Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 15

 

    మరుసటి రోజు ఉదయం సుందరమ్మ కాఫీ యివ్వటానికి వెడితే పడక మీద ఉమాపతి కనిపించలేదు. ఎక్కడో వెళ్లుంటాడు లెమ్మనుకుంది ఆవిడ.
    చెరుకు గానుగేత్తటానికి గానుగ బయానా ఇవ్వడం కోసం డబ్బు వెదికితే డబ్బు పెట్టిన చోట కనిపించలేదు. ఉమాపతి కనుపించక పోవడంతో ఆ డబ్బుతో కూడా వెళ్ళిపోయాడని అర్ధమయింది విశ్వనాధయ్య గారికి. భార్యను పిలిచి ఆ విషయం చెప్పారు. ఆవిడకు ఏడుపు ఆగలేదు. బాగుపడుతున్నాడనుకున్న చెయ్యెత్తు కొడుకు దూరంయ్యేసరికి ఆ మాతృ హృదయం తల్లడిల్లిపోయింది.
    విశ్వనాధయ్య గారికి ఏడుపు రాలేదు. వారి వద్ద ఇంక కార్చడానికి కన్నీళ్లు లేవు.
    "ఏడవకు సుందరా. వాడికి నీకన్నా, నాకన్నా ఆ మూడు వందల రూపాయలు ఎక్కువయ్యాయి." అంటూ భార్యను ఊరడించారు.
    రత్నమ్మా, శారదా ఎటువంటి భావాన్నీ కనబడ నియ్యలేదు. శారదకు మాత్రం ఉమాపతి ఇక మీదట యింటికి రాడేమో ననిపించింది.
    ఆరోజు సాయంకాలం విశ్వనాధయ్య గారు బావి వద్ద కూర్చుని ఉన్నారు. ఎదురుగా కనిపిస్తున్న కోత ముగిసిన పొలం లాగే ఉంది వారి మనస్సు. సారధి, ప్రకాశం వచ్చారు.
    "మీరెప్పుడోచ్చారు?' సారధిని ప్రశ్నించారు విశ్వనాధయ్య గారు.
    "నిన్న సాయంత్రం వచ్చాను...."
    ఐదు నిముషాలు మౌనంగా గడిచాయి. ప్రకాశం, ఉమాపతి విషయం అడుగుదామనుకున్నాడు. కానీ మానుతున్న గాయాన్ని రేపడమెందుకని మానుకున్నాడు.
    "ప్రకాశం , జగన్నాధం ఏమంటున్నాడు?" విశ్వనాధయ్య గారు ప్రశ్నించాడు.
    ప్రకాశం ఆశ్చర్యపోయాడు. విశ్వనాధయ్య గారికి పంచాయితీ ఎన్నికలను గూర్చి ఆలోచించే మనశ్శాంతి ఎక్కడదా అనుకున్నాడు.
    "ఏమోనండి. సరిగ్గా తెలియటం లేదు. పల్లెలు తిరుగుతున్నాడు. తనే ఈ గ్రామాన్ని ఉద్దరించానని చెప్పుకొంటున్నాడు."
    ప్రకాశం మాట పూర్తీ కాకముందే సారధి ఉపన్యాసం ప్రారంభించాడు.
    "చూడండి, విధ్వనధయ్య గారు , కుర్రవాణ్ణయినా ఒక మాట చెబుతాను. ప్రపంచంలో ప్రతి వ్యక్తీ కి తన వ్యక్తిగత సుఖదుఖాలు సమస్యలూ ఉంటాయి. అవే మనిషి జీవితాన్ని తినెయ్య కూడదు. ఈనాడు మన సమాజం ఇంత వృద్దయింది కదా? ఎలాగైంది? ఎవరో కొందరు మహానుభావుల త్యాగ ఫలితమే నేటి నాగరికత. వాళ్ళలా త్యాగం చేయకపోతే మనకీ అదృష్టం ఉండేదే కాదు. అందువల్ల మనం కూడా మన స్వార్ధాన్ని కాస్త త్యాగం చేయాలి.
    'ఈ ఊరిని చూస్తుంటే నాకదోరకంగా ఉంది. ఇంకా ఈ ఊళ్ళో  జమీందారీ పద్దతులే కొనసాగుతున్నాయి. అందువల్ల ఇక్కడి ప్రజలకు ఈ నరకయాతన తోలగాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. జగన్నాధం లాంటి ధనికుల్ని నాశనం చేయాలి.
    "నీళ్ళు త్రాగడానికి, అన్నం తినడానికీ , పూలు వాసన చూడడం కోసమూ ఉన్నట్లే, డబ్బు అనుభవించడం కోసం ఉంది. అంతేగానీ డబ్బు అలా ఒకచోట చేరి మూలగ కూడదు. దాన్ని అందరికీ పంచాలి...."
    "ఇలాంటి విషయాలు నాకర్ధం కావు , సారదీ! నా వ్యక్తిగత సమస్యల్నిపూర్తిగా జయించే శక్తి సామర్ధ్యాలు నాకు లేవు" అన్నారు విశ్వనాధయ్య గారు.
    ప్రకాశానికి సారధి వ్యవహారమేమీ నచ్చలేదు. చిన్నా పెద్దా లేకుండా అలా బోధ మొదలు పెడతాడెందుకా అనుకొన్నాడు.
    "ప్రకాశం , ఈ విషయమే చెప్పబోయాను. అంతలో సారధి కూడా ఆవిషయమే చెబుతున్నాడు. నేను పంచాయితీ ఎన్నికల్లో జగన్నాధంతో పోటీ చేస్తాను."
    ప్రకాశం ఆశ్చర్యంతో అప్రతిభుడైపోయాడు.
    "మీరా?" అన్నాడు సారధి.
    "అవును. నాకు యిప్పుడు ఏ బంధాలు లేవు. బాధ్యతలు అంతకన్నా లేవు. శారద పెళ్ళి ఎలాగూ వైశాఖ మాసంలో జరుగుతుంది. ఆ విషయంలో నాకెలాంటి చింతా లేదు. ఇన్ని దినాలూ వాడిదొక చింత ఉండేది. ఈనాటి నుంచీ ఆ చింత కూడా లేదు. వాడి మీద ఉన్న మమకారం పూర్తిగా చంపుకున్నాను. వాడు తిరిగొస్తే , సరే, అంతేగానీ వాడి కోసం నేను వెదకను. కానీ వాడుతిరిగోస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందువల్ల ఎన్నికలలో తప్పక నిలుస్తాను."
    ప్రకాశానికి అంత సంతోషం కలగలేదు. విశ్వనాధయ్య గారు చేసుకొన్న ఈ నిర్ణయం వెనుక ఎంత వేదన ఉందొ అతడికి బాగా తెలుసు. కానీసారధి మాత్రం పరమానందం పొందాడు.
    "చాలా బాగుంది! మీలాటి అనుభవజ్ఞులు చెయ్యి కలిపితే ఈ జమీందారీ వ్యవస్థను ఎదిరించెయ్యమూ!" అన్నాడు సంబరంతో.
    విశ్వనాధయ్య గారు నగ్నంగా ఉన్న పొలాలు చూస్తూ మౌనంగా కూర్చున్నారు.

                              *    *    *    *
    ఉమాపతి మద్రాసు చేరినప్పటి నుంచీ చాలా ఆనందంగా ఉంటున్నాడు. జేబులో మూడు వందల రూపాయలున్నాయి. డబ్బుకు అసాధ్యమైంది మద్రాసులో లేదు. అసలు ఈ ప్రపంచంలో లేదు. అనేక ఆలోచనలతో, కొత్త కొత్త ఊహలతో అతని మనస్సు చాలా గందరగోళంగా ఉంది. తన జేబులో మూడు వందల రూపాయలు ఉన్నాయి. వాటితో కనీసం నెలన్నర గడుస్తుంది. ఆలోగా ఒక ఉద్యోగం సంపాదించాలి. కనీసం వందా యాభై యిస్తారు. ఆ డబ్బుతో హాయిగా బ్రతకవచ్చు. తనకు భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి తండ్రీ లేరు.అసలు ఈ బాధ్యతల నేవీ యీ జగత్తు లో లేకుండా పోవాలి. వాటి వల్ల చెప్పలేనంత ఆనందం నాశనమవుతుంది. అందుకే హాయిగా ఒంటరిగా జీవితం గడప దలచుకొన్నాడు తాను. తను సంపాదించిన డబ్బుతో హాయిగా జీవిస్తాడు. కావలసింది తింటాడు. ఇక పొతే తాను గూడా పురుషుడే! తనకు కూడా వాంఛలు ఉంటాయి. జేబులో డబ్బుండాలి గానీ అవి తీరటానికికేం!మహబాగా తీరుతాయి. కానీ ఈ ఆడవాళ్ళ పట్ల తనకు బాధ్యతలు ఉండవు. అది మారుసాళ్ళ వ్యాపారం! ఆనందాన్ని నెలకు కొనుక్కోవడం, అబ్బ, ఒంటరి జీవితం ఎంత హాయి! కుటుంబ జీవితం ఒక నరకం! అది హోటలు భోజనం లాంటిది. తన రుచికి అభిరుచి కీ సరైంది. అందులో వెదికినా దొరకదు. జీవితమంటే తనది.
    గంట చూసుకుందామంటే వాచీ లేదు. ఉమాపతికి విమల జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ ఉందో, ఏమి చేస్తూ ఉందొ -- అనుకున్నాడు. అంతలోనే ఏ గంగలో కలిస్తే తనకేం అనుకున్నాడు. విమల కూడా ఆడదే! కాబట్టి ఆవిడది కూడా కోతి బుద్దే కదా! ఆడదాని జీవితం కంటే అసహ్యకరమైనదీ , ఆడదాని కంటే ఆనందాన్నిచ్చేది లేదు అనుకున్నాడు ఉమాపతి. ఆ ఊహ రాగానే జేబులో పది రూపాయలుంచుకుని గదికి తాళం వేసి బయలుదేరాడు.    
    ఎంత మరిచిపోదామన్నా విమల అతనికి మరుపు రాలేదు. ఇప్పుడెం చేస్తూ ఉందొ? తనకు చెప్పి మోసగించిన ఆదర్శాలనే ఇంకెవరికో  వల్లిస్తూ ఉంటుంది. లేదా గుట్టుగా యిల్లు చేరి ఉంటుంది. లేదా, బజారు పక్షి అయి ఉంటుంది. తనకీ నాడు తారసిల్లకూడదూ, డబ్బు మిగులునే-- అనుకున్నాడు ఉమాపతి, తన ఊహకు తనే నవ్వుకుని నడక సాగించాడు.
    అతడు మళ్ళీ రెండో రోజు ఉదయం కానీ గదికి చేరలేదు.అతడి మనసు చాలా హాయిగా ఉంది.గదికి చేరగానే ప్రకాశానికి ఉత్తరం వ్రాసాడు. తనకీ జీవితం చాలా బావుందనీ, ఇలాంటి జీవితం పైన విసుగన్నది ఏనాడూ పుట్టదనీ వ్రాశాడు. రెండు మూడు రోజులు గడిచాయి.
    అతడు ఒకరోజు గది చేరేసరికి ఒక ఉత్తరం కనిపించింది. ప్రకాశం కాబోలు వ్రాశాడని చించి చూశాడు. ప్రకాశం కాదు వ్రాసింది! విమల! ఒక్కసారి ఉత్తరాన్ని ముక్కముక్కలుగా చించేయాలనిపించింది ఉమాపతి కి. కాని ఏమి వ్రాసిందో చూడాలన్న ఉత్సుకత అతణ్ణి చించనియ్యలేదు చదివాడు.
    "డియర్ ఉమాపతీ!
    ఈ ఉత్తరం నేను రాశానని నీకు తెలియగానే నీకు చించెయ్య బుద్దేస్తుంది. కానీ చించకు. సాంతం చదివి చూడు!"
    ఉమాపతికి గుండె జలదరించింది. తన మనస్తత్వాన్ని ఎంత బాగా అర్ధం చేసుకుంది విమల -- అనుకున్నాడు. గాడంగా నిట్టూర్చి ఉత్తరం చదవసాగాడు.
    "నా ఉత్తరాన్ని నువ్వు పూర్తిగా చదవగలగటం కోసం నేను నీకొక వాగ్దానం చేస్తున్నాను. నాకు నువ్వు ఎలాంటి సహాయం చేయనవసరం లేదు. నేను మళ్ళీ నీ నెత్తిన వాలటం లేదు! కానీ నా పైన నీవు ఏర్పరచుకున్న కొన్ని భావాల నిజమైన స్వరూపం తెలియజేయటం కోసం యీ ఉత్తరం రాస్తున్నాను.
    నా వల్ల నీ చదువు, నీ వల్ల నా చదువు పాడయ్యాయి. మనలాంటి వాళ్ళు కలుసుకోవడం ఎంత సహజమో, విడిపోవడం కూడా అంత సహజం! కానీ నువ్వా సత్యాన్ని గ్రహించలేక పోయావు. నాకు డబ్బు పిచ్చనీ, అదనీ, ఇదనీ ప్రచారం చేశావు. ఆమాటే సారధి గారితో కూడా అన్నావు. ఆ ఆర్ధికశాస్త్రవేత్తా నీకు 'సై' అన్నాడనుకుంటాను. కానీ నాకు డబ్బు మీద, అది సమకూర్చే సుఖాల మీద అంత విశ్వాసం లేదు. ఒక విషయం ఆలోచించు. నా శరీరం అయస్కాంతం లాంటిది. నా కళ్ళలో మెరుపు, నా బుగ్గలలో ఎరుపు ఉన్నంత కాలం డబ్బుకు నాకు కొదవ లేదు. ఇక తర్వాతంటావా? అవి పోయాక ఇక జీవితం లేదని, తర్వాత జీవించవలసిన అవసరం లేదని ఒకనాటి నా నమ్మకం. ఒకనాటిది అని ఎందుకంటున్నానంటే ఆనాటి కొన్ని విశ్వాసాలు యీ నాడునాకు లేవు. ఈ విశ్వాసాలు కూడా ప్రేమ లాంటివే. ప్రేమ ఎంత చంచలమో నా మనస్సు కూడా అంత చంచలం.
    నేను నీ వద్ద నుంచి వచ్చాక రాజారావుతో గూడా గడిపాను. అతడు గూడా దాదాపు నీలాంటి వాడె! కానీ కాస్త పిరికి! ఒక నెల రోజులు నేను అందించే అమృతాన్ని త్రాగి చివరికోరోజున పారిపోయాడు. ఒక వెయ్యి రూపాయలు గదిలో ఉంచి, ఒక ఉత్తరం ముక్క కూడా వ్రాసి వుంచి మరీ పారిపోయాడు. అదిచూచి నాకు నానా చీదరా వేసింది. నాలుగు రోజులు అవస్థ పడి అతడు అజ్ఞాత వాసం చేస్తున్న చోటు వెదికి ఆ డబ్బు నా ఖర్చుతో ఏమ్.ఓ చేశాను. రాజారావు చేసిన ఆ పనితో నాకు మగాళ్ళ మీద పరమ అసహ్యం కలిగింది.
    నేను నిన్ను వదిలి వస్తే నువ్వు ఆడజాతిని ద్వేషించడం ప్రారంభించావు. రాజారావు నన్ను వదిలి పారిపోతే నేను మగజాతిని ద్వేషిస్తున్నాను. ఈ ద్వేషాలు చాలా అసహజమైనవి. కానీ ఎందువల్లనో మనల్నిద్దర్నీ యివి వెంటాడుతున్నాయి.
    తర్వాత యింటికి వెళ్లాను. మానాన్న-- విశ్వామిత్రుని లాంటి వాడు-- నన్ను గడప తొక్క నియ్యలేదు. మళ్ళీ మద్రాసు చేరాను. ఇప్పుడొక స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నాను. భవిష్యత్తు ను గూర్చి ఆలోచించటం నేర్చుకుంటున్నాను.
    కానీ ఒక విషయం. నా జీవితంలో ఏదో అసంతృప్తి స్పష్టాస్పష్టంగాకనిపిస్తోంది. అదేమిటో అంతు పట్టడం లేదు. ఆలోచించిన కొద్దీ చాలా గంబీరంగా కనుపిస్తోంది జీవితం. నువ్వింకా ఆలోచించటం ప్రారంభించలేదనుకుంటాను. ప్రారంభించి ఉంటె మొన్న శనివారం నువ్వు అక్కడ కనిపించి ఉండవు. ఆలోచించడం ప్రారంభించు. నీకు కూడా జీవిత సంగీతంలో అపశ్రుతి వినిపించక పోదు.

                                                                                               విమల'
    ఉత్తరం చదువుతున్నంత సేపూ తన గుండెను ఎవరో నలిపివేస్తున్నట్లు బాధ పడ్డాడు ఉమాపతి. విమల మీద కోపం దావగ్నిలా అతని శరీరమంతా వ్యాపించింది. తను తన బ్రతుకేదో బ్రతుకుతున్నాడు. తనకు అందుతున్న ఈ ఆనందాన్ని కూడా మళ్ళీ విమల నాశనం చేస్తుందా? తన జీవితంలో ఏదో అసంతృప్తి ఉందట. తనకేం తక్కువ? అన్నీ ఉన్నాయి. తన జీవితంలో అసంతృప్తి లేదు- అని గట్టిగా అనుకున్నాడు ఉమాపతి.
    బయటికి చూశాడు. సాయంకాలం కావస్తుంది. మనసంతా గజిబిజి గా ఉంది. బీచికి బయలుదేరాడు అత్మశాంతిని వెదుక్కుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS