Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 15

 

    "ఏమిటో యీ ఆలోచనలు! ఎందుకీ చర్చలన్నీ? అందరి లాగా వో కొబ్బరికాయ కొట్టి బయటపడితే పోదూ?" అనుకుంది తన మీద తనే చిరాకు పడుతూ.
    అంతేకాదు యీ యాత్ర ముగిసే వరకు యిలాటి చర్చలు యింక చస్తే చెయ్యకూడదు అని కూడా గట్టిగా తీర్మానించుకుంది. ఐనా తను వచ్చింది దేవుడి కోసం కాదు. దేవుడి కోసం మనిషి సృష్టించిన కళా ఖండాలను దర్శించటానికి . ఆ విషయం తెలిసి తనెందు కిలా పూలిష్ గా ప్రవర్తిస్తుంది?
    గుళ్ళోకి వెళ్ళి పూజావగైరా మామూలుగా జరిపించేరు. అక్కడ ఆమెను అమితంగా ఆకర్షించింది ఆ దేవాలయ ప్రాంగణం లోనే ఉన్న శిల్ప కళాశాల. అక్కడ ఎంతో మంది విద్యార్ధులు మట్టితో ప్లాస్టర్ తో, సుద్దతో , రాతితో శిల్పాలను తయారు చేస్తున్నారు. అక్కడ ఉన్న అందమైన ఆ శిల్పాల కన్న ఆ శిల్పాలకు రూపమిచ్చిన మనుషులు ఆమెను మరింత ఆశ్చర్యాన్ని కలిగించేరు. ఎముకలు బయట పడుతున్న శరీరాలు, వాటిని అచ్చాదిస్తున్న నీరకావి బట్టలు, ఏదో నిర్లిప్తక, యాంత్రికత తాండవిస్తున్న ముఖాలు- వీళ్ళేనా యీ కళా ఖండాలను మలచింది! అని ఆశ్చర్య పోయింది కళ్యాణి.
    కొన్ని బొమ్మలను 'షోకేసు ' లో పెట్టినా చాలావరకు అసంపూర్తిగా ఉన్న కొన్ని శిల్పాలు ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా పడి ఉన్నాయ్. వాళ్ళు వెళ్ళినప్పుడే శిల్ప కళను గురించి ధియరీ క్లాసు జరుగుతుంది. ఆ శిల్ప కళను అభ్యసిస్తున్న విద్యార్ధులు, వారికి బోధిస్తున్న విద్యార్ధులు కూడా ఎంతో పేదగా, అతి సామాన్యంగా కనిపిస్తున్నారు. 'కళ' అంటే యేమిటో వీళ్ళకు తెలియదు కాని పుట్టుకతో నే ఒక అద్భుతమైన కళా నైపుణ్యాన్ని వెంట పెట్టుకు వచ్చిన అదృష్ట వంతులు వీళ్ళు. ఎంత చిత్రం!
    లోపలికి వెళ్ళేక పిల్లలిద్దరినీ స్వేచ్చగా వదిలి ఆ పరిసరాలన్నీ గమనించ సాగేరు. కళ్యాణి కాంతారావు లు, ప్రతి చోట యింత రంపపు పొట్టు గుట్టగా పడి ఉండటమో, లేదా బంక మన్ను ముద్దలు పడి ఉండటమో కనిపించేది. అక్కడి మనుషులందరూ మాములుగా కాయకష్టం చేసుకుని బ్రతికే వాళ్ళలానే కనిపిస్తున్నారు. ఒక కమ్మరి వాడు కళాయిని ఎలా చేస్తాడో, వడ్రంగి మంచాన్ని ఎలా తయారు చేస్తాడో తాపీపని వాడు సిమెంటు ను ఎలా కలుపుతాడో , రోజు కూలివాళ్ళను ఎలా ఎత్తుకుని పని చేస్తాడో అదే యాంత్రికమైన అలవాటు తో నిర్లిప్తత తో ఏ భావోద్వేగము కాని, ఆర్ద్రత గాని లేకుండా తమ పని తాము చేసుకు పోతున్నారు ఆ శిల్పులు. ఆ శిల్పుల చేతుల నుండి ఎన్నో అందమైన కళా ఖండాలు రూపం పోసుకుంటాయి. ఆ కళా ఖండాలను ఐశ్వర్య వంతులు తమ డ్రాయింగు రూములో అందంగా పేర్చుకుని తమ యింటికి వచ్చే ప్రతి ఒక్కరికీ తామెంతటి కళా ప్రియులమో నన్న సంగతిని సగర్వంగా చూపించుకుంటారు.
    కాని యీ శిల్పులను గురించి ఎవరూ ఆలోచించరు. వీళ్ళ మీద ఎవరూ పాటలు వ్రాయరు. వీళ్ళను గూర్చి సినిమాలు తీయరు, అసలు సినిమాల్లో హీరోకి కావలసిన ఫోటో జేనిక్ ఫేసులు, నటనా చాతుర్యం వీళ్ళ కుంటేగా , వెండి తెరపై వీళ్ళను చూపటానికి! అసలు యీ శిల్పులు కూడా తమని గురించి తామే ఆలోచించరు. పొట్ట కూటి కోసం తమకు వచ్చిన విద్యను వినియోగపరచుకుంటున్నారు అంతే! తాము సృష్టించిన ప్రతిమలలోని సౌందర్యాన్ని గూర్చి వో నిమిషం సేపయినా ఆలోచించే తీరిక వీళ్ళకు లేదు. ఆలోచించాలన్న ధ్యాస కూడా వాళ్లకు లేదు. పువ్వుకి తన పరిమళాన్ని గురించి తనకి తెలియనట్లే యీ శిల్పులకు అద్భుతమైన సౌందర్యాన్ని సృష్టించే తమ చేతి వ్రేళ్ళ లోని మహిమ సంగతి వాళ్ళకే తెలియదు.

                                   7

    ఆలోచించకుండా పరధ్యానంగా చూసుకుంటూ నడుస్తుంటే ఏదో కలకలం వినిపించి యిటు తిరిగి చూసేరు. 'మీ పిల్లలేనాండి! వొళ్ళంతా పాడు చేసుకుంటున్నారు చూడండి.' అంటున్నాడు ఒకతను.
    పాప తడిగా ఉన్న బంక మన్నులో కూర్చుని దానికి అతుక్కుపోయి, పైకి లేవలేక గోడుగోడున ఏడుస్తోంది. బాబు రంపపు పొత్తును తను నెత్తి నిండా పోసుకుని మరి కొంత తీసి ఏడుస్తున్న పాప నెత్తి మీద హుషారుగా కేకలు వేస్తూ పోస్తున్నాడు. అప్పటికే వాడు కొంత బంక మన్నును బుగ్గలకు , చేతులకు, కాళ్ళకు రాసుకోవటం జరిగింది.
    ఆ దృశ్యాన్ని చూస్తూనే కళ్యాణి గుండె దడదడ;లాడింది. 'ఏమిటి అవతారాలు. ఇంతమంది మధ్యా ఎంత అవమానం! ఎంత అవమానం!' అనుకుంటూ అక్కడకు పరుగు పెడ్తూ వెళ్ళింది.
    కాంతారావు అతి కష్టం మీద పాపను బంకమన్ను లో నుండి బయటకు లాగేడు. అప్పటికి అక్కడున్న జనం చాలామంది గుమి గూడారు. జరిగినది చూసి అంతా ఒకటే నవ్వు. 'భలే పిల్లలు' 'ఫన్నీ కిడ్స్' 'చిచ్చు పిడుగుల్లా ఉన్నారే పిల్లలు!' అంటూ కామెంట్స్.
    అవన్నీ వింటుంటే కళ్యాణి కి తల కొట్టివేసినంత పనయింది. గబగబ వాళ్ళ చేతులు పట్టుకుని హోటలు వైపుకు నడిచేరు. గదిలోకి వెళ్ళగానే బడబడ బాదేసింది పిల్లలిద్దరినీ. కాంతారావు అడ్డం వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు. 'ఇంక చాల్లే ఊరుకో. పిల్లలకేం తెలుస్తుంది?' అంటూ.
    
    'చూసేరా వాళ్ళందరి ముందూ ఎంత అవమానం జరిగిందో! అసలు వీళ్ళు 'నా ' పిల్లల్లా ఉన్నారా? వీళ్ళను ఎంత డిసిప్లీన్డు గా పెంచుదామనుకుంటున్నానో అంత డర్టీ గా తయారవుతున్నారు వీళ్ళు!" అంటూ ముక్కు చీదేసింది కళ్యాణి.
    'సర్లే, మధ్య నీ ఎడుపెమిటి? అపు' అన్నాడు కాంతారావు విసుగ్గా.
    "మీకలాగే అనిపిస్తుంది. వాళ్ళిలాటి అసహ్యకరమైన పనులు చేస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు? పిల్లలంటే చక్కగా స్నానం చేయించి, బట్టలు తొడిగి , ఎక్కడ కూర్చో పెడితే, అక్కడ కూర్చోవాలి బొమ్మల్లా. అంతేకాని యిదెం చిలిపితనం బాబూ! మా యింటా వంటా యిలాటి చిలిపి పిల్లలు లేనే లేరు. చూస్తుంటే వీళ్ళకు మీవైపు చాలే వచ్చినట్లుంది.' అంటూ తన ఉక్రోషన్నంతటిని భర్త వైపుకు మళ్ళించింది కళ్యాణి.
    'హతోస్మీ' అని మనసులోనే అనుకుంటూ బాబు బట్టలు విప్పటం మొదలేట్టాడు. కళ్యాణి పాప బట్టలు విప్పి తరువాత ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుని బడబడ ఈడ్చుకుంటూ బాత్ రూములోకి తీసుకు వెళ్ళింది. 'అబ్బబ్బ! ఏం పిల్లలు వీళ్ళు. అసలు వీళ్ళు పిల్లలేనా అంటా. ఉహూ వీళ్ళు పిల్లలు కానేకాదు ముమ్మాటికి కాదు. వీళ్ళు రాక్షసులు బ్రహ్మ రాక్షసులు. నరరూప పిశాచాలు. నన్ను పీక్కు తింటానికే పుట్టేరు వీళ్ళు' అంటూ బాత్ రూము లో ఉన్నంతసేపూ సణుగుతూనే ఉంది.
    బయటకు వచ్చేక తుడిచి , మరో జత బట్టలు తొడిగి , తల దువ్వి వాళ్ళను తయారుచేసింది. ఆపనంతా పూర్తయ్యేవరకు పిల్లలను తిడుతూనే ఉంది కళ్యాణి. ఆ  తిట్లలో కొన్ని వక్రీకరణం చెంది కాంతారావు వైపుకు కూడా దూసుకు పోతున్నాయ్. నాకు తెలుసు. గట్టిగా తెలుసు. ఇవి' మా' బుద్దులు కానే కావు. మా అన్నయ్య పిల్లలు, అక్కయ్యల పిల్లలు మా బాబాయి మనవరాలు మా పెదనాన్న మనమలు-- అందరూ ఎంత ముచ్చటగా ఉంటారని! కూర్చోమంటే కూర్చుంటారు. నిల్చోమంటే నిల్చుంటారు. కాని యిలాటి అఘాయిత్యం పిల్లలను నేనెక్కడా చూళ్ళేదమ్మా! పట్టుమని రెండేళ్ళ ఈ వెధవ-- ఈ వెధవకి (ఆ వెధవ నెత్తి మీద అప్పుడో మొట్టికాయ పడింది) ఎంత పొగరు!' 'వద్దురా , వద్దురా ' అంటున్న కొద్ది వద్దన్నపనినే చేసి తీర్తాడు వాడు అదేం బుద్దో! ఎక్కణ్ణించి వచ్చింది వాడికాపాడు బుద్ది! ఇవి' మా' బుద్దులైతే కానేకావమ్మా! ఇంక యిది - భూమికి జానేడెత్తు లేదూ (ఆ జానేడెత్తు పిల్ల బుగ్గ కొంచెం సాగింనప్పుడు) దీనికి మాత్రం తక్కువ పొగరా! అసలు ఆ బంకమట్టి దగ్గరకు దీన్ని ఎవడేళ్ళమన్నాడూ అంట! వెళ్ళింది వెళ్ళక అందులోనే కూలబడాలా! చచా! డర్టీ క్రీచర్స్! దిమోస్ట్ యిన్ డిసిప్లీన్డు క్రీచర్స్ అన్ ఎర్త్!' అంటూ పని పూర్తీ చేసేసరికి ఆమె వాక్ప్రవాహానికి ఆనకట్ట వేస్తూ కాంతారావు 'సరే ఇంక టిఫిను తిని వద్దాం బయల్దేరు!' అన్నాడు కాంతారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS