నది అబద్దమై యుండాలి.'
    'వోహో! అయితే ఆ తొందరపడ్డ దంతా మీరే నన్నమాట.'
    'ఆహా నాకాపాటి ధైర్యం వుంటే ఇలా ఎందు కుంటాను.
    సరి మేమే తొందర బుద్దివాళ్ళం . ఇక అసలు సంగతి చెప్పండి.'
    'చెప్పాగా భయమేస్తోందని.'
    'సరి మీ మీద ఆశ పెట్టుకుని మేం వుంటే, మీరింత పిరికితనం చూపిస్తే ఎలా వదినా!'
    'లేకపోతె నువ్వు దీని సహాయం కోరదమేమిటి. అందులోనూ ప్రేమ సందేశాల నిమిత్తం. హు మేం మొదటిసారి విడిగా మాట్లాడుకున్నప్పటి దాని ప్రవర్తన ని విన్నావంటే , ఇక దాని సహాయం కోరవు  సరికదా, మా ప్రయత్నాలన్నీ ఫలించెంత వరకూ దయచేసి మీరిందులో జోక్యం చేసుకోకండి వదినా' అని బతిమాలు కుంటావు కూడా --' ఇంకా అతనేదో చెప్ప బోతుండగా 'చాల్ను ఊరు కుందురూ' అని మందలించింది సిగ్గుతో నిర్మల.
    'అయితే చెప్పుకుంటే , గొప్ప సిగ్గు అమ్మమ్మ అంటావ్ అంతేనా' అన్నాడు నవ్వుతూ.
    'అంత సిగ్గు పడ్డానికేం వుందనీ మహారాజులా చెప్పండి.'

                    
    'ఏవిటీ? మళ్లీ తరవాత నన్ను సతాయించకూడదు.'
    'అలా పెంచుకు పోయే బదులు ఆ కాస్త రహస్యమూ చెప్పెయ్య రాదూ తిలక్ నువ్వూ?'
    'అసలేవన్నా ఉంటె కదండీ, చెప్పేందుకూ. అందుకే ఈ జంకు' నవ్వింది నిర్మల.
    'ఆహా , అందాకా వచ్చింది కదా, అయితే వినరా మురళీ' అంటూ ఠీవిగా కాలు మీద కాలు వేసి తోడ మీద కొట్టుకున్నాడు తిలక్. నేనూ సిద్దంగా వున్నానన్నట్టుగా నటిస్తూ, నోరు గట్టిగా మూసుకుని చేతులు కట్టుకుని బడి కుర్రాళ్ల , కూర్చున్నాడు మురళి. మళ్ళీ వోసారి నిర్మల వేపు చూశాడు తిలక్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS