Previous Page Next Page 
అపస్వరం పేజి 15


    శామూమామయ్య అనటంతోనే, వాళ్ళు మగపెళ్ళివారింటి నుండి వచ్చారని గ్రహించి "రండి" అంటూ గదిలోకి తీసుకువెళ్ళింది.
    "కాఫీ టిఫిన్ తీసుకున్నారా?"
    "తీసుకున్నాం" అంది రంగలక్ష్మి.
    సరస్వతి ఒకే సమంగా మింగేసేటట్టు మీరను చూస్తూ కూర్చుంది. పావుగంటలో ఒక మాటయినా మాట్లాడకుండా విచిత్రమయిన వస్తువును చూసినట్టుగా మీరవేపు చూస్తూ ఉండిపోయి, తరువాత గబుక్కున లేచి "మే మిక వెడుతాం" అంది. మీర తలూపింది. పరిచయంలేని మనుష్యులతో అలా మవునంగా కూర్చోవటం మీరకు దు
ర్భరమనిపించి వాళ్ళు వెడతా మనగానే "సరే" అంది.
    బయటికి రాగానే సరస్వతి, మాత్సర్యంతో "అబ్బ శాము మావయ్య ఎలాంటి సురసుందరిని ఎన్నుకున్నాడో? అనుకున్నా ఛ! ఏం బాగా లేదు. మా వూళ్ళో ఇటువంటి వాళ్ళు కోకొల్లలు" అంది.
    "ఎందుకే అలా అంటావ్? నాకేమో బాగుందబ్బా ఎంత గంభీరం....."
    "చాలూరుకోవే గంభీరమట!........పొగరు మోత్తనం......తనే చదువుల సరస్వతి అని గర్వం. మనం వెళ్ళామా? ఒక మాటా పలుకూ ఏమయినా ఉందా? ముంగిలా మూతి ముడుచుకుని కూర్చుంది'
    "నీ కలాటివన్నీ లేవుగా? నువ్వెందుకు మాట్లాడించలేదుమరి?"
    సరస్వతికి కోపం ముంచుకొచ్చింది.
    "ఆమెగారికే అంత ఇదయితే నాకేంపట్టింది? నేనెందుకు పలుకరిస్తాను? పొట్టి జడా మెల్లకన్నూను...."
    "ఛ. ఛా. నువ్వు సరిగ్గా చూడలేదయితే? పొట్టయితే మాత్రమేం? ఉంగరాలజుత్తు లావుగా అందంగా వుంది. ఇహ కళ్ళు.....అలాంటి కళ్ళు నూటికి ఒక్కరికుండవు."
    తనన్న దానికంతా రంగలక్ష్మి ఎదురుచెప్పటంతో సరస్వతి నోరు మూసుకుంది.
    మరుసటి రోజు ఉదయం తొమ్మిదింటికే ముహూర్తం. మీర తెల్లవారకుండానే వుండాలని దేవుడితో మొర పెట్టుకుంది.
    తెల్లవారింది. మంగళ వాద్యాలు మోగటం ప్రారంభమయ్యాయి. సుప్రభాతంలో మధురంగా ధ్వని చేస్తున్న వాద్యాలు అపస్వరంతో గోలపెడుతున్నట్టనిపించింది మీరకు.
    కనకాంబరం రంగు జరీ చీర కట్టుకుని గౌరి పూజకు కూర్చుంది మీర. మామిడి పిందెల జరీ అంచు మెరుస్తోంది. నీలపురాళ్ళ జూకాలు ఆమె ఎర్రటి బుగ్గలమీద నీలపు కాంతులను ప్రసరింపచేస్తున్నాయి. నుదిటిమీద కట్టిన బాసింగం, చెంపలకు రాసుకున్న పసుపు, ఆమె మొహానికో వింత అందాన్నిచ్చాయి. నవ వధువు మీర సౌందర్యం అపూర్వంగా ఉందా రోజు.
    పూజ చేస్తున్న మీర దగ్గరగా కూర్చుని సావిత్రమ్మగారు ఆభరణాల పెట్టితీసి ఆమెను అలంకరించసాగారు. శాము శ్రీమంతుడన్న సంగతి అందరికీ తెలిసినదే. అతను తన భార్యకు ఏమేం నగలు పెడతాడోనని ఆడవాళ్ళంతా చుట్టూ మూగారు.
    సావిత్రమ్మగారు చెవికి వజ్రపు దుద్దులువేసి చెంపసరాలు ధరింపచేశారు. చంద్రహారం, కాసుల పేరు. మామూలు రెండు పేర్ల గొలుసు, పధకం మెళ్ళో వేశారు. చేతికి సింహలలాటం, పాతకాలపు నాలుగు జతల గాజులు వేశారు. పమిట సర్ది మువ్వల వడ్డాణం పెట్టారు. ఒక్కొక్క నగే తీసి అలంకరిస్తున్నపుడు ఒక్క క్షణం ఆమె మనసులో అసూయ ప్రవేశించింది. తమ కూతురు సరసికి ఈ నగలు ధరించే భాగ్యం లేనందుకు. కాని వెంటనే 'ఆ వంశానికాంతా ఒక్కడే కొడుకు. దంపతులు నాలుగు కాలాలపాటు సుఖంగా ఉండనీ' అనుకున్నారు.
    "ఈ నగలన్నీ కొత్తగా చేయించినట్టు లేవే" అన్నారు ఆశ్చర్యంతో చూస్తున్న పద్ధక్క.
    "అవునమ్మా అన్నీ పాతవే వాళ్ళ అమ్మవి. సగం ఇంటిదగ్గరే వదిలేసి సగం మాత్రమే తెచ్చాడు.
    కమలమ్మగారు, "చూస్తేనే తెలుస్తోందిగా. అన్నీ పూర్వకాలపు నగలే. ఎంత డాబుగా ఉన్నాయో చూడండి. ఆ వడ్డాణ మొక్కటే ఎంత లేదన్నా ఒకటిన్నర శేరు బంగారం ఉంటుంది."
    చుట్టూ చేరిన అవివాహితలు అసూయతో చూస్తున్నారు.
    కాని మీరకు ఏమాత్రం ఆనందం కలుగలేదు. తను నిర్మించుకున్న భవ్య మయిన సుందరహర్మ్యం క్రిందికి కూలిపోవటాన్ని తలచుకొని బాధగా మూలుగుతోంది ఆమె మనసు.
    "నేనూ చదవాల్సింది. గోపన్నయ్యలాగా డాక్టరవాల్సింది. స్వతంత్రంగా ఉండాల్సింది" అని మనసు క్షోభ పెడుతోంది.
    కాని అంతా మించిపోయింది.
    వధూవరులు పీటలమీద కూర్చున్నారు. పురోహితుడు, మంత్రాలు వల్లిస్తూ వధువు చేరి లోని పేలాలను హోమంలో వేయిస్తున్నారు. పొగతోనో ఏమో మీర కళ్ళు ఎర్రబడ్డాయి.
    పెళ్ళికి వచ్చిన వారంతా గుంపులుగా చేరితమలో తాము మాట్లాడుకొంటున్నారు."మీరేమయినా చెప్పండి లక్ష్మమ్మగారూ పిల్లమొహం చూస్తే పెళ్ళి ఇష్టమున్నట్టు లేదు"
    "అలాగెందుకనుకోవాలి? శామూ మీరకన్నా దేన్లో తక్కువో చెప్పండి. రంగులో నంటారా, మీరకన్నా ఎర్రగానే ఉన్నాడు. శామును చేపట్టడానికి పుణ్యం చేసుకుంది మీర. చదువులేదనీ మీర కాస్త బెంగ పెట్టుకుందేమోకాని చదువులు కట్టుకుని ఏం చేసుకుంటాం? మా అబ్బాయి ఎం.ఏ. పాసయి ఆరునెల్లయిందా. ఇంకా ఉద్యోగం దొరకలా....."
    ఈ సంభాషణనంతా ఆలకిస్తున్న ఇంకొకామె,
    "చదువులేకపోతే పోయింది. డబ్బన్నా ఉందా?"
    "డబ్బుకేం కావలసినంత ఉంది. రాణిలా ఉండొచ్చు"
    "ఎన్ని చీరలు పెట్టారు?"
    "ఆరు అన్నీ ధర్మావరపు పట్టులే."
    "పుట్టింటివాళ్ళేం పెట్టారు?"
    "వాళ్ళేం పెడుతారు పాపం! పిల్లకు తల్లి లేదు, తండ్రి లేడు. అంతా పెదనాన్నే పెంచి పెద్ద చేశారు. కాలేజి చదువు చదివించారు. అంతకన్నా ఏం చేస్తారు?"
    "పోనీలే పిల్ల ఎక్కడున్నా సుఖంగా ఉండనీ" అని ఆశీర్వ్దదించారు ఓ పండు ముత్తైదువ.
    పొగ ఎక్కువయినందువల్లనో ఏమిటో మీర కళ్ళల్లోనుండి నీరు ప్రవహించ నారంభించింది. లోపలే కేంద్రీకరించిన దుఃఖం కూడా దాంతో బాటే బయటికి రాసాగింది. పసుపు రాసిన ఆమె బుగ్గలు కన్నీటితో తడిసిపోయాయి.
    "పాపం తల్లి గుర్తుకొచ్చుంటుంది" అని కొంత మంది జాలిపడ్డారు. మీర కట్టుకున్న కొత్త పట్టుచీర కొంగంతా కన్నీటితో తడిసి ముద్దయింది. తల్లో పూలు సద్దటానికి వంగిన కమలమ్మగారితో,
    "పెద్ధమ్మా పొగగాఉంది. ఓ జేబురుమాలు తెచ్చిపెట్టు" అంది మీర. కాని కమలమ్మగారు పనుల తొందరలో ఆ సంగతే మర్చిపోయారు. శాము రెండు నిముషాలు ఆగి. ఆమె రాకపోవటంతో తన జేబురుమాలు మీర కిచ్చాడు. చుట్టూవున్న వారంతా నవ్వారు.
    "ఏవిట్రోయ్. అప్పుడే సేవా కార్యక్రమం ప్రారంభించావ్" అని గేలి చేశాడో స్నేహితుడు.
    పెళ్ళయిపోయింది. ఆ రోజు రాత్రే రెండో శాస్త్రం కూడ కానిచ్చి మీరను తనతోనే పంపించేయాలని మామగారికి విన్నవించుకున్నాడు శాము.
    అది విని తృళ్ళిపడింది మీర. కమలమ్మగారితో మొర పెట్టుకుంది.
    "ఈరోజువద్దు పెద్దమ్మా నాకు చాలా అలసటగా ఉంది. అదికాక, ఈ శాస్తాలన్నీ ఈ కాలంలో ఎవరు పాటిస్తారు?"
    కమలమ్మగారికి మీరమీద ఎప్పుడూ వల్ల మాలిన ప్రేమలేదు. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే చాలనుకునేవారు.
    "పెళ్ళయ్యాక నువ్వు వాళ్ళకు చెందినదానివి. ఎలా చెప్పితే అలా వినాలి మరి" అనేశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS