Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 15


    "మీ అమ్మగారి ఆరోగ్యం?"
    "అసలు జబ్బు లేందే?"
    "మరి అంత అర్జెంటుగా ఎందుకురమ్మన్నట్టు?"
    "ఏదో పెళ్ళి సంబంధం మాట్లాడుకోవాలి రమ్మని ఉత్తరం రాశారు యింతకు ముందు. నేను రానని రాశాను. అందుకీ ఉపాయం పన్నారు."
    సుధీర చెంపకు చెయ్యి ఆన్చి మౌనంగా వింటుంది.
    "మరిప్పుడు పెళ్ళికూతుర్ని చూసే వచ్చావా?
    'ఊ..."
    "ఇంకేం? మాకు పప్పన్నం త్వరలో దొరుకుతుందన్న మాట!"
    "ఉహు...." తల అడ్డంగా తిప్పాడు చంద్రశేఖరం.
    "ఏం?"
    "వద్దన్నాను."
    "ఎందుకనీ? అమ్మాయి బాగులేదా?"
    "ఓ మోస్తరు. బొత్తుగా చదువుకోలేదు. అందులోనూ అమ్మ కట్నం తీసుకోమంటుంది. నా కిష్టం లేదు" తలవంచుకుని అన్నాడు చంద్ర శేఖరం.
    భానుమూర్తి, సుధీరా కొంచెం ఆశ్చర్యంగానే చూశారు చంద్రశేఖరం వేపు.
    "కట్నం తీసుకోకపోవడం ఉత్తమమైన ఆదర్శమే. కానీ ఒక్కోసారి పరిస్థితుల ఒత్తిడికి లొంగి పోవలసివస్తుంది." అన్నాడు భానుమూర్తి పరీక్షగా చంద్రశేఖరం ముఖంలోకి చూస్తూ.
    చంద్రశేఖరం తలెత్తి భానుమూర్తి ముఖం లోకి చూశాడు. అసాధారణమైన బాధా, అవేశమూ చంద్రశేఖరం ముఖంలో చూశాడు భానుమూర్తి.
    "పరిస్థితులు మనల్ని ఒత్తిడి చేయవచ్చు. ఆమాత్రం చేత వాటికి లొంగిపోవడం ధీరుల లక్షణమంటారా? కట్నం తీసుకోవడమంటే ఏవిటి? మనకు మనం అమ్ముడుపోవడం కాదూ? ఏ అమ్మాయి ఎక్కువ డబ్బు తెగలదో ఆమెను పెండ్లి చేసుకోవడం , హృదయానికి విరుద్దంగా ఉన్నాసరే ప్రేమించానని నటించడం, జీవితాంతం ఆమెతో అయిష్టంగానే కాపరం చేయడం - ఇదంతా వింటుంటేనే అసహ్యంగా లేదూ? ఇక అనుభవం లో కొస్తే ఎలా ఉంటుంది? నాకో రెడ్డి స్నేహితుడున్నాడు. అతని జీవితం నరకం లా ఉంటుంది." బాధగా అన్నాడు చంద్రశేఖరం.
    "ఎవరా స్నేహితుడు? ఏమిటా కధ?" బాధగా నవ్వుతూ అడిగాడు భానుమూర్తి.
    సుధీర అలాగే కదలకుండా కూర్చుంది.
    "ఫస్ట్ ఫామ్ నుండీ మేమిద్దరం స్నేహితులం. అతను తెలివి గలవాడు. అంటే ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు శ్రద్దగావినేవాడు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివేవాడు. ఓపిగ్గా పరీక్షల్లో రాసేవాడు. ప్రతి తరగతిలో ప్రతి సబ్జెక్టు లోనూ వాడు ఫస్ట్! ఇంటర్ లో యూనివర్శిటీ ఫస్టు. నేను మాములుగా పాసయ్యాను. వాడు ఇంజనీరింగ్ కెళ్ళాడు. నేను బి.ఏ లో చేరాను. తర్వాత గవర్నమెంటు స్కాలర్ షిప్ తో ఫారిన్ వెళ్ళాడు. వాళ్ళ ఊళ్ళో వాణ్ణి అల్లుణ్ణి చేసుకొనేందుకు పెద్ద పెద్ద రెడ్లంతా కాచుక్కూచున్నారు. వాళ్ళ నాన్న వాణ్ణి వరుల మార్కెట్ లో వేలం వేశాడు. పాట లక్ష రూపాయల వరకూ పెరిగింది. ఆయనకు తృప్తే లేదు! వాడి అమ్మకాన్ని గురించిన వేలం పాట ఆంధ్రదేశమంతా చాటించాడు! ఫారిన్ రిటర్న్ డ్ అంటే ఓ విధమైన గ్లామర్! సినిమా విడుదల అయిన మొదటి రోజు పావలా టిక్కెట్టు దొరకడం ఎంత కష్టమో , ఆ మార్కెట్ లోకి రావడమే అంత కష్టమైంది చాలా మందికి! చివరికో మారు మూలనున్న జమిందారు లాంటి రెడ్డి గారు రెండు లక్షలిస్తానంటూ ముందు కొచ్చాడు. వాళ్ళ నాన్న సంతోషానికి అంతమే లేదు. ఇద్దరూ పెళ్ళి పిల్లను చూశారు. అమ్మాయి నల్లగా వుంది. చదువుకోలేదు. కొంచెం మెల్లకన్ను గూడా. మెల్లకన్ను అదృష్టం అన్నాడు వాడి నాన్న! వాడు ఇంటర్ లో ఉండగా ప్రేమించిన అరుణ, ఈ రాజకుమారుడు ఒకరోజు వచ్చి తన్ను విమానం లో తీసికు వెళ్తాడని కలలు కంటూనే ఉంది! వాడితో అరుణ విషయం చెప్పాను. నవ్వాడు. ఆ నవ్వులోని అర్ధమేమిటో నాకు తెలీదు. డబ్బు మైకంలో పడిపోయాడు. రెండు లక్షలంటే సామాన్యమా? ఆ రెండు లక్షలతో తనేం చేయ్యబోయేది చెప్పాడు. అరుణ పడే బాధను గురించి ఆలోచిస్తూ నేను వచ్చేశాను. పెళ్ళయిన కొన్నాళ్ళ వరకూ వాడు ఉత్సాహంగానే ఉన్నాడు. రోల్స్ రయిన్ కార్లో జమ్మంటూ తిరగసాగాడు! ఓ పెద్ద బంగళా కట్టించాడు. రెంనేళ్ళ క్రితం నాక్కనిపించాడు. ముందున్న ఉత్సాహం లేదు. కారణమడిగాను. 'ఆవిడ తో ఇంకెన్నాళ్ళు కాపరం చెయ్యాలో తెలీడం లేదు" అన్నాడు విచారంగా.
    "బ్రతికినంత కాలం' అని చెప్పాను. బరువుగా నిట్టూర్చాడు.
    "పొరపాటు చేశాన్రా!" అన్నాడు. ఎందుకన్నాను."
    'జీవితంలో డబ్బు కున్న విలువేమిటి?" అని నన్నే ప్రశ్నించాడు.
    "నువ్వే చెప్పు" అన్నాను. "కవివి కదూ, నీ అభిప్రాయం చెప్పు' అన్నాడు. ' అనుభవించి తెలుసుకున్న వాడివి నువ్వు. నీ అభిప్రాయం చెప్తే నాకూ ఉపయోగంగా ఉంటుంది.' అన్నాను. 'ఒవిధమైన మత్తుతో కూడిన సుఖాన్నిస్తుంది. అంతే! మెదడూ, మనసూ ఆ మత్తులోపడి జోగుతున్నాయి.' అన్నాడు. 'ఫారిన్ వెళ్ళి చదువు కొచ్చావే, ఆమాత్రం జ్ఞానం ముందు లేదూ? జీవితంలో డబ్బుకున్న విలువ తెలుసుకోలేని వాడివి అంతోటి పెద్ద చదువు లేలా చదివావురా!" అన్నాను." చంద్రశేఖరం ఆగాడు.
    భానుమూర్తి, సుధీరా ఆసక్తితో వింటున్నారు.
    "ఊ-- తర్వాత?' అంది సుధీర.
    "తర్వాతేముంది? 'ఇదంతా ఈనాటి చదువుల మహిమ' అన్నాడు. నాకు బాగా కోపం వచ్చింది. నోర్మూసుకు పొమ్మన్నాను. వాడి మాటలే అంత! ఆరోజు రెండు లక్షలు చూసేసరికి కళ్ళు బైర్లు కమ్మాయి!ఈరోజు  మైకం వదులుతుంది!"
    ఆవేశంగా అన్నాడు చంద్రశేఖరం . ఆవేశం వల్ల ముఖం ఎర్రబడింది.
    "అయితే నువ్వు నచ్చిన పిల్లను చేసుకుని సుఖపడాలనుకున్నావన్న మాట!" స్నేహపూర్వకంగా నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    చంద్రశేఖరం సిగ్గుతో తలవంచుకున్నాడు. "అసలు మీకీ దెబ్బలేలా తగిలాయి సార్? ఎవ్వరికీ అపకారం చెయ్యడం మీ స్వభావం కాదే?" తలెత్తి కాసేపయిన తర్వాత అడిగాడు.
    "మనం అపకారం చేస్తేనే మనకు అపకారం లభిస్తుందా? ఉపకారానికి ప్రతిఫలంగా అపకారం చేసేవాళ్ళు ఈ లోకంలో లేరంటావా, శేఖరం?"
    "ఎందుకు లేరు?"
    "పాముకు , తేలుకూ మనమేం అపకారం చేస్తున్నాం? మానవుడి మీద ఎప్పుడూ పగ సాధిస్తూనే ఉంటాయి ఎందుకు?'
    "మనం శత్రువులం కనక. మన కళ్ళలో పడగానే చంపేస్తాం. ఆ శత్రుత్వం ఈ రోజుది కాదు.' నవ్వుతూ అన్నాడు శేఖరం.
    "పోనీ,అందులో ఒక ప్రయోజనమన్నా ఉంది. కానీ ఎలాంటి అపకారం చెయ్యలేని ఒక అసహయుడి మీద తమ బలాన్నంతా ఉపయోగించే అదమాధములు మానవులలో ఉన్నారు."
    "ఇక్కడమటుకు శత్రుత్వం లేదంటారా? మానవజాతికి సంబంధించిన వాళ్ళమైనా బలవంతుల  బలహీనుల మధ్య ప్రచ్చన్నంగా శత్రుత్వం ఉండనే ఉంది. కానీ నాగరికత అనే ముసుగులో అదిపైకి కనిపించక పోయినా మనసులో మటుకు ఉందని నేను నిస్సందేహంగా చెప్పగలను."
    'అవును, నీకోసారి చెప్పాను గుర్తుందా? సమితి ప్రెసిడెంటుకూ, నాకూ మనస్పర్ధలు కలిగాయని?"
    శేఖరం గుర్తుందన్నట్లుగా తల ఆడించాడు.
    "ఎందుకనుకున్నావు? అతని చుట్ట మొకడు ఓ పల్లెలో పనిచేస్తున్నాడు. హెడ్ మాస్టరూ , టీచరు అన్నీ అతనే. నేను రెండు సార్లు సర్ ఫైజ్ విజిట్స్ కు వెళ్ళినప్పుడు అతను స్కూల్లో లేనే లేడు. పిల్లలు అసలు లేరు. చుట్టు పక్కల వాళ్ళను వాకబు చేశాను. ఇష్టముంటే స్కూలు కొస్తాట్ట. లేకుంటే లేదట! పిల్లలోచ్చి కాసేపు కూర్చుని వెళ్ళి పోతారుట!'
    శేఖరం విస్తుపోయాడు.
    "ఉన్న విషయం నేను రిపోర్టు లో వ్రాయడం తప్పా?"
    "ఊ?"
    "ఆ రిపోర్టు నాచేతిలో పెట్టి వేరేరిపోర్టు వ్రాయమన్నాడు. నేను వ్రాయనన్నాను. ఈసారి ఇన్ స్పెక్షన్ కు మా ఊరేలా వస్తావో చూస్తానన్నాడా అబ్బాయి! బహుశా దాని ఫలితమే ఇది అయి ఉంటుంది." విచారంగా నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    చంద్రశేఖరం కనుల్లో కెంపులు తళుక్కు మన్నాయి.
    "నేటి యువకులు ఇంత అవేశపరులుగా  ఎందు కుంటున్నారో నాకర్ధం కాలేదు. విద్యా విధానంలో లోపమని చెప్పేందుకు మనస్కరించడం లేదు. ఏది మంచి, ఏది చెడు> ఏది న్యాయం? ఎదన్యాయం అనే ఆలోచనా శక్తి లేని ఆవేశం వాళ్ళ జీవితాలనే గాక ఇతరుల జీవితాలను గూడా దుఃఖ భాజనం చేస్తాయన్న విషయం వాళ్ళు పూర్తిగా విస్మరించారు."వ్యధిత కంఠంతో అన్నాడు భానుమూర్తి.
    'అది అక్షరాలా నిజం. న్యాయం మీద కాక అన్యాయం మీద ఆ ఆవేశం చూపితే ఎంత బాగుంటుంది. నా రూం మేటు ఒకడు బి.ఏ చదువుతున్నాడు. లెక్చరర్ మీద స్ట్రైక్ లేవనెత్తాడు. ఎందుకనుకున్నారు?"
    భానుమూర్తీ ,సుధీరా కుతూహలంగా చూశారు.
    "అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతానంటాడు వాడు. క్లాసులో ఉండందే అటెండెన్స్ ఎలా ఇవ్వను? అంటాడు అతను. 'నీ పాఠం వినడం నాకిష్టం లేదు' అన్నాడట. 'అయితే వెళ్ళు. అభ్యంతరం ఏం లేదు' అన్నాడతను. 'అటెండన్స్ ఇవ్వందే పోను' అని వీడూ, 'క్లాసు లో లేకుండా అటేండేన్సు ఇవ్వనని' అతనూ. దానితో ప్రారంభమైంది. దీన్లో న్యాయాన్యాయాలు విచారించే పాటి పరిజ్ఞానం అందరికీ ఉంది. కానీ చిత్ర మేమిటంటే అందరూ మావాడ్నే సపోర్టు చేశారు. అయన వారం రోజులుగా రావటం లేదట. అపాలజీ కోరుకుంటే క్లాసు కోస్తానని అన్నాడాయన. కానీ వీళ్ళనేదేమంటే ఆయనే వీళ్ళను క్షమాబిక్ష కోరుకోవాలట! బాగుంది కదూ?" కోపంతో అన్నాడు చంద్రశేఖరం.
    'అంత చదువులు చదువుకున్నా సభ్యంగా ప్రవర్తించడ కొందరికీ రాదు. అంత మలినం హృదయాల్లో ఎలా ఉంటుందో?' సుధీర ముఖం చిట్లించి అంది.
    "చదువుకూ, సంస్కారానికీ సంబంధం లేదు. కాస్త కష్టపడితే చదువు అందరికీ వస్తుంది. కానీ సంస్కారం అందరికీ లభ్యమయ్యే వస్తువు కాడు." సుధీర ముఖంలోకి చూసి అన్నాడు చంద్రశేఖరం.
    "ఆ విషయం నిజం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి సంపాయిస్తున్న ఈ చదువులు వీళ్ళను కేవలం కాగితం పూవుల్లా తయారు చేసేందుకే తోడ్పడుతున్నాయి"అన్నాడు భానుమూర్తి.
    మరి కాసేపు వుండి వెళ్ళిపోయాడు చంద్రశేఖరం.
    సుధీర ఆలోచిస్తూ కిటికీ లో నుండి దూరంగా చూస్తుంది.
    'అంత ఆలోచనేమిటో?" భానుమూర్తి కుతూహలంగా అడిగాడు.
    "ఏమీ లేదు." కిటికీ దగ్గరకి వెళ్ళి నిల్చుని అందిసుదీర.
    దూరంగా ఉన్న కొండలు ఎత్తుగా - హుందాగా - రమణీయంగా ఉన్నాయి. ఆకాశంలో అక్కడో టీ, అక్కడో టీ విహారం చేస్తున్న మబ్బు తునకలు కొన్ని కొండ శిఖరాలను తాకి ప్రేమగా ముద్దెట్టు కొంటున్నాయి. సూర్యుడు గబగబా పైకి ప్రాకుతున్నాడు. లానులో ఉన్న గడ్డి పరకలు చల్లని, మెత్తని గాలికి పరవశంతో మైమరచి విలాసంగా నాట్యం చేస్తున్నాయి. కిటికీ ప్రక్కగా ఉన్న మందార చెట్టు విరగబూసి, సగర్వంగా తృప్తిగా చూస్తుంది. తన మాతృత్వాన్ని తలుచుకొని గాబోలు లాను మధ్యలో ఉన్న పౌంటేను లో నుండి నీటి ధారా పైకి చిమ్మి తుంపర తుంపర్లుగా క్రిందపడుతుంది. సూర్యుని కాంతిలో నీటి తుంపర్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
    సుధీర తలత్రిప్పి భారంగా విశ్వసించింది.
    భానుమూర్తి ఉలిక్కిపడి చూశాడు .సుధీర మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
    భానుమూర్తి హృదయం గతుక్కుమంది. ఏదో అవ్యక్తమైన వేదన హృదయాన్ని కలచి వేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS