"సుభా" అని నన్ను ఒక్క నెట్టు నెట్టారు. మంచం కోటి మీద పడ్డాను. తలకు దెబ్బ తగిలింది. రక్తం వచ్చింది. అప్పటికి గాని నాలో మామూలు చైతన్యం కలగలేదు. అంతా రెండు నిమిషాల్లో జరిగిపోయింది. అక్కయ్య చీరే కుచ్చేళ్ళు సర్దుకుంటూ వంటింట్లో కి వెళ్లి పోయింది. వంటింట్లో నుంచి ఏడుపు వినిపిస్తున్నది. దవడ పుచ్చుకుని వారు గదిలోకి వెళ్లి పోయారు.
నాకు తల దిమ్మెక్కి పోయింది. రక్తం కారకుండా చేత్తో అదిమి పెట్టాను. వారి గదిలోకి వెళ్ళలేక అక్కడే నెల మీద పడుకున్నాను.
మరో అరగంటలో తలుపు కొట్టిన చప్పుడయింది. హరికధ అయి అత్తయ్య వచ్చినట్లుంది. మెల్లిగా లేచి వెళ్లి తలుపు తీశాను. నన్ను చూసి నీరయిపోయింది అత్తయ్య. ఇంట్లోకి రాగానే అత్తయ్య కాళ్ళు చోట్టేసి బావురుమని ఏడ్చింది అక్కయ్య. ఆవిడా ఖంగారు పడిపోతూ "ఏం జరిగింది అన్నది. అంతా చెప్పాను. చివాల్న గదిలోకి వెళ్ళి ,
'పాపాత్ముడా బుద్ది లేదురా, పశువా, ఛీ, నీ ముఖం చూస్తె పంచ మహాపాతకాలూ చుట్టూ కుంటాయి. ఆ అమాయకురాలి జీవితంలో నిప్పులు పోడ్డామను కున్నావురా, అమ్మాయి నువ్వనుకున్నంత అమాయకురాలు కాదురా. మంచి చెడ్డలు తెల్సిన గంగిగోవు లాంటిది" అంటూ ఎన్నో చివాట్లు వేశారు. వారెం మాట్లాడనే లేదు.
ఆ మర్నాడు ఉదయమే ఎక్కడికో వెళ్ళి పది గంటలకు తిరిగొచ్చి జిప్ బాగ్ లో కాసిని బట్టలు సర్దుకుని ఊరికి వెళ్ళి నాలుగయిదు రోజుల్లో వస్తానన్నారు. ఏ ఊరి కని గాని, ఎందుకని గాని వారు చెప్పలేదు. నిర్విన్నురాలై నిల్చుండి పోయాను.
"ఆఫీసు పనా, శలవు పెట్టారా"
"శలవు పెట్టాను. కాకినాడ వెళ్ళాలి."
ఎందుకని అడగలేదు. ఎందుకో నాకూ తెలీదు. రాత్రి ఎంత గట్టిగా కొట్టానో వారి చెంపలు చూస్తుంటే తెల్సింది. వారి ప్రవర్తన లోకం దృష్టి లో అసహజమైన భరించగలిగినదని వారి అభిప్రాయం. కాని భార్య చేత చెంప దెబ్బలు తిన్నానే అనే కుమిలింపు, క్రోధావేశాలు వారి ముఖంలో అద్దంలో చూసినట్లే కనిపించింది. మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు.
నేను మామూలుగా ఆఫీసుకు వెళ్లాను. అటెండెన్స్ రిజిష్టర్ లో సంతకం పెట్టి సీట్లోకి వచ్చి కూర్చున్నాను. ఇంకా కాగితాలు సర్దుకోలేదు. యు.డి.సి. రామారావు గారు వచ్చి, 'ఒక్కసారి ఇట్లా రామ్మా" అన్నారు వరండాలో నుంచి నా వైపు చూసి. వరండాలోకి వెళ్లాను. ఒక చివర నిల్చున్నాం. అక్కడ ఎవరూ లేరు.
శ్రావణ కుమార్ నాలుగు రోజుల సెలవు పెట్టాడెందుకు?"
'కాకినాడ వెళ్ళాలిట. వెళ్ళారు. ఏం పనో నాకు తెలీదు."
"మీతో ఏదన్నా ఘర్షణ పడ్డాడా."
నిజం చెప్పాలో తప్పించి చెప్పాలో నాకు అర్ధం కాలేదు. వెళ్ళే ముందు రామారావు గారితో సంప్రదించారని ఊహించాను. అసలు విషయం చెప్పి కాపురం గుట్టు బైట పెట్టి అయన సలహా ను అర్ధించటమా లేక ఏదో సర్ది చెప్పి వారి కాకినాడ ఎందుకు వెళ్లిందో తెల్సుకోటమా అని ఆలోచించాను.
"సంసారం అన్న తరవాత సంఘర్షణలూ, సంప్రదింపు లూ తప్పవు. మా అమ్మా, అక్కయ్యా మా దగ్గిరే ఉంటున్న సంగతి మీకు తేలింది కాదు . వారిద్దరినీ పంపించెయ్య మంటారు. అదే వారి బాధ. మా భార్య భర్తల మధ్య మనస్పర్ధలకూ అదే కారణం" అన్నాను.
రామారావు గారు కూడా ఏదో చెపితే నమ్మే రకం కాదు. అదీకాక వారిద్దరూ స్నేహితులు కూడా.
వాడీ ఊరు నుంచి కాకినాడ బదిలీ చేయించు కోవాలనే ప్రయత్నం మీద వెళ్ళాడు ఈ ఆఫీసులో వాడి సర్వీసు దాదాపు ఎనిమిదేళ్ళ యింది. అందుచేత వాడి కోరిక నెరవేరవచ్చు. అదీ సంగతి. వెళ్లి మీ పని చూసుకోండి" ఎక్కువగా మాట్లాడడం బాగుండదని అయన వెళ్ళిపోయారు. భారంగా అడుగులు వేసుకుంటూ నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను.
మనస్సులో ఆలోచనలు పరిపరి విధాల పరిభ్రమిస్తున్నాయి. ఈ వాతావరణం నుంచి తప్పుకోవాలనే వారు కాకినాడ కు ప్రయత్నిస్తున్నారు. వారు కాకినాడ లో ఉంటె నేను ఉద్యోగం చేస్తూ వారందరినీ చూస్తూ ఇక్కడే ఉండాలా? వారి వల్ల ఎన్ని తప్పులున్నా ఎంత అవమానకరమైన పన్లు చేసినా ఎదురు గుండా వుంటే ఎంతో నచ్చ చెప్పి కొన్ని రోజుల్లో నైనా వారి మనస్సు మార్చగలిగాననే తృప్తి పడేదాన్ని. వారు కాకినాడ వెళితే ఆ ఆశ లేదు. వారు పూర్తిగా మారిపోతారు. ఎదురు చెప్పేవారు ఉండరు. వచ్చే జీతం ఒక్కరికే చాలదు. అన్ని రకాల వ్యసనాలూ పూర్తిగా అలవాటవుతాయి. ఆలోచిస్తే భవిష్యత్తు కు పునాది కనబడలేదు.
వారం రోజులు గడిచాయి. ఆర్డర్లు తీసుకునే వచ్చారు. వార్ని కలెక్టర్ ఆఫీసుకు వేశారు. రాజమండ్రి కావలసిన ఇంకొక యు.డి.సి అక్కడే ఉండడంతో తొందరగా పనయింది.
"మీ సుఖ సంతోషాలకు, అత్యాచారాలకు నేను అడ్డుగా వుంటే నన్ను చంపి వేస్తె శాశ్వతంగా మీకు అడ్డు తొలిగి పోతుంది. మీరు కాకినాడ వెళ్ళటం ఎందుకు చెప్పండి" కంటతడితో మనస్సు చిక్క బట్టుకుని వచ్చే వెక్కును ఆపుకుంటూ అడిగాను. నా వైపు నిశితంగా చూశారు.
"భార్య చేతులలో చెంప దెబ్బలు తిన్న వాణ్ణి చావలేక బ్రతుకుతున్నాను. భర్త జూదరి, త్రాగుబోతు, పరస్త్రీ లోలుడు కావచ్చు. అతను చేసే యీ పనులన్నీ ఘనకార్యాలనీ నేను వాదించను. మానవ దౌర్భల్య మూ మానసిక దౌర్బల్యమూ , రెండు నాలో ఉన్నాయి. ఈ సంఘం లో నాలాంటి భార్యలు ఎందరో ఉన్నారు. వాళ్ళతో పాటు నేనూ పాపత్ముడ్నే . కాని వాళ్ళెవ్వరూ నా మాదిరి భార్య చేతిలో దెబ్బలు తినలేదు. ఆ ఘనత నాకే దక్కింది. పుట్టిన ప్రతి వాడికీ గౌరవ ప్రడంగానే జీవితం వెళ్ళదీసుకోవాలని ఉంటుంది. కాని మన దాంపత్య జీవితంలో భర్తగా నాకు గౌరవ ప్రదమైన స్థానం లేదు. అందుకే కావాలనే కాకినాడ బదిలీ చేయించుకున్నాను. ఇంతకూ మించి నేను చెప్పెదేం లేదు సుభాషిణి" అన్నారు.
నా పాదాల కింద భూమి కంపించింది. శరీరమంతా వణికి పోయింది. ముచ్చెమటలు పోశాయి. వారి తప్పును వారు ఒప్పుకున్నా ఏ భార్య చెయ్యలేని నా తప్పిదానికి వారు ఖిన్నులై పోయారు. ఎంతో అవమానంగా భావించారు. "మీ మీద నేను చెయ్యి చేసుకోవటం తప్పే కాదు. ఈ కారణంగా ఏ భార్యా వొడిగట్టుకొని పాపాన్ని నేను శాశ్వతంగా నెత్తిన వేసుకొన్నాను. నా అపరాధాన్ని మన్నించమని వేడుకొను. నా చేతుల మీద వాతలు వెయ్యండి. నేనే వాతలు వేసుకుంటాను. మీరు ట్రాన్స్ ఫర్ ఆర్డరు రద్దు చేయించుకోండి. మీరు లేని ఈ ఇంట్లో నేను ఉండలేను. ఎక్కువ కాలం జీవించలేనెమో కూడా" అని బ్రతిమాలు కున్నాను, ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డాను. కాని వారేమీ మాట్లాడలేదు.
రెండు రోజుల్లో రిలీవయి వెళ్ళబోతూన్నారు. రామారావు గారిని సలహా అడిగాను.
"గవర్నమెంటు ఉద్యోగాల్లో వీలయినంత వరకూ భార్య భర్త లిద్దరూ ఒక ఊళ్ళో నే ఉండి ఉద్యోగాలు చేసుకోటానికి వీలుగా బదిలీలు చెయ్యాలనే గవర్నమెంటు ఆర్డరు ఒకటి ఉన్నది. మీ అయన వెళ్ళి జాయినయాక కలెక్టరు కు ఒక రిప్రజేంటేషన్ పెట్టండి. మిమ్మల్నీ కాకినాడ బదిలీ చెయ్యొచ్చు. అంతకన్నా మార్గం లేదు" అన్నారాయన.
నాకూ పోయిన ప్రాణం సగం లేచి వచ్చింది. వారు చార్జీ ఇచ్చి రిలీవయారు. ఆఫీస్ స్టాఫంతా పెద్ద టీ పార్టీ ఇచ్చారు. కొంతమంది డిన్నరు ఇచ్చారు. నన్నూ పిలిచారు. మనస్సు కూ, హృదయానికీ శాంతి లేకపోయినా ఈ భార్య భర్తలు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా ఎప్పుడూ కీచు లాడుకుంటారేమా అని ఎవరూ అనుకునే ఆస్కారం లేకుండా పీల్చినా నాలుగు డిన్నర్ల కూ సంతోషమనే పౌడరు రాచుకుని, ఉత్సాహమనే ముస్తాబు చేసుకుని వెళ్లాను. ఇట్లా ఈ నాలుగు డిన్నర్ల కూ నేను రావటం వారికి యిబ్బంది గానే ఉన్నా ఆ గంటసేపూ జోక్స్ వేస్తూ నాతొ కూడా నవ్వుతూ మాట్లాడే వారు. ఇట్లాంటివి ఇంకా పది డిన్నర్లు ఉంటె బావుండుననిపించేది. మనిషికి కావాల్సింది సంతోషం, ఆత్మ సంతృప్తి , ఈ రెండూ మనకు దూరమై పోతున్నయ్యనే భావం కలిగేసరికి ఇది వరకు అనుభవించిన సుఖమయ జీవిత మంతా దుస్వప్నంగా మారిపోతుంది. డిన్నరు పూర్తయి ఇంటికి వచ్చాక ఆ ముఖం లో ఏదో తీరని వ్యధ రివ్వున యెగిరి వచ్చి గూడు కట్టుకుంటుంది.
వెళ్ళే రోజున పెట్టె, బెడ్డింగూ అన్నీ సర్దుకుని వాకిట్లో కి రిక్షా వచ్చాక వెళ్ళుతున్నాను. పిన్నీ" అని అత్తయ్య తో అన్నారు. పెద్దవాడు ఎదురొస్తే నవ్వు ముఖంతో తల ఎగరేసి రిక్షా ఎక్కారు. వెళుతున్నానని నాతొ మాట మాత్రమైనా చెప్పలేదు. రిక్షా వెళ్ళిపోయింది.
రిక్షా మలుపు తిరిగేవరకూ కళ్ళార్పకుండా చూసి "అమ్మా నాన్నకు కాకినాడ బదిలీ అయిందటగా. నాన్న చెప్పలేదు. బామ్మ ఇందాక అన్నది. మరీ మనం కూడా అక్కడికి వెళ్ళవద్దూ" అన్నాడు పెద్దవాడు. పుట్టెడు దిగులు నెత్తిన వేసుకున్నా "వెళదాం బాబూ ఇల్లు తీసుకుని మనల్ని తీసుకు వెళతారు నాన్నగారు" అన్నాను.
కాకినాడ లో ఎక్కడుంటారని అడిగితె "నా బ్రతుక్కు తోడూ గది కూడా కావాలంటావా . ఎక్కడుంటానో నాకే తెలీదు. నీ కెట్లా చెప్పేది" అన్నారు.
ఆ రాత్రి తెల్లవార్లూ నా కళ్ళ నుంచి వచ్చిన కన్నీరంతా దిండు తనలో దాచుకున్నది. అక్కయ్య ను బావ వదిలిపెట్టి వెళ్ళిన దృశ్యం కన్నా, నాన్న చనిపోయిన ఆనాటి పరిస్థితి కన్నా , అన్నయ్య జైలుకు వెళ్ళిన రోజు కన్నా ఈనాడు వారు వెళ్ళిన ఈ సంఘటన నా మనస్సులో చెరగని ముద్ర వేసింది. బదిలీ అనేది ప్రతి గవర్నమెంటు ఉద్యోగికీ ఉండేది. కానీ ఈ బదిలీ అట్లాంటిది కాదు. అ మరునాడు ఉదయం రెండు అరిచేతుల మీదా ఎవరూ చూడకుండా రెండు వాతలు నేనే వేసుకున్నాను.
