"నవ్వడము దేనికండీ? మీరు వచ్చి మాత్రం యెన్ని సంవత్సారాలయిందేవిటి? నెమ్మదిగా కూడబెడుదురు గాని' ఓదార్చాడు.
"వచ్చిన అబ్బాయిలు ఆంధ్రులు కదా. అని సంతోషం గా మాట్లాడబోయాను అమ్మాయి వారించింది. వారెవరికి మనము తెలుగు వారమని కూడా తెలియనివ్వరాదని కట్టడి చేసింది."
"అవునండి. భాష రాదని తెలిస్తే తమ మానాన తాము తిని వెళ్తారు. లేకుంటే గంటల తరబడి హస్కు వేసుకుని, నెమ్మదిగా ప్రేమ పాఠాలు వల్లిస్తారు. నేను మొదట పని చేసిన అంబుజము ఇంట్లో ఇరువురు మనవారు కూడా వున్నారు. ఆంధ్రులు కదా అని ప్రత్యెక అభిమానంతో నేను మాట్లాడితే వారు మరోలా అర్ధం చేసుకున్నారు. ఏదో పని కల్పించి పిలిచేవారు. ఒకతను ఒంటరిగా పిలిచి మెరీనా బీచ్ కు వస్తారా అని అడిగాడు. నేను కోపంగా చూస్తె, చేతిలో రెండు రూపాయలు పెట్టబోయాడు. నిజంగా ఏడ్పు, కోపము వచ్చాయి. అంబుజము తో చెప్పాను. ఆమె నోటికి అందరూ జడుస్తారు. ముఖము వాచేలా చీవాట్లు పెట్టింది."
'అయితే అంబుజాన్ని అనుకరిస్తే బాధలేదనుకున్నాను?" ఫక్కున నవ్వాడు ఆనంద్.
"మీకు నవ్వులాటగానే వుంటుంది. నా పరిస్థితి అర్ధం చేసుకుంటే అలా అనరు."
"అరె అప్పుడే కోపమా! తమాషాకంటేను" అనునయించాడు.
"నిజంగా స్త్రీ జీవితమూ గాజుపాత్ర వంటిది. ఎటునుండి ఏ రాయి పడినా బ్రద్దలవుతుంది. అవకాశము దొరికితే పురుషులంతా ఒకే రకంగా ప్రవర్తిస్తారని తెలుసు...."
"ఎంత అవమానము....' ఆనంద్ ఏమో అనబోయాడు.
'అసలు సంగతి అర్ధం చేసుకోండి. మీరు అలాంటి వారు కాకపోవచ్చు. మీ స్నేహితులనడగండి. నాకు తెలుగు రాదని తెలిసి, ఎంతెంత మాటలనేవారో, నా శరీరము లోని ప్రతి భాగాన్ని నీచాతి నీచంగా వర్ణించే వారు. పైకి బుద్ది మంతులలా కనిపిస్తారు , పిచ్చి హాస్యాలు, వెకిలి చేష్టలు చేసేవారు. దాంతో ఏ భాషో తెలియనట్టు గొంతు చించుకుని అరిచేదాన్ని. భయపడి, బుద్దిమంతులలా , తలవంచి తిట్టుకునేవారు.......
"అవును, మా వాళ్ళు చెప్పారు లెండి. వాళ్ళు మీకు ముఖము చూపడానికి సిగ్గుపడ్డారు. నేనే లాక్కువచ్చాను." ఆనంద్ చెప్పాడు.
"వాళ్ళు అలా ప్రవర్తించడానికి వాళ్ళ తప్పు కాదు నాయనా. మన సాంఘిక స్థితి. ఎటుచూచిన అణా కాని చవక పుస్తకాలు, ఏ సినిమా చూసినా, ప్రేమను ధీమ్ గా పెట్టుకుని నడిపించే కధలే, హాస్యము పేరుతొ చవకబారు వేషాలు . అవన్నీ చూచాక యువకులు పైత్యము ప్రకోపించి ఏదో వాగుతారు." సీతారామయ్య గారు నిట్టుర్చారు.
'అది నిజమే లెండి. యువకులంతా అలా ఉండరు."
"మీరు అన్యవిధంగా బావిస్తున్నట్టున్నారు. యువకులనే కాదు , అసహాయ , ఆబల అయిన స్త్రీని చూస్తె అందరికీ లోకువేనండి. మొన్నో రోజు తంబి కి జ్వరము వచ్చింది. భయపడుతూనే ఒంటరిగా మార్కెట్టు కు వెళ్ళాను. కూరలు అవి కొని తెస్తున్నాను. చాలా బరువు, మొయ్యలేక ఆగుతూ వస్తుంటే ఓ పెద్ద మనిషి చూచి జాలి పడ్డాడులా ఉంది. ఒక సంచి అందుకుని సందు చివర వరకు వచ్చాడు. నాన్నగారి కంటే కాస్త చిన్నవాడెమో, ముందటి రెండు పళ్ళు ఊడి పోయాయి. సంచి అంది భుజము పై చేయి వేశాడు. ఈడ్చి చెంప పై కొడదామనిపించింది. అతని వెకిలి నవ్వు చూస్తె కోపమొచ్చింది. ఏం చెయ్యలేను. రెండు చేతులలో రెండు సంచులున్నాయి. ఇంతలో అంబుజము భర్త అటుగా వచ్చాడు. లేకపోతె యెంత గొడవ జరిగేదో!"
"నిజంగా ఇదంతా వింటుంటేనే కోపము వస్తుంది. మీరెలా అనుభవించారో పోనివ్వండి. గతము నాస్తి. భవిష్యత్తు ఆలోచించాలి. మీరు పుస్తకాలు కొని మెట్రిక్ లేషన్ చదవండి. వెంకటా పురము కాలనీ లో ఓ ఇన్ స్టియూట్ ఉంది. అక్కడ చేరండి.' ప్రోత్సాహ పరిచాడు ఆనంద్.
"ఇంట్లో తీరికేవేళ్ళలందు చదవటము కుదురుతుంది కాని, ఇన్ స్టిట్యూట్ లో చేరటము యెలా వీలవుతుంది? ప్రొద్దు, రాత్రి పదకొండు మందికి వంట చేయాలి. మాటలా?"
"వంటకు మనిషిని పెడితే సరి."
"యెంత తేలికగా తేల్చి వేశారండి. ' ఫక్కున నవ్వింది."అంత తాహతే ఉంటె ఇంకేం? ఎంతో కష్టముతో , పొదుపు చేస్తే, మా పొట్టలు నింపుకునే ఆహారము పొదుపు చేస్తున్నాము. తంబికి పెడుతున్నాను."
"ఇంట్లో చదువటమేలా కుదురుతుందమ్మా! ఇంగ్లీష్, లెక్కలు ఎవరో ఒకరు చెప్పాలిగా?"
"అలా అయితే ఓ పని చేయండి. రోజూ ఒక అరగంట సాయంత్రము తీరిక చేసుకుని మేమే చెబుతాము. విల్లియమ్స్ ఇంగ్లీష్ చెప్తాడు. చక్రవర్తిది లెక్కల బుర్ర. గోవిందు తెలుగు చెప్తాడు. సోషియల్ స్టడీస్ ఉంటె నేను చెప్తాను."
"అమ్మ బాబోయ్ ! నల్గురు టీచర్లే. " భయము నటిస్తూ గుండె లపై చేతులుంచుకుంది సురేఖ.
"నల్గురు అంగీకరించినట్టే మాట్లాడుతావేం పాపా? ఆనంద్ అంటే మనవాడు. అందరూ ఎందుకు శ్రమ పడుతారు?"
"ఇందులో శ్రమ ఏముంది మాస్టారూ! అందరూ అంగీకరిస్తారు."
"అదంతా నీ దయ. మా అదృష్టము" అతని కళ్ళు మెరిశాయి.
"పెద్దవారు అంతమాట అనరాదు మేష్టారు. వస్తాను." లేచాడు. రోడ్డు వరకు వచ్చాడు సీతారామయ్య. చిరునవ్వుతో గుమ్మములో నిలబడి వీడ్కోలిచ్చింది సురేఖ. అతని కెందుకో అత్మీయులను చూచినట్టు అనుభూతి కల్గింది.
ఆనంద్ నిదుర లేవకముందే బిలబిల మంటూ, చక్రవర్తి , గోవింద్ వచ్చారు.


ఆదివారము హాయిగా పడుకుందామంటే తొందరగా వచ్చారేమిట్రా?"
"చూచారా 'అదివారము కాలమెలా గడుస్తుందో నని అనుకుంటే మీరు వచ్చారుట్రా.
సంతోషం ఆనవు కదా?' బుంగమూతి పెట్టాడు చక్రవర్తి.
"బుంగమూతి పెట్టడము ఆడవారి లక్షణమురా. ఆదివారము కూడా తొమ్మిది గంటల వరకు నిదురపోక పొతే మన ఘనతేముంది? ఇంత తొందరగా దయచేసిన కార్యమేదో వివరింపుము మిత్రమా" లేచి కూర్చుని సిగరెట్టు వెలిగించాడు.
"మర్యాదకైనా మాకు ఆఫర్ చేయవేమిరా?
"ఓ సిగరెట్టా! మర్యాదలు పాటిస్తే దివాళా తీస్తానురా. అయినా నేనెలాగూ ఓ పాడు అలవాటు నేర్చుకున్నాను. మీరెందుకురా నేర్చుకోవడమూ? విల్లియమ్స్ రాలేదా?
"వాడు తనను తానె ఓ హైదరాబాద్ నవాబు అనుకుంటాడు. పది దాటితే గాని లేవడురా?"
మీరింత తొందరగా లేచి చేయు ఘనకార్య,మెద్దియో!"
మేమంటే నీకు తమశాలే. సీనియర్స్ మన్న గౌరవము కూడా లేదుట్రా? నీవు పెడితే తిప్పలు పడు గాని ఆ సురేఖతో మేము పడలేమురా. ఎంత పోగరో, ఎన్ని యెదురు ప్రశ్నలు వేస్తుందో. పందొమ్మిదో ఎక్కము రాదని యెగతాళి చేస్తుందా?"
"ఒరేయ్ చక్రీ! కాస్త ఇంటి వద్ద చూచుకొని వెళ్ళరా అని చెప్పలేదూ?"
"చెప్పలేదూ." ఆనంద్ ను అనుకరించాడు, "పెద్ద ఫీజు ఇచ్చినట్టు, యెంత బుద్దికి అంతే రాసి పెట్టి వుంటుంది. అంత గర్వమో?"
"చాల్లే" తీక్షణంగా చూచాడు ఆనంద్. "చదువుకున్న వాడవు, సహృదయుడవు. ఇతరుల పరిస్థితుల నర్దం చేసుకుంటావని ఏదో కాలక్షేపంగా నాల్గు రోజులకో గంట చదువు చెప్తావనుకుంటే, వారి అదృష్టాన్ని హేళన చేస్తావా?"
'అంత కోపం దేనికిరా! ఒరేయ్ చక్రీ మాట్లాడటము అసలు తెలియదురా" గోవిందు అడ్డుకున్నాడు. "ఉన్న విషయము చెబుతాను. ఆ పిల్ల అతి చురుకైనది. నా మాటే చెబుతాను. తెలుగు చెప్పమన్నావు కదా, వ్యాకరణము నా కంటే బాగానే వస్తుంది. చదవటము కూడా స్పష్టంగా , యెంతో జాగ్రత్తగా చదువుతుందిరా నా అవసరము లేదనుకుంటాను . "సందెడు" సంధి విడదీయమన్నదిరా, అదో గొప్ప విషయమా అని నంది ప్లస్ యేడు అన్నానురా పడి పడి నవ్వింది."
"బావుందిరా మీ చదువు చెప్పటము. కాస్త బుర్ర ఉపయోగించాలిరా' తగ్గాడు ఆనంద్.
"అక్కరలేదురా. మా మానాన మమ్మిలా ఉండనియ్యి. నీ కంత మోజుగా వుంటే చెప్పు మాకేం అభ్యంతరం లేదు ' దీనంగా చూచాడు గోవిందు.
'అవునురా , కావాలంటే మేము తిండి ఏర్పాటు మరో చోట చూచు కుంటాము" చక్రవర్తి ఆఖరు అస్రము ప్రయోగించాడు.
"ఊర్కోండిరా. బలవంత మేం లేదు. నీకిష్టమైతే చెప్పు" సిగరెట్టు పారేసి లేచాడు ఆనంద్ అందరూ తయారయి హోటల్లో దూరినారు. కాఫీ టిఫిన్లు కానిచ్చి , ఊరు మీద పడ్డారు పత్రికలు పండ్లు కొని గది చేరారు. కాసేపు పేకాడి, భోజనానికి వెళ్ళారు. ఉన్న చిన్న ఇంటిని శుభ్రంగా కడిగి నాముతో ముగ్గులు పెట్టింది సురేఖ. భోజనాలు చేసి సరదాకు పేకాట మొదలు పెట్టారు సీతారామయ్య పని ఉందంటూ బయటకు వెళ్ళిపోయాడు. విలియమ్స్ కు రమ్మి తప్ప మరో అట రాదు. ట్వింటియేట్ అట ప్రారంభించారు. చక్రవర్తీ, గోవిందు ఒక జట్టూ, ఆనంద్ సురేఖ మరో జట్టు అట సాగుతుంది.
"మీ బుర్రలో ఏముంది?' తీక్షణంగా ఆనంద్ వంక చూచింది. మిగిలినవారు ఉలిక్కి పడి చూచారు.
"యెందుకు?' అభిమానంగా అడిగాడు ఆనంద్.
"నేను ఆశతో అసు మొదలు పెట్టాను. మీరు యెందుకు వేసినట్టు."
"సారీ" ఆనంద్ చిన్న బుచ్చుకున్నాడు.
"ఒక పట్టు పాడుచేశారు. ఛీ మీలాంటి వారిని పార్టనర్స్ గా పెట్టుకుని ఆడితే గెలుపెలా వస్తుంది." విసుక్కుంది.
"ఈసారి జాగ్రత్తగా ఆడుతాను." సంజాయిషీ ఇచ్చుకున్నాడు. రెండుసార్లు గెలుపు చక్రవర్తి దే . సురేఖకు చచ్చే కోపంగా ఉంది.
