Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 17

 

    సుధీర ఏమీ మాట్లాడలేదు. కుర్చీలో కూర్చుంది. భానుమూర్తి లోపలికి వెళ్ళి ఫ్లాస్కు లో ఉన్న కాఫీ రెండు గ్లాసుల్లో పోసి తనొక గ్లాసు తీసుకుని సుధీర ముందు ఇంకో గ్లాసు పెట్టాడు.
    "మాటీనీ ఎలా వుంది?' కాఫీ చప్పరిస్తూ అడిగాడు.
    "బాగానే వుంది. అసలు.... " సుధీర మధ్యలోనే ఆగిపోయింది.
    "ఏవిటి?' అన్నాడు సుదీర కెదురుగా కుర్చీలో కూర్చుంటూ.
    "నువ్వేమను కుంటున్నావో....నాకు తెలీదు గానీ....." అంటూ భానుమూర్తి కన్నుల్లోకి చూస్తూ ఆగిపోయింది.
    భానుమూర్తి కి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. మనసులోని విషయం టకీమని చెప్పే సుధీర ఈరోజు ఎందుకిలా సందేహిస్తుందో అర్ధంకాలేదు.
    "ఏవిటీ, సుధీ? ఎందుకలా సందేహిస్తున్నావు/ ఏవిటో చెప్పు?" అన్నాడు.
    "నేనూ, చంద్రశేఖరం కలిసి రాలేదు." చూపులు ప్రక్కకు త్రిప్పుకుంటూ అంది సుధీర.
    "ఆ విషయం నిన్ను నేను అడగలేదుగా?" చిన్నగా నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    "అడగలేదనుకో. అయినా చెప్పవలసిన బాధ్యత నామీద వుంది. ' అంది అలాగే నేల చూపులు చూస్తూ.
    "ఎందుకలా అనుకుంటున్నావు?"
    "నీకు తెలీదా?"
    "తెలుసనుకో. కానీ నువ్వు నన్నెందుకు అర్ధం చేసుకోలేకున్నావో తెలీడం లేదు. నువ్వూ, శేఖరం కలిసే వచ్చారో, లేక దియేటర్ లోనే కలుసుకున్నారో నాకనవసరం. అసలు నిన్ను సంజాయిషీ యిచ్చుకోమని నేను అడగలేదు కూడా" అన్నాడు ముఖం గంబీరంగా పెట్టి.
    "నిజమే...నిజమే. కానీ నేనే చెప్తున్నాను." అంది తలెత్తి వ్యధిత కంఠంతో.
    "నువ్వెందుకు చెప్తున్నావో నాకు తెలుసు. కానీ విజయ మాటలు మనసులోపెట్టుకోకు."
    "అసలు విజయ నన్నేమందని?' అప్రసన్నవదనంతో అంది సుధీర.
    భానుమూర్తి బాధగా నవ్వాడు.
    సుధీర టేబిలు మీద తలవాల్చి "నువ్వు వచ్చి అమ్మతో మాట్లాడితే బాగుంటుందేమో?'అంది.
    "ఏం మాట్లాడాలి?' అన్నాడు భానుమూర్తి ఆశ్చర్యంగా.
    "అదే.... మన పెళ్ళి విషయం." అస్పష్టంగా గొణిగింది సుధీర.
    "మన పెళ్ళి విషయమా? సుధీ , ఏవిటీ నువ్వంటున్నది?"
    "నేనంటున్నదేమిటో నీకు బాగానే అర్ధమౌతుంది! ఆ జరిగేదేమిటో త్వరగా జరిగిపోతే.." సుధీర గొంతు జీరపోయింది.
    భానుమూర్తి నిశ్చేష్టుడైపోయాడు. కొన్ని క్షణాల వరకూ నోటి మాటే రాలేదు. తర్వాత తన్ను తాను సంభాళించుకుని -- "సుధీ యిలా చూడు" అన్నాడు.
    సుధీర అయిష్టంగానే తలెత్తి చూసింది.
    "ఏడుస్తున్నావా?' అన్నాడు అశ్రుతప్తమైన  సుధీర కళ్ళల్లోకి చూస్తూ.
    సుధీర జవాబు చెప్పక కనురెప్పలు క్రిందకు వాల్చింది.
    "నేనో మాట చెప్తాను. వింటావా?' అన్నాడు.
    సుధీర యీసారీ ఏమీ మాట్లాడలేదు.
    "నువ్వు ఎవర్ని చూసి భయపడి పారిపోతున్నావో నాకు తెలుసు. ఈ రోజే యీ విషయాన్ని తెలుసుకున్నాననుకోకు. నేను హాస్పిటల్లో వున్నప్పుడే నాకీ విషయం తెలుసు. ఏరోజో ఒకరోజు నువ్వు తప్పకుండా ఈ విషయం నాతొ చెప్తావని గూడా తెలుసు. మనసులు చిత్రమైనవి. మన అధీనంలో వుండవు. నిజాన్ని ఒప్పుకునేందుకే ఎందుకలా భయపడతావు? సత్య మేనాటికైనా సత్యమే. నువ్వూ, నేనూ ఒప్పుకోనంత మాత్రాన అది అసత్యమౌతుందా? మనల్ని మనమే మోసగించుకొడం ఏం బాగుంది చెప్పు? అది ఆత్మవంచన అవుతుంది."
    "దయచేసి అలా మాట్లాడకు బావా!" దోసిట్లో ముఖం దాచుకుని అంది.
    "నీ మనసులోని విషయం నేను మాటల్లో పెట్టడం తప్పయిందా? హృదయం అద్దాల బీరువాలాంటిది.దాన్ని పదిలంగా కాపాడుకోవలసిన బాధ్యత నీది. కానీ నువ్వే రాళ్ళు విసిరితే పగిలిపోదూ?'
    సుధీర నిశ్శబ్దంగా రోదించసాగింది.
    "ఎంతో దైర్యంగా , చలాకీ గా వుండే సుధీరేనా యిలా ఏడుస్తుంది?' అనే ఆశ్చర్యం కలిగింది భానుమూర్తికి.
    "ఛా! ఛా! అలా ఎవరయినా ఏడుస్తారా? లేచి ముఖం కడుక్కో. మీనాక్షి వచ్చిందంటే ఎన్నో అపార్ధాలు చేసుకోగలదు."
    సుధీర పెరట్లో కెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది.
    భానుమూర్తి కాసేపు అలోచించి - 'అయితే అత్తయ్యతో చెప్పనా?' అన్నాడు.
    "నిజం చెప్పు. నువ్వేం బాధ పడ్డం లేదు గదా?" అంది సూటిగా భానుమూర్తి కళ్ళలోకి చూస్తూ.
    "నా బాధల్లా ఒక్కటే. నన్ను నువ్వర్ధం చేసుకోలేదే అని. ఆరోజు అత్తయ్య ఉన్నట్టుండి మనల్నిద్దర్నీ పిలిచి ' మీ యిద్దరికీ పెళ్ళి చేస్తా' నంటే యిద్దరం సరేనంటూ తల ఊపాము. మనసులో మనిద్దరికీ యిష్టం లేదు.  ఆ విషయం నాకు బాగా తెలుసు.అసలే పుట్టెడు దుఃఖంలో వున్న అత్తయ్యను మరింత బాధించడం నాకిష్టం లేకపోయింది. కానీ నువ్వెందుకొప్పుకున్నావో నాకర్ధం కాదు. బహుశా అదే కారణం కావచ్చు. అనాలోచితంగా నువ్వు చెప్పిన మాటను పట్టుకుని వేళ్ళాడేటంతటి సంకుచితత్వం నాలో లేదు. అసలు నిన్ను చూస్తె నాకొక ఆత్మీయురాలైన స్నేహితురాల్ని చూసినట్లే అనిపిస్తుంది. ఇంకా బాగా ఆలోచిస్తే నువ్వొకటి, మీనాక్షీ ఒకటీ కాదేమో అనిపిస్తుంది. నా మాట మీద నీకు నమ్మకం లేకుంటే ....ఏదీ నీ చెయ్యిలా యివ్వు" అంటూ సుధీర చేతిని తన చేతిలోకి తీసుకుని, "మనస్పూర్తిగా చెప్తున్నాను. నేనేం బాధపడ్డం లేదు.సరేనా?' అన్నాడు.
    అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన మీనాక్షి, విశాల ఓ క్షణం తటపటాయించారు. మీనాక్షి పొడిదగ్గు దగ్గింది.
    భానుమూర్తి గుమ్మం వేపు చూసి సుధీర చేతిని వదిలేశాడు.
    మీనాక్షి లోపలికి వెళ్ళిపోయింది. విశాల అలాగే నిల్చుంది.
    "కూర్చో విశాలా!" అన్నాడు భానుమూర్తి.
    విశాల సుధీర ప్రక్కనే కూర్చుంటూ - "ఏవిటలా వున్నావు?' అంది.
    "బాగానే వున్నాను. ఈరోజు ఆదివారం కదా, బజారేమిటి?"
    "మీనాక్షి ఏవో కొనాలంటే.. రెండు కొట్లే వున్నాయి. అమ్మకు ఒంట్లో బాగాలేదు. వంట చెయ్యాలి , వెళ్తాను" అంటూ విశాల వెళ్ళిపోయింది.
    "నేనూ, వెళ్తాను, బావా! ఇప్పుడిప్పుడే యీ విషయం ఎవ్వరికీ చెప్పకు. అమ్మకు తెలిసిందంటే...."
    "చెప్పన్లే. రిక్షా పిలవనా?"
    "వద్దు. అలా వెళ్ళి ఎక్కుటాలే" అంటూ వెళ్ళిపోయింది సుధీర.
    భానుమూర్తి హృదయం తేలిగ్గా, హాయిగా ఎగురుతూ , రమణీయమైన వినూత్న లోకాలకు వెళ్ళిపోయింది. ఎనిమిది గంటలకు మీనాక్షి భోజనానికి పిలిచే వరకూ స్వీయనిర్మితమైన ఆ సుందర సీనులోనే విహరిస్తూ  ఉండిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS