Previous Page Next Page 
అన్వేషి పేజి 15

 

    "ఇది కూడా మీఅభిప్రాయం కాదు."
    "అని ఎవరన్నారు?"
    "మీ మనస్తత్వం నాకు తెలుసు! ఒక రనక్కరలేదు. ఈనాడు మీ పిన్ని చేతులతో స్వయంగా వండి పంపిన భోజనాన్ని తిరస్కరించారు. అపర్ణ భవిష్యత్తు చూచాయగా తెలిసి కూడా ఆమె దూరాన్ని భరించగలుగుతున్నారు. వాళ్ళు వెళ్ళాక ఒక్కసారికి మాత్రమే అటు వెళ్ళారు. అదివరకు వాళ్ళ పై మీకు గల అభిమానం నెనెరగనిదా?"
    "నేను మారానంటారు. అది సునీల వల్ల అంటారు అవునా?"
    "గిరిధారి మాట్లాడలేదు.
    కృష్ణ తిరిగి ప్రారంభించాడు.
    "సరే! మీ మౌనమే అంగీకారం. నిజమే కావచ్చు. మార్పు సహజం. అయినా భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాల నొకరు మన్నించినందువల్ల మేలే గాని కీడు లేదు. అవతలి వారు అర్ధం చేసుకోలేక ఉలికితే నన్నేం చేయమంటారు? నేనెవరినీ వెళ్ళ,మనలేడు. నిజానికి సునీల వచ్చాకనే పిన్నీ, అపర్ణా నన్ను మభ్యపెట్టి ఎలా చదరంగ మాడుతున్నారో తెలిసి వచ్చింది. గ్రహించాక ఋజువులు వెతికాను. అవీదొరికాయి. సునీల నా కన్ని విధాలా నచ్చింది. ఆమె చాలా తెలివి కలది. మిగిలిన ఇద్దరాడవాళ్ళలా ఆమె నన్ను పావును చేసి చదరంగ మాడలేదు. నాతొ పోట్లాడి నన్ను మంచి మర్గాన పెట్టింది. ఆమె పట్ల గురి కుదిరింది నాకు. అది మిగిలిన వారి అసూయకు కారణమైంది. నేనేం చెయ్యను? తోట డబ్బు అపర్ణది. అమెది జాగ్రత్తగా కేటాయించి ఉంచాను. ఆమె పేరున 'డిపాజిట్' చేశాను. ఆమెకు చెప్పండి. అది ఆమె ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయవచ్చు!"

 

                             
    "నాకేమీ తోచకుండా ఉంది. మీలో మీకు ఒకరి మీద ఒకరికి అభిమానాలు తరుగలేదు. ఒకరి నుంచి ఒకరికి అంతకు మించి ఏం కావాలో తెలియకుండా ఉంది.''
    "ముగురాడువారు చేరిన సుగుణాకర పట్టపగలు చుక్కలు పోడుచున్ -- అన్నది వినలేదూ! అదే అసలు సంగతి! నేను పూర్తిగా తన వాడిని కావాలనుకోవటం సునీల తప్పు కాదు. ఏ ఆడదైనా అలాగే అనుకుంటుంది. ఎటొచ్చీ సునీల రాకతో పిన్నీఅపర్ణ ల అట కట్టు అయింది. వీళ్ళిద్దరినీ మించిన అధికురాలు. రాజుని బాహాటంగా కొంగున కట్టుకుంది."
    "మీరు చాలా ఎదిగిపోయారు."
    "ఒప్పుకుంటున్నాను. మీకూ, సునీలకూ నేనెంతో రుణపడి ఉన్నాను."
    "నేను చెసిం దేముంది లెండి!"
    "పిన్నీ, అపర్ణా ఎప్పుడు వచ్చినా నా కభ్యంతరం లేదు. నన్ను రట్టు చేయాలనే వాళ్ళ పంతమే సాగనివ్వండి!"
    "మీ భోజనం విషయంలో ఎంతో బాధ పడింది పిన్ని గారు."
    "ప్చ్!" అంటూ ఒక తెలివైన నిట్టూర్పుతో ఒక చిన్న పెదవి విరుపుతో కలిసి తేల్చేశాడు కృష్ణ!
    ఆ తరవాత వెళ్ళిపోయాడతను.


    
                                        23


    గిరిధారి స్నానం చేశాడు. మంగాలు ఆ దాపునే గడ్డి కోస్తున్నది. అతను తడి తువ్వాలు దులిపాడు. అది కరెంటు స్తంభానికి తగిలింది. 'లీక్' అయిందో ఏమో -- విసిరేసినట్లు పోల్ కంటుకుని పోయి కెవ్వున అరిచాడు. మంగాలు చూసింది. పూనకం పూనిన దానిలా, పొట్ల గొడ్డులా అమాంతం ముందుకు దూకి తన బలం కొద్దీ గిరిదారిని ఒక్క తోపు తోసింది. ఆ నెట్టుకు అతను పోయి బావిలో పడ్డాడు. మంగాలు ఊపు ఆపుకోలేక తను స్తంభాని కంటుకుపోయి వికృతంగా రెండు మార్లు అరిచింది.
    మోటారు కేమైందో టక్కున ఆగిపోయింది.
    అప్పుడే నీళ్ళకు వస్తున్న కస్తూరి దూరం నుంచే చూసి మంగాలు ఉనికితో కీడును శంకించి కేకలు వేసింది. క్షణాల్లో అంతా పోగయ్యారు. మంగాలు విగత శరీరాన్ని కట్టెతో ఇవతలికి లాగారు. బావిలో మునకలు వేసే గిరిధారిని చూసి ఇద్దరు నూతిలోకి దిగారు. అతన్ని పైకి తెచ్చారు. ప్రాణం ఉంది. మెయిన్ స్వేచ్ ఆఫ్ చేశారోకరు.
    అంతా ఏడెనిమిది నిమిషాల వ్యవధి లోపలే జరిగిపోయింది. డాక్టరు కోసం పరుగెత్తారు.
    గిరిధారిని అపర్ణ గదిలో మంచం వేయించి పడుకో బెట్టింది. అతనికి స్పృహ లేదు.
    విషయం విన్న డాక్టరు కరెంటు దిపార్టు మెంటు వారికీ, పోలీసులకూ ఫోన్ చేశాడు. ఆ తరవాత వచ్చిన వ్యక్తీ వెంట బయలుదేరాడు.
    తరవాత జరగవలసిన తతంగ మంతా జరిగింది.

 

                                 *    *    *    *


    తెలివి వచ్చిన గిరిధారి దూరంగా కోలాహలం విని బయటకు వచ్చాడు.
    మంగాలు ముత్తైదువు లాంచనాలతో కులపు వాళ్ళు వెనకా ముందూ నడవగా ఆమె త్యాగాన్ని అభినందించిన సుమారు రెండు వందల మంది జనం ఆమెకు జేజేలు కొడుతూ ఉండగా, పూలమాలలతో , పసుపు కుంకుమ లతో దేవతలా సాగిపోతుంది.
    గిరిధారి రెండు చేతులూ ఎత్తి తన ప్రాణదాతకు నమస్కరించాడు.
    తిరిగి చూసేసరికి కస్తూరి కళ్ళు తుడుచుకుంటుంది.
    "కస్తూరీ! అమ్మాయిగా రెం చేస్తున్నారు?"
    "ఇంట్లోనే ఉన్నాను" అంటూ బయటికి వచ్చింది అపర్ణ."
    "ఎలా ఉంది మీకు?" అని అడిగింది.
    "ఒళ్ళంతా ఇంకా తిమ్మిరి గా ఉంది."
    "అలాగే ఉంటుందని చెప్పారు డాక్టరు గారు. రేపటికి పూర్తిగా తగ్గుతుందట. నీరసంగా ఉందా?"
    "ఎన్నో లంకణాలు చేసినట్లుగా ఉంది."
    "పిన్ని హార్లిక్స్ కలుపుతుంది. తెస్తా నుండండి." అంటూ లోపలికి వెళ్ళి మరు నిమిషంలో పెద్ద గ్లాసుతో తిరిగి వచ్చింది.
    "ఇంత ఎక్కువా?"
    "మరేం ఫరవాలేదు. తాగండి!"
    అతను తాగేసి గ్లాసు కస్తూరి చేతి కందించాడు.
    "ఎటూ వెళ్ళకండి! అయిదు నిమిషాలలో మళ్ళీ వస్తాను నేను" అంటూ ఆమె లోనికి  వెళ్ళింది.
    "మంచం వరండాలో వెయ్యనా, అయ్యగారూ?" కస్తూరి అడిగింది.
    ఇప్పుడిప్పుడే గిరిధారికి 'షాక్' వివరం గుర్తు కోస్తున్నది.
    అతను గబగబా మేడ మీది కెళ్ళి మంగాలును తలుచుకుని దుఃఖించసాగాడు. నిండు చూలాలు మంగాలు తనకు పునర్జన్మ ఇచ్చిన మంగాలు. ఆమె తనకు మరో తల్లి. తనను కనకుండానే తల్లి అయింది తనకు.
    "ఇక్కడున్నారా? ఏం చేస్తున్నారు? ఏం పని ఇది! దేని కెవరూ కర్తలు కారు. మీరు బాధ పడకండి!" అపర్ణ టప్పుడు వచ్చిందో -- అతని దాపున కూర్చున్నది. "అన్నయ్య వచ్చి చూసి వెళ్ళాడు మిమ్మల్ని. మీరు స్పృహలో లేరు" అన్నది.
    "ఇప్పుడెన్ని గంటలైంది?"
    "అయిదు కావస్తూందనుకుంటాను."
    "నాకు షాక్ తగిలి ఎంత సేపైంది?"
    "మీకు షాక్ తగిలింది నిన్న. పోలీస్ పంచనామా పూర్తీ అయేసరికి రాత్రి పది గంటలైంది. ఈ వేళ ఉదయం కరెంటు వాళ్ళు వచ్చి అంతా సరి చేశారు."
    "నిన్నంతా నేను....."
    "ఇక్కడే ఉన్నారు. డాక్టరు ఊహించి చెప్పిన ప్రమాద లేమీ మీకు జరగనందుకు భగవంతునికి కృతజ్ఞులమై ఉండాలి మనం."
    "ఏం చెప్పారు డాక్టరు గారు?"
    "మీరు వెళ్ళి అడగండి!"
    గిరిధారికి తన గొంతు తనకే కొత్తగా ఉంది.ఎక్కడి నుంచో ఏదో పిలుపు వినిపిస్తున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉండి పిలుస్తున్న అపర్ణ పిలుపు వినిపించటం లేదు.
    "మీ మనసు వ్యాకులంగా ఉంది. వచ్చి పడుకోండి!" అంటున్నది అపర్ణ.
    గిరిధారి బలవంతాన తనను తాను నిలదొక్కుకుని సర్దుకుని కూర్చున్నాడు.
    "మీతో మాట్లాడాలి, అపర్ణా!"
    "నాతోనా? ఇప్పుడే మాట్లాడాలా?"
    "అవును. ఇప్పుడే మాట్లాడాలి. ఇన్నాళ్ళూ నేను నన్ను గురించి ఇక్కడెవరికీ ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు మీతో చెప్పవలసిన అవసరం కనిపిస్తోంది!'
    "ఎందుకని?"
    "ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు! మీకు తెలుసనీ నాకు తెలుసు! అడ్డు రాకుండా నా పూర్వ కధ జాగ్రత్తగా వినండి!"
    "చెప్పండి" అంది అపర్ణ.

 

                                       24


    చదువు పూర్తీ అయింది. రిజల్ట్స్ రాగానే ఉద్యోగం సంపాదించటం లో జీవితంలో సెటిల్ అయినట్లే. నేను పాసు కావటమే కాదు, నిస్సంశయంగా క్లాసు వస్తుందన్న అమితోత్సాహంతో బయలుదేరాను. మా నాన్న-- నాకు అమ్మ పోయిన దగ్గరి నుంచీ పెంపకం, చదువు బాధ్యతలు వహించిన నాన్న-- నన్ను కంటికి రెప్పలా చూచుకునే ఆయనను చూడాలని , సెలవులు ఆనందంగా గడపాలని ఇల్లు చేరిన నాకు స్వాగత మిచ్చిందొక పెళ్ళి పందిరి.
    నా ఆశ్చర్యాని కాంతులేదు. గేటు దగ్గిరే నిలబడి పోయాను. ఆ తరవాత మా ఇల్లు ఎవరికైనా పెళ్ళి చేసుకోవడానికిచ్చారేమో ననుకుని లోపలకు వచ్చాను-- అంటే-- ఆ పందిట్లోకి.
    జనార్దనం కక్కయ్య గారు-- ఆయన మా పోరుగింటాయన , చిన్ననాటి నుంచీ నాకలా పిలవటం అలవాటు-- అయన నన్ను గమనించి, "అరె, గిరీ! నువ్వా? బాగున్నావా , నాయనా? పరీక్ష లయ్యాయా? అయితే టెలిగ్రాం ఆలస్యంగా అందిందా? బండి లేటా?' అన్నారు.
    "బాగానే ఉన్నాను. పరీక్ష లయ్యాయి గాని, టెలిగ్రాం ఏవిటి, కక్కయ్యా! నాన్న ఏడీ!' అన్నాను కంగారుగా.
    "మీ నాన్న కేమోయ్! నిక్షేపంలా ఉన్నాడు. అయితే అసలు విషయం నీకు తెలియదన్న మాట!"
    "నువ్వు చెప్పరాదూ! నాప్రాణం తీయకపోతే?" నవ్వుతూనే విసుగ్గా అన్నాను.
    కక్కయ్య నా దగ్గరగా వచ్చి నెమ్మదిగా అన్నాడు. "మీ నాన్న పెళ్ళి చేసుకున్నాడు. కనిపించడం లేదూ? ఇదంతా ఆశోభయే!"
    "ఆ? నిజమా!"
    "అక్షరాలా."
    ఇంతలో లోకేశ్వరి కక్కి అటుగా వచ్చింది. "అమ్మయ్య! వచ్చావా నాయనా! ఇక నిశ్చింత. ప్రతి వాళ్ళూ నీ పెత్తనమేమిటమ్మా, ఈశ్వరమ్మా! అంటూ నా ప్రాణం తీశారనుకో! మీ నాన్నేమో సామానుల గది తాళాలు నాకిచ్చి 'జాగ్రత్త మరదలా . అంతా చూసుకో!" అని పెళ్ళి పీటల మీద కూర్చున్నాడు. ఎలా చావనింక? నిన్ను చూసేసరికి నా ప్రాణం వచ్చిందనుకో. అన్నట్లు ఇక్కడ నిలబడ్డావెం? లోని కెళ్ళు? మీ నాన్న కెంత పెళ్ళి కళ వచ్చిందో చూడు!" అన్నది. ఆమె నోరు తెరిస్తే అంతే ఇంక అవతల వాళ్ళు నోరు తెరిచే పని ఉండదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS