"నిజం అనిపించటం యేమిటి? నిజమే అయివుంటుంది" అన్నాను.
"నేనూ అలాగే అనుకుంటాను నేను చిన్నతనంనించి అలవాటు చేసుకున్న హేతుబద్ధమయిన ఆలోచనలు యీ వూహని అబద్దం అని నిరూపించలేకపోతున్నాయి" ఆమె శూన్యంలోకి చూస్తూ అంది.
"ఇక్కడ మీకు విసుగ్గా వుందికదూ! రండి నా గదికి పోదాం" అని పిల్చాను.
ఆమె యెటువంటి అభ్యంతరాలు చెప్పకుండా లేచి నా వెంట వచ్చింది. డాక్టర్ వైకుంఠంగారిని పరిచయం చేశాను. ఆమె భారతీయ శైలిలో చేతులు ముకుళించి చక్కగా నమస్కారం చేసింది.
డాక్టర్ వైకుంఠం తక్షణమే తన ట్రీట్ మెంట్ ప్ర్రారంభించాడు.
సీతాదేవి వ్రాసిన వుత్తరంకూడా చదివి వుండటాన ఆయనకు మిస్ మార్లిన్ కధ అంతా తెలిసింది. మార్లిన్ ని నా కుర్చీలో కూర్చోమని నేను వైకుంఠంగారి ప్రక్కన కూర్చున్నాను. వైకుంఠం ట్రీట్ మెంటు యివ్వవచ్చాడని ఆమెకి తెలియదు.
"మీరు యెక్కడనించి వచ్చారు?" డాక్టరు అడిగాడు.
"ఫ్రాన్స్ నించి."
"ఏ పనిమీద వచ్చారు?"
"చూచేందుకు-" మిస్ మార్లిన్ సమాధానం.
"బొబ్బిలి చూచేందుకు వచ్చారా?"
"ఇది బొబ్బిలి అని తెలియదు. దిగిపోయాను అంతే!"
"యీ యింటికి యెలా వచ్చారు?"
"ఏమో నేను వివరించి చెప్పలేను."
"బొబ్బిలి అంతా చూచారా? పాతకోటా అవీ!"
"ఇంకా చూడలేదు."
"చూచాక మళ్ళీ ఎక్కడకు పోవాలని?"
"ఏమో తెలియలేదు."
"ఇక్కడ యెంతకాలం వుంటారు?"
"చెప్పలేను ప్రస్తుతానికి వెళ్ళాలని లేదు."
"ఇక్కడే వుండిపోతారా?" డాక్టరుగారి ప్రశ్న.
"ఎందుకండీ యీ ప్రశ్నలన్నీను" అంటూ నవ్వింది మిస్ మార్లిన్.
"డాక్టరు వైకుంఠంగారిది సి.ఐ.డి. బుర్ర కావటానికి డాక్టర్ కాని సవాలక్ష ప్రశ్నలు వెయ్యందే యెవర్ని విడిచిపెట్టరు. ఆయనకు అదొక హాబీ" అన్నాను నేను కల్పించుకుని. ఆమెకు వైకుంఠంమీద అనుమానం కలక్కూడదు.
"ఫ్రాన్సులో సీతాదేవి అని మీకు తెలిసిన రాణి వున్నారు" అంటూ మళ్ళీ తోముడు ప్ర్రారంభించాడు వైకుంఠం.
"అవును వున్నారు. నాకూ తెలుసు" అంది మిస్ మార్లిన్.
"వారిది పిఠాపురమే!" డాక్టరు.
"అవును- చెప్పారు. నన్ను బొబ్బిలి చూడమని చెప్పిందికూడా వారే!" అన్నది మిస్ మార్లిన్. యీ సందర్భాన్ని నేను వృధా పోనివ్వలేదు.
"మీరు అలా అంటున్నారు కాని, ఆంద్రదేశంలో చూడవలసినవి యెన్ని వున్నాయి? కొండవీడు, కొండపల్లి, అమరావతి, నాగార్జునసాగర్ యింకా యెన్నో వుండగా యీ బొబ్బిలి చూడాలని మీకు యెందుకు అనిపించింది" అని అడిగి మీచేత చెప్పించాలని చూస్తున్నారు డాక్టరుగారు. చెప్పాను కదండీ! ఆయన యే విషయాన్నీ అంతటితో వదిలిపెట్టరు" అన్నాను.
"ఆ సంగతి సూటిగా అడిగితే నేనే చెప్పనూ?" అన్నది మార్లిన్.
డాక్టరు తెల్లబోయినాడు. ఆమె చాల తెలివి కలది.
"నేనే మహాదేవి మల్లమ్మను అని నాకు అనిపిస్తూ వుంటుంది. నేను పారా సైకాలజీలో రీసెర్చి చేస్తున్నాను. నాకు తెలిసిన హేతువాదం కన్నా నాకు కలిగే అనుభూతి బలంగా వుంది. దానికి నాకు తెలియకుండానే లొంగిపోతాను" అని అర్ధమయ్యేలా చెప్పింది మార్లిన్.
"అలా అనిపించేటప్పుడు మీరెవరో మీకు గుర్తు వుండదా?" డాక్టర్ అడిగాడు.
"అంటే-?' మిస్ మార్లిన్ ప్రశ్న.
"అంటే- నేను మహాదేవి మల్లమ్మను కాను. మిస్ మార్లిన్ ను అని మీకు అనిపించదా?" డాక్టరు వివరించాడు తన ప్రశ్నని.
"ఒక స్థాయి దాటేవరకూ అనిపిస్తూ వుంటుంది. ఆ తరువాత నేనెవరో నాకు జ్ఞాపకం వుండదు. గుర్తుకు తెచ్చుకోవాలన్న స్పృహకూడా వుండదు. నాకు తెలియనివి, నేను యెన్నడూ విననివి యెన్నో సంగతులు మాట్లాడుతానట. రాత్రిపూట కలలు వస్తాయి. ఒక్కొక్కసారి మేలుకుని వున్నప్పుడు కూడా కలలు వస్తాయి అలా వచ్చినప్పుడు నేను చూస్తున్న పాత్రనే అయిపోతాను యిదీ స్థితి!" మార్లిన్ చెప్పింది.
డాక్టరుగారు ఆలోచిస్తున్నారు.
మీరు నాతో విశాఖ వస్తే బాగుంటుంది" అన్నాడు.
"సిల్లీ!" తేలికగా నవ్వేసింది మిస్ మార్లిన్.
"నా శరీరమూ, నా మనస్సూ, నా ప్రాణమూ, నా ఆత్మ అన్నీ యీ చోటుకు అంటుకుపోవాలని కోరుతున్నాయి. యిక్కడకు వచ్చేముందు మళ్ళీ ఫ్రాన్సు వెళ్ళాలనే అనుకున్నాను. యిప్పుడు ఆ ఆలోచనకూడా నాకు రావటల్లేదు యిదే నేను వుండవలసిన చోట అనిపిస్తోంది" ఆమె ఎటో చూస్తూ చెప్పింది.
ఆమె మాటల్ని నేను శ్రద్దగా వింటున్నాను.
పనిపిల్లవాడు వచ్చి భోజనానికి పిల్చాడు.
ఆమెను లోపలకు తీసుకుపోయాను. డాక్టర్ నా గదిలోనే కూర్చున్నాడు.
