
హల్లో కూర్చుని తను చూసిన "న్యూవేవ్" సినిమా గురించి ఇందిర చంద్ర శేఖరానికి చెబుతుంది. అతను "న్యూవేవ్" సినిమాలేవీ చూడలేదుట. సత్యజీత్ రాయ్ "వధేర్ పాంచాలీ" చూశాడుట గానీ ఏవీ నచ్చలేదుట.
"అయినా సినిమా కంటూవెళ్ళేదీ కాస్త వినోదం కోసం కదా. అలాంటప్పుడు నాలుగు పాత్రల చేత ఏడిపిస్తే ఏం సుఖమండీ? సత్యజీత్ రాయ్ ఎంత గోప్పవాడయినా పాటలూ, డాన్సులూ లేకుండా సినిమాని వినోదాత్మకంగా ఎలా తీయగలడండీ?' అన్నాడు.
ఇందిర అతని అభిప్రాయాలను విని ఊరుకుంది గానీ వాదించదలుచు కోలేదు. ఎందుకంటె అలాంటి వాళ్ళతో వాదించి లాభం లేదు కనక.
న్యూవేవ్ సినిమాల్లో కొత్తదనం గురించి, తను చూసిన ఫ్రెంచి చిత్రం "హీరో షిమామాన్ అమోర్' ను దృష్టాంతంగా తీసుకుని చెప్పింది. అతను సరదాగానే విన్నాడు కానీ, అంత అర్ధమైనట్టు లేదతనికి.
"సరే మీరు "క్లీయో పాత్రా" చూశారా?' అని అడిగిన శేఖరాన్ని ఎదిపించాలని ఇందిర, "అది వట్టి దండుగ సినిమా. మరీ వ్యాపార సరళి లో తీశారు గానీ, కళా దృష్టి తో తీయలేదు" అంది.
"అదేమిటి , అలా కొట్టి పారేస్తున్నారు? ఆ సెట్టింగు లు, కాస్ట్యూమ్స్ లూ, ఆ నటనా........"
"మరే....మరీ ముఖ్యంగా లిజ్ టేలరూ , బెధింగ్ సీనూ, ఆహా.......' అని నవ్వడం మొదలెట్టిన ఇందిర గేటు తెరుచుకుని లోపలికి వస్తున్న పురుషాకారాన్ని చూసి నవ్వు మాని స్తభ్డురాలై చూస్తూ ఊరుకుంది.
శేఖరం కూడా ఆమెలోని మార్పు గమనించి, "ఎవరండీ వచ్చేది? దేవుడా, దయ్యమా? అలా కళ్ళప్పగించి చూస్తున్నారు?" అన్నాడు.
ఆమె ఇదేం వినిపించుకోలేదు. కళ్ళని అగంతుడికి పైనే నిలిపి కూర్చుంది.
మాధవరావు గుమ్మం లోపలికి అడుగు వేసి నమస్కరించాడు.
ఇంకా ఆశ్చర్యాన్నించి తేరుకొని ఇందిర "ఎలా వచ్చారు?' అని అడిగింది.
"అదేం ప్రశ్న, ఇందిరా" అంటూ మండలిస్తున్నట్టు నవ్వాడు శేఖరం. మాధవరావు క్షణం లో సగం సేపు, మాట్లాడిన పెద్ద మనిషి వంక చూసి, తల తిప్పుకున్నాడు.
ఇందిర ఇంకా రెప్పలల్లార్ప కుండా అతన్నే చూస్తుంది కలా నిజమా అన్నట్లు.
"కూర్చోవచ్చునా?" ఆమె ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ అన్నాడు మాధవరావు.
తల గట్టిగా ఊపి, "చెప్పండి, ఇక్కడి కెందుకు వచ్చారో' అంది.
"భలే! ఇంకెందు కేమిటి? నీకు తెలియదా, ఇందిరా! " అతని ముఖం మీది నవ్వు మాయమయింది.
శేఖరాని కేం అర్ధం కాలేదీ వ్యవహారం.
"నే వెళ్లి వస్తాను, ఇందిరా. ఇంకోసారి కలుద్దాం" అంటూ లేచాడు.
ఇందిర వెళ్ళమన్నట్టు తల ఊపి ఊరుకుంది.
ఇందిర ప్రవర్తన శేఖరానికి విస్మయాన్ని కోపాన్నీ కలగజేసింది. అతనింక మారుమాట లేకుండా చకచకా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్న శేఖరాన్ని నిర్లిప్తంగా చూసిన ఇందిర మాధవరావు వంక తిరిగి , "ఎప్పుడు వచ్చారో చెప్పండి. మిమ్మల్నింట హటాత్తుగా, అనుకోకుండా చూడ్డంతో నాకు పిచ్చేత్తేటట్టుంది " అంది.
"అయితే అదృష్ట వంతుడ్నే, ఇందిరా, నిన్ను మళ్ళీ కలవడానికి ణా కిప్పుడే ధైర్యం వచ్చింది. నువ్వొక అంక్ష పెట్టావు, గుర్తుందా?"
అతని వంక చూస్తూ కూర్చుంది ఇందిర.
"నీతో ఎంతో మాట్లాడాలని అంతదూరం నించీ వచ్చాను. నన్ను వెళ్లి పొమ్మనకు." అభ్యర్ధించాడతను.
"అతిధుల్ని గెంటి వేసే సంప్రదాయం కాదు మాది." తనను తాను కూడదీసుకున్న ఇందిర అనగలిగింది.
అతనింకేదో అనే లోపలే వారించి లేచి లోపలికి వెళ్ళింది గాలిలో తేలుతూ.
"అమ్మా, ఇలా రావే. డిల్లీ నుంచీ మామయ్య స్నేహితుడోకాయన వచ్చాడు. నాన్నేరీ స్టడీ లో ఉన్నారా? నాన్నా, మామయ్య స్నేహితులు ఒకాయన వచ్చారు" అంటూ హడావిడిగా ఇద్దర్నీ హాల్లోకి పీల్చుకు వచ్చింది. గోపాలరావు గారి స్నేహితుడనగానే పెద్దవాడయి ఉంటాడని తలచిన దంపతులిద్దరూ వినయంగా తమకు నమస్కరిస్తున్న చిన్నవాణ్ణి చూసి కొంచెం ఆశ్చర్యపడ్డారు.
"కూర్చోండి........ ఎప్పుడూ రావడం?"
"ఇవాళే నండీ."
'అలాగా.....ఏమన్నా పని మీద వచ్చారా?"
"ఔనండీ . అర్జంటు వ్యవహారం ......"
"ఉహూ....... మీరేం పని చేస్తున్నారక్కడ ?'
'జాన్ అండ్ ఎరిక్ కి మేనేజింగ్ డైరెక్టర్నండి."
"అలాగా....ఇందూ , మన శేఖరం ఏడీ?"
"వెళ్ళిపోయాడనుకుంటాను నాన్నా." ఇందిర తెల్లముఖం వేసింది.
"చెప్పి వెళ్లలేదూ?"
"ఏమో -- ఉహూ? చెప్పారు " తికమక పడింది ఇందిర.
ఎవరూ ఏం మాట్లాడలేదు చాలాసేపు. ఆకాశం లోంచి ఊడిపడ్డ ఈ మహానుభావుడేవడా అని సీతమ్మ ఆలోచిస్తుంది.
"మంజులా , అత్తయ్యా వాళ్ళే మంటున్నారు?' ఇందిర శాంతంగా అడిగింది.
"మీరు తిరిగి రావడం లేదని బాధపడుతున్నారు."
".........."
లేచి తన చేతిలోని పాకెట్టు ఇందిర చేతికిచ్చి "నేనిక్కడికి వచ్చింది ముఖ్యంగా మంజుల వల్లే. ఈ పుస్తకాలు మీకిమ్మంది. తనకేవో కావాలని అడిగింది మీరు శ్రమ అనుకోకుండా ఓసారి నాతొ బజారు రాగలరా?"
సందేహంగా "ఇప్పుడా?' అంది ఇందిర , మంజుల పంపిన పాకెట్టు ఒళ్లో ఉంచుకుని.
"ప్లీజ్, నేను రేపు ఉదయాన్నే పోవాలి."
"ఏం కావాలిట మంజులకు?' సీతమ్మ గారు అడిగారు.
"ఏవో చీరలూ, అవీ....తడుముకున్నాడు.
కృష్ణమూర్తి గారు ఇప్పుడే వస్తానని గొణిగి లోపలికి వెళ్ళిపోయారు. సీతమ్మ గారు కూడా పెద్ద పని ఉన్నట్టు లేస్తూ "కాఫీ తీసుకుంటారా?" అని అడిగారు. "వద్దు, వద్దు" అని మాధవరావు అనడం, ఆవిడ లోపలికి వెళ్ళడం జరిగాయి.
"ప్లీజ్, ఇందిరా, ఒక్కసారి రా పైకి." బతిమాలాడాడు మాధవరావు.
ఇందిర జవాబిచ్చే లోగా సీతమ్మ గారి పిలుపు వినబడింది.
ఇందిర లోపలికి వెళ్ళగానే "ఎవరే, అమ్మాయీ, తనూ?" అని అడిగారు సీతమ్మ గారు. కృష్ణమూర్తి గారు కూడా ఇందిర జవాబు కోసం నిరీక్షిస్తున్నట్లు అగుపించారు.
చటుక్కున ఇందిర అంది. "మంజుల నతనికిచ్చి చేద్దామను కుంటున్నారమ్మా అత్తా వాళ్ళు. వాళ్ళల్లో ఒకడులా ఉంటాడీయన . నాకూ బాగా పరిచయం ఉంది."
కృష్ణమూర్తి గారి ముఖం వికసించింది. "ఇతనే నేమిటి , మీ మామయ్య 'మంచి సంబంధం' అంటూ రాశాడు?"
"పిల్లాడు బాగానే ఉన్నాడు. ఇంటి పేరేమిటో? ఎంతిస్తారేమిటి జీతం?"
తల్లి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వ కుండా 'అమ్మా, నాక్కాస్తా డబ్బియ్య వే. నేకూడా మంజుల కేమన్నా కొని పంపుతా నితనితో" అంది.
"సరే, పోయి చీకటి పడకుండా ఇల్లు చేరు జాగ్రత్త" అంటూ కూతురికి వెయ్యి సలహా లిచ్చి పంపారు.
* * * *
సిరిపురం అంటే వాల్తేరు కల్లా అందమైన, పరిశుభ్రమైన ప్రదేశం. ఒకవైపు దూరదూరంగా కట్టబడిన ఇళ్ళూ, మరో వైపున విశ్వవిద్యాలయోపధ్యాయుల నివాస గృహాలు, మూడో వైపున చిక్కని మామిడి తోపూ, ఇంకొంచెం ముందుగా పొతే కాల్టేక్సు భవనాలు, వెనకాలగా అద్భుతమైన సముద్రమూ -- ఇవన్నీ కలిసి సిరిపురాన్ని అందమైన ప్రాంతంగా చేస్తాయి. కాల్టెక్స్ బంకు బస్సు స్టాపు దాకా మాధవరావూ, ఇందిరా మాటా మంతీ లేకుండా తాపీగా నడిచారు. బస్సు స్టాపు సమీపించిన తరవాత, దూరాన హోరుమంటున్న సముద్రం వంక చూస్తూ, మాధవరావు అన్నాడు. "మనం బజారు కెళ్ళటం లేదు. అలా సముద్ర తీరానికేడదామా?"
'సరే" అన్నట్టు తల ఊపింది ఇందిర. సెలవు రోజులేమో దగ్గిరలో కనిపిస్తున్న ఆర్ట్స్ కాలేజీ లో జన సంచారమే లేదు. దూరంగా చెట్ల సందుల్లోంచి కనబడుతున్న లైబ్రరీ భవనాన్ని చూసి మెల్లిగా నిట్టూర్చింది ఇందిర. ఆ రోజులు మళ్ళీ రావు.
