
10
మధ్యాహ్నం రెండు గంటలు కావస్తున్నా, ఎండ తీక్షణత మటుకు కొంచెం కూడా తగ్గలేదు. ఎండకు నెత్తీ, కాళ్ళూ బాగా చురచురమంటున్నాయి. భానుమూర్తి గదిలో కళ్ళు మూసుకుని పడుకొనున్నాడు. హాస్పిటల్ నుండి వచ్చి అప్పటికే రెండు వారాలు కావస్తుంది. గాయాలన్నీ మానిపోయినా బలహీనంగా ఉండడం చేత మరి కొన్నాళ్ళు సెలవు పొడిగించాడు.
మగతగా పడుకుని కళ్ళు మూసుకోనున్న భానుమూర్తి బయట నుండి కారు హరన్ విని పించగానే కొంచెం ఆశ్చర్యపడ్డాడు. గదిలో అడుగు పెట్టిన విజయను చూడగానే భానుమూర్తి ఆశ్చర్యానికి అంతే లేకపోయింది.
"నువ్వా, విజయా!" అన్నాడు ఆశ్చర్యంగా.
"ఏం? నేను రాకూడదేమిటి?" నవ్వుతూ అంది విజయ.
"ఊహు, రాకూడదు! అది సరే గానీ , అసలు హైదరాబాదు నుండి ఎప్పుడొచ్చావు? సుధీ నాతో నువ్వు వస్తున్నట్లు ఒక్కమాటా చెప్పలేదే?"
"ఎవ్వరికీ తెలీదు. అసలు ప్రయానమయ్యే వరకూ నాకే తెలీదు!"
"నిజం!"
"ఊ నీకు బాగులేదంటే చూసిపోదామని వచ్చాను!" తల తిప్పుతూ నవ్వి అంది విజయ.
"ఎంత దయ! థాంక్యూ! థాంక్యూ!" సంతోషంతో ప్రపుల్లమైన వదనంతో అన్నాడు భానుమూర్తి.
"నిన్ను చూసేందు కేం రాలేదు! హైదరాబాదు నీళ్ళు నాకు పట్టలేదు. అందుకే కొన్నాళ్ళ పాటు సెలవు పెట్టి వచ్చేశాను." అంది నిర్వికారంగా.
"నిన్ను చూడగానే అనుకున్నావు - నీ ఆరోగ్యం బాగాలేదని."
"ఆరోగ్యమే కాదు- మనశ్శాంతి గూడా లేదు."
భానుమూర్తి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యాన్నంతా కుమ్మరించాడు.
భానుమూర్తి అంతగా ఆశ్చర్యపోవడం విజయకు కాస్త చిరాకునే కలిగించింది.
"అంత ఆశ్చర్యపోతావేం? ఎవన్నానని?" అని అడిగేసింది కూడా.
"నీకు మనశ్శాంతి లేకపోవడమేమిటి?" అన్నాడు, మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గరికీ వెళ్ళి నిల్చుంటూ.
"నేను మనిషిని కానా? నీ కళ్ళ కేలా కనిపిస్తూన్నానేమిటి?" చురచురా భానుమూర్తి వేపు చూస్తూ అంది.
"మనిషిలాగే కనిపిస్తున్నావు! అయినా నీకు మనశ్శాంతి లేకుండా చేసే విషయాలు కూడా ఉన్నాయా? ఎవిటాబ్బా! అవి! " స్వగతంలా ప్రశ్నించుకొన్నాడు.
"ఏదో ఒకటి. తెలుసుకుని చేసే దేముంది?"
"ఏమీ చెయ్యలేనని నీవెలా చెప్పగలవు? ఆత్మీయుల దగ్గర కూడా మనసులోని బాధను దాచుకుంటారా? అలా చేస్తే ఏమవుతుంది? జీవితం దుర్భరం కాదూ?' అనునయంగా అన్నాడు.
"అత్మీయులా? అలాంటి వాళ్ళు నాకెవరూ లేరే?" నిందా, నిష్టూరాలూ మేళవించిన కంఠంతో అంది.
భానుమూర్తి కళ్ళలో బాధసుడులు గిర్రున తిరిగాయి. విజయ పట్ల కలిగిన జాలి, సానుభూతులతో హృదయం పొంగి పొరలింది.
'అలాంటి మాటలనకు, విజయా! అత్తయ్యే ఆ మాట వింటే ఎంత బాధ పడుతుందో కొంచెమైనా ఊహించగలిగావా? సుధీర అయితే ఈ పాటికి కన్నీళ్లు పెట్టుకునేది. నా విషయం..... నేను నీకే కాదు, మీ ఇంట్లో అందరికీ అత్మీయుడ్నే , బంధువునూ అనుకొంటున్నాను. ఒక వేళ నువ్వు నన్ను ఆ దృష్టితో చూడ్డం లేదేమో? నువ్వెలా అనుకున్నా సరే , నువ్వే మాత్రం గూడా బాధపడ్డం సహించలేని విషయం.' కిటికీ లో నుండి దూరంగా చూస్తూ నిశ్చల కంఠంతో అన్నాడు భానుమూర్తి.
విజయ మౌనంగా కూర్చుంది.
"మేము ఇంతమందిమి ఉండగా నీకు ఆత్మీయులే లేరని బాధపడ్డం పొరపాటు . మా అందరి ఆశలూ నీమీదే పెట్టుకున్నాము. నీ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ప్రకశించాలనీ, సుఖ సంతోషాలతో నువ్వు చిరకాలం వర్ధిల్లాలనీ కోరుకునే వాళ్ళలో నేనొకడ్ని. కానీ హైదరాబాదు లో నీ మనశ్శాంతికే భంగం కలిగించిన విషయమేమిటో నాకర్ధం కావడం లేదు. విజ్ఞానమూ, వివేకమూ, యుక్తా యుక్తా జ్ఞానమూ గల నువ్వు సామాన్య స్త్రీలా ప్రవర్తించి అశాంతిని కొని తెచ్చుకోవని నాకు బాగా తెలుసు." భానుమూర్తి ఆగి విజయ వేపు చూశాడు.
"ఊ?' విజయ తలత్రిప్పి ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఇదేదో అసాధారణ విషయమే కావచ్చు?'
"అవును."
కొన్ని లిప్త కాలం నిశ్శబ్దంగా గడిచిపోయింది. రంగు రంగుల ప్లాష్ లైట్లు ఒకటి తర్వాత ఒకటి వెలిగినట్లు భానుమూర్తి ముఖంలో రకారకాల భావాల ఫ్లాష్ లైట్లు వరుసగా వెలిగి ఆరిపోయాయి.
"విజయా!" కిటికీ దగ్గరి నుండి విజయ దగ్గరగా వచ్చి పిలిచాడు.
విజయ ధైర్యంగా భానుమూర్తి ముఖంలోకి చూసింది.
"ఇది సంభవమా?"
"ఎందుక్కాకూడదు?" అంది కళ్ళు క్రిందికి దించి.
"పోనీలే! నాతొ నాన్న నీ మనసులోని విషయం చెప్పినందుకు సంతోషంగా ఉంది. నువ్వేం విచారించకు. నేను హైదరాబాదు వెళ్ళి అన్ని విషయాలూ సరిదిద్దుతాను."
"ఏం అక్కర్లేదు.' తీక్షణ కంఠంతో అంది.
'అదేవిటి, విజయా? నేను పరాయివాడ్నా?"
"నా విషయాలి నేను సరిదిద్దుకోగలనన్న నమ్మకముంది."
భానుమూర్తి ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ నిల్చున్నాడు. కాసేపయిన తర్వాత - "సరే! నీ యిష్టం! కానీ నీకోసం తన సర్వస్వాన్ని యివ్వగల స్నేహితుడూ, బంధువూ, ఆత్మీయుడూ యిక్కడున్నాడన్న విషయం ఏరోజూ మరిచిపోకు. వింటున్నావా, విజయా?' అన్నాడు నిశ్చల కంఠం'తో.
విజయ నవ్వుతూ - "విన్నాను . గుర్తు పెట్టుకుంటాను గూడా. మీనాక్షేది?' అంది.
"ఈరోజు ఆదివారం కదూ? విశాల దగ్గరకు చదువుకునేందుకు వెళ్ళింది. పిలవనా?"
"వస్తుందిలే" అంటూ మంచం మీదున్న పుస్తకం తీసి తిరగేస్తూ కూర్చుంది విజయ.
"విజయా?"
"ఏం?' పుస్తకంలో నుండి తలెత్తి అంది.
"నేనూ, మీనాక్షీ కూడా విశాల కేంతగానో ఋణపడి వున్నాం."
"ఎందుకేమిటి?"
"విశాల సంపర్కంతోనే కృశించిపోయిన మీనాక్షి జీవన లత తిరిగి చిగురిస్తుంది. జీవితంలో స్నేహాని కున్న స్థానం చాలా ముఖ్యమైంది. పువ్వును చేరిన దారం సువాసన పొందుతుంది. సజ్జన స్నేహం అలాంటిది. ఎప్పుడూ అది పరిమళమును వెదజల్లుతూనే వుంటుంది.' అన్నాడు చెమర్చిన కళ్ళతో.
"అయితే మీనాక్షి మారిందన్న మాట?"
"అవును , విజయా! జీవితంలో నేను సంతోషించవలసిన విషయం యింతకన్నా వేరొకటి లేదనుకుంటాను. ఒకనాడు మీనాక్షి నన్ను "అన్నయ్యా" అని పిలిచేందుక్కూడా యిష్టపడేది కాదు. నన్ను కేవలం పరాయి వాడిలాగే చూసింది. ఆరోజులు గతించి పోయినా తిరిగి అనుకుంటే హృదయాన్ని ఎంతగా కలచి వేస్తుందో ఎలా చెప్పను? మనం ప్రాణాలిచ్చే వాళ్ళు మనల్ని దూరం చేస్తుంటే ఎలా వుంటుందో - అది చెప్పడం నాకు చేత కాదు-" అన్నాడు, చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
'అవును , అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది" అంది విజయ మెల్లగా.
మీనాక్షి పుస్తకాలు చేత్తో పట్టుకుని వచ్చింది.
"విజయ వచ్చింది , మీనాక్షి " అన్నాడు భానుమూర్తి.
మీనాక్షి గది గుమ్మం లోకి వచ్చి "ఎప్పుడొచ్చావు?' అంటూ పరామర్శించింది.
"మధ్యాహ్నం."
"తగ్గిపోయావెం?"
"నాలుగు నెల్ల క్రితం గోపాలరావు చనిపోయి నప్పటికీ యిప్పటికీ ఎంతో మార్పు కనిపిస్తుంది విజయలో.
విజయ జవాబుగా నవ్వి ఊరుకుంది.
కాఫీ చేసి తెస్తానంటూ మీనాక్షి లోపలికి వెళ్ళింది.
"ఇంగ్లీషు మాటినీ ఏదో మంచిదుందట. వెళ్దాం వస్తావా?' అంది విజయ.
భానుమూర్తి ఓ క్షణం తటపటాయించి "ఊ పోదాం పద" అన్నాడు.
మీనాక్షి ని రమ్మంటే ఇంగ్లీషు సినిమా తన కర్ధం కాదు గనుక రానంది.
ఇద్దరూ కారులో వెళ్ళిపోయారు.
విజయా, భానుమూర్తి టికెట్లు తీసుకుని హల్లో అడుగు పెట్టేసరికి మాటీని మొదలు పెట్టేశారు.
మరేం మాట్లాడక యిద్దరూ పిక్చరు చూడసాగారు. అరగంట గడిచేసరికి ఉన్నట్టుండి కరెంటు పోయింది. ఫాన్ లు నిలిచిపోయి ఉక్కపోస్తుంటే గాలి కోసం తలుపులు తెరిచారు.మాట్లాడేందుకు మాటల్లేక యధాలాపంగా హాలంతా కలయ చూడసాగాడు భానుమూర్తి. భానుమూర్తి వాళ్ళూ కూర్చున్న వెనక వరసలో సుధీరా, చంద్రశేఖరం కూర్చోమన్నారు. చంద్రశేఖరం దూరంగా ఎటో చూస్తున్నాడు. సుధీర ఏదో అడుగుతుంది.
"సుధీర వచ్చింది" అన్నాడు విజయతో భానుమూర్తి.
విజయ వెనక్కు తిరిగి చూసి - "ఆ ప్రక్కనేవరో ?" అంది.
"చంద్రశేఖరమని మా ఆఫీసులో క్లర్కు."
"సుదీరకు తెలుసేమిటి?"
"తెలుసు"
అంతలోనే కరెంటు వచ్చింది. పిక్చరు మొదలు పెట్టారు. మాటీని వదిలేసరికి ఐదు గంటలయింది. జనం అట్టే లేకపోవడం చేత రద్దీ ఏమాత్రం లేదు. నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ బయల్దేరారు అందరూ. కారేక్కూతూ సుదీరతో శేఖరాన్ని, మరిద్దరమ్మాయిలను చూశాడు భానుమూర్తి.
అదే సమయానికి సుధీర కూడా భాను మూర్తిని , విజయనూ చూసింది.
స్టీరింగు ముందు కూర్చొనున్న విజయ సుధీరను కేకవేసి పిలిచింది.
సుధీర కారు దగ్గరికి వచ్చి ఎందుకన్నట్లు చూసింది.
"ఇంటికి రావా?"
"ఎందుకు రాను?"
"ఏమో! ఇంకా ఎన్ని పనులున్నాయో?" ఓరగా సుధీర ముఖంలోకి చూస్తూ అదోరకంగా అంది విజయ.
సుధీరకు ఒళ్ళు మండిపోయింది. ఏమనలేక మౌనంగా వెళ్ళి వెనక సీట్లో కూర్చుంది.
కారు నెమ్మదిగా, మెత్తగా సిమెంటు రోడ్డు మీద జారిపోతుంది.
కారులో కూర్చొనున్న ముగ్గురి మనసుల్లోని ఆలోచనలూ ఒకే విషయాన్ని గురించే అయినా భిన్న రీతుల్లో సాగిపోతున్నాయి.
"శేఖరం నీకు తెలుసా?' అంది విజయ తలకొద్దిగా వెనక్కు తిప్పి.
"ఊ" సుధీర అంతకన్నా ఎక్కువ మరేం చెప్పలేకపోయింది.
విజయ ప్రక్కన కూర్చోనున్న భానుమూర్తి తనకేం పట్టనట్లు మౌనంగా ఉండిపోయాడు.
"మాటినీ కొస్తున్నట్లు మాట మాత్రమయినా చెప్పలేదే? వెంటే వస్తానని భయపడ్డావా?"
సుధీర మనసు చివుక్కుమంది. "భయం ఎందుకూ?' అంది.
"నీకే తెలియాలి!" అంది విజయ కొంచెం పెద్దగా నవ్వి.
సుధీర ముఖంలో కోప రేఖలు పొడచూపాయి. మెదడులో లెక్కలేనన్ని ఆలోచనలు గిర్రున తిరిగి చికాకు కలిగించాయి. ఆ చికాకులో నుండి ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. కారు భానుమూర్తి యింటి దగ్గర ఆగింది. భానుమూర్తితో పాటు సుధీర కూడా దిగింది.
"ఇక్కడ దిగావేం?' అంది విజయ.
"విశాలతో కొంచెం పనుంది" అంది ముఖం ప్రక్కకు త్రిప్పుకుని సుధీర.
కారు వెళ్ళిపోయింది.
ఇంటికి తాళం పెట్టి వుంది. రాఘవయ్య మాస్టర్నడిగి తాళం చెవి తెచ్చి తలుపు తీస్తూ , "విశాలా, మీనాక్షి బజారు కెళ్ళారుట" అన్నాడు భానుమూర్తి.
