Previous Page
నిష్టూర ప్రేమ పేజి 17


    "ఏమి టాలోచిస్తున్నారు?' అనుకోకుండా బహువచనం వాడాడు.
    "అదే నా కాలేజీ" అంది ఇందిర దృష్టి మరల్చకుండా. ఇంక ఇందిర నేమీ ప్రశ్నించలేదతను. ఆమె పొట్టి జడను, మెడ దగ్గరి వంపును చూస్తూ నుంచున్నాడతను బస్సు వచ్చేదాకా. నెంబర్ టెన్ బస్సు వచ్చింది. ఆమె ఆడవాళ్ళకు కేటాయించిన సీటులో కూర్చుంది. అతను నాలుగు సీట్ల తరువాత కూర్చున్నాడు. పదిహేను పైసలిచ్చి రెండు టిక్కెట్లు కొన్నాడిద్దరికీ. బస్సు ఎన్నో మలుపులు తిరిగి రామకృష్ణా మిషను దగ్గిర ఆగింది. బస్సులోని మూడు వంతుల జనం దిగారు బీచి దగ్గిర. ముందుగా బస్సు దిగిన మాధవరావు , ఇందిర దిగేదాకా వేచి ఉన్నాడు, జనానికి దూరంగా. బస్సు దిగిన ఇందిర అతని వంకైనా చూడకుండా సరాసరి ఇసుకలోకి నడిచింది. అతను వెనకాలే అనుసరించాడు. నడిచి నడిచి ఇందిర మనుష్య సంచారం లేని భాగం దాకా వచ్చి ఆగింది. సముద్రం వంక చూస్తూ. అంతదాకా వచ్చిన మాధవరావు ఇసుకలో చతికిల బడ్డాడు. ఇందిర రెండు క్షణాల తరవాత అతని వంక తిరిగింది.
    "కూర్చో, ఇందిరా, ఇంక నేను నడవలేను" అన్న మాధవరావు మాటలు సముద్రపు గాలిలో తేలిపోతూ మార్గమధ్యం లో ఇందిర చెవులను పరామర్శించి వెళ్ళాయి. వెంటనే తిరిగి ఇంటికి వెళ్లి పోవాలని పించింది ఇందిర కు ఎందుకో. కానీ అలా చేసే సాహసమూ , ఓపికా రెండూ లోపించడం చేత నిస్సహాయంగా అతనికి ఆరడగుల దూరంలో కూలబడింది తను కూడా.
     "ఇప్పుడు చెప్పు, ఇందిరా. నీకేతువంటి అభిప్రాయముందో నేనంటే?" ఆమెకు దగ్గిరగా జరిగి అన్నాడతను.
    అతని వంకే సూటిగా చూస్తూ, "మీరు చెప్పదలుచుకున్నదేదో చెప్పండి" అంది. మిగతాదంతా అతని కనవసరం అన్నట్టు.
    ఆమె నుంచీ చూపు మరల్చు కొని, "నే చెప్పవలసిందంతా ఇందివరకే చెప్పాను. నాకు కావలసిందేదో నాకు సరిగ్గా తెలుసు. నా కెటువంటి అనుమానాలూ, సంకోచాలూ లేవు. నీకే ఏవో కొన్ని తేల్చుకోవలసిన విషయాలున్నాయి." అన్నాడు మాధవరావు.
    "నాకా?"
    "ఔను. లేకపోతె నాకెందుకు సరియైన జవాబివ్వలేక పోతున్నావు?"
    "మీరడిగినట్లు జరగడం అసంభవం అని నేనూ చెప్పాను. గుర్తు చేసుకోండి."
    "ఎందువల్ల అసంభవమంటున్నావు , ఇందిరా? ఒక్క కారణం చెప్పగలవా?' కొంచెం అసహనంగా అడిగాడు.
    "నాకిష్టం లేదు....మీరంటే."
    "మీ అక్కని నే నిష్ఠ పడనందున , నేనంటే నీ కిష్టం లేదని చెబితే నాకు తగిన శాస్తి జరుగుతుందను కుంటున్నావు. ఇది చిన్నపిల్లలాట కాదు, ఇందిరా , పంతాలు పోవడానికి."
    ఇందిర మాట్లాడలేదు.
    "నీకెంతో వివేచనా శక్తీ, మనో బలం ఉన్నాయను కున్నాను. ఇంత అనాలోచనారహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మీ అక్కను నేను ఇష్టపడక పొతే అది క్షమించరాని నేరం ఎలాగవుతుందో దయచేసి చెప్పగలవా?' తీవ్రంగా అడిగాడతను.
    "ఇష్టపడకపోతే తప్పనటం లేదేవ్వరూ. కానీ...కానీ.....మీరు నీరూని గురించి చాలా చులకనగా హేళనగా ఎందుకు మాట్లాడ వలసివచ్చిందో చెప్పండి నాకు." పరుషంగా అంది.
    "అబ్బే.....నేనేమన్నాను? ఆ పెద్ద మనిషి నా ప్రాణాలు తింటుంటే నాకు మీ అక్కని చేసుకునే  ఉద్దేశ్యం లేదని గట్టిగా చెప్పాను అంతే. అసలు నేను రానంటే బలవంత పెట్టి హైదరాబాదు రప్పించి ఆమెని చూపించాడాయన. నాకస లప్పుడు వివాహం చేసుకోవాలన్న తలపే లేదు."    
    "మరి శాస్త్రి గారు మీరు నీరక్క ని మరీ ప్రాణం లేనిదానిలా ఉందనీ, ఇంకా ఏవేవో అన్నారనీ చెప్పారే?' జవాబు చెప్పండన్నట్టు అడిగింది.
    "ఆయన్ని ప్రమాణంగా తీసుకుని నన్ను నమ్మకపోతే నేనేం చేయలేను. ఈసారి ఎప్పుడైనా అతగాడు నాక్కానిపిస్తే ఇలాంటి అభూత కల్పన లెందుకు చేశాడో అడుగుతాను. నేను చాలా దురుసుగా వ్యవహతిస్తానని మా అమ్మ అనేది. కానీ పరోక్షం లో నాకు తెలియని వాళ్ళ గురించి నేను చులకనగా ఎప్పుడూ మాట్లాడలేదు." ఆవేశంతో అర్ధం చేసుకోవూ అంటూ అర్ధించాడతను.
    శాస్త్రి గారా మాటలు కల్పించి ఉంటాడన్న ఆలోచన ఇందిర కెప్పుడూ రాలేదు. ఇందిరే ఏమిటీ, ఎవరూ కూడా అటువంటి సందేహం వెలిబుచ్చలేదు. చివరికి నిరుపమ చేసుకున్న సంబంధం కూడా అయన తెచ్చినదే. ఆయన్ని ఎందుకు నమ్మాలని ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఎందుకో ఇందిర కు మాధవతావు మాటల్లో నిజాయితీ ఉందని పించింది.
    "నన్ను నమ్మాలి, ఇందిరా. నమ్మలేకపోతే నమ్మించడానికి ప్రయత్న మంటూ చెయ్యలేను. ఒకవేళ నేనుఅటువంటి మాటలన్నీ అన్నా కూడా, నీకు తెలిసినంత లో నేనెటు వంటి వాడినో గ్రహించ లేకపోయావా? ఎదురు కుండా నేనుంటే, ఎక్కడో ఉన్న శాస్త్రి మాటల్ని మాత్రమె ఎందుకు ప్రమాణం గా తీసుకుంటావు? నీయందు నేనేటువంటి అపచారం చేశానని నన్ను కాదంటున్నావు, ఇందిరా?' గాలితో కుస్తీ పడుతున్నట్టు గా అన్నాడు.
    "క్షమించండి , నాదే తప్పయితే...." మనస్పూర్తిగా అంది ఇందిర. "అయినా, ణా జవాబులో మార్పేమీ ఉండదు. నేను బాగా ఆలోచించు కున్నాను. మీరసలు నన్నిలా అడగడం కూడా నాకాశ్చర్యంగా ఉంది. మీకు తెలియదా, అత్తయ్యా వాళ్ళు మంజుల ను మీకిచ్చి వివాహం చేయాలను కుంటున్నారని? లేక తెలియనట్టే నటిస్తున్నారా?"
    అర్ధం కానట్టు చూశాడతను.
    "మీకు గ్రహించగలిగే శక్తీ, వివేకమూ ఉన్నాయను కున్నాను.' అతన్ని అనుకరించింది ఇందిర ఎత్తి పొదుపుగా. "బుద్దిగా మంజులను చేసుకుని సుఖంగా ఉండండి. పసిపిల్లాల్లా వ్యవహరించడం ఎంత తొందరగా మానితే అంత మంచిది." అరిందలాగా చెప్పింది.
    "నీ సూచనలకు కృతజ్ఞుడ్ని. తమరి కభ్యంతరం లేకపోతె నేను నాకు నచ్చిన పిల్లను చేసుకుంటాను. ఒక్క నిమిషం క్రితం దాకా మీ అక్కను చేసుకోలేదని కోపగించావు. ఇప్పుడు మీ మామ కూతురిని చేసుకోమని సలహా ఇస్తున్నావు. ఇంత అసందర్భంగా మాట్లాదతావని నేననుకోలేదు , ఇందిరా."
    "ఇప్పుడు తెలుసుకున్నారుగా!"
    "నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పు. నేను మారు మాటా లేకుండా వెళ్ళిపోతాను. అంతేగానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని నన్ను వాళ్ళందరి నీ సంతృప్తి పరచమంటే మటుకు అది ణా తరం కాదు. చెప్పు, నాతొ సంబంధం నీ కిష్టం లేదా?' ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని అడిగాడు.
    రెండు క్షణాల్లో , రెండు యుగాలో అతని కళ్ళల్లో కి చూస్తూ ఊరుకుంది ఇందిర. సముద్రపు హోరు చెవులలో, శరీరం లో అణువణువున ప్రతిధ్వనించగా ఆమె ఆకాశపు టంచులను అతని కళ్ళల్లో చూడగలిగింది. భూమీ ఆకాశమూ కలిసే చోట మెరిసే తారకల తళుకులు అతని కళ్ళల్లో కనబడ్డాయామెకి. యుగయుగాలుగా సాగుతున్న మానవ చరిత్రనంతా ఒక్క తృటి కాలంలో అతని కళ్ళల్లో చదవ గలిగింది ఇందిర. అందుకే ఏదో అంతు తెలియని భయం ఒక్క ఊపు ఊపగా , రక్షించమన్నట్టుగా అతని ఒడిలో తలదాచుకుంది. తన ఒళ్లో తల పెట్టుకుని ముద్ద బంతి పూవులా కూర్చున్న ఇందిర జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి "పిచ్చిపిల్ల' అనుకున్నాడు మాధవరావు.
    ఆ క్షణం లో అతను ఆకాశాన్నంటుకునేంత పొడుగ్గా పెరిగాడు. సృష్టి అంతా అత్యంత సుందరంగా కనిపించిందతనికి.
    "లే, ఇంటికి పోదాం" అంటూ ఇందిర ను లేపి తను లేచాడు. ఇందిర చేతిని తన చేతిలోకి పోనిచ్చి ఆమెకు ఊతగా నడుస్తూ, "రేపు మీ నాన్నగారితో మాట్లాడుతాను ఇందిరా" అన్నాడు.
    ఇందిర పలకలేదు.
    ఆమె నిద్రలో నడుస్తున్నట్టు నడుస్తుంది.
    బీచి దాటి రోడ్డు మీదికి వచ్చారు ఇద్దరూ.
    "అదుగో , బస్సు వస్తుంది . పద." ఇద్దరూ బస్సెక్కారు.

                             *    *    *    *
    "ఏమిటి కొన్నారు?" అన్న సీతమ్మ గారి మాటకు బదులుగా "బీచీకి వెళ్ళా" మని చెప్పిన కూతురి వంక తెల్లబోయి చూశారు కృష్ణమూర్తి గారు.
    "నన్నేమడక్కమ్మా. నిద్ర వస్తుంది. పడుకుంటా" నని గదిలోకి పోయి గడియ వేసుకున్న ఇందిరను ఒంటరిగా వదిలేయ్యాడం మంచిదనుకున్నారాయన. తెల్లారే దాకా కూతుర్ని ఏమీ అడగకూడదన్న నిబందన పాటించడానికే సీతమ్మ గారు కూడా నిశ్చయించు కున్నారు.
    తెల్లగా తెల్లారాక నిద్రలేచిన ఇందిర స్నానం పూర్తి చేసుకుని , కాఫీ టిఫిన్లు తీసుకునేసరికి పది అయింది. కూతుర్ని క్రాస్ ఎగ్జామిన్ చేసే సమయం దొరికిందని గొంతు సవరించు కుంటున్న కృష్ణమూర్తి గారికి మాధవరావు ప్రవేశం అంతరాయం కలిగించింది. వస్తూనే అతి వినయంగా ఆయనతో ఏకాంతంగా మాట్లాడవలసిన అవసరం ఉందని తెలియ జేశాడతను. ఇద్దరూ ముందు గదిలోకి పోయి గంటసేపు తమలో తామేదో తర్జన భర్జనలు పడ్డారు . ఈ గంట సేపూ కూతుర్ని వివరాల డగటమా,  మానటమా అన్న సందిగ్ధవస్థ లో పడి కొట్టుకున్నారు సీతమ్మ గారు. ఇందిర దినపత్రిక తీసి ఆహార సమస్య దగ్గిర నించీ అమృతాంజనం ప్రకటన దాకా ఆమూలాగ్రంగా చదివింది.
    ,ముందుగది తలుపు తెరుచుకున్న శబ్దం రాగానే కుర్చీ కింద టపాకాయ పేల్చినట్టు ఉలిక్కిపడింది ఇందిర.
    కృష్ణమూర్తి గారు సరసరి వీళ్ళ దగ్గిరికి వచ్చి, "ఇందూ, అతనితో మాట్లాడుతూ ఉండు . ఇప్పుడే వస్తాను" అన్నారు. ఇందిరను అటు పంపి, సీతమ్మ గారితో ఆలోచనలు జరపడం మొదలు పెట్టారు.
    తన కెదురుగా వచ్చి నుంచున్న ఇందిర వంక నవ్వుతూ చూసి, "మీ నాన్నగారు ఒప్పుకున్నారు" అన్నాడు మాధవరావు.
    ఇందిర మనోహరంగా నవ్వింది. సిగ్గుతో చెక్కిళ్ళు ఎర్రబారా యామెకు.
    కిటికీ దగ్గిరికి పోయి నుంచుని పైకి చూస్తున్న ఇందిరతో మాధవరావు మళ్ళీ అన్నాడు. "మీ జోగీ ని కలిశా నా మధ్య."
    తల చటుక్కున తిప్పి, అతని వంక చూస్తూ ఇందిర అంది. "నా అంత అదృష్ట వంతురా లింకేవరూ ఈ ప్రపంచం లోనే లేదని నేను అనుకుంటున్నానని జోగీకి చెప్పండి."
    మాట్లాడకుండా కుర్చీలో జార్లబడి కూర్చుని ఆమె వంక తదేకంగా చూస్తున్నాడతను. ఇందిర కిటికీ ఊచలను గట్టిగా పట్టుకుని, అతని వంక తిరిగి అతని చూపుల్లో తన చూపులను కలిపింది.

                                                             (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS