Previous Page Next Page 
విరామం పేజి 15


    ఎడం పక్కకి తిరిగి స్టేజి వెనక్కి వెళ్ళిపోయింది"
    "ఔను ఈసారి బాగా చూశాను..."
    "ఆ అమ్మాయి చికో అక్క కాదు,"
    "మరి?"
    "రామొ కృష్ణో రామో కృష్ణో!" లహరీ చిలి పిగా నవ్వేడు.
    నా గుండె కొట్టుకోడం నాకు వినిపించింది.
    "ఈ అమ్మాయి! రామ కృష్ణో రాము కృష్ణో! నిటారుగా, నిమ్మళంగా, ఠీవిగా, పరిమళంతో కూడిన రివట గాలిలా వెళ్లిపోయింది. రామొ కృష్ణో రామో కృష్ణో".
    తరుచు సాయంత్రం లాల్ ది ఘీ వేపు షికారు వెళ్ళేవాడిని. 'బ్లాకౌటు" కారణంవాళ్ళ వూరు చీకటిగా వుండేది. ముఖ్యం లాల్ దిఘీకి వెళ్ళే తోవ మరీ చీకటిగా వుండేది. జనసంచారం కూడా వుండదు. నిశ్శబ్దంగా వున్న ఆ రోడ్డంట రాత్రి పూట వొంటరిగా వెళుతూంటే సరదాగా వుంటుంది. తోవలో ఒక దగ్గర రజని గంధ (నైట్ క్వీన్) పరిమళం గుప్పుమనేది. అక్కడ మరీ చీకటి. పరిమళం తోబాటు, మేడమీంచి సంగీతం వినిపించేది.
    "రామొ కృష్ణో రామో కృష్ణో, రామొ కృష్ణో రామో కృష్ణో - రామొ కృష్ణో రామొ కృష్ణో. రామో - కృష్ణో"
    ఇదే వినిపించేది. తియ్యగా, నిండుగా వున్న కంఠంతో శ్రుతి పక్వంగా వున్న ఆ సాథకం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నేను రజని గంధ పక్కనే నిలబడి మైమరచి వినేవాన్ని, నిద్రలో కూడా ఆ ఆలాపన వినిపించేది. ఆ గాయని యిరవై ఏళ్ల యువతై వుంటుంది. అందంగా వుంటుందని వూహించుకున్నా. సాధారణంగా అలాంటి అంచనా తప్పుతుంది. కఠోరమైన కంఠంగల నెమిలి అందాలరాణి. సతయ్లేని కంఠమాధుర్యం గల కోయిల కురూపి. కాని రామొకృష్ణో విషయంలో నా ఊహ నిజవైంది. రామొ కృష్ణో రామొ కృష్ణో అందం అపురూపం, అతిలోకం.
    రజని గంధ దగ్గిర "తీయని సంగీతం" గురించి లహరీ నడిగా. అతనికా అమ్మాయితో గాని, ఆ యింట్లో వాళ్ళతోగాని పరిచయం లేదు. కాని ఆ "తీయని సంగీత" ఫలానా అని తెలుసు. అదిగో ఆ అమ్మాయే రామొ కృష్ణా అని లహరీ చూపించగానే నాకేదో తీయని బాధ కలిగింది.
    గొప్ప చిత్రకారుడు చిత్రించిన పటంలోంచి చిరునవ్వులతో దిగివచ్చిన రసపుత్ర రమణి. మొగల్ సుందరిలా వుంది రామొ కృష్ణో.
    కాని ఆ రెండో అమ్మాయెవరు? ఎక్కడో చూసేను! ఎక్కడ?

                                    14

    పూజ రోజులు గడిచిపోయిన తరవాత చిట్టగాంగు తిరిగి యథాప్రకారం తయారైంది.
    తూర్పు రంగంలో యుద్ధం మరీ జోరందుకుంది. ముందుకి చొచ్చుకొచ్చిన జపాన్ సైన్యాన్ని మిత్రమండలి బలాలు వెనక్కి నెట్టుకెడుతున్నాయి కొన్ని చోట్ల వాళ్ళు, కొన్నిచోట్ల వీళ్ళు ముందడుగు వేస్తున్నారు. ఈ తోపు లాటలో మిత్ర మండలి సైనిక దళాలు కొన్ని బర్మా కీ కారణ్యాల్లో ముందు వెనక కూడా శత్రు సైన్యాలలో చిక్కు పడి పోయేయి వాళ్ళకి ఆయుధాలు లేవు. కనీసం రేషన్లయినా లేకపోతే శత్రువుల వల్ల కాకపోయినా, ఆకలివల్ల మాడి చస్తారు.
    అక్కడ చెరువులున్నాయి. కాని చాలా చెరువుల్లో శత్రువులు విషం కలిపారు, అలిసి సొలిసిన ఆ నిర్భాగ్యులకి అక్కడా అక్కడా సిగరెట్లు, రేషన్లు పడి దొరికేవి. కాని ఆ సిగరెట్లు కాల్చినా, రేషన్లు తిన్నా, చావు తప్పదు. ఈ వుచ్చులో చిక్కుకున్న సైనికులందరూ పాపం కటకట లాడిపోయారు. అప్పుడే "ఎయిర్ సప్లై కోర్" తయారైంది. ఈ సిబ్బంది విమానాల మీద రేషను తీసుకెళ్ళి "చిక్కుపడిన సైనిక స్థావరాలు గుర్తుచూసుకుని గిరాటు వేస్తారు. కాని యిందులో యిబ్బంది వుంది. విమానం శత్రు శతఘ్నుల దెబ్బ తప్పించుకుని, గుర్తుకనిపెట్టి, అదను కనిపెట్టి, సాధ్యమైనంత కిందికి దిగి, రేషను పార్సెళ్ళు దిగ విడిచి, వెంటనే పై కెగసి దెబ్బలు తప్పించుకుంటూ తిరిగి రావాలి ఈ ప్రయత్నంలో అటు విమానాలు, యిటు రేషన్లు కూడా వృధా అవుతూండేవి.

                                     15

    రంగూన్ ట్రేడింగులో సేన్ నన్ను చాలా సార్లు వాళ్ళపల్లెకి రమ్మని ఆహ్వానించేడు. పల్లెపేరు "సీతాకుండి" కాని తీరిక లేక నేనే వెళ్ళలేదు. అక్కడవాళ్ళకి తోటలు, దొడ్లు చాలా వున్నాయి.
    "రావ్! ఇవాళ రాత్రి నేను సీతాకుండీ వెళుతున్నా. నువ్వుకూడా రాకూడదా? రేపు సాయంత్రం తిరిగి వచ్చేద్దాం..."
    "ఈసారి కాదు, రేపు నన్ను కొందరు మిలిట్రీ మిత్రులు విందుకి ఆహ్వానించేరు...
    సీతాకుండి ఎంతో చల్లని ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ గుట్టమీద "చంద్ర నాద్" దేవాలయం వుంది. నీలాటి వాడు చూడవలసిన విషయాలెన్నో వున్నాయి..."
    "మీకక్కడ చాలా సిబ్బంది వుందనుకుంటా.."
    "చాలా కాదు. ఒక మేనేజరున్నాడుమ్ కుటుంబంతో సహా. అతను మాకు దూరపు బంధువే. నమ్మకస్తుడు. తరుచు మానాన్నగారక్కడే వుంటున్నారు. మా పినతండ్రి కూతుర్ని కూడా ఈమధ్య అక్కడే పెట్టేం. ఆ అమ్మాయికి కాస్త మతి చలించింది, వాళ్ళకి కుటుంబ సంబంధమైన కొన్ని యిబ్బందులు కూడా వచ్చాయి. దానా దీనా పట్నవాసం కన్నా ఆ చల్లటి పల్లెటూరే బాగుంటుందనిపించింది. ఆపిల్ల నాకు అక్క అవుతుంది. కాని నాకంటే కొన్ని నెలలే పెద్ద..."
    "అసలు వాళ్ళిక్కడే వుండేవారా?"
    "ఉహు. కొమిల్లాలో, మాసిన తండ్రి ఈమధ్యేపోయేడు.
    యూనిటుకి తిరిగొస్తుంటే లెక్కలేనన్ని యేవో ఆలోచనలు సముద్ర కెరటాల్లా లేచేయి,

                                                           16

    కొన్నాళ్ళ తరవాత నాకు "అపెండి సైటిసు" జబ్బు చేసింది. మొదట్లో అశ్రద్ధ చెయ్యటంవల్ల అది త్వరగా ముదిరిపోయింది. నేను ఆస్పత్రిలో చేరా. చిట్ట గాంగులొ "అడ్వాన్సుబేసు ఆస్పత్రి" వుంది. అక్కడికి రోజూ క్షతగాత్రులు యుద్ద రంగం నించి వస్తున్నారు. వాళ్ళుగాక అత్యవసరమైన కేసులెన్నో వస్తున్నాయి, నాక్కూడా శస్త్ర చికిత్స చెయ్యాలి. కాని నాది మామూలు కేసు. అంచేత నన్ను ఢాకాలో బేస్ ఆస్పత్రికి బదలాయించేరు.
    నేను ప్రయాణం చేసిన అంబ్యులెస్సు రైలు చాలా సదుపాయంగా వుంది, అందులో రోగు లందర్నీ అతి జాగ్రత్తగా చూస్తారు. ఆ రైలు ప్రయాణానికి ఎక్కడా, ఏ పరిస్థితుల్లోనూ అంతరాయం కలక్కూడదు. అన్ని రైళ్ళూ దానికి తోవయిచ్చేయ్య వలసిందే.
    రైల్లో ప్రవేశించగానే డాక్టరూ, మేట్రస్ వచ్చి ప్రతి కేసూ చూసి రోగం రోగి పరిస్థితి తెలుసుకుంటారు, ప్రమాద స్థితిలోవున్న కేసుల్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తారు. ఆ రైల్లో మెడికల్ నర్సింగు సిబ్బంది అంతా తెల్లవాళ్ళు, ఆంగ్లో ఇండియన్లే వున్నారు.
    ఆ రైల్లో, ఆస్పత్రిలో వున్న అన్ని సదుపాయాలూ వున్నాయి. గ్రామఫోను, సంగీతం, లైబ్రరీ సదుపాయం కూడా వున్నాయి. కాఫీ, టీ, కొకో, ఓవల్టిన్- ఏదో ఒకటి గంట గంటకీ తెచ్చి యిస్తారు! చేతులకి దెబ్బలు తగిలి కట్లతో వున్న రోగుల ప్రక్క నర్సులు నిలబడి వాళ్ళ చేత సిగరెట్లు కాల్పిస్తారు.
    మేట్రన్ సుమారు యాభై యేళ్ళ దొరసాని. తెల్లటి డ్రస్సులో తెల్లగా గోవులా వుంటుంది. రోగుల్ని చిరునవ్వుతో తల్లిలా సమీపిస్తుంది. అతి మృదువుగా మాట్లాడుతుంది. ఆమె నా దగ్గిరికి రాగానే లేచి కూచోబోయాడు.
    "ఒద్దు దయచేసి అలా పడుకో! నీచేత నిమ్మళంగా ఈపాలు తాగిస్తా..." చిరునవ్వుతో అంది.
    "ఫరవాలేదు సిస్టర్. నాదంత సీరియస్ కేసు కాదు. అపెండిసైటిస్ ఆపరేషనుకి వెళ్తున్నా....అని నే కూచున్న.
    "అయితే యిది తాగు..."
    "క్షమించు సిస్టర్, నాకు పాలు సయించవు"
    "నాకు తెలుసు. ఇవి తాజాపాలు కావు అయినా యివి మంచిపాలు! చూడు నీకు రొట్టె, పాలే ఆహారం...."
    "క్షమించు నేను పలు తాగలేను"
    "పోనీ ఓవల్ టిన్ తాగుతావా?"
    "సరే ఓవల్ టిన్"
    ఓవల్ టిన్ తాగా, ఆవిడ నా జబ్బు గురించి ఉద్యోగం గురించి. యింక కుటుంబం గురించి కనుక్కుంది.

 

                         
    "మరేం భయపడకు, అపెండి సైటిస్ సాధారణంగా యేమంత ప్రమాదకరం కాదు. ఆపరేషను చేస్తారు. నీకు కులాసాగా వుంటుంది..."
    "నాకేం భయంలేదు సిస్టర్..."
    ఆమె చిరునవ్వుతో లేచింది, నేను గుడ్ నైట్ చెప్పి సాగారా, రైలాగకుండా వెళ్ళి పోతూంది.
    ఢాకా ఆస్పత్రిలో చేరగానే నన్ను తిరిగి తనిఖీ చేశారు. ఆపరేషను చెయ్యడానికి A-1 వార్డులో చేర్చేరు. ఆ గదిలో రెండే మంచాలున్నాయి. గది చాలా పెద్దది. నిశ్శబ్దంగా వుంది.    
    రెండో మంచం మీద రోగికి అంతకి ముందే ఏదో ఆపరేషను అయిపోయింది. పైజమా చొక్కాలో పడుకున్నాడు.
    నన్ను మంచం దగ్గిర కొక ఆంగ్లో ఇండియన్ నర్సు తీసుకెళ్ళింది. ఆవిడ పేరు హెలెన్. తెల్లగా పొడూగ్గా వుంది. చాలా అందకత్తె, నిమ్మళంగా మాట్లాడుతుంది, మాట వినిపించడమే కష్టం. పెద్ద కళ్ళలో ఆకర్షణ శక్తి వుంది, ఆమె నా కేసు హిస్టరీ కాయితాలన్నీ గుచ్చెత్తి సూది దారంతో ఒకమూల కుట్టింది. సూది ఆమె చేతిలో సున్నితమైన పువ్వులా తోచింది. ఆమె వేళ్ళు పొడుగాటి తెల్లచిక్కుడు కాయల్లా వున్నాయి.
    ఆమె అక్కడ వుండగానే ఒక మగ మేజరు, ఆడ కెప్టెను వచ్చారు, నా కాయితాలు చూశారు. నన్ను తిరిగి తనిఖీచేశారు, మేజర్ బ్లిన్, కెప్టెన్ రూద్ యేదో గుసగుసలాడుకొన్నారు. ఇద్దరూ తెల్లవాళ్ళే.
    "నీకు రేపే ఆపరేషను. ఏం భయం లేదు." మేజర్ బ్లిన్.
    నేను చిరునవ్వు నవ్వాను, వాళ్ళు నర్సుకి చెప్పవలసినవన్నీ చెప్పి వెళ్ళిపోయారు. తరువాత మేట్రనొచ్చి నన్ను పలకరించి వెళ్ళి పోయింది, హెలెన్ అవతలికెళ్ళి పన్లు చక్కబెట్టు కొని తిరిగివచ్చి నా మంచం పక్క స్టూలు మీద కూచుంది. చీకటైంది, లైటు వెలిగేయి.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS