Previous Page Next Page 
శరన్మేఘం పేజి 15


    "ఆ ....ఆర్నెల్ల క్రితమే తీసుకు వద్దును . అలా అయితే -- ఇంత క్రితం వెళితే అంత సంబడం అయింది? ఇంక మళ్ళీ వెళ్ళాలి సిగ్గు లేక ? ఇప్పుడు దానితోటి కోడలూ, మరిది కూడా వచ్చి ఉన్నారట ఇంటిలో -- ఏమమ్మా అల్లుడా వరస ని మంచమీద ఉంటె ఇన్నాళ్ళ కా వచ్చి చూడ్డం? అంటూ మొహాన్న పేడ నీళ్ళు జల్లుతారు.
    "అవునా?..... ఆ మాత్రం దానికి నన్నెందుకు వెళ్ళమన్నావు? ఆ నీళ్ళేవో వృధాగా పోతాయి. నన్ను జల్లించు రమ్మనా?
    "మహా ప్రభో ...మీరూ వెళ్ళక్కర్లేదు నేనూ వెళ్ళక్కర్ల లేదు. మీరు తలంటుకోడానికి లేవండి. "అంటూ, "ఎవరూ వెళ్ళక్కర్లెకుండానే అయ్యాయి లెండి పరిస్థితులు." అంటూ తనలో తను గొనుక్కోసాగింది కాంతమ్మ.
    "ఏవిటే అలా గొనుక్కుంటావు....ఇలా కూచో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడు మనతో పాటు మన డబ్బుని కూడా ఇలా తృణీకరించి పారేస్తోంది కదా -- అనకేనా. అదే మన అనంతరంయేనా .ఈ ఆస్తి స్వీకరిస్తుందా అది?"
    "ఏమో ....తెలివితక్కువ పిల్ల-- అప్పటికి పౌరుషం తగ్గక, నా కక్కర్లెదంటే అనొచ్చు."
    "అంటే ఏమిటి చెయ్యడం?"
    "అయ్యో మీ చాదస్తం బంగారం గాను? ఏం చేయడానికి , మానడానికీ అప్పుడు ఉంటె కదుటండీ మనం ఈ లోకంలో?"
    అవునా?.... అందువల్ల మనం ఉండగానే ఓ పని చేద్దాం నాకో ఆలోచన వస్తోంది. అలా చేస్తే మనల్ని ఎంత బాధ పెట్టిందో దానికీ తెలుస్తుంది. మన మనస్సుల్ని ఇంత హింసించి నందుకు దాని మీద మనం శిక్ష తీర్చుకున్నట్లూ అవుతుంది."
    "మనకి దాని మీద కక్షేమిటండి?"
    "అందేలే-- బదలాయింపు. ఈ ఇల్లూ ఆ మామిడి తోటా, ఆ నాలుగేకరాల మాగాణి . ఆ గరువు చెక్కా! పొగాకు పండే ఆ లంక భూమీ -- యావత్తు స్థిరాస్తి దాని పేర రాయడం మానేసి ..."
    "చాల్లెండి ....అక్కడి తోటి అపుచెయ్యండి మీ ఆలోచనా మీరూను..."
    "ఉండవే ! కయ్ మనకే? పూర్తిగా విను దాని పేర రాయడం మానేసి, దానికి పుట్టబోయే పిల్లల పేర రాద్దాం. నా పిల్లలకి అక్కర్లేదని అనడానికి దానికి హక్కుండదు. తృణీకరించడానికి వారు లేకపోతె, స్వీకరించక ఇంకేం చేస్తుంది? దాంతో దాని పౌరుషం కాస్తా ఇగురుతుంది....లేకపోతెనూ. నా ఆస్తి చిల్లి గవ్వ ముట్టుకోదుట . ముట్టుకోకుండా ఉండటానికి దీని ఇష్టమే అనుకుంది.... హే.... ఇక్కడున్న వాడేవడు? అఖండ ప్రజ్ఞా వంతుడైన రాఘవయ్య--
    కాంతమ్మ అతని ధోరణి చూసి నోట్లో పైట కుక్కుకుని మౌనంగా ఏడుస్తోంది.
    "ఇంక బ్యాంక్ ఎకౌంటు అంటావు -- అది దాని పేర రాద్దాం లే-- కావాలన్నా అక్కర్లేధన్నా అందులో ఉండేది ఎంతలే -- పది పదిహేను వేలు" అన్నాడు రాఘవయ్య.
    కాంతమ్మ కళ్ళు తుడుచుకుంటూ నిలబడింది కాని ఏం మాట్లాడలేదు.
    "ఇదీ మన ప్లాను. ఎలా ఉంది?"
    "బాగుంది . ఇంక మీరు లేస్తారా.... ఆ దస్తావేజులు అవీ తీసి మూటకట్టండి...."
    "దస్తావేజులు అనకే....అవి ఇప్పటి నుంచీ మన మనవలు. మన సునంద బిడ్డలు. వాళ్ళని ఎత్తుకుని వస్తాను. నువ్వు నడు --"
    గుండెల్లో కొండంత దుఃఖం తో కదిలింది కాంతమ్మ.
    ఆ సాయంత్రం అనాధ శరణాలయం లో పిల్లలంతా కలకల్లాడుతూ వచ్చి ఇంట్లో తిరుగుతుంటే , రాఘవయ్యకీ, కాంతమ్మ కీ, సునంద తాలుకూ జ్ఞాపకాలు ఎన్నో మనస్సు లో కదిలి నాలుగు కళ్ళల్లోనూ నీళ్ళు నిండాయి. ఒకరి కన్నీళ్ళు ఒకరికి కనిపించకుండా చాటుగా తుడుచుకుంటూ ముఖం మీదకి నవ్వు తెచ్చి పెట్టుకుని ఉత్సాహాన్ని నటించసాగారు . రాఘవయ్య కోసం కాంతమ్మ, కాంతమ్మ కోసం రాఘవయ్యను.
    "నవ్వినప్పుడు అచ్చు సునంద లాగే ఉంద'ని ఓ అమ్మాయి కి మరో రెండు లడ్డులు ఎక్కువిచ్చాడు రాఘవయ్య. పక్క అమ్మాయి ఏదో అంది అని  కోపం వచ్చి, మూల కెళ్ళి నిలబడ్డ ఓ పిల్ల బుగ్గలు పుణికి" ఎంత పౌరుషమే నా తల్లీ -- పెద్దదయితే నీతో వేగలేమని కనిపెట్టి , ముందే సెలవు తీసుకున్నారు. మీ అమ్మా , నాన్నాను  మాకంటే గడుసు వాళ్ళు " అన్నాడు రాఘవయ్య.
    "చిన్నప్పుడు సునంద అచ్చు ఇలాగే ఉండేదని "ఓ అమ్మాయిని వదలకుండా దగ్గరే కూర్చో పెట్టుకుని ఉండుండి ముద్దు పెట్టుకో సాగింది కాంతమ్మ.
    "ఇవాళ మీ ఇంట్లో మిఠాయిలు పంచుతున్నారు "ఎందుకండీ" అన్న ఒక అమ్మాయికి సమాధానంగా "మా అమ్మాయి పుట్టిన రోజు అమ్మా" అంది కాంతమ్మ.
    "ఏది మీ అమ్మాయి?' అంది ఇంకో పిల్ల.
    "మదన పల్లె లో ఉంది. తనకి కాళీ లేక తన పుట్టిన రోజు మమ్మల్ని చేసుకోమంది ఇక్కడ" అన్నాడు రాఘవయ్య.
    ఇంకో చిన్న పిల్ల "మీ అమ్మాయి మా కంటే పెద్దదా అండి" అంది. "వయస్సు పెరిగింది కాని మనస్సు మాత్రం చిన్న పిల్ల మనస్సే-- పెరగలేదు. ఎవరేనా మిఠాయిలు డబ్బూ ఇస్తాం అంటే వద్దంటారా?' అన్నాడు రాఘవయ్య. "ఊహూ." అంది ఆ పసిబాల.
    "మరీ చూడు. మా అమ్మాయి వద్దంది. ఎంత చిన్న పిల్లో!"
    "పాపం. అంత చంటి పాపని వదిలేసి వచ్చారా మీరు?"
    "మేం వదిలెయ్యలేదమ్మా... తనే మమ్మల్ని వదిలేసింది...."
    "ఏవిటండీ చిన్న పిల్లలతో ఆ మాటలు! వాళ్ళకి ఏం అర్ధం అవుతాయి ?' అంటూ కసురుకుంది కాంతమ్మ.
    మిఠాయిలు అవీ పంచి పెట్టడం పూర్తి అయ్యాక పిల్లల్ని తీసుకు వెళ్తూ "థాంక్స్ అండీ ఈ అనాధల నందర్నీ ఆదరించి ప్రేమగా చూశారు " అంది శరణాలయం వార్డెన్.
    వాళ్ళూ మమ్మల్ని ఆదుకున్నారు ఒక రకంగా మేమూ అనాధలమే. ఈ పసి కూనల్ని వాళ్ళ తల్లి దండ్రులు వదిలేస్తే, ఈ ముసలి తలిదండ్రుల్ని మా అమ్మాయి వదిలేసింది" అన్నాడు రాఘవయ్య. అతని మాటలు వార్డెన్ కేమీ అర్ధం కాక సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
    పిల్లలందరికీ మిఠాయిలు పంచి పెట్టడం వల్ల ఆ సాయంత్రం పడిన శ్రమకి, ఓ రాత్రి వేళ వెన్ను లో పోటు వచ్చింది కాంతమ్మ కి, రాత్రి తెల్లవార్లూ చాలా కంగారు చేసింది. రాఘవయ్య, డాక్టరు ని తీసుకు వచ్చాడు. గంటకో ఇంజక్షన్ ఇస్తూ డాక్టరు తెల్లవారే దాకా మంచం పక్కనే కూచున్నాడు. రాఘవయ్య భగవన్నామస్మరణ చేస్తూ తలాపు దిక్కున నుంచున్నాడు.
    బాగా తెల్లారింది.
    స్టేతస్కోపు తో గుండెలు పరీక్షించి ఇంకో ఇంజక్షన్ ఇచ్చి "ఫరవాలేదు . ప్రమాదం దాటింది" అన్నాడు డాక్టరు. అప్పటి దాకా వ్యగ్రమనస్కుడై దిక్కుతోచకుండా మౌనంగా ఉన్న రాఘవయ్య ఆ మాటతో ప్రాణం లేచి వచ్చి నట్లయి ఆనందం తో కళ్ళు ఇంతచేసి  "ఆహా! అయితే మూట చిలక్కొయ్య వేసిందన్న మాట!ఇంకా ప్రయాణం కట్టేసింది అనుకున్నాను." అన్నాడు.
    అతని మాటలకి అలవాటు పడ్డ ఆ డాక్టరు "ప్రయాణం అయితే ఏం ఉండండి? ఏం అనుభవించినా ఇక్కడే అనుభవించాలి" అన్నాడు.
    "ఆ ....అనుభవిస్తూనే ఉన్నాం... అనుభావించ కేం?' అన్నాడు రాఘవయ్య విరక్తిగా.
    "ఆవిడకి ఎలాగేనా వంట్లో రక్తం లేదు. ఈ వయస్సు లో కొత్తగా రక్తం ఎక్కించినా అంతగా పనిచెయ్యదు కూడా...."
    "కొత్త రక్తం మాట దేవుడెరుగును. ఉన్న రక్తం ఒకటి మనల్ని మోసం చెయ్యకుండా ఉంటె అదే చాలు"
    డాక్టరు తన సిరంజ్ వగైరాలు సర్దుకోసాగాడు.
    "వెళతారా?" అన్నాడు రాఘవయ్య.
    "మరి వెళ్ళద్దు రాత్రి తెల్లవార్లూ ఇక్కడే ఉండి పోయాను. ఆ.... అన్నట్లు ఆవిడకి ఆత్మీయులు అంటే కొడుకులు కాని కూతుళ్ళు కాని, ఉంటె రప్పించండి."
    "ఎందుకు?"
    "ఆహా! కావలసిన వాళ్ళని చూస్తె ఒంట్లో కొంచెం ధైర్యం బలం వస్తుంది అని."
    "ఉన్న ధైర్యాన్ని పోగొట్టే పిల్లలుంటారండి ఈ లోకంలో.
    డాక్టరు నవ్వి -- "నిజమే -- అలాంటి వాళ్ళు ఉంటారు" అన్నాడు.
    "డాక్టరు గారూ నేనొక్క సలహా చెప్తాను వింటారా? మీరేవిటి నేనేవిటి ఎవ్వరం కూడా పిల్లల్ని అతిగా ప్రేమించకూడదు పొరపాటున ప్రేమించామో వాళ్ళు పెద్దవాళ్ళయి మనల్ని మోసం చేస్తారు. మోసం అండీ మోసం."
    డాక్టరు నవ్వి "అయినా మరి, ముసలి తనంలో ఆదుకోవాలంటే పిల్లలే కదండీ?' అన్నాడు.
    "ఏవిటో మీ చాదస్తం కోడి గట్టె దీపాలకి నూనె ఎందుకండీ?" అన్నాడు రాఘవయ్య.
    మెట్లు దిగుతూ వస్తే ఆమె కళ్ళు తెరిస్తే కొద్దిగా సగ్గు జావా ఇయ్యండి. అన్నాడు డాక్టరు.
    "తెరుస్తే కదా! అన్నాడు రాఘవయ్య.
    "ఏవిటండీ మీ మాటలూ మీరునూ కొద్దిగా మందలించాడు డాక్టరు.
    "డాక్టరు గారూ మీరు కాశీ లో ఏమ్ . బి.బి.యస్  చదివారు గదా... అక్కడ నుంచీ హృషీ కేశానికి దారి ఉందా? అక్కడ నుంచి కైలసానికి -- దీని ప్రయాణం ఏదో తెమిలితే నేను కైలసానికి పోదును ఇంచక్కా " అంటూ తనలో తను అనుకుంటూ కాంతమ్మ మంచం దగ్గరికి వెళ్ళి , "కాంతం" అంటూ అరిచి కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ భార్యని కళ్ళనిండుగా చూసుకుంటూ అలాగే నిలబడి పోయాడు రాఘవయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS