ఆరోజు రోజులానే రామాన్ని చూడ్డానికి వెళ్ళాను. రాధ తల్లి రామాన్ని ఒళ్ళో కూర్చో పెట్టుకుని, అక్షరాలూ రాయిస్తోంది. నన్ను చూసి, "రా బాబూ" అంది. పరంధామయ్య గారు వ్యాపార విషయాలు, కుశల ప్రశ్నలూ వేసి, మెడ మీదికి వెళ్ళిపోయారు.
రామం మారం చేసే సంగతులు, వాడి తెలివి తేటలు అవీ ఆవిడ నాతొ చెప్పి, "రాధ ఉండుంటే ఎంత ఆనందించేదో పాపం!' అంది నిట్టురుస్తూ.
నేనూ నిట్టుర్చాను.
"బాబూ ఓ మాట చెప్తాను వింటావా! రోజూ చెప్పేదే అనుకో! అయినా విను" అని ప్రారంభించింది.
"మేమిక బ్రతికినంత కాలం బ్రతకము. కనీసం బాబుని చూసుకోడానికి నీకు ఒక మనిషి కావాలి కదా! నీ కా వయస్సు ముదరలేదు. పోనీ అనుకోడానికి.
నేను కుర్చీలోంచి లేచి బయటికి రాబోయాను. రామం 'నాన్నా' అంటూ నా కాళ్ళకు చుట్టుకు పోయాడు. గమ్మున వాణ్ణి ఎత్తుకుని , నా హృదయానికి హత్తుకున్నాను. నా కంటి వెంట నీరు కారింది. రామం తన లేత చేతులతో నా కన్నీరు తుడుస్తూ , "అమ్మ కావాలి ' అన్నాడు. నా హృదయం భగ్గుమంది. నే చేసిన పాపానికి యీ పసికందుకా శిక్ష?
"ఆలోచించు బాబూ! వాడి ముఖం చూడు. వాడికి అమ్మ అంటే ఏమిటో కూడా తెలీదు" అంటూ ఆవిడ లేచి, నా దగ్గరకు వచ్చింది. నాకు కోపం విపరీతంయ్యింది. "మా నాన్నగారు యీ మాటలన్నీ చెప్పి నన్ను వప్పించమన్నారా! ఔనా" అన్నాను. ఆవిడ ఆశ్చర్యంగా నాకేసి చూసి, "మీ నాన్న గారు చెప్పాలేమిటి? ఇదేమైనా తప్పు మాటా! రాధ మా కూతురు మాత్రం కాదా! కానీ ఏం చేస్తాం? పోయింది. దానితో పోగలిగామా! ఎలాగూ ఎలాగూ పోలేము...." అంది. ఆవిడ మాట పూర్తీ చేసేలోగా పరంధామయ్యగారు క్రిందికి దిగి వస్తూ "అవునోయ్! అది నిజం కాదా! పోయిన వాళ్ళ కోసం మనమూ పోగలమా! అకాడికి మనం యీ ప్రపంచంలో ఆనందంగా ఉండాలంటే కష్టాలను జీర్ణం చేసుకోవాలి. మనస్సు రాయి చేసుకోవాలి. చెట్టంత కూతురు పొతే మేం చూడు ఎలా ఉన్నామో" అంటూ కన్నీరు గుడ్లల కుక్కుకుని, లోపలకు వెళ్ళిపోయారు.
నాకు కోపం మరింతేక్కువయింది.
"రామాన్ని నేను తీసుకు వెళ్తున్నాను. నేనే పెంచుకుంటా. నా కొడుకు నాకు బరువు కాదు. మీకీ శ్రమక్కర్లేదు." అనేసి, సమాధానం కోసం ఎదురు చూడకుండా రామాన్ని తీసుకుని యింటికి వచ్చేశాను. జరిగినదంతా విని, నా దురుసుతనానికి నాన్నగారు కూడా బాధపడ్డారు.
రామంతో ఆరోజంతా నేను బాధపడ్డాను.
"అమ్మ కావాలి. అమ్మమ్మ కావాలి. అక్కడే బావుంది అంటూ రామం మారాం ప్రారంభించాడు. ఎంతసేపు బ్రతిమాలినా మొండి కేసుక్కుర్చున్నాడు. నాకు ఏడుపొచ్చింది.
"నోర్మూయ్!' అనరిచాడు. నోరు ముయ్యకపోవడం సరికదా మారాం మానేసి, ఏడుపు ప్రారంభించాడు. పనివాడిని పిలిచి రామాన్ని ఆడించే 'ఆయా' ని పిలుచుకు రమ్మన్నాను.
వాడేళ్ళీ నరసమ్మను తీసుకు వచ్చాడు. ఆవిణ్ణి చూస్తూనే రామం శాంతించాడు. "మీరు యీ రోజునుంచీ యిక్కడే వుండండి. వెళ్లేంతిచ్చేవారు?" అన్నాను.
"భోజనం పెట్టి యాభై బాబూ, ఇంటి పనులు కూడా చేసేదాన్ని. అందావిడ. నాలో అహంకారం ఎగదన్నింది. "భోజనం పెట్టి నేను వందిస్తాన్లె. పై పనీ పాడుపనీ ఏమీ చెయ్యనక్కరలేదు. వాడి నడిస్తే చాలు. ఇదిగో వంద" అంటూ అలమర లోంచి పది పదులావిడకు తీసిచ్చాను. ఆవిడానందం పట్టలేక పోయింది. డబ్బు కళ్ళ కద్దుకుని , బాబుని చంక నేసుకుని, నాకో నమస్కారం పెట్టి, వెళ్ళిపోయింది.
విజయగర్వంతో నేను కుర్చీలో వాలాను.
ఏ గొడవా లేకుండా మూడు రోజులు గడిచాయి. ఆఫీసు కు కుడా వెళ్ళకుండా యింట్లోనే కూర్చున్నాను. తప్పనిసరయితే మోటారు సైకిలు మీది వెళ్ళి ఓ గంటలో వచ్చేసేవాణ్ణి. నాలుగో నాడు బయట నుంచి వస్తూ రామానికి అట వస్తువులు కొని తెచ్చాను. వాడు పరమానందంతో ఆటలో మునిగిపోయాడు. నేను కుర్చీలో కూలబడ్డాను. నా మనస్సులో సింహాచలం మెదిలింది. సింహాచలం గుర్తు రాడానికి కారణం లేకపోలేదు. ఇంటికి వస్తుండగా దారిలో ఒకమ్మాయిని చూశాను. ఆ పిల్ల నడక తీరు, ఒడ్డూ పొడుగూ సింహాచలాన్ని గుర్తుకు తెచ్చాయి.
తివాచీ మీద కూర్చుని ఆడుకుంటున్న రామాన్ని చూసేసరికి సింహాచలం కొడుకు ఎలా ఉంటాడో అనిపించింది. వాడు ఆడుకోడానికి బొమ్మలుంటాయా...లేక కుండ చిప్పలతో......
నే వూహించలేకపోయాను.
భయంతో రామాన్ని నా గుండెకు అదుముకున్నాను. ఒకవేళ భగవంతుడింకా నన్ను శిక్షించదలుచుకుంటే
సింహాచలం ఎలా వుందో!
"నాన్నా" అన్నాడు వూపిరాడక రామం. రామాన్ని వదిలేసి, ఆయాసంతో కుర్చీలో కూలబడ్డాను. ఇంతలో నరసమ్మ గారు వచ్చి "బాబూ పంతులమ్మ గారొచ్చారు" అంది.
"పంతులమ్మగారేమిటి" అన్నాను.
"అవును బాబూ. మన బాబుకి ప్రయివేటు చెప్పే పంతులమ్మ" అందావిడ. రామానికి ప్రయివేటా? దానికో పంతులమ్మా!" "రమ్మను" అన్నాను. ఆవిడ వెళ్ళి పంతులమ్మ గారిని పిల్చుకోచ్చింది. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి.
"నమస్కారం' అందామె చేతులు జోడిస్తూ.
"కూర్చోండి' అన్నాను యాంత్రికంగా . ఆమె కూర్చుంది. నేను యిందాక చూసిందామెని. అవును. ఆకుపచ్చ చీర, చామనచాయ, చక్కని ఆరోగ్యమయిన , అందమైన శరీరం, నవయో.....వూహాలను తెంపేశాను.
ఆమె గొంతు సవరించుకుని, "మన బాబుకి ప్రయివేటు చెప్పేదాన్ని నేను. బాబూకి అయీడూ వుందని కాదు. అసలు కారణం....'ఆమె ఓ లిప్త పస్తాయించి మళ్ళీ ప్రారంభించింది.
"మేం చాలా బీదవాళ్ళం. ఒకనాడు మాత్రం యీ నాటంత బీదవాళ్ళం కామని మా అమ్మ అంటుంది. నేను జ్ఞానం తెలుసుకునే వయస్సుకి వచ్చేసరికే అంతా అయిపొయింది. సుభద్రమ్మ గారే నన్ను స్కూలు ఫైనలు వరకూ చదివించి, ట్రైనింగు చేయించారు. ఇప్పుడు బాబూ చదువు వంకన నెలనెలా పాతిక రూపాయలిస్తున్నారు...." అంటూ ఆగింది.
"బాబుకి యిప్పుడు ప్రయివేట్లూ అవీ ఏమీ అక్కరలేదు. కాన్వెంటు లో చేర్చాలనుకుంటున్నాను" అన్నాను. కొంచెం దురుసుగా -- సుభద్రమ్మ గారి మీద కసితో.
రామం వెళ్ళి ఆమె ఒళ్ళో కూర్చున్నాడు.
నా మాటలకు ఆమె నిరాశగా నవ్వింది.
"తెలుసు: ఆమాత్రం వూహించి ఆవిడే చెప్పారు. కానీ, ఆశతో ముక్కు ముఖం తెలియని మీతో -- సిగ్గు విడిచి బీద అరుపులు అరిచాను" అందామె. ఆమె కంఠం వణికింది. రామాన్ని క్రిందకు దింపి, లేచి నుంచుంటూ, "శెలవు" అని రెండు చేతులూ జోడించింది. రామం ఆమె చీర కుచ్చిళ్ళు పట్టుకుని మారాం చేశాడు. ఆమె వంగి రామాన్ని బుజ్జగిస్తూ "తప్పు! అలా అల్లరి చెయ్యచ్చా! ఇవిగో నీకు చాకలెట్లు తెచ్చాను. మళ్ళీ రేపోస్తాను. ఏం? ఏదీ నవ్వు అదీ మా బాబు మంచివాడు' అంది. రామం బుద్ది మంతుడిలా నవ్వి ఆటవస్తువుల ముందు కూర్చున్నాడు. ఆమె నిట్టూర్చి, నాకేసి చూసి వెళ్ళిపోయింది. నేను తలెత్తి ఆమె కేసి చూశాను. గడపదాటి ఆమె వెళుతుంటే తలలోంచి పువ్వు-- మందార పువ్వు-- క్రింద పడిపోయింది. మందార పువ్వు చూడగానే నా ప్రాణం ఝల్లు మంది. గమ్మున వెళ్ళి ఆ పువ్వు తీసుకుని జేబులో పెట్టేసుకున్నాను. ఇంతలో నరసమ్మ గారు వచ్చింది.
"పంతులమ్మ గార్ని పిలవండి" అన్నాను. ఆవిడ నాకేసి చిత్రంగా చూసి, గబగబ వెళ్ళిపోయింది. జేబులోంచి మందార పువ్వు తీసి, దానికేసి చూశాను. అందులో సింహాచలం కనిపించింది. బయట అడుగుల శబ్దం విని పువ్వు జేబులో తోసేశాను. ఆమె వస్తూనే "పిలిచారట' అంది. ఆమెకేసి చూశాను. కళ్ళు ఎర్రగా వున్నాయి. ఈకాస్త సేపటిలోనే ఆమె ఏడ్చి వుండాలి. అవును పాతిక రూపాయలాదాయం. ఆ పాతిక విలువ నాకేం తెలుసు?
"మీరు బాబుకి పాఠం చెప్పడానికి రేపటి నుంచీ రావచ్చు. మీకు జీతం యాభై యిస్తాను. వాడు మారాం చేయకుండా చూస్తె చాలు... పాఠాలు చెప్పినంత పుణ్యం" అన్నాను.
చక్కని ఆమె కళ్ళలో ముత్యాల్లా కన్నీరు మెరిసింది. "శలవు రేపటి నుంచీ వస్తాను' అంటూ ఆమె చేతులు జోడించింది.
