Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 15


    మెల్లిగా కారుపోనిస్తూ ఒకచేత్తో  స్టీరింగు పట్టుకుని, మరో చెయి అనూరాధ చేతిమీద వేసి మృదువుగా నొక్కుతూ "ఇవాల్టి విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి, అనూరాధ! ఇక్కడివి ఇక్కడే మరిచిపోవడానికి ప్రయత్నించండి. రెండు నెలలే కాబోలు ఇంక ఉన్నది. బాగా చదవండి" అన్నాడు. అతని కంఠంలో మార్పు గమనించి కొంచం ఆశ్చర్యపోక తప్పలేదు అనూరాధకు. అంతవరకు ఎంతో ఆవేశంతో ఉన్న కంఠం, ఆ క్షణంలో అసలు ఏమి జరగనట్లు అతి సామాన్యంగా, మామూలుగా ఉంది.
    కారు దిగుతూ, "మళ్ళీ ఎప్పుడు వస్తారు?" అని అడిగింది.
    "మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు."
    "నేను రమ్మనటం ఏమిటి? మీరు ఎప్పుడు వచ్చినా వెల్ కమ్. రెండు మూడు రోజులలో తీరికచేసుకు వస్తారుగా."    
    తల ఊగించి గృహోన్ముఖుడయ్యాడు.
    ఆ రాత్రి భోజనం తరవాత మంచంమీద వాలిన అనూరాధ క్లాసు పుస్తకంలో ఒక్క పేజీకూడా తిప్పలేకపోయింది. ఎంత ప్రయత్నించినా మనస్సు చదువుమీద నిమగ్నం కాలేకపోయింది. ఏ విధంగా ఆలోచనలు మొదలయినా, అవి శ్రీనివాస్ మీదికే దారితియ్యసాగాయి.
    ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన, విన్న విషయాలు కలలా? వాస్తవాలా? అన్న మీమాంసలో పడి కొట్టుకుపోసాగింది. ఎంత ప్రయత్నించినా ఆ విషయాలు తేలికగా తీసిపారెయ్యలేకపోయింది. శ్రీనివాస్ ... మెడిసిన్ చదివాడా? నిజమయిన విషయమే! ఆ రోజున ఒక అమాయిక ప్రాణానికి అడ్డుపడ్డ శ్రీనివాస్-ఒక డాక్టర్! ఇన్ని నెలలనుండి ఇంత గుంభనంగా ఈ విషయాలు  దాచాడన్నమాట! అందుకేనా ఆ రోజు  వాళ్ళింటి విషయాలు అడిగితే చెప్పేందుకు ఏమీ లేదని తప్పించుకున్నాడు? ఎమ్. ఏ. చదవడం, సరదాగా పనిచెయ్యడం అన్ని అబద్దాలేనన్నమాట! ఎంత తమాషా! తనకు ఆ రోజే అనుమానం వచ్చింది. తనలో తను ఆలోచనలో పడిపోయింది. పయిన ఉన్న సీలింగ్ ఫాన్ రెక్కలు తిరగటంతో మాయమయి ఒక చక్రంలా కనుపిస్తూంది. ఆలోచనలో తిరుగు తున్న అతని రూపం ఆ చక్రంలో కనుపించింది చిరునవ్వుతో. భారీఅయిన విగ్రహం. అందమయిన రూపం. ముఖంలో ప్రత్యేకత కలిగించే చిన్నకళ్ళు. వీటన్నిటితో ఇంత గంభీరంగా కనుపించే ఆ ముఖం చాటున ఇంత సున్నితమయిన హృదయమా? ఇందులో సగం తన భావన అయిఉండాలి! అంత చక్కని ఔదార్యబుద్ది మరుగున పడిపోకూడదు! అతని విద్య వృథా కాకూడదు! అతని అభివృద్దికి తను ఎంతయినా ప్రయత్నించాలి. 'లేదు, శ్రీనివాస్, మీ పేరు ఎప్పుడూ అందరికీ తెలియాలి! మీ రిలా అధైర్యపడకూడదు. మీకు ప్రతి ఇతర డాక్టర్ లా ఉజ్జ్వల మైన భవిష్యత్తు కలగాలి! దానికి నా కృషి, సహకారం ఎప్పుడూ ఉంటాయి.' తనలో తను నిర్ణయం చేసుకుంది అనూరాధ. ఆ సాయంత్రం అతని బలమయిన హస్తాలలో మృదువుగా స్పృశించబడ్డ తన అరిచేతులను చూసుకుంటూ మెల్లిగా ముద్దుపెట్టుకుంది.

                                   19

    "రాధా" అంది మందలింపుగా లలిత. ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూచింది అనూరాధ.
    "నువ్వు అత్యాశకు పోతున్నావేమో, కొంచం ఆలోచించడం మంచిది!"
    "అంటే?"
    "అంటే?" తిరిగి అనుకరించింది చిరుకోపంతో. "అంటే ఏమిటో నీకు తెలియదని నేననుకోను. అతను చెప్పిందంతా విని అతని ఉద్దేశాన్ని కనుక్కోవాలని ప్రయత్నించక మళ్ళీ ఇంకా ప్రోత్సహిస్తావా?"
    "ఇందులో కనుక్కోవడానికి అంతగా ఉందని నేననుకోను. అతనికి తగిన ప్రోత్సాహం లేదు. అతనికి అవసరమయిన ..."
    "అనూ, నీ ఉద్దేశం మంచిదే! కాని దానికి తగ్గ వ్యక్తి, తగిన సమయం కాదు. అతను జీవితంలో మరుగున పరచాలనుకునే విషయాల్ని బయటికి తీసి బాధకు మాత్రం గురికాకు."
    "ఇందులో బాధకు గురికావలసిన ఆగత్యం ఉందనుకోను. అతని ఆదర్శాలకీ వృత్తి ఎంతయినా సరిపోతుంది. ఆ ఆదర్శాల పేరుతోనే అతన్ని తిరిగి ఇందులో ప్రవేశపెట్టించాలి."
    "వృత్తికి, ఆదర్శాలకుకాదు పొత్తు కలవవలిసింది. ఆదర్శం అనేది మనఃపూర్వకంగా ఆచరణలో పెట్టదలుచుకుంటే, ఏ వృత్తిలో ఉన్నా, ఎంత రాబడి ఉన్నా వీలౌతుంది. మనః ప్రవృత్తికి, మనం ఆచరించే పనులకు, చెయ్యదలుచుకున్న వృత్తికి సరిపోవాలి. ఈ ఆదర్శాల పేరుతో, ఆవేశంతో చేసే పనులలో ఎన్ని అనర్ధాలయినా జరుగుతాయి. మనం చేయదలుచుకున్న పనికి నిర్ణయం మనది కావాలి. మరొకరిది కాకూడదు."
    "నిశ్చయం చేసుకోలేని వ్యక్తులు, నిర్ణయించుకోలేని వ్యక్తులు కొందరుంటారు. వారికి ఇతరుల సలహాలు, నిర్ణయాలు ఎంతయినా అవసరం."
    "తమకు కావలిసినదేదో నిర్ణయించుకోలేని వ్యక్తులుకూడా, తమకు అక్కరలేనివి తేలికగా, తప్పకుండా నిర్ణయించుకుంటారు. కాని మరే ఇతరుల ప్రభావంవల్లయినా తమకు అక్కరలేనిది కావలిసినదిగా భావించుకుని, ఎదురు దెబ్బ తింటే నింద భరించేవాళ్ళుమాత్రం నిర్ణయించినవాళ్ళే."    
    "కాని, లలితా, అతను చెప్పేది ఎంతవరకు సబబు అంటావు? గుండెపోటు వచ్చినవాళ్ళు హాస్పిటల్ లో చేరేటప్పుడే ఆశ లేనివాళ్ళు మరణించడాలు ఆశ్చర్యకరమయినవి, జరగకూడనివి కావుకదా! అలాటి మరణాలు తన చేతుల్లో సంభవించాయని, తను డాక్టర్ గా పనికిరాడని అనుకునే వ్యక్తులకు తగిన ప్రోత్సాహం అవసరమా? కాదా?"
    "అనూ, మామూలుగా అలాటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి డాక్టరుగా పనికి వచ్చేది, లేనిది తేల్చేవాళ్ళు ఇతరులు. కాని .... ఒక డాక్టరే ఆ వృత్తికి తను పనికిరానని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయానికి తిరుగేమిటి? ఎదురు చెప్పేవాళ్ళు, ఎవరు? కాని ఒక్కటిమాత్రం నిజం. మిగిలిన వృత్తులకు, వైద్య వృత్తికి తప్పకుండా తేడా ఉంది. ఏ వృత్తిలో ఏ విధమయిన పొరపాటు జరిగినా కలిగే నష్టం వస్తురూపంలో, ధనరూపంలో ఉంటుంది. కాని డాక్టర్ పొరపాట్లు చేస్తే జరిగే నష్టం మనిషి ప్రాణం!"
    "అతన్ని నేను ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తూ ఉంటే నన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తావేం, లలితా!"
    "నిరుత్సాహపరచాలని కాదు, అనూ. నీకు స్ఫురించని విషయాలు తెలియపరచాలని. జీవితంలో మనిషి తను చేసుకునే ప్రతి నిర్ణయానికి తనే బాధ్యుడవ్వాలని నా ఉద్దేశం. ఒకరిమీద మన ప్రోత్సాహం ఎక్కువగా ఉండటం మంచిది కాదు, అనూ. ముఖ్యంగా పురుషులమీద."
    "మళ్ళీ ఆ తేడా ఎందుకు?"
    "తేడా అనికాదు. ఒక స్త్రీ ఇంకో స్త్రీని అర్ధం చేసుకున్నట్లు పురుషుడు అర్ధం చేసుకోలేడు."
    "కాని ఒక స్త్రీ పురుషుణ్ణి కాని, ఒక పురుషుడు స్త్రీనికాని అర్ధం చేసుకొనే విధానం మన జాతిలో సంభవించదు."
    "ఇలా మనం వాదించుకుంటే దీని కంతం ఉండదు నీమీద, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ మీద నీకున్న ప్రత్యేకాభిమానానికి కారణం లేదనుకోను. నువ్వు అతని విజయానికి కారకురాలివైతే ఆకాశానికి ఎత్తుతారు! కాని నీమూలంగా మరొకసారి అపజయానికి తావుమాత్రం ఇవ్వకు. స్త్రీమూలంగా పురుషుడు ఓటమి అంగీకరించలేడు. అది నరనరాల్లో జీర్ణించుకున్న బలహీనత."
    "ఇందులో ఓటమికి, అపజయానికి తావుందనుకోను, లలితా. ఆ రోజు  భగభగ మండిపోతున్న ఇళ్ళల్లో ఒక అమ్మాయిని, చావుబతుకులలో ఉన్నప్పుడు బతికించడానికి కారకుడు శ్రీనివాస్. అతను నిజంగా చావును ఎదుర్కొనేందుకు భయపడేవాడయితే, ఆ రోజు అ అమ్మాయిని ఎలా రక్షించాడంటావ్?"
    "ఏమో! నువ్వన్నట్లు అతనిది కొంత భావన కావచ్చు. ఆ రోజు జరిగింది కేవలం యాదృచ్చికం కావచ్చు.

                               *    *    *

                   

                                20

    "హలో...డాక్టర్" ...అప్పుడే లైబ్రరీనుండి వస్తున్న శ్రీనివాస్ తలఎత్తి చూచాడు ఆశ్చర్యంగా. లైబ్రరీ ముందుగా ఉన్న కారులో కృష్ణమూర్తి గారిని చూచి కొంచం ఆశ్చర్యపోయాడు. ఆయనకు వీలయినప్పుడు అటువైపు రావడం, తనను పిలుచుకువెళ్ళి కొంతకాలం గడవటం మామూలే అయినా ఆ రోజున అది కొంచం ఆశ్చర్యపరిచింది. అనూరాధ సంగతి అప్పుడే చాలామందికి తెలిసిందన్న మాట అనుకున్నాడు కొంచం విసుగా, అది పైకి కనబడనియ్యకుండా. "హలో" అని విష్ చేశాడు మామూలుగా డాక్టర్ అన్న పదానికి ఎటువంటి ప్రత్యేకతా కనబడనీయకుండా.
    "ఎక్కడికి, రూమ్ కేనా?"
    "ఉఁ.... మీరేమిటి ఇలా వచ్చారు?"
    "ఏం లేదు. ఇక్కడ దగ్గిరిలో ఒకరింటికి విజిటర్ కి వెడుతున్నాను. దారిలో నిన్ను కలిసి ఎక్కించుకుందామని."
    "ప్రొఫెషనల్ విజిట్టా?"
    "అంతే మరి .... ఈటైములో" అన్నారు నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS