కొంచెం వాడిన ముఖంతో తిరుగుతున్న ఇందిరను చూసి, "ఏమిటి, తల్లీ, అలా వున్నావు?' అనిఅడిగారు సీతమ్మ గారు.
తల్లి గొంతులో ఆప్యాయత సూటిగా ఇందిర గుండెలను తగిలింది.
"నేనింక డిల్లీ వెళ్ళనమ్మా. నీ దగ్గిరే ఉండిపోతాను." అని కళ్ళల్లో గిర్రున తిరిగిన అశ్రువులను తల్లికి కనబడనీయకుండా అక్కణ్ణించి గబగబా వెళ్ళిపోయింది.
సీతమ్మ గారు ఈ హటత్పరిణామానికి సంతోషించాలో అక్కర్లేదో నిర్ణయించు కోలేక పోయింది.
అలా గబగబా వెళ్ళిన ఇందిర తన గదిలో బల్ల ముందు కూర్చుని , జోగీకి ఉత్తరం మొదలు పెట్టింది. తల్లికి చెప్పినంత క్లుప్తంగా నూ, హటాత్తు గానూ జోగీ కి రాశాక చేయి కదల్లేదు. ఇంక రాయడానికి విశేషాలెం కనబడలేదు. లెటర్ పాడ్ మూసివేసి కుర్చీలో నుంచి లేచింది ఇందిర. ఉత్తరం తరవాత పూర్తీ చెయ్యవచ్చు ననుకుని.
సాయంత్రం కాఫీలయ్యాక అలవాటు ప్రకారం కుటుంబ మంతా వీధి వసారాలోకి చేరారు. చిన్నగా గాలికి అల్లల్లాడే బంతి మొక్కల్ని, చేమంతు లని చూస్తూ, కూర్చుంది ఇందిర. తోటంతటినీ తృప్తిగా సర్వ్ చేస్తూ , ఎత్తైన ప్రహరీగోడ మీదనించి రోడ్డున పోయే మనుషులు కనబడుతుంటే వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచారు సీతమ్మ గారు. కృష్ణమూర్తి గారు మాత్రం కన్నార్పకుండా తన ముద్దుల కూతురి మీదే దృష్టి నిలిపి ఉంచారు చాలాసేపు.
చివరికి కృష్ణమూర్తి గారే సంభాషణ కి ఉపక్రమించారు. "నువ్వు డిల్లీ తిరిగి వెళ్ళకుండా, ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించు కున్నావని అమ్మ చెప్పిందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది నీ నిర్ణయం విన్నాక. ఇప్పుడే నీ కింకో విషయం చెప్పాలని ఉంది. వెనకోమారు నీకు వివాహం చేసుకోవాడాని కేమీ అభ్యంతరం లేదన్నావు కదూ? ఈ మధ్యనే నాకో మంచి కుర్రాడు తటస్థ పడ్డాడు. కింగ్ జార్జి హాస్పిటల్లో అసిస్టెంటు సర్జను గా ఉంటున్నాడు. అందమైన వాడూ, అందరి చేత మంచివాడని పించుకునే వాడూను. పేరు చంద్ర శేఖరం. అతను నిన్ను యూనివర్శిటీ లో ఇదివరకు చూశాడట. నువ్వంటే చాలా గౌరవమూ, అభిమానమూ ఉన్నాయతనికి. నీ అభిప్రాయాల్లాంటివే అతనివీని. నీ కత నెవరో గుర్తుండి ఉండదు. ఎల్లుండి ఓ మాటు ఇంటికి రమ్మని పిలుడ్డామను కుంటున్నాను. చూసి, నచ్చితే ...ఏ విషయమూ ఆలోచించు కుందాం -- ఎమ్మా?"
చేష్టలు దక్కి తండ్రి వంక చూస్తున్న ఇందిర చటుక్కున తన్ను తాను కూడదీసుకుని , "ఇప్పుడెం తొందర వచ్చింది, నాన్నా?" అంది.
"తొందరేముంది?నీ ఆలోచనలు నాకూ తెలుసుగా. ఆ కుర్రాడు నచ్చితే, నాలుగు రోజుల పాటు సన్నిహితంగా మెలిగి ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకున్నాక, మీరో నిర్ణయానికీ రావచ్చు. అప్పుడు నాకు నోటీసిస్తే, ణా తంటాలు నే పడతాను. వెసం కాలంలో గానీ ఎలాగూ మంచి ముహూర్తాలు దొరకవు. అంతా సవ్యంగా నడిస్తే, ఆపైన ఆలోచించుకోవచ్చు."
ఏదో అడ్డు చెప్పబోయిన ఇందిర కు తను పొద్దున్న చేసుకున్న మొదటి నిర్ణయం గుర్తు వచ్చింది. దాంతో తండ్రి వంక చూసి, "మీ ఇష్టం నాన్నగారూ' అని తల తిప్పి కళ్ళ కెదురుగా ఉన్న ముద్ద మందారాలను చూస్తూ కూర్చుంది.
* * * *
రెండు రోజుల తరవాత తమ ఇంటికి టీకి వచ్చిన చంద్ర శేఖరం లో ఏవంకా చూపించలేక పోయింది ఇందిర. పచ్చగా, పొడవుగా ఉన్నాడతను. తెలివైన కళ్ళూ, నాజూకైన పొడుగాటి చేతి వేళ్ళూ ముందుగా ఇందిర నాకర్శించాయి. అతను మాట్లాడిన తీరు , నడవడీ కూడా అతను పెద్ద మనిషి అని చాటి చెపుతున్నాయి. ఇందిర కి అతనంటే వెంటనే స్నేహ భావం కుదిరింది. అతనితో చనువుగా, సరదాగా మాట్లాడుతున్న ఇందిరను చూసి కృష్ణమూర్తి గారూ, సీతమ్మ గారూ కూడా తృప్తి పడ్డారు.
శేఖరం తనెందు కీ ఇంటికి వచ్చాడో తెలుసుండీ కూడా ఎక్కడా చూపుల్లో గానీ, మాటల్లో గానీ ఇందిర అంటే కేవలం కాబోయే భార్యగా చూడలేదు. అసలు ఇందిర కివి పెళ్లి చూపులన్న స్పృహే లేదు. అవీ ఇవీ ఓ గంటకు పైగా మాట్లాడుకున్న తరవాత కృష్ణమూర్తి గారు అతన్ని సాగనంపుతూ "అప్పుడప్పుడు వచ్చి పోతుండండీ " అన్నారు.
'అలాగే" అంటూ వెళ్ళిపోయాడతను.
"నచ్చాడమ్మా నీకు?' అని తండ్రి అడిగినప్పుడీ లోకంలో పడింది ఇందిర.
ఛీ....అతన్ని ఎలా......ఎలా....వివాహం చేసుకుంటుంది? అతన్ని భర్తగా ఊహించుకునేందుకే యావత్ శరీరమూ ఏవగించు కుంటుంది. కానీ ఇంత సేపూ అతనితో కులాసాగా గడిపిన ఇందిర ఇప్పుడే మని అభ్యంతరం చెప్పాలో తోచలేదు.
"ఇంకా ఇప్పుడేగా పరిచయ మయింది." తగ్గుస్వరం లో జవాబిచ్చిన కూతుర్ని చూసి, దురాలోచన గలది నా బిడ్డ అనుకున్నారాయన.
ఆ రాత్రి అంతా ఇందిరకు మాధవరావే గుర్తుకు వచ్చాడు. వద్దనుకున్నా, తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లో కి గుచ్చి చూస్తున్న అతను మనసులో మెదిలాడు. అతని ఆ కళ్ళల్లో కదిలిన విచిత్రమైన భావం ఇదివరకెప్పుడూ ఇందిర చూసి ఉండలేదు. ఆ కళ్ళు ఇందిరను "రా రమ్మ'న్నాయి కానీ, భయపెట్టలేదు. అతనితో పరిచయం అయిన తరువాత తానింకేవరినీ ఇంకో దృష్టి తో చూడలేక పోతున్నదని గ్రహించింది. చంద్రశేఖరం మీద కలిగిన ఔదాసీన్యానికి కారణం అతనే అన్న విషయం అవగత మయింది. అతన్ని గురించిన ఆలోచనలతో ఇందిర కళ్ళు బరువుగా మూతపడ్డాయి.
కృష్ణమూర్తి గారికీ ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కూతురి పెళ్లిని గురించి, చంద్రశేఖరాన్ని గురించీ ఆలోచిస్తూ గడిపారాయన. సీతమ్మగారు ఇందిర డిల్లీ వెళ్లననడం గురించీ, వచ్చిన సంబంధం గురించీ, గోపాలరావు గారికి తెలియ బరచమని గట్టిగా చెప్పారు. తెల్లారుఝామునే ఉత్తరం రాసి పదేస్తాననే దాకా ఊరుకున్నారు కారావిడ.
* * * *
ఇందిర ఎడ్రసు కూపీ తీయడానికి మంజుల ఇంటికి వేళ్ళాడు మాధవరావు. ఇందిర వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళడం అదే మొదటిసారి. తలుపు తీస్తూనే మంజుల సాధించింది. "మమ్మల్ని పూర్తిగా మరిచి పోయినట్టున్నారే, మహానుభావా?"
సంజాయిషీ లూ, కుశల ప్రశ్నలూ అయ్యాక, అనుకోకుండా మంజులే ఇందిర ప్రసక్తి తెచ్చింది. "బొత్తిగా తోచటం లేదండీ మా ఇందిర లేకపోతె."
"మరే, పిల్ల చాలా కలివిడిగా ఉండేది. "అత్తయ్యా' అంటూ వెనకాలే తిరిగేది. మంచి పనిమంతురాలు కూడానూ. ఎవరూ చేసుకుంటారో గానీ, అదృష్టవంతుడే అవుతాడు....' అప్పుడే భూత కాలంలోకి మాట్లాడుతున్న సునరమ్మ గారి ధోరణి మాధవరావు లో అనుమానాలు రేకెత్తించింది.
నవ్వడానికి ప్రయత్నిస్తూ , "ఏమిటి విశేషాలు? ఇంటి దగ్గిర నించి ఉత్తరాలేమన్నా వచ్చాయా?' అని అడిగాడు.
"ఆ , తానింక తిరిగి రాదుట. ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చింది."
"ఏం? డిల్లీ మీద అంత మరీ విసుగు పుట్టిందా ఆవిడకు?' చిన్నబోయిన ముఖంతో అడిగాడతను.
"లేదోయ్ , ఎంతైనా ఆడపిల్ల కదా. పెళ్లి చేసి పంపాలనుంటుంది కాని, ఏ తల్లిదండ్రులకయినా, పరాయి ఊళ్ళో ఎందుకు ఉంచుతారు? ఇందిర కేదో సంబంధాలు చూస్తున్నారట. ఏదో ఒకటి ఖాయం చేస్తే సరిపోతుందను కుంటున్నారు వాళ్ళు. సందట్లో సందడని మా మంజుల తల్లికి కూడా మూడు ముళ్ళూ వేయించెయ్యాలను కుంటున్నావయ్యా."
"చాలు కానీ ఇంక ఊరుకుందూ , అమ్మా, పుణ్యముంటుంది." అంది మంజుల , ముఖం ఎర్ర బడేసుకుని.
మాధవరామీ వినిపించుకోలేదు. "ఇందిర పెళ్లి ఇందిర పెళ్లి" అని సకల భువనాలు తన చుట్టూ తిరుగుతూ సంగీతం పాడుతున్నట్లని పించిండతనికి.
'ఔనోయ్ ఎంత ముద్దయినా ఆడపిల్లని ఎంతకాలం ఇంట్లో ఉంచుకోగలం చెప్పూ? మా అమ్మాయికి నచ్చిన వాడూ, యోగ్యుడూ దొరకాలే గానీ, మా మంజుల కేం తక్కువయ్యా?" అతని వంక ఆశగా చూస్తూ ఆవిడ అన్న మాటలు సరిగ్గా వినిపించుకోలేధతను.
"మరే, తనకేం లక్షణంగా ఉంది" అన్నాడతను అనాలోచితంగా. చెవుల్లో "ఇందిర పెళ్లి" అంటూ రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి.
"ఉన్నది కాస్తా కొద్దో గొప్పో దానికే చెందుతుంది. పెద్ద జమీందారులం కాకపోయినా ఏదో వెనకా ముందూ చూసుకోనక్కర్లేని వసతి ఉంది భగవంతుడి దయ వల్ల." చెప్పుకు పోయిందావిడ."
అక్కణ్ణించి మంజుల ఎప్పుడో వెళ్ళిపోయింది . మాధవరావు ఇంక కూర్చోలేక పోయాడు.
"వెళ్ళొస్తానండీ ఇంక....." లేచి వెళ్ళబోతున్న మాధవరావు కో ఉపాయం తోచింది.
"అన్నట్టు, అసలు సంగతి మరిచి పోయాను . వాసన్ వాల్తేరు వెళుతున్నాడు పనిమీద. ఇందిర ఎడ్రస్ కావాలన్నాడు."
"అలాగా. అయితే ఇందిర పుస్తకాలూ అవీ పట్టుకేడితే బాగుండునే. ఎప్పుడు వెడుతున్నాడుటా ? అమ్మాయ్ , మంజూ , ఇలా రామ్మా. ఇందిర ఎడ్రస్ రాసియ్యి, తల్లీ, ఇతనికి కావాలిట."
"మీరూ వేడుతున్నారా వాల్తేరు?' ఆశ్చర్యంగా అడిగింది మంజుల.'
"ఔను, మంజులా, ఇందిర కోసం , ఇందిర దగ్గిరికి పోవాలనుంది." అందామని పించినా తమాయించుకుని శుష్క హాసం చేసి, "లేదు, వాసన్ వేడతాట్ట" అన్నాడు.
మంజుల ఓ కాయితం మీద ఎడ్రస్ రాసి ఇచ్చింది. భద్రంగా కోటు జేబులో దాచుకున్నాడా కాయితాన్ని."
"మళ్ళీ వస్తారు కదూ." మంజుల అడిగింది.
"తప్పకుండా ' అని యాంత్రికంగా చెప్పి తడవ కి రెండేసి మెట్లు చెప్పున దిగి కారులోకి చేరాడు మాధవరావు. అర్ధం లేని వేగంతో కారు నడుపుతూ "ఔను నేనే వెళ్ళాలి. ఉత్తరం రాసి ప్రయోజనం లేదు" అని పదేపదే అనుకున్నాడతను.
మరునాడు సాయంత్రం హల్లో ఒంటరిగా కూర్చుని పత్రికేదో తిరగేస్తున్న మంజుల ఫోను రింగుమనగానే చేతిలోకి తీసుకుంది. మాధవరావు మాట్లాడుతున్నాడు.
"ఇందిర పుస్తకాలేవో తీసి కెళ్ళమన్నారు మీ మదర్ అవి ఇక్కడికి పంపగలరా, మంజులా?"
'అలాగే, వాసన్ ఎప్పుడు వెడుతున్నారు?"
".........."
"హలో!"
"ఇక్కడే ఉన్నాను మంజులా. నిన్న నేను చెప్పింది నిజం కాదు. ప్లీజ్ మంజులా, నన్నర్ధం చేసుకో. నేనే వాల్తేరు వెడుతున్నాను . నిన్న మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్తాననుకోలేదు."
మంజుల నీరసంగా సోఫాలో వాలిపోయింది.
"పని మీద వెళుతున్నారా?' సరళంగా అడగ ప్రయత్నించింది.
'ఆ....నీతో అబద్ద మాడలేను , మంజులా. నేను ఇందిర కోసం వెడుతున్నాను. ఎంతవరకూ కృతకృత్యుడనవుతానో నాకు తెలియదు. విష్ మీ లక్." తడారిపోయిన నాలుకను పెదిమల పై పోనిచ్చి అలాగే వింది.
"ఇందిర అందుకేనా తిరిగి రావడం లేదు?"
"నన్నడక్కు , మంజూ. తను రాకపోతే నే వెళుతున్నాను ఇంట్లో ఎవరికీ చెప్పక.......ఏమవుతుందో?'
"ఇందిర అదృష్ట వంతురాలు."
మాధవరావు తప్పు చేసినట్టు ఊరుకున్నాడు.
"మాట్లాడరేం ? ఇందిరను చూసి మాత్రం నే నసూయపడలేను......మీకు అభినందనలు చెబుతున్నాను....సరే ఇందిర సామాను నాయర్ చేత పంపుతాను. ఏమనుకోకండి."
గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది మంజులకు. మాధవరావు ఆమె గొంతులోని కన్నీళ్ళ ను గ్రహించాడు.
"మంజులా , నన్ను క్షమించు. నాకు....నాకు తెలియదు." జాలిగా అన్నాడు.
సమాధానంగా అవతల టెలిఫోను పెట్టిన చప్పుడయింది. మాట్లాడకుండా తనూ పెట్టేసి సామాను సర్దుకోడం మొదలు పెట్టాడు.
బయలుదేరేముందు నాయర్ చిన్న పాకెట్టు తో వచ్చాడు.
"మంజులమ్మ మీ కిమ్మన్నారు" అంటూ ఒక కవరు కూడా ఇచ్చాడు.
నాయర్ ని వెళ్ళమని కవరు విప్పి చూశాడు. అందులో ఒక చిన్న చీటీ ఉంది.
"నేను క్షమించవలసిన పనేం చేయలేదు మీరు. నా స్నేహితులయిన మీ ఇద్దరికీ మంచి జరగలన్నదే నాకావలసింది. అమ్మతో అన్ని విషయాలూ మీరే చెబుదురు గాని. దేవుడు మీకు శుభం కూరుస్తాడు. మంజుల" అని రాసిన చీటీ చదివి, నిట్టూర్చి ఆ చీటిని నలిపి వేశాడు.
