Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 15


    "స్టాపిట్ ఆపండి మీకెంత ధైర్యం నన్ను గురించి యిలా మాట్లాడడానికి ఆవేశంతో అన్నాను మాటలు తడబడ్డాయి. "మీరిలాగే యింక మాట్లాడితే ఐడోంట్ స్పేర్ యూ-." చాలా తీవ్రంగా అన్నాను.
    "ఏం ఉన్నమాట అంటే ఉలుకెక్కువని. ఏం నీవే అన్నావుగా బాయ్ ఫ్రెండ్స్ వున్నారని - ఏంచేస్తావేమిటి?"
    "అన్నాను....మాటలో నిజమెంతో, హాస్యం ఎంతో గ్రహించలేని మీలాంటి వారితో హాస్యం అడ్డం నాదే తప్పు- ఫ్రెండుకి - ప్రియుడికి తేడా తెలీని మీలాంటి వారితో అలా అనడం తప్పే."
    "ఓహూ.....హాస్యం అంటే నమ్మడానికి నేనేం తెలివి తక్కువ వాడిని కాను."
    "సరే. నేను రోజూ ఒక బాయ్ ఫ్రెండుతో తిరిగాను - లవ్ ఎఫైర్లు జరిపాను. అన్నీ తెల్సిన మీరు మరినన్నెందుకు చేసుకున్నారో...." తీక్షణంగా నిలేసి ప్రశ్నించాను.
    "ఏదో ఎర్రగా బుర్రగా వున్నావని మావాళ్ళూరికే చంపుతూంటే సరే అన్నాను." మళ్ళీ వక్రపు నవ్వు.
    "సరే నా అందం కావల్సి చేసుకున్నారు.....మరింత నా గుణం చూడకండి."
    "ఇదిగో.....యిన్నాళ్ళు ఏ వెధవ్వేషాలేసావో నాకు తెలియదు - కాని యిప్పుడింక నా భార్యవి పిచ్చివేషాలేస్తే మాత్రం ఊరుకోను తెలుసా. అందగత్తెనని విర్రవీగకుండా అందరి యిల్లాళ్ళ లాగా యింట్లో పడుండాలి. తెలుసా."
    "ఆ క్షణంలో నా మనోభావాలు చెప్పడానికి మాటలు చాలవు రాజేష్ గారూ.....మొదటిరాత్రి యిలా మాట్లాడిన భర్తని ఏ భార్య అయినా ప్రేమించి గౌరవించగలదో నాకు తెలియదుగానీ ఆ రోజున నేను ఆయన్ని ఎంత ద్వేషించానో నేను చెప్పలేను. నా కలలన్నీ కల్లలు అయిపోయాయని ఎంత మూగగా రోదించానో ఆ భగవంతుడికే తెలుసు! నా అందమే నాకు శత్రువు అయిపోయింది. రాజేష్ గారూ ఆ రాత్రే కాదు, ఈ మూడేళ్ళుగా ప్రతి రాత్రి నాకు కాళరాత్రే! ఏ అనుభూతులు, స్పందనలు లేకుండానే కట్టుకున్న భర్తని కాదనే వీలులేక వళ్ళప్పగించాను. నా మనసు మొదటిరాత్రే స్పందనలు మరిచి బండబారింది. ఇలాంటి సున్నితసమస్యని ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. నాభర్త యిలా మాట్లాడేవాడు, నన్నిలా అవమానించాడు, ఇలా మాటలతో హింసించాడు. యిలా నామీద అనుమానపడ్డాడు, అని ఎవరితోనూ, కన్నవాళ్ళకయినా చెప్పుకోలేని నా ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ నాకు నేనే దిగమింగుకుని కాపురానికి వెళ్ళాను. మొదటి రోజే అతని మొహాన్ని ఈడ్చిదన్ని గదిలోంచి పైకివెళ్ళి నలుగురికీ ఎందుకు చెప్పలేదా అని తర్వాత ఎన్నిసార్లు అనుకున్నానో.....ఎన్నిసార్లు అలా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందీ చెప్పలేను. ఈ మూడేళ్ళల్లో మొదటి రాత్రి అనుభవం మిగతా రాత్రుల అనుభవాల ముందు చాలా స్వల్పం.
    "కాపురానికి వెళ్ళాక గాని ఆయన పూర్తి నిజస్వరూపం తెలియలేదు. రాజేష్ గారూ ప్రతి సంఘటన, ప్రతిమాట, ప్రతిచర్య నామీద ఎంతటి ప్రభావాన్ని చూపాయో, నన్నెంతగా ఆయన పట్ల విముఖురాలిగా మార్చాయో చెప్పాలంటే రామాయణం, భారతం అంత అవుతుంది. యీ మూడేళ్ళుగా ప్రతి నిమిషం ఈ పెళ్ళెందుకు చేసుకున్నానా అని మనస్సు ఏడవని క్షణం లేదు! ఏ పాపం చేసి ఇలాంటి మూర్ఖుని పాల పడ్డానో అని వగచని రోజు లేదు! ఆయన మనిషి నిలువెల్లా విషం. ఆయన ప్రతి ఆలోచనా వక్రం! ప్రతిమాట వికృతం.....ఆయనకి అందరిలా సజావుగా ఆలోచించడం రాదు. ప్రతి చర్యకీ విపరీతార్ధాలు, ప్రతిమాటకీ అనుమానాలు తప్ప ఆయన కంటికి ఏదీ సవ్యంగా కనపడదు! అనుమానం అనే పెనుభూతం ఆయనకి తోడు, నీడ! నిల్చుంతే తప్పు, కూర్చుంటే తప్పు. అలంకరించుకుంటే అనుమానం, గుమ్మంలో నిల్చుంటే ఎవడికోసమో చూస్తున్నానని అనుమానం. సినిమాకి వెడితే పక్కవాడిని తగిలానో, చూచానో అనుమానం. పార్టీకి వెడితే పరాయి మగాడు పలకరిస్తే ఎక్కడ ప్రేమించేస్తానని అనుమానం. పార్టీలో నవ్వితే తప్పు, నవ్వకపోతే తప్పు, బాస్ పలకరించితే నవ్వకపోతే కోపం, నవ్వితే అనుమానం, బంధువులలో మామలూ, బావలూ వస్తే సరదాగా మాట్లాడితే వాళ్ళతో ఏదో సంబంధం వుండే వుంటుందని అనుమానం, కడుపొస్తే అది ఆయనవల్లో కాదోనని బాధ, అనుమానం, ఏ చిన్ననాటి స్నేహితులో తారసపడి పలకరిస్తే పాత ప్రియుడని అనుమానం, నే అందంగా వున్నందుకు ఏడుపు, అందంగా అలంకరించుకుంటే ఉక్రోషం, నలుగురూ నాచుట్టూ మూగి నన్ను ప్రశంసిస్తే ఉడుకు మోత్తనం, ఆయనకి రాజేష్ గారూ....
    "నా ఖర్మకొద్ది ఆయన పనిచేస్తున్నది పెద్ద కంపెనీ ఏమోతరచు పార్టీలుండేవి-పెద్ద పొజిషన్ లో వున్న ఆయనకి నన్ను వెంటపెట్టుకు వెళ్ళక తప్పేదికాదు. మిగిలిన అందరూ భార్యలతో వచ్చినప్పుడు ఈయన ఎన్నిసార్లని తీసికెళ్ళకుండా వెళ్ళగలరు! అంచేత పార్టీలకి నన్ను తీసుకెళ్ళడం తప్పని సరి అయ్యేది. వాళ్ళ మేనేజింగ్ డైరక్టరు, చైర్మన్ వగైరాలంతా నాతో చాలా బాగా మాట్లాడుతూ నా చుట్టూ చేరేవారు. పార్టీలో ఆయనని ఎవరూ పట్టించుకునేవారు కారు. "మిసెస్ రావు" అంటూ నన్ను పొగుడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ నా వెంట వెంట వుండేవారు. చిన్నప్పటి నించి అందంగా అలంకరించుకోవడం అలవాటు, అందులో పార్టీలంటే నాకు సరదా, ఈ ఢిల్లీలో లేడీస్ అందరూ చాలా ఆడంబరంగా తయారై వెళ్ళేటప్పుడు నేను సింపుల్ గా అలంకరించుకుంటే బాగుండదని నాకున్న మంచి మంచి చీరలన్నీ లేటెస్టు హైర్ స్టెయిల్స్, స్లీవ్ లెస్, లిప్ స్టిక్కులు వగైరాలతో తయారయి వెళ్ళేదాన్ని అందరి కళ్ళు నామీదే వుండేవని నాకు తెలిసి గర్వంగా ఫీలయ్యేదాన్ని కట్టుకున్న మొగుడి దగ్గిర లభించని మెప్పు పరాయివాళ్ళ కళ్ళల్లో చూసి తృప్తిపడేదాన్ని పార్టీలకి వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా వెళ్ళేదాన్నో, వచ్చాక అంత నరకం చూపించేవారాయన. "వాడితో ఎందుకు నవ్వావు" వీడితో ఎందుకు మాట్లాడావు", మా చైర్మన్ ముసలి పీనుగ నీకంత నచ్చాడా, వాడితో తెగనవ్వావు. "ఆ కపూర్ తో ఏమిటా గుసగుసలు-రాత్రికి రమ్మని పిలిచాడా.." ఆ పిలానీగాడు గ్లాసు అందిస్తే తీసుకోవడమేనా తాగనని చెప్పలేవూ.....అసలు నీకు ఆడ లక్షణాలెక్కడేడ్చాయి. మగాడితో సమంగా తాగి తందనాలు ఆడదామనుకుంటే చెంపలు పగలకొడతాను" అందగత్తెనని నీ అందం చూసి ఎర్రగా బుర్రగా వున్న వాళ్ళని వలలో వేసుకుందామనుకున్నట్లున్నావు. నీకో మొగుడు ఏడ్చాడని గుర్తుందా పాపం...." - ఇలా ఆ మాటలు ఎన్నని చెప్పను రాజేష్ గారూ- ఆయన కుళ్ళు, కసి అంతా నన్ను తిట్టి తీర్చుకునే వారు ప్రతివాళ్ళు. వాళ్ళ బాస్ లు "యూ ఆర్ సో లక్ష్మీ రావ్, టూ గెట్ సచ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ - అంటూ పొగిడితే ఆ తర్వాత తన కుళ్ళు, కసి అంతా నన్నుతిట్టి తీర్చుకునేవారు. "వెధవలు నీవు అందగత్తెవని చెప్పాలిగాబోలు- అంటే నేను అందంగా లేనని ఎత్తిపొడవడం నిన్ను కట్టుకోడం ఎంత అదృష్టమో వెధవలకీ యిలాంటి పెళ్ళాం వుంటే తెలిసేది." అనేవారు ఉక్రోషంగా పార్టీలో పలకరించిన వాళ్ళతో మాట్లాడకుండా ఎలా? అలా సోషల్ గా మూవ్ అయ్యేచోట ఏమగవాడో నా పక్కనవచ్చి కూర్చుంటే అది నా తప్పన్నట్టు యింటికొచ్చాక రాద్దాంతం చేసేవారు. నాకు డ్రింక్ అసలు యిష్టంలేదు. కాని అలాంటి పార్టీలలో చాలాసార్లు రిఫ్యూజ్ చేసినా ఏ చైర్మనో స్వయంగా గ్లాసుతీసుకొచ్చి బలవంతంచేస్తే మరీ మొండికెత్తడం అసహ్యంగా వుంటుందని గ్లాసు తీసుకుని అలా తాగుతున్నట్లు నటించేదాన్ని దానికి ఒక గొడవ మొదట్లో పార్టీలంటే చాలా సరదాగా ఉత్సాహంగా అన్పించేది- ఈయనిలాంటి మనిషితో సంసారం మధ్య ఔటింగ్ ఒక్కటే కాస్త ఓదార్పు! కాని ఆపార్టీ తరువాత మాటలతో ఆయనచేసే చిత్రహింస భరించలేక నాలుగైదుసార్ల తరువాత పార్టీలకిరానని మొండికేసి వెళ్ళటం మానేశాను. ఆ పార్టీలలో అందరూ  అడిగారు గాబోలు, వాళ్ళ బాస్ రెండుసార్లుచూసి డైరెక్టుగా నాకు ఫోను చేశాడు రావడంలేదేం అంటూ "మీరు లేందేపార్టీకి అందమేలేదు." అంటూ వస్తాననే వరకు వదలలేదు. బాస్ గట్టిగా చెప్పాడు అని కాబోలు ఆయన పార్టీకి రమ్మన్నారు. "నేను చచ్చినారాను మీ మాటలు భరించేశక్తి నాకులేదు." అంటూ తెగేసి చెప్పాను. అవతల వాళ్ళ వత్తిడి, నేను యిలా రాననడంతో ఆయనకి తిక్కరేగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS