Previous Page Next Page 
తామరకొలను పేజి 15


    "నిద్రయినా వస్తే!"
    భవిష్యత్తు శూన్యంగా కనిపించిందతనికి. ఎన్నో రకాల ఆలోచనలు సూదుల్లా గుచ్చుకుని బాధ పెడుతున్నాయి.
    బాధ, మంటలతో మూగబాధ అనుభవిస్తూ నిద్రపోయాడు.
    "రత్నా" అని కలవరిస్తూ పక్కకు పొర్లాడు.
    ఉదయం రమేశ్ లేచేసరికి ఎనిమిది దాటింది. అతడు గదిలో నుండి బయటకు వచ్చేసరికి రత్న ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది.
    ఆమె మొహం చూడగానే గతరాత్రి తాను అనుభవించిన బాధంతా మరిచిపోయి నవ్వాడు రమేశ్.
    "ఉదయం లేవగానే ఎవరితో మాట్లాడుతున్నారు? అంత పుణ్యం చేసుకున్నవారెవరో?" అని అడిగాడు రమేశ్.
    "నా కసిన్ దాదర్ లో ఉంది. సాయంకాలం నాలుగింటికి ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను."
    "ఓ"
    "సాయంకాలం అందరం కలిసి మలబార్ హిల్స్ లోని కమలానెహ్రూ పార్కుకు వెడదాం."
    నవ్వుతో వెలుగుతున్న రమేశుడి మొహాన్ని క్షణ మాత్రంలో నల్లటి మబ్బులు క్రమ్ముకున్నాయి.
    "నా నుండి రక్షించుకుందామని ఆవిడను పిలిచారా?"
    అతడి కంఠంలో ధ్వనించిన వ్యధను గమనించి వెంటనే రత్న,
    "అలా అనుకోకండి. మిమ్మల్ని ఆమెకు పరిచయం చేద్దామనిపించి పిలిచాను. తను బి.ఏ. పాసయింది. బాగా పాడుతుంది......"
    "ఇవేం పెళ్ళి చూపులు కావుకదా?"
    రత్న అటు తిరిగి, ఏదో వెతుకుతున్నట్టు నటిస్తూ "కాదు" అంది.
    రత్న కాఫీగ్లాసు అతడి ముందుంచి,
    "తాగండి" అంది.
    "అక్కర్లేదు."
    "మంచి కుర్రాళ్ళు అలా మొండికెయ్యరు; నాకోసం తాగండి."
    "నాకోసం మీరామెను పిలవకండి."
    "నళినికి అంతా చెప్పి, సాయంత్రం నాలుగింటికి రమ్మన్నాను. ఇప్పుడు ప్రోగ్రాం కాన్సిల్ చేయటానికి వీల్లేదు."
    "అయితే ఈరోజు నే నెక్కడికీ రాను."
    "రమేశ్ మిమ్మల్నేం చేయాలో తెలుసా?"    
    "చెప్పండి."
    "Spanking అంటారు విన్నారా?"
    "మీరు మాటల్లోనే Spank చేస్తున్నారు."
    "మిమ్మల్ని పట్టుకుని బాగా తన్నాలనిపిస్తుంది. కాని చేతులు రావు" అంది రత్న ప్రేమగా.
    "కొట్టడానికి బదులు తిడుతున్నారు. అంతేగా!"
    రత్న కాఫీ-గ్లాసు పట్టుకుని అతడి ముందు:
    "తీసుకోండి" అంది.
    "ఉహుఁ."
    "మీరు తాగకపోతే నేనే తాగించాల్సి ఉంటుంది."
    రమేశ్ రత్న-కళ్ళల్లోకి చూస్తూ, "రత్నా! నేను అడిగింది తెచ్చి తాగిస్తారా?" అని అడిగాడు.
    "ఓ, ఏం కావాలి? కాఫీ, టీ?"
    "విషం ఇవ్వండి. సంతోషంగా తాగుతాను."
    స్విచ్ ఆఫ్ చేయగా ఆరిపోయే దీపంలా రత్న మొహంలోని వెలుగు ఆరిపోయింది. దెబ్బతిన్న పక్షిలా అక్కడినుండి వెళ్ళిపోయింది రత్న.
    రమేశుడికి తానన్న మాటలలోని తీవ్రత అర్ధమయింది. కాని, అతడికి ఆ క్షణంలో నిజంగానే ఆమె చేతి నుండి విషం తీసుకుని తాగాలనిపించింది.
    బ్రతకటానికి భయపడి మృత్యువును ఆహ్వానించటం!
    ఎంత పిరికితనం!
    కళావిహీనమైన రత్న మొహం అతడిని అక్కడ నిలవనీయలేదు. కాఫీ-గ్లాసు తీసుకొని వంట-గది లోకి వెళ్ళి, ఆమె ముందే కూర్చుని కాఫీ తాగాడు. రత్న మాట్లాడకుండా కూర్చుని కూర తరుగుతోంది.
    "రత్నా! నామీద కోపమా?"
    "లేదు. ఈ ఇష్ట మొచ్చినట్టు మాట్లాడే స్వాతంత్ర్యం మీకుంది."
    "విషం తాగినా, నేను చావను రత్నా."
    రత్న తలెత్తి అతడివైపు చూసింది. ఆమె కళ్ళనిండా నీరు నిలిచింది.
    "నిన్న రాత్రి నేను మహాలక్ష్మీ దేవస్థానం వెనుక సముద్రతీరంలో అమృతపానం చేశాను. అమృతం తాగాక, విషం తాగినా చావరు."
    రత్న తల వంచుకుని నెమ్మదిగా అంది: "రమేశ్ నేను చాలా సామాన్యురాలిని. నాకు అంత వెల కట్టకండి. మీ రత్న అతి సామాన్యురాలు."
    "ఎప్పటికీ కాదు; రత్న రత్నమే."
    "కాదు. పేరు మాత్రమే రత్న. నేను వట్టి గాజుముక్కను."
    "రత్నమో, గాజో దాని వెల. అదే నిర్ణయించదు. దాని వెల కట్టేవారు వేరే ఉంటారు."
    "కావచ్చు. ఎవరైతే ఆ విషయాలలో ఎక్కువ అనుభవం కలిగి ఉంటారో, వాళ్ళే వెలకట్టగలరు. మీలాంటివారికి రత్నానికి, గాజుకూ తేడా ఏం తెలుస్తుంది?"
    "నాకు తెలుసు, నేను చెప్పగలను."
    రత్న చిరునవ్వు నవ్వి "పులుసులో ఉప్పెక్కువో, కారం ఎక్కువో చెప్పలేని మీరు, గాజు, వజ్రాల సంగ తెందుకు మాట్లాడుతారు?" అంది.
    "రత్నా! నేను మీ రనుకున్నంత మూర్కుడుని కయు.
    "సరే; అలాగే అనుకుందాం. ఇప్పుడు చెప్పండి మీ కెంతమంది స్త్రీలతో పరిచయం ఉంది? నాతో ఉన్నటువంటి స్నేహమే ఇంకెవరెవరితో ఉందో చెప్పండి."
    ఆమె-మాటల్లో ఇమిడిఉన్న అర్ధాన్ని తెలుసుకోకుండానే రమేశ్ "మీరు.....అమ్మ.....వదిన...." అన్నాడు.
    "ఇంతేనా?"
    "అవును. నా క్లాసులో కొంతమందితో పరిచయం ఉంది గాని, అది స్నేహ మనిపించుకోదు."
    "అమ్మ, వదినల మాట అటుంచండి. వాళ్ళిద్దర్నీ జాబితాలో నుండి తీసేస్తే మిగిలేది నే నొక్కదాన్నే. నాలాంటివాళ్ళు పదిమందితో పరిచయం చేసుకుని, చనువుగా తిరగండి. అపుడు మీరు రత్నకు ఎన్నోస్థాన మిస్తారు?
    "ప్రథమ స్థానం."
    "నిజంగానా?"
    "అవును."
    "దీన్నే మొండితనం అంటారు. సరే గాని, సాయంత్రం మటుకు నామాట తీసెయ్యకండి" అంటూ బ్రతిమాలుకుంది రత్న.
    సాయంకాలం, నాలుగింటికి సరిగ్గా నళిని "రత్నా" అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టింది.
    "ష్ ....." అని నోటిమీద వేలుంచుకుని అరవవద్దని హెచ్చరించి, వంట-గదిలోకి తీసుకొని వెళ్ళింది.
    "ఏమిటీ అంత అర్జంట్ గా రమ్మన్నావ్?"
    "మా ఇంటికి రమేశ్ అని ఒకరు వచ్చారు. ఎం.బి.బి.ఎస్. ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. ఇంకా పెళ్ళి కాలేదు. అందగాడు ...." మాట నిలిపి నళిని వైపు అర్దగర్భితంగా చూసింది రత్న.
    నళినికి రత్న చెప్పబోతున్న దేమిటో తెలిసినా, తెలియనట్టుగానే:
    "దానికి నన్నేం చేయమంటావ్?" అంది.    
    "దేవుడు నీకు అందం, తెలివి, యౌవనం, విద్య-అన్నీ ఇచ్చాడు. జీవితంలో అంతగా ఆసక్తి లేని ఈ అబ్బాయిని వీలయితే వలపించుకో. ఈ పరీక్షలో నువ్వు గెలిస్తే రమేశుడినే బహుమతిగా పొందుదువుగాని."
    చెంచాతో గ్లాసును మోగిస్తూ-రత్న-మాటలు వింటోంది నళిని.
    "ఏమంటావు?" రత్న అడిగింది.
    "ముందు అతడిని చూడాలి నేను. తరువాత చెప్తాను. జీవితంలో అతడికి కలిగిన నిరాసక్తి ఎందుకో తెలుసా?"
    "ఆప్తు లొకరి మరణంలో జీవితంమీద విరక్తి కలిగింది."
    "ఆప్తులంటే?" నళిని కంఠంలో ఆరాటం వ్యక్తమయింది.
    "వారి వదిన."
    "అంతేకదా" తేలిగ్గా నిట్టూర్చింది నళిని.
    "రమేశ్ బంగారంలాంటి అబ్బాయి. నువ్వు రెండు రోజులు అతడితో కలిసి తిరిగి, వీలయితే నీవాడిగా చేసుకో."
    "నా కెరియర్ (Career) గతేంకాను?"
    "నీ కెరియర్ పాడుగాను. ఆడదానికి కెరియర్ ఏమిటి? భర్తతో కాపురం చేయటమే నీ కెరియర్."
    "ఈరోజు ఎటువైపు వెడదామంటావ్?"
    "కమలా నెహ్రూ పార్కుకు వెడదామని చెప్పాను. కాని, నాలుగుంపావుకు కుముదని రమ్మని కబురు చేశాను. తను రావటంతో, నేను రాను, మీ రిద్దరూ వెడతారు. రేపటి ప్రోగ్రాం నువ్వే అతడితో చెప్పు."
    "అతడిని చూశాక ఏ సంగతీ చెపుతాను" అంది నళిని.
    రత్న నళినికి కాస్త దూరంగా జరిగి నిల్చుని పరీక్షగా చూసింది.
    నళిని పదిమందిలో ఉన్నా, ప్రత్యేకంగా కనిపించే అందగత్తె. రత్నకు పినతండ్రి కూతురు. ఆ సంవత్సరమే బి.ఏ. పాసయింది. ఒక స్కూలులో టీచరుగా పని చేస్తోంది. నళిని తల్లి దండ్రులు ఆమెకు పెళ్ళి చెయ్యాలని ఆతురపడుతున్నారు గాని, మంచి సంబంధం దొరక్క ఊరుకున్నారు.
    నళిని కళ్ళల్లో ఆనందం లాస్యం చేస్తోంది. అందమైన పెదవులమీద మందహాసం వెలుగుతోంది. చంచలతతో ఆమె కళ్ళు మిలమిలా మెరిసిపోతున్నాయి. పసిపాపల కుండే నిర్మలమైన నడచిన పరిసరాలకంతా వెలుగును విరజిమ్ముతోంది.
    తన అందాన్ని కనిపించేలా అలంకరించుకునే నేర్పు ఉందామెకు.
    రత్న ఆమెవైపు చూసి తృప్తిగా నిట్టూర్చింది.
    నళిని రా లేచేటంతలో, రమేష్ లేచి వచ్చాడు.
    రత్న ఇద్దర్నీ ఒకరి నొకరికి పరిచయం చేసింది.
    "నమస్తే" అంది నళిని చేతులు జోడిస్తూ.
     అప్పుడే నిద్రనుండి లేచి వచ్చిన రమేశుడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ర మత్తు వదలని మొహం పసిపిల్లాడి మొహంలా ఉంది. చెదరిన ఉంగరాల జుట్టు నుదురునంతా కప్పేసింది.
    "అందగాడు" అని మనసులోనే అనుకుంది నళిని.
    పదిహేను నిమిషాల్లో బయటికి వెళ్ళటానికి సిద్ధమై నిల్చున్నాడు రమేష్. రత్న కూడా వెళ్ళే సంనహంలోనే ఉంది కాని, ఆమె కళ్ళంతా వీధి తలుపు వైపే ఉన్నాయి.
    "కుముద ఇంకా రాలేదేం చెప్మా" అని మాటి మాటికీ ఆ తలుపువైపు చూస్తోంది రత్న. లేని పనిని వెతుక్కుంటూ కాలయాపన చెయ్యసాగింది. ఆఖరికి కుముద కనిపించేసరికి దేవుడి దర్శన సంతోషమయింది రత్నకు. కుముదను పలకరించి కూర్చోబెట్టి, రమేశుడితో:
    "మీరు వెళ్ళిరండి. రాకరాక కుముద వచ్చింది. రేపు కావాలంటే అందరం వెడదాం" అంది.    
    రమేశుడికి ఏం చెయ్యాలో తోచలేదు. నళిని మౌనంగా రమేశుడివైపొకసారి, రత్నవైపొకసారి చూసింది. ఆఖరికి:    
    "పోనీ, రేపే అందరం కలిసి వెడదాం" అంది.
    రత్న ఒప్పుకోలేదు: "నావల్ల మీరు ఆగిపోవటం ఎందుకూ? మీరు వెళ్ళిరండి" అంది.
    రమేశ్ ఏమనటానికీ వీల్లేకపోయింది. మెడ బట్టి గెంటించుకున్నవాడిలా నళినితో బయల్దేరాడు.
    అంతవరకూ కుముది మాట్లాడకుండా కూర్చున్నది రత్న అదృష్టమే అనాలి. వాళ్ళు వెళ్ళి పోగానే, రత్న-వీపుమీద చిన్నగా కొట్టి, "ఏమిటే గొడవ" అంది.
    "ఏం లేదే. నిన్ను చూద్దామనిపించింది రమ్మన్నాను" అంది రత్న.
    కాని, తరువాత కబుర్లలో ఆసక్తి లేక రత్న పరధ్యానంగా ఉండటం కుముద గమనించింది.
    నిజంగా తనను చూడాలని ఆత్రంతో పిలిపించిన రత్నేనా తను?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS